‘జై కేసీఆర్‌’ అన్నందుకు కేసు! | Ganesh Immersion: Jai KCR Slogan Songs Trigger Political Storm Telangana | Sakshi
Sakshi News home page

‘జై కేసీఆర్‌’ అన్నందుకు కేసు!

Sep 25 2026 8:56 AM | Updated on Sep 25 2026 8:58 AM

Ganesh Immersion: Jai KCR Slogan Songs Trigger Political Storm Telangana

హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనం సందర్భంగా రాజకీయ పాటలు, నినాదాల వ్యవహారం వివాదంగా మారింది. నిమజ్జనానికి వచ్చిన భక్తులు బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాటలు పెట్టడాన్ని పోలీసులు అడ్డుకున్నారంటూ పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఈ వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ పోలీసుల తీరుతో పాటు రేవంత్‌ సర్కార్‌పై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.  

గణేశ్‌ మండపాల వద్ద రాజకీయ పార్టీలకు సంబంధించిన పాటలు, నేతలకు సంబంధించిన నినాదాలు చేయడంపై  హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సీవీ సజ్జనార్‌ హెచ్చరికలు జారీ చేశారు. నవరాత్రి ఉత్సవాలు భక్తికి సంబంధించిన కార్యక్రమమని.. రాజకీయాలకు వేదిక కాకూడదని పేర్కొన్నారు. అసభ్యకర, రెచ్చగొట్టే పాటలు, నిబంధనలకు విరుద్ధంగా డీజేలు వినియోగించినా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పోలీసుల సోషల్‌ మీడియా బృందాలు వీడియోలు, రీల్స్‌ను పరిశీలిస్తున్నాయని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు.

కేసీఆర్‌ పాటలపై వివాదం
ఈ నేపథ్యంలో గణేశ్‌ నిమజ్జన వాహనాల్లో కేసీఆర్‌కు సంబంధించిన పాటలు, డైలాగులతో కూడిన రీమిక్స్‌ డీజేలు వినిపిస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. కొన్ని చోట్ల పోలీసులు వాటిని నిలిపివేసిన దృశ్యాలు కూడా చర్చకు వచ్చాయి. కేసీఆర్‌ పాటలు పెట్టొద్దంటూ పోలీసులు హెచ్చరించారని, కేసులు పెడతామని చెప్పడంతో పాటు వాహనం సీజ్‌ చేస్తామని బెదిరించారని నిర్వాహకులు ఆరోపించారు.

‘జై కేసీఆర్‌’ అన్నందుకే కేసా?
ఇదే వివాదానికి కొనసాగింపుగా.. ట్యాంక్‌బండ్‌పై ‘జై కేసీఆర్‌’ నినాదం చేసినందుకు తనపై కేసు పెట్టారని ట్రాన్స్‌జెండర్‌ శృతి యాదవ్‌ ఆరోపించారు. గణేశ్‌ నిమజ్జనానికి వచ్చిన సమయంలో తాను నినాదం చేశానని, అందుకే పోలీసులు కేసు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణకు సంబంధించి కేసు ఏ సెక్షన్ల కింద నమోదైంది, నినాదమే కేసుకు కారణమా అనే అంశాలపై అధికారిక పోలీసు వివరణ వెలువడాల్సి ఉంది.

మరో ఘటనలో..
కేసీఆర్‌ పాటలు పెట్టి.. జై కేసీఆర్‌ నినాదాలు చేసినందుకు ఓ ఊరేగింపు బృందంతో పోలీసులు వాగ్వాదానికి దిగిన వీడియో సైతం వైరల్‌​ అయ్యింది. ప్రశ్నించినందుకు ఆ సభ్యులతో పాటు వీడియో తీస్తున్న వ్యక్తితోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు అందులో ఉంది. 

బీఆర్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం
పోలీసుల హెచ్చరికలు, కేసీఆర్‌ పాటల వ్యవహారంపై బీఆర్‌ఎస్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. గణేశ్‌ నిమజ్జనం కోసం వచ్చిన భక్తులపై లాఠీలు ప్రయోగించడం, కేసుల పేరుతో బెదిరించడం ఏమిటని ఆ పార్టీ నేతలు ప్రశ్నించారు. పోలీసుల చర్యలు రాజకీయపరంగా ఉన్నాయనే ఆరోపణలు చేశారు. 

ఇదీ చదవండి: నిమజ్జనంలో గుండె ఆగిపోయింది!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement