ప్రేమకు కత్తదనమే కానీ పాత అనే పదానికి తావే ఉండదు. అదే విధంగా స్వచ్ఛమైన ప్రేమకు వయసు బేధం ఉండదు. ప్రేమ అనేది మోహం కాదు బలం. అలాంటి ప్రేమ ఇతివృత్తంగా రూ పొందిన తాజా చిత్రం లెనిన్ పాండియన్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఒక యువకుడు పోలీస్ కానిస్టేబుల్‌గా బాధ్యతలను నిర్వహిస్తాడు. అయితే అతనికి ఆ వృత్తిలో తగిన గౌరవం లభించదు. పై అధికారుల నుంచి చాలా అవమానాలను ఎదుర్కొంటుంటాడు. దీంతో భార్య తండ్రి అతన్ని చిన్న చూపు చూస్తాడు. మరో పక్క ఒక వయసు మళ్లిన దంపతుల విలువైన భూమిని ఒక స్వార్థపరుడు పొందాలని వారిని బెదిరిస్తుంటాడు. అదే సమయంలో ఈ వృద్ధ దంపతులు ప్రేమగా పెంచుకుంటున్న మేకను అక్రమ మట్టి దందా వ్యక్తులు లారీలో గుద్ది చంపేస్తారు.
దీంతో ఆ వృద్ధ దంపతులు న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించినా, అవమానాలు, ఛీత్కారాలే ఎదురౌతాయి. ఆ తరువాత కోర్టు గుమ్మం ఎక్కిన వారికి న్యాయం లభించిందా? వారికి నిజాయితీకి మారుపేరైన పుత్రుడైన పోలీస్ కానిస్టేబుల్‌కు సంబంధం ఏమిటి ? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం లెనిన్ పాండియన్ . ఇందులో సీనియర్ సంగీత దర్శకుడు, గీత రచయిత, గాయకుడు గంగై అమరన్, ప్రముఖ నటీమణి, రాజకీయ నాయకురాలు రోజా వృద్ధ దంపతులుగా ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరికోసం ఒకరు జీవించే పాత్రల్లో నటించారు.
ఈ చిత్రం ద్వారా నడిగర్ తిలకన్ శివాజీ గణేషన్ మనవడు దర్శన్ గణేశన్ కథానాయకుడిగా పరిచయం అయిన ఇందులో నటి ప్రియా రావ్, సుబ్బు పంజు, జార్జ్ మరియన్, అడుగళం నరేన్, అర్చనా రవిచంద్రన్, బోస్ వెంకట్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై టీజీ .త్యాగరాజన్ సమర్పణలో సెంథిల్ త్యాగరాజన్ అర్జున్ త్యాగరాజన్ నిర్మించారు. డీడీ.బాలచంద్రన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఇళయరాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి రానుంది. ఎందరో స్టార్ హీరోల సరసన నటించిన రోజా తో కలిసి నటించడం సంతోషంగా ఉంది అని గంగై అమరన్ మీడియాతో పేర్కొన్నారు.


