Kerala: వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు | Heavy Rains Wreak Havoc in Kerala Five Dead, Two Missing | Sakshi
Sakshi News home page

Kerala: వర్ష బీభత్సం.. ఐదుగురు మృతి, ఇద్దరు గల్లంతు

Sep 21 2026 9:22 AM | Updated on Sep 21 2026 9:22 AM

Heavy Rains Wreak Havoc in Kerala Five Dead, Two Missing

తిరువనంతపురం: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విలయాన్ని సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల వల్ల కొండచరియలు విరిగిపడటం, ఆకస్మిక వరదలు సంభవించడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గల్లంతయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విపత్కర పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలను వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. ప్రతి గంటకు ఒకసారి క్షేత్రస్థాయి పరిస్థితులను సమీక్షిస్తూ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి యంత్రాంగాన్ని ఆదేశించారు.

నది ఉధృతిలో కొట్టుకుపోయిన బృందం
మలప్పురం జిల్లా నిలంబూర్-అమరంబలం పరిధిలోని కొట్టపుళ నది వద్ద తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వండూర్ ప్రాంతానికి చెందిన ఐదుగురు వ్యక్తులు నదిలో స్నానం చేయడానికి దిగగా, అకస్మాత్తుగా వరద ఉధృతి పెరగడంతో వారంతా నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈ ప్రమాదంలో ఒకరిని స్థానికులు రక్షించగా, సహాయక సిబ్బంది ఇద్దరి మృతదేహాలను వెలికితీశారు. గల్లంతైన మిగిలిన ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. సీఎం ఆదేశాల మేరకు విపత్తు నిర్వహణ దళం ప్రత్యేక బృందాలు అక్కడ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతున్నాయి.

కొండచరియలు విరిగిపడి మహిళ దుర్మరణం
కొట్టాయం జిల్లా తీకోయి సమీపంలోని వేలత్తుస్సేరి వద్ద కొండచరియలు విరిగిపడిన ఘటనలో చెన్నైకి చెందిన సంగీత అరుల్ లాల్ (35) అనే మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆమె తన స్నేహితుడితో కలిసి స్కూటర్‌పై వాగమన్ నుంచి తిరిగి వస్తుండగా రోడ్డుపైకి భారీగా మట్టి పెళ్లలు దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలపాలైన ఆమె స్నేహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మరోవైపు, ఇడుక్కి జిల్లా కొట్టకంబుర్‌లో వర్షం నుంచి తప్పించుకోవడానికి ఒక షెడ్డులో ఆశ్రయం పొందిన ముగ్గురిపై కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు అక్కడికక్కడే మరణించగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది.

ఆరెంజ్ అలర్ట్ జారీ.. ముమ్మరంగా సహాయక చర్యలు
రాష్ట్రంలో మరో నాలుగు రోజుల పాటు పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)హెచ్చరించింది. కొట్టాయం, ఇడుక్కి జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రజలకు వాతావరణ సమాచారాన్ని ఎస్ఎంఎస్ రూపంలో చేరవేస్తున్నారు. కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న ప్రాంతాలు, నదీ పరీవాహక లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు జిల్లా కలెక్టర్లు తగిన చర్యలు చేపట్టారు.

ఇదీ చదవండి: ఎల్‌ నినోకు చెక్‌.. గణపయ్యల నిమజ్జనానికి సరికొత్త విధానం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement