బ్రెజిల్‌లో సంచలనం సృష్టించిన సీరియల్ కిల్లర్ జోర్లాన్ లోప్స్ డా సిల్వా (33)ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 16 హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ నిందితుడు, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు అడవుల్లో గుడారాలు వేసుకుని తలదాచుకున్నాడు.
స్థానికంగా ఇతని సన్నని దేహదారుడ్యం కారణంగా అందరూ ఇతన్ని మస్కిటో (దోమ) అని పిలిచేవారు.
బ్రెజిల్ ఈశాన్య రాష్ట్రమైన పారైబాలోని ములుంగు ప్రాంతంలో సెప్టెంబర్ 13న పోలీసులు రెండు రోజుల పాటు తీవ్రంగా గాలించి ఇతన్ని పట్టుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఈ కిల్లర్ విచిత్రమైన వేషధారణ మార్చుకున్నాడు. నలుపు, తెలుపు చారల డ్రెస్, విగ్గు, గోళ్లకు నెయిల్ పాలిష్ వేసుకుని మహిళలా వేషం మార్చాడు. అంతేకాకుండా ఎవరికి చెందినదో తెలియని ఒక చిన్న పసికందును ఎత్తుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా పోలీసులు అతన్ని అడ్డగించి అరెస్ట్ చేశారు.
దట్టమైన అడవుల్లోని తాత్కాలిక గుడారాల్లో జీవించడం వల్ల ఇతను సంవత్సరాలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకోగలిగాడు. గత మూడు నెలల్లో ములుంగు ప్రాంతంలో జరిగిన హత్యలతో ఇతనికి సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పబ్లిక్ స్క్వేర్‌లో 18 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన సంఘటన తర్వాతే పోలీసులు ఈ సీరియల్ కిల్లర్‌కు, ఇతర నేరాలకు మధ్య సంబంధాన్ని గుర్తించారు.
విచారణలో భాగంగా తాను కేవలం నేరస్థులనే లక్ష్యంగా చేసుకున్నానని కిల్లర్ చెప్పినప్పటికీ, దర్యాప్తులో మాత్రం అమాయకులను కూడా హత్య చేసినట్లు తేలిందని ఇన్వెస్టిగేటర్ డగ్లస్ గర్సియా తెలిపారు. ఇతను తన 13 ఏళ్ల వయసులోనే మొదటి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించాడు.
ప్రస్తుతం పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ కిల్లర్‌తో సంబంధం ఉన్న మరికొన్ని పాత కేసులను కూడా తిరిగి తెరిచేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిందితుడి వద్ద దొరికిన శిశువు ఎవరిదనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నారు.


