వైట్‌హౌస్‌పై మీడియా సంస్థల దావా  | CNN, MS NOW and Politico sue Trump administration over White House access | Sakshi
Sakshi News home page

వైట్‌హౌస్‌పై మీడియా సంస్థల దావా 

Sep 22 2026 5:28 AM | Updated on Sep 22 2026 5:28 AM

CNN, MS NOW and Politico sue Trump administration over White House access

అధ్యక్షతా భవనంలోకి అనుమతి నిరాకరణపై కోర్టుకెక్కిన సీఎన్‌ఎన్, ఎంఎస్‌ నౌ, పొలిటికో  

ట్రంప్‌ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్లు వాదన

న్యూయార్క్‌: అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్‌హౌస్‌లోకి అనుమతి నిరాకరిస్తూ ట్రంప్‌ తీసుకున్న నిర్ణయాన్ని సీఎన్‌ఎన్, ఎంఎస్‌ నౌ, పొలిటికో మీడియా సంస్థలు సోమవారం కోర్టులో సవాల్‌చేశాయి. తమను మాత్రమే ఉద్దేశపూర్వకంగా అడ్డుకోవడం రాజ్యాంగంలోని ఒకటో సవరణ ప్రకారం చెల్లదని ఈ సంస్థలు న్యాయస్థానంలో వాదించాయి. 

వాషింగ్టన్‌ డీసీలోని ‘యూఎస్‌ డిస్ట్రిక్ట్‌ కోర్ట్‌ ఫర్‌ ది డిస్ట్రిక్ట్‌ ఆఫ్‌ కొలంబియా’లో ఉమ్మడిగా దావా వేశాయి. మొదటి చట్టసవరణ పరిరక్షణ ప్రకారం మీడియా స్వేచ్ఛను ప్రభుత్వాలు అడ్డుకోవడం కుదరదని పేర్కొన్నాయి. ‘‘చట్టం ద్వారా మీడియా సంస్థలకు సంక్రమించిన హక్కులను కాలరాసే అధికారం అధ్యక్షుడు లేదా ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులకు లేదు. ప్రచురితమయ్యే, ప్రసారమయ్యే వార్తలు, కథనాలు అధ్యక్షుడికి నచ్చనంత మాత్రాన ఎలాంటి నోటీస్‌ లేకుండా చట్టపర విధానాన్ని అనుసరించకుండా ఏకపక్షంగా వైట్‌హౌస్‌లోకి రాకుండా నిషేధం విధించడం చట్టప్రకారం కుదరదు’’అని సంస్థలు తమ పిటిషన్‌లో పేర్కొన్నాయి. 

మీడియా సంస్థలు వేసిన దావాపై శ్వేతసౌధం ఇంకా స్పందించలేదు. కానీ పొద్దుపోయాక ట్రంప్‌ తన సొంత సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’లో ఒక పోస్ట్‌పెట్టారు. ‘‘మీడియా స్వేచ్ఛపై శ్వేతసౌధం ఎలాంటి ఆంక్షలు విధంచబోదు. నిజానికి నేను మీడియా స్వేచ్ఛకు ఎంతో విలువ ఇస్తా. తప్పుడు వార్తలు రాసే సంస్థల మీద మాత్రమే ఆంక్షలు విధించా. ఈ తప్పుడు వార్తలనేవి అమెరికాకు క్యాన్సర్‌లా దాపురించాయి. ఈ ఫేక్‌ న్యూస్‌ అవినీతి, స్వీయప్రయోజనాలతో వ్యవస్థీకృతంగా కట్టుతప్పుతున్నాయి. ఇవి జాతీయ భద్రతకు ముప్పగా మారాయి. అందుకే వీటికి తక్షణం అడ్డుకోవాల్సిందే’’అని ట్రంప్‌ ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాసే మీడియా సంస్థలు, ట్రంప్‌కు మధ్య చాలాకాలంగా ఘర్షణపూరిత వాతావరణం నెలకొన్న విషయం తెల్సిందే. 

ట్రంప్‌ కవరేజీని నిలిపేసిన ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు 
సోమవారం ట్రంప్‌ వైట్‌హౌస్‌లో కొత్తగా హెలిప్యాడ్‌ను ఆవిష్కరించగా దానికి సంబంధించిన కవరేజీని అమెరికాలోని ప్రధాన టీవీ నెట్‌వర్క్‌లు నిలిపేశాయి. సీఎన్‌ఎన్‌పై నిషేధాన్ని నిరసిస్తూ ట్రంప్‌ కార్యక్రమాల కవరేజీని పక్కనపడేసినట్లు తెలుస్తోంది. ప్రధానమైన ఏబీఎస్, సీబీఎస్, ఫాక్స్‌ న్యూస్‌ చానళ్లలో ఈ కార్యక్రమం ప్రసారం కాలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement