ఖైరతాబాద్: నిమజ్జనోత్సవంలో అత్యంత ప్రత్యేకత కలిగిన ఖైరతాబాద్ మహాగణపతి తరలింపునకు గురువారం రోజంతా ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం ఉదయం 7 గంటలకే ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర ప్రారంభమయ్యేలా అధికారులు చర్యలు తీసుకున్నారు.
ఈ మేరకు గురువారం తెల్లవారుజాము నుంచి భక్తుల దర్శనాలు నిలిపివేసి..ఉదయం 8 గంటలకు షెడ్ తొలగింపు చేపట్టారు. సాయంత్రం షెడ్డు పనులు పూర్తికాగానే భారీ హైడ్రాలిక్ క్రేన్ సాయంతో మహాగణపతికి ఇరువైపులా ఉన్న విగ్రహాలను ట్రాయిలర్ వాహనంపైకి చేర్చారు.
రాత్రి 8 గంటలకు కలశ పూజ నిర్వహించి, 9 గంటలకు చివరగా మహా హారతి ఇచ్చారు.
10 గంటల నుంచి మహాగణపతిని క్రేన్ సాయంతో ట్రాయిలర్‌పైకి చేర్చే పనులు ప్రారంభించారు.
శుక్రవారం తెల్లవారుజాము వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఖైరతాబాద్ ఇన్‌స్పెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు.
ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా నుంచి శోభాయాత్ర ప్రారంభమై, రాజ్‌దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, ఎక్బాల్ మినార్ చౌరస్తా, తెలంగాణ తల్లి చౌరస్తా, సచివాలయం ముందు నుంచి ఎన్టీఆర్ మార్గ్‌లో క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది.
గతేడాది మధ్యాహ్నం 2 గంటల సమయంలో నిమజ్జనం కాగా.. ఈసారి ఇంకా ముందుగానే పూర్తి చేయనున్నారు.


