ఏఐ మౌలిక వసతులు, క్లౌడ్ సర్వీసుల దిశగా వేగంగా వ్యూహాత్మక మార్పులు చేస్తున్న అంతర్జాతీయ ఐటీ దిగ్గజం ఒరాకిల్ ప్రపంచవ్యాప్తంగా మరో విడత ఉద్యోగాల కోత ప్రారంభించింది. అమెరికా వెలుపల సంస్థకు అతిపెద్ద డెవలప్‌మెంట్ హబ్‌గా ఉన్న భారత్‌లో ఈ చర్యల ప్రభావం తీవ్రంగా ఉంది. తాజా లేఆఫ్‌ల్లో భాగంగా దేశవ్యాప్తంగా దాదాపు 3000 మంది సిబ్బందిని తొలగించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.
ఏ విభాగాల్లో కోతలంటే..
బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, ముంబై, నోయిడాలతో సహా ప్రధాన కేంద్రాల్లోని ఒరాకిల్ హెల్త్, ఓసీఐ సెక్యూరిటీ, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, డేటా సెంటర్ ఆపరేషన్స్, సేల్స్ విభాగాలపై ఈ ప్రభావం పడింది. ఎంట్రీ-లెవల్ ఫ్రెషర్ల నుంచి సీనియర్, మిడ్-లెవల్ మేనేజ్‌మెంట్ హోదాలోని వారి ఉద్యోగాలు ఊడాయి. ఏడాది వ్యవధిలోనే ఒరాకిల్ భారత్‌లో చేపట్టిన రెండో భారీ పునర్వ్యవస్థీకరణ ఇది.
సెవెరెన్స్ ప్యాకేజీ నిబంధనలు ఇవే..
సంస్థ సమర్పించిన అంతర్గత పత్రాల ప్రకారం.. లేఆఫ్‌కు గురైన ఉద్యోగులకు అందించే పరిపరిహారానికి (సెవెరెన్స్ పే) గరిష్టంగా 26 వారాల ప్రాథమిక వేతనం సీలింగ్ విధించారు. మొదటి ఏడాది సర్వీసుకు గాను 4 వారాల బేసిక్ సాలరీ, ఆ తర్వాత పూర్తి చేసిన ప్రతి అదనపు సంవత్సరానికి ఒక వారం చొప్పున అదనపు పరిహారం లభిస్తుంది. ఉద్యోగం ముగిసిన వెంటనే అన్‌వెస్టెడ్ ఆప్షన్లు, ఆర్‌ఎస్‌యూలు తక్షణమే రద్దవుతాయి. అలాగే భవిష్యత్తు కార్పొరేట్ బోనస్‌లకు అర్హత ఉండదు.
ఏఐ రీ-స్ట్రక్చరింగ్ ప్రభావమే కారణమా?
ఒరాకిల్ గ్లోబల్ హెడ్‌కౌంట్ నివేదిక ప్రకారం, సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 21,000 మందికి పైగా సిబ్బందిని తగ్గించుకుంటూ ఏఐ ఆటోమేషన్, క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ప్రాధాన్యత ఇస్తోంది. క్లౌడ్, ఏఐ వైపు వనరులను మళ్లిస్తుండటం వల్ల సాంప్రదాయ సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్, సపోర్ట్ రోల్స్ ప్రమాదంలో పడుతున్నాయని, ఈ ధోరణి రాబోయే రోజుల్లో మిగతా దిగ్గజ సంస్థల్లోనూ కొనసాగే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇదీ చదవండి: వెళ్లిపోయాడనుకునేలోపే మళ్లీ ఐదేళ్ల పదవి!


