న్యూయార్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో ప్రసంగించేందుకు నెతన్యాహు న్యూయార్క్ చేరుకోనున్న వేళ.. మమ్దానీపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మమ్దానీ హమాస్‌కు మద్దతు ఇస్తున్నారని, న్యూయార్క్‌లో యూదులకు వ్యతిరేకంగా అల్లర్లను ప్రోత్సహిస్తున్నారని నెతన్యాహు ఆరోపించారు.
మమ్దానీ సోమవారం సీఎన్‌ఎన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెతన్యాహును ‘వార్ క్రిమినల్’, పాలస్తీనా ప్రజలపై జరుగుతున్న దారుణాలను ‘జెనోసైడ్‌కు ఆర్కిటెక్ట్’గా అభివర్ణించారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన నెతన్యాహు వీడియో సందేశంలో.. ‘నేను ఐక్యరాజ్యసమితికి వస్తున్నాను. మా వీరోచిత సైనికుల గురించి నిజం చెబుతాను. మీ గురించి కూడా నిజం చెబుతాను’ అని అన్నారు. ఇదే సమయంలో మమ్దానీని ఉద్దేశించి నెతన్యాహు మరింత ఘాటుగా స్పందించారు. ‘షేమ్ ఆన్ యూ, మిస్టర్ మమ్దానీ. మా ప్రజలను హతమార్చిన హమాస్ ఉగ్రవాదులకు మద్దతు ఇస్తున్నందుకు సిగ్గుపడాలి. న్యూయార్క్ యూదులకు వ్యతిరేకంగా అల్లర్లను ప్రేరేపిస్తున్నందుకు సిగ్గుపడాలి’ అని వ్యాఖ్యానించారు.
అయితే, ఈ వివాదం కొత్తది కాదు. గతంలో నెతన్యాహును న్యూయార్క్‌లోకి వస్తే అరెస్టు చేస్తానని మమ్దానీ వ్యాఖ్యానించారు. అయితే, అలాంటి అరెస్టు చేసే అధికార పరిధి తనకు వాస్తవంగా ఉందో లేదో స్పష్టత లేదని ఆయన తర్వాత అంగీకరించారు. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC) నెతన్యాహుపై జారీ చేసిన అరెస్టు వారెంట్ నేపథ్యంలో మమ్దానీ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆరోపణలను తిరస్కరించిన మమ్దానీ
మమ్దానీపై కొంతమంది రిపబ్లికన్ ప్రత్యర్థులు గతంలో యూదు వ్యతిరేకత ఆరోపణలు చేశారు. పాలస్తీనా అనుకూల వైఖరి, గాజాలో ఇజ్రాయెల్ సైనిక చర్యలపై ఆయన విమర్శలను ఇందుకు ఉదాహరణగా చూపారు. అయితే మమ్దానీ ఈ ఆరోపణలను తిరస్కరించారు. యూదు వ్యతిరేకతను తాను ఖండించానని, ఇజ్రాయెల్ ప్రభుత్వ విధానాలపై విమర్శలను యూదులపై ద్వేషంతో ముడిపెట్టడం సరికాదని ఆయన పేర్కొన్నారు. జూలైలోనూ నెతన్యాహు మమ్దానీపై విమర్శలు చేశారు. న్యూయార్క్ మేయర్‌గా అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించాల్సిన ఆయన.. ఒక వర్గాన్ని మరో వర్గానికి వ్యతిరేకంగా నిలబెడుతున్నారని ఆరోపించారు.
ట్రంప్, మమ్దానీ భేటీ..
ఇదిలా ఉండగా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, న్యూయార్క్ మేయర్ జొహ్రాన్ మమ్దానీ భేటీ అయ్యారు. గ్రేసీ మాన్షన్‌లో జరిగిన ఈ సమావేశంలో న్యూయార్క్‌లో గృహ నిర్మాణం, జీవన వ్యయం, వలసదారుల సమస్యలు, పోలీసింగ్ తదితర అంశాలపై చర్చించారు. క్వీన్స్‌లోని సన్నీసైడ్ యార్డ్స్‌లో సుమారు 12 వేల అందుబాటు ధరల ఇళ్ల నిర్మాణం, 30 వేల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన ప్రతిపాదనపైనా చర్చ జరిగింది. ఈ ప్రాజెక్టుపై ఇరు వర్గాలు తదుపరి చర్చలు జరపాలని నిర్ణయించాయి. గతంలో ట్రంప్, మమ్దానీ మధ్య తీవ్ర విమర్శలు జరిగినప్పటికీ.. భేటీ అనంతరం ట్రంప్ మాట్లాడుతూ న్యూయార్క్‌కు మమ్దానీ గొప్ప మేయర్ కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రజలకు ప్రయోజనం చేకూర్చే అంశాల్లో అధ్యక్షుడితో కలిసి పనిచేస్తానని మమ్దానీ చెప్పారు.
ఇదీ చదవండి: ఇరాన్‌తో మూడు గంటలు చర్చలు.. గుడ్‌న్యూస్ చెప్పిన ట్రంప్


