Mithu Mukherjee Passes away ప్రముఖ బెంగాలీ సీనియర్ నటి మిథు ముఖర్జీ (71) కన్నుమూశారు. 1970, 1980 దశకాలలో ప్రముఖ నటిగా ప్రజాదరణ పొందారు. మిథు దాదాపు ఏడాది పాటు క్యాన్సర్‌తో బాధపడుతూ ముంబైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఉత్తమ్ కుమార్, సౌమిత్ర ఛటోపాధ్యాయ , రంజిత్ మల్లిక్ వంటి బెంగాలీ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు అగ్రశ్రేణి నటులతో ఆమె నటించారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బెంగాలీ చిత్ర పరిశ్రమను ఏలిన మిథు ముఖర్జీ అస్తమయంపై పలువురు నటీనటులు, ఇతర సినీ ప్రముఖులు సంతాపం వెలిబుచ్చారు.
నటుడు ప్రోసేన్‌జిత్ ఛటర్జీ ఎక్స్ వేదికగా ఆమె మృతికి సంతాపం తెలిపారు. "మిథు ముఖోపాధ్యాయ మరణ వార్త అత్యంత బాధాకరం. ఆమె జ్ఞాపకాలు , ఆమె చేసిన కృషి మన మధ్య ఎప్పటికీ నిలిచి ఉంటాయంటూ ఆమెకు నివాళులర్పించారు. ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్ (AICWA) కూడా సోషల్ మీడియా ద్వారా ఈ దిగ్గజ నటికి హృదయపూర్వక నివాళులు అర్పించింది.
1955లో కోల్‌కతాలో జన్మించిన మిథు ముఖర్జీ, 1972లో చిత్తా బోస్ దర్శకత్వం వహించిన 'షేష్ పర్బా' (Shesh Parba) చిత్రంతో 17 ఏళ్ల వయసులో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో ఆమె షమిత్ భంజా సరసన నటించారు. అయితే, దినెన్ గుప్తా దర్శకత్వంలో వచ్చిన 'మార్జినా అబ్దుల్లా' (Marjina Abdulla) మూవీ ఆమెను టాప్‌స్టార్‌గా నిలబెట్టింది. బెంగాలీ సినిమాలతో పాటు 'ఖాన్ దోస్త్', 'సఫేద్ ఝూట్',', 'దిల్లగి', 'దో లడ్కే దోనో కడ్కే' వంటి హిందీ చిత్రాల్లో కూడా నటించారు. 1990లో వచ్చిన చంద్ర బారోట్ చిత్రం 'ఆశ్రిత' ఆమె కెరీర్‌లో చివరి సినిమా. ఆ తర్వాత ఆమె సినిమాలకు దూరంగా ప్రైవేట్ జీవితాన్ని గడిపారు.


