విద్యుదాఘాతంతో తండ్రి, కొడుకు మృతి
గూడూరు రూరల్: విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌లోని రాగి తీగలు, ఇతర వస్తువులను అపహరించేందుకు యత్నిస్తుండగా విద్యుదాఘాతానికి గురై తండ్రి, కుమారుడు మృతి చెందారు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు రూరల్‌లోని రామలింగాపురం సమీపంలో పొలాల వద్ద జరిగింది. గూడూరులోని మాళవ్యానగర్‌లో ఉంటున్న కలపాటి వెంకటేష్ (34) కరెంట్ పనులు చేస్తుంటారు.
ఈయన రెండో భార్య కుమారుడైన కిశోర్ (13) నాయుడుపేట గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. వీరిద్దరూ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద మృతి చెంది ఉండటాన్ని స్థానికులు ఆదివారం గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. విద్యుత్ శాఖ అధికారులు, పోలీసులు విచారణ జరిపి రాగి వైరు చోరీ చేస్తుండగా ప్రమాదం జరిగినట్లు గుర్తించారు.


