ఐక్యరాజ్యసమితి వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’ అంటూ ప్రశంసించడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. అయితే ఈ ప్రశంసలు పాక్‌కు అనుకూలంగా కనిపిస్తున్న వేళ.. ఉగ్రవాదంపై షరీఫ్ చేసిన ఓ వ్యాఖ్య సోషల్ మీడియాలో మళ్లీ వైరల్‌గా మారింది. ‘‘మా ఉగ్రవాదులను నియంత్రించకపోయి ఉంటేనా..’’ అని ఆయన వ్యాఖ్యపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
81వ UNGAలో మంగళవారం ప్రసంగించిన ట్రంప్.. భారత్, పాకిస్థాన్ మధ్య 2025లో చోటుచేసుకున్న సైనిక ఉద్రిక్తతను ప్రస్తావించారు. ఆ వివాదాన్ని ఆపేందుకు తాను జోక్యం చేసుకున్నానని మరోసారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌ను ‘టెర్రిఫిక్ మ్యాన్’గా అభివర్ణించారు. షరీఫ్ తనకు కృతజ్ఞతలు తెలిపారని, తాను 3 కోట్ల మంది ప్రాణాలను కాపాడినట్లు చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే భారత్ మాత్రం ఈ వివాదంలో మూడో పక్షం మధ్యవర్తిత్వం చేసిందన్న వాదనను గతంలో తిరస్కరించింది.
వైరల్‌గా మారిన ఆ వ్యాఖ్య..
ట్రంప్ ప్రశంసల నేపథ్యంలో షరీఫ్ చేసిన ఓ పాత వ్యాఖ్య ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2025లో జరిగిన 80వ యూఎన్‌జీఏలో ఆయన పాకిస్థాన్ రెండు దశాబ్దాలకు పైగా ఉగ్రవాదంపై పోరాడుతోందని చెప్పారు. ఈ పోరులో 90 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయామని, భారీ ఆర్థిక నష్టం ఎదుర్కొన్నామని పేర్కొన్నారు. అదే ప్రసంగంలో షరీఫ్.. పాకిస్థాన్ ఉగ్రవాదులను ఎదుర్కొనకపోయి ఉంటే వారు న్యూయార్క్, లండన్ వీధుల్లో తిరిగేవారని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై పాకిస్థాన్ చేస్తున్న పోరాటాన్ని ప్రపంచ భద్రతకు తన దేశం చేస్తున్న సేవగా ఆయన అభివర్ణించారు.
‘If we haven't controlled our terrorists, they would be roaming on the streets of New York or London"
- Pakistan PM Shehbaz Sharif at UNGA pic.twitter.com/2bHJaAKEaG— Rishi Bagree (@rishibagree) September 22, 2026
ఒప్పుకున్నట్లేనా?
ఈ వ్యాఖ్యల వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో.. పాకిస్థాన్‌కు కొత్త చిక్కు ఎదురైంది. షరీఫ్ మాటలను పట్టుకుని కొందరు నెటిజన్లు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. పాకిస్థాన్‌లో ఉగ్రవాద నెట్‌వర్క్‌లు ఉన్నాయన్న విషయాన్ని ఆ దేశ ప్రధానే స్వయంగా అంగీకరించినట్టుగా వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీంతో ఉగ్రవాదంపై పాక్ వైఖరి, గతంలో ఆ దేశంపై వచ్చిన ఆరోపణలు మరోసారి చర్చకు వస్తున్నాయి.
ఇక్కడే మరో కీలక విషయం ఉంది. సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ‘న్యూయార్క్, లండన్’ వ్యాఖ్య ఈ సమావేశాల్లో చేసిన షరీఫ్ చేసిన ప్రసంగానిది కాదు. షరీఫ్ 2026లో 81వ UNGAకి హాజరయ్యేందుకు సెప్టెంబర్ 21న న్యూయార్క్ చేరుకున్నారు. ఆయన తాజా UNGA ప్రసంగం సెప్టెంబర్ 25న జరగనుంది.
ట్రంప్ నుంచి వచ్చిన బహిరంగ ప్రశంసల సమయంలోనే ఈ పాత వ్యాఖ్య మళ్లీ తెరపైకి రావడంతో.. పాకిస్థాన్ ఉగ్రవాదంపై తన గత వాదనలపై కొత్త చర్చ మొదలైంది. ఒకవైపు అమెరికా అధ్యక్షుడి ప్రశంసలు.. మరోవైపు షరీఫ్ పాత ఉగ్రవాద వ్యాఖ్య వైరల్ కావడం.. పాక్ దౌత్యానికి ఇది ఊహించని చర్చగా మారింది.
ఇదీ చదవండి: ఆ టెక్నాలజీ మామూలుది కాదంటున్న ట్రంప్


