పిల్లల పెంపకంపై ఎన్నో అనుమానాలు, సందేహాలు వచ్చేస్తుంటాయి. కానీ వాళ్లను పెంచడమే మనం అనే అంశం మర్చిపోతుంటాం. వాళ్లను వాళ్లలా కాకుండా కట్టడి చేసేలా పెంచుతుంటాం. అదికాదు అని చెప్పే గొప్ప పేరెంటింగ్ పాఠం గురించి ఓ ఇన్‌ఫ్లుయెన్సర్ 60 సెకన్ల వీడియో ద్వారా చెప్పేసింది. అందుకు తనే ఉదాహరణ అంటూ తన విజయ ప్రస్థానాల గురించి వివరించింది.
ఆ అమ్మాయే ఇన్‌ఫ్లుయెన్సర్ మిథాలీ శర్మ. ఆమె నీట్ ఆల్ ఇండియా ర్యాంక్ హోల్డర్, డాక్టర్, నృత్యకారిణి, ఈత క్రీడాకారిణి, గాయని. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె ఆల్‌రౌండర్. ఇవేమి యాదృశ్చికంగా జరగలేదంటూ తన కథను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో వీడియో రూపంలో షేర్ చేసుకుంది. తన తల్లిదండ్రలు అలా పెంచడం వల్ల ఈ విజయాలను సాధించానంటూ..అద్భుతమైన పేరెంటింగ్ పాఠం, గొప్ప జీవిత తత్వాన్ని చెప్పుకొచ్చింది.
తన తల్లి తనను ఒక కలల ప్రాజెక్టులా పెంచిందని అంటోంది. ప్రతి వేసవి సెలవులను ఒక మినహాయింపు కూడా లేకుండా ఒక్కో సరికొత్త నైపుణ్యాన్ని నేర్చుకునేలా కేర్ తీసుకుంది. సెలవులంటే కాలక్షేపంలా గడిపే విరామంగా కాకుండా..ఏదో ఒక నైపుణ్యం అందిపుచ్చుకునేలా మార్చేసిందని తెలిపింది. అంతేగాదు క్లాస్‌లు ఉన్నప్పుడు కూడా పాఠ్యేతర పోటీల్లో పాల్గొనేలా చేశారని చెప్పుకొచ్చింది. ఒక నెల డిబేట్, మరుసటి నెల ఆర్ట్ ఇలా ఏదో ఒకటి నేర్పిస్తూ ఖాళీగా టైంని గడిపనివ్వకుండా చేసేవారని ..ఇది ఒకరకంగా అన్ని నైపుణ్యాలపై అవగాహన పెంచుకునేందుకు దారితీసిందని అంటోంది.
అలాగే తన తండ్రి తనను స్మిమ్మింగ్ క్లాస్‌కి పంపించారని, అలాగే క్లాసికల్ డ్యాన్స్ క్లాస్‌లకు వెళ్లేలా ఇద్దరూ కేర్ తీసుకున్నారని, అందువల్ల ఇవాళ అటు చదువు, ఇటు కళల్లో రాణించగలిగానని చెప్పుకొచ్చింది. అలాగే ఆమె ప్రతిష్టాత్మక నీట్‌లో మంచి ర్యాంకు సాధించి డాక్టర్ వృత్తిని చేపట్టినట్లు వెల్లడించింది. అంతేగాదు హాస్యనటుడు జాకిర్ ఖాన్ ఒక షోలో చెప్పిన డైలాగ్‌ని ప్రస్తావిస్తూ..“మీ పెంపకమే మీరు” అనే మాటతో తాను ఏకభవిస్తానని చెబుతోంది మిథాలీ.
ఇది తన వ్యక్తి గత విజయాల పరంపర మాత్రమే కాదని, తల్లిదండ్రుల పెంపకశైలికి సంబంధించిందని అంటూ తన సంభాషణను ముగించింది మిథాలీ. నిజానికి ఆమెను మంచి డాక్టర్‌గా, గాయని, నృత్యకారణి, ఈత క్రీడాకారిణీగా మార్చడానికి వాళ్లు ఎలాంటి ప్రణాళికలు ఏర్పరచుకోలేదు. ఆమె తన చదువులో భాగంగా నేర్చుకోవాలనుకున్నవన్నీ నేర్చుకునే స్వేచ్ఛ ఇచ్చారు, అందులో సమస్యలు వస్తే సాయం అందించారు. అదే ఆమెను ఉన్నతంగా ఎదిగేందుకు, విజయాలు సాధించేందుకు దారితీసింది.
ఇదీ చదవండి: లండన్ ఫ్యాషన్ వీక్ రన్‌వేపై భారత్ ఆదర్శ బాలక్..!)


