లాతూర్ జిల్లా సెంట్రల్ సహకార బ్యాంకు (డీసీసీబీ) బోర్డు డైరెక్టర్లుగా పదేళ్ల కాలపరిమితి దాటిన వారిని వెంటనే తొలగించాలని ఆర్‌బీఐ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. మహారాష్ట్ర సహకార శాఖ మంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సీపీ) నాయకుడు బాబాసాహెబ్ పాటిల్‌తో పాటు మరో ఏడుగురు డైరెక్టర్లు తమ పదవులకు అనర్హులని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1949 (సవరణ చట్టం 2025)లోని సెక్షన్ 10A(2A)(i), సెక్షన్ 56 నిబంధనల ప్రకారం డీసీసీ బ్యాంకుల డైరెక్టర్ల గరిష్ట పదవీకాలం 10 ఏళ్లకు మించకూడదు.
చట్టపరమైన పోరాటం.. ఆర్‌బీఐ నిర్ణయం
ఈ వ్యవహారంపై బ్యాంకు సభ్యుడు సతీష్ శేషరావు జాధవ్ దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హైకోర్టు (ఔరంగబాద్ బెంచ్) కీలక ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాల మేరకు ఆర్‌బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కపిల్ గోస్వామి ఈ అధికారిక ఉత్తర్వులను విడుదల చేశారు.
మే 25, 2026: నిబంధనలు ఉల్లంఘించి 10 ఏళ్లకు పైగా కొనసాగుతున్న 8 మంది డైరెక్టర్లపై చర్యలు తీసుకోవాలని సతీష్ జాధవ్ ఆర్‌బీఐ చీఫ్ జనరల్ మేనేజర్‌కు ఫిర్యాదు చేశారు.
ఆగస్టు 3, 2026: పిటిషనర్ ఫిర్యాదుపై ఆరు వారాల్లోగా తగిన నిర్ణయం తీసుకోవాలని ఆర్‌బీఐని బాంబే హైకోర్టు ఆదేశించింది.
సెప్టెంబరు 4 - 10, 2026: ఆర్‌బీఐ నోటీసులకు స్పందిస్తూ సెప్టెంబరు 10న ఏడుగురు డైరెక్టర్లు తమ రాజీనామా లేఖలను బ్యాంకు ఛైర్మన్, ఎండీ హనుమంత్ జాధవ్‌కు సమర్పించారు.
సెప్టెంబరు 18, 2026: నిబంధనల ప్రకారం అనర్హులైన బోర్డు సభ్యుల తొలగింపు ప్రక్రియను తక్షణమే అమలు చేయాలని లాతూర్ డీసీసీబీ యాజమాన్యాన్ని ఆర్‌బీఐ ఆదేశించింది. సహకార వ్యవస్థలో పారదర్శకతను పెంచేందుకు ఆర్‌బీఐ తీసుకున్న ఈ నిర్ణయం మహారాష్ట్ర రాజకీయాల్లోనూ, సహకార బ్యాంకింగ్ వర్గాల్లోనూ కలకలం రేపింది.
ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి!


