నేడు వాయుగుండంగా మారే అవకాశం
సాక్షి, అమరావతి: ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ, వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలపడి సోమవారానికి వాయుగుండంగా మారుతుందని వాతావరణశాఖ తెలిపింది. మంగళవారానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా బలపడే అవకాశం ఉందని, బుధవారం ఉదయానికి పశ్చిమ వాయవ్యదిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలకు దగ్గరగా చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.
దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల భారీవర్షాలు, బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కోస్తాంధ్ర తీరం వెంబడి 50–60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. సోమవారం అల్లూరి సీతారామరాజు, పోలవరం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.


