క్వీన్స్‌లాండ్: ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో తేనెటీగల భారీ చోరీ కలకలం రేపుతోంది. అథర్టన్ టేబుల్‌ల్యాండ్స్ ప్రాంతంలోని 41 వాణిజ్య తేనెటీగల గూళ్ల నుంచి తేనెటీగలు, వాటి సంతానాన్ని దుండగులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ఆ తేనెటీగల విలువ 20 వేల ఆస్ట్రేలియన్ డాలర్లు(రూ. 13,61,400)కు పైగా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తేనెటీగల పెంపకం పరిశ్రమపై అవగాహన ఉన్న వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
41 గూళ్లను టార్గెట్ చేసిన దొంగలు
కెయిర్న్స్‌కు పశ్చిమాన ఉన్న అథర్టన్ టేబుల్‌ల్యాండ్స్‌లోని పలు ప్రాంతాల్లో ఈ చోరీ జరిగింది. వాణిజ్య తేనెటీగల పెంపకందారుడు జాక్ లాటన్‌కు చెందిన 41 గూళ్ల నుంచి తేనెటీగలు, వాటి సంతానాన్ని తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఒక్కో గూడులో సుమారు 15 వేల తేనెటీగలు ఉంటాయని లాటన్ తెలిపారు. మొత్తం మీద దాదాపు 8 లక్షల తేనెటీగలు చోరీ అయినట్లు ఆయన చెప్పారు.
ప్రత్యేక పరికరాలతో చోరీ
దొంగలు మొత్తం తేనెటీగల గూళ్లను ఎత్తుకెళ్లలేదు. వాటిలోని తేనెటీగలు ఉన్న ఫ్రేమ్‌లను మాత్రమే తీసి తమ సొంత పెట్టెల్లోకి మార్చినట్లు అధికారులు చెబుతున్నారు. తేనెటీగలు సంతానోత్పత్తి చేసే బ్రూడ్ బాక్స్‌లను కూడా తీసుకెళ్లారు. ఈ పని చేయడానికి ప్రత్యేక పరికరాలు, తేనెటీగల పెంపకంపై నైపుణ్యం అవసరమని పోలీసులు భావిస్తున్నారు.
తేనెను మాత్రం వదిలేశారు
ఈ చోరీలో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దొంగలు గూళ్లలోని తేనెను మాత్రం తీసుకెళ్లలేదు. తేనెటీగలున్న ఫ్రేమ్‌లను తమ పెట్టెల్లోకి మార్చుకుని, అసలు గూళ్లను మళ్లీ యథాతథంగా అమర్చారు. దీంతో గూళ్ల యజమానులకు వెంటనే చోరీ జరిగిన విషయం తెలియకుండా జాగ్రత్త పడ్డారని వాటిని నిర్వహించే టామ్ బిడ్నర్ తెలిపారు.
పరాగసంపర్క ఒప్పందాలపైనా ప్రభావం
ఈ ఘటనతో తేనెటీగలను మాత్రమే కాకుండా వాటి ద్వారా అందించే పరాగసంపర్క సేవల ఒప్పందాలను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని పెంపకందారులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వర్రోవా మైట్ అనే పరాన్నజీవి కారణంగా క్వీన్స్‌లాండ్ తేనెటీగల పరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ సమయంలో చోరీ ఘటన తమకు మరింత నష్టాన్ని కలిగించిందని బిడ్నర్ పేర్కొన్నారు.
పరిశ్రమలోని వ్యక్తులపైనే అనుమానం
మరీబా రూరల్ అండ్ స్టాక్ క్రైమ్ స్క్వాడ్ ఈ కేసును దర్యాప్తు చేస్తోంది. గతంలోనూ తేనెటీగల చోరీలు జరిగినప్పటికీ, ఇదే అతిపెద్ద ఘటన అని బిడ్నర్ తెలిపారు. పలు ప్రాంతాల్లోని గూళ్లను లక్ష్యంగా చేసుకోవడం, ప్రత్యేక పరికరాలను ఉపయోగించడం వంటి అంశాల ఆధారంగా నిందితులు తేనెటీగల పెంపకం పరిశ్రమకు చెందినవారై ఉండొచ్చని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. అయితే ఇప్పటివరకు పోలీసులు నిందితులను గుర్తించలేదు.
ఇదీ చదవండి: నెహ్రూ నుంచి జైట్లీ వరకు.. డీయూఎస్‌యూ సంచలన చరిత్ర!


