ఆ ప్రాంతంలో ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు.. ఇక 60 రోజులు ఉత్కంఠ | Rare sea turtle lays eggs in Orange County in first documented West Coast nesting | Sakshi
Sakshi News home page

ఆ ప్రాంతంలో ఆలివ్ రిడ్లీ తాబేలు గుడ్లు.. ఇక 60 రోజులు ఉత్కంఠ

Sep 23 2026 5:17 AM | Updated on Sep 23 2026 5:17 AM

Rare sea turtle lays eggs in Orange County in first documented West Coast nesting

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియా తీరంలో అరుదైన పరిణామం చోటుచేసుకుంది. దక్షిణ కాలిఫోర్నియా తీరంలో ఆలివ్ రిడ్లీ సముద్ర తాబేలు తొలిసారి గుడ్లు పెట్టింది. అమెరికా జాతీయ సముద్ర, వాతావరణ పరిపాలన సంస్థ (ఎన్‌ఓఏఏ) ప్రకారం.. అమెరికా పశ్చిమ తీరంలో సముద్ర తాబేలు సహజంగా గూడు కట్టుకుని గుడ్లు పెట్టిన తొలి ఘటన ఇదే.

ఆరెంజ్ కౌంటీలోని సీల్ బీచ్ సమీపంలో సెప్టెంబర్ 16న ఆలివ్ రిడ్లీ తాబేలు ఇసుకలో గూడు తవ్వి గుడ్లు పెట్టినట్లు గుర్తించారు. సాధారణంగా ఈ తాబేళ్లు దక్షిణ కాలిఫోర్నియా సముద్ర జలాల్లో అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి. వెచ్చని సముద్ర ప్రవాహాల కారణంగా అవి ఈ ప్రాంతానికి చేరుకుంటాయని ఎన్‌ఓఏఏ తెలిపింది. అయితే అమెరికాలోనే ఇంతకుముందు ఈ జాతి తాబేలు గూడు కట్టుకుని గుడ్లు పెట్టిన దాఖలాలు లేవు.

సీల్ బీచ్‌లో ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత, కొన్ని మైళ్ల దక్షిణాన హంటింగ్టన్ బీచ్ పియర్ సమీపంలో మరో సముద్ర తాబేలు తీరానికి వచ్చినట్లు గుర్తించారు. అది సీల్ బీచ్‌లో గుడ్లు పెట్టిన అదే తాబేలేనా, లేక మరో తాబేలేనా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

60 రోజుల వరకు గుడ్లపై నిఘా
తాబేలు గుడ్లు పొదిగే కాలం సాధారణంగా 45 నుంచి 60 రోజుల వరకు ఉంటుంది. స్థానిక, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఈ ప్రాంతాలను పర్యవేక్షిస్తున్నాయి. గుడ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గూడు ఉన్న ప్రాంతాలను కంచెతో చుట్టి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. తీరానికి వచ్చే ప్రజలు సురక్షిత దూరం పాటించాలని, కంచెలు లేదా హెచ్చరిక బోర్డులను తాకవద్దని ఎన్‌ఓఏఏ సూచించింది.

ఆలివ్ రిడ్లీ తాబేళ్లు ప్రపంచంలోని సముద్ర తాబేళ్లలో అతి చిన్న జాతిగా గుర్తింపు పొందాయి. పెద్ద తాబేళ్లు 100 పౌండ్ల వరకు బరువు, సుమారు 2.5 నుంచి 3 అడుగుల పొడవు ఉంటాయి. ఇవి దాదాపు 30 నుంచి 50 ఏళ్ల వరకు జీవిస్తాయి. పసిఫిక్ ప్రాంతంలో మెక్సికో, నికరాగువా, కోస్టారికా, పనామా దేశాల్లో వీటి ప్రధాన గూడు ప్రాంతాలు ఉన్నాయి. కాలిఫోర్నియాలో ఇకపై మరిన్ని తాబేళ్ల గూళ్లు కనపడతాయా? ప్రస్తుతం ఉన్న గుడ్ల నుంచి పిల్లలు విజయవంతంగా బయటకు వస్తాయా? అనే అంశాలపై అధికారులు వచ్చే 45-60 రోజుల్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement