పొదలకూరు: పట్టణంలోని బాలాజీనగర్‌లో గల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఆదివారం సంభవించింది. ఒక్కసారిగా పొగలు కమ్ముకోవడంతో స్థానికులు గుర్తించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వీరొచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా వైర్లు, ఇన్వర్టర్ కాలిపోవడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న సబ్ రిజిస్ట్రార్ శోభమ్మ చేరుకొని పరిశీలించారు.
అల్లకల్లోలంగా సముద్రం
కోట: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా మారింది. మండలంలోని గోవిందపల్లిపాళెం తీరంలో అలలు ఆదివారం ఉవ్వెత్తున ఎగసిపడ్డాయి. సముద్రం 30 మీటర్ల మేర ముందుకొచ్చిందని మత్స్యకారులు తెలిపారు. అలల ఉధృతి మరింత పెరిగే అవకాశముందనే సమాచారంతో పడవలు, వేట సామగ్రిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఐటీడీఏ గవర్నింగ్ బాడీ
సమావేశం నేడు
నెల్లూరు(వేదాయపాళెం): ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశాన్ని కొండాయపాళెం గేట్ సమీపంలోని కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నిర్వహించనున్నామని ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ అధ్యక్షతన జరపనున్న సమావేశంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు.. వాటి పురోగతి, తదితర అంశాలపై సమీక్షను నిర్వహించనున్నామని వివరించారు.
శ్రీవారి దర్శనానికి
ఎనిమిది గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం సాధారణంగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 83,589 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 27,828 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.17 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లున్న వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి ఎనిమిది గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లున్న వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు.
మంత్రి పార్థసారథి
రాక నేడు
నెల్లూరు రూరల్: రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి కొలుసు పార్థసారథి.. జిల్లాలో సోమవారం పర్యటించనున్నారని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయానికి ఉదయం 9.30కు చేరుకొని చైర్మన్, కౌన్సిల్ సభ్యులతో సమావేశమవ్వనున్నారని వివరించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించడంతో పాటు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొననున్నారని చెప్పారు. ఆపై మధ్యాహ్నం ఒంటి గంటకు బయల్దేరనున్నారని పేర్కొన్నారు.
విద్యుదాఘాతంతో
వ్యక్తి మృతి
నెల్లూరు సిటీ: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. నవలాకులతోటకు చెందిన సురేష్ (37) హార్డ్‌వేర్ షాపులో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో అక్కడ పనులు చేసే క్రమంలో డ్రిల్లింగ్ మెషీన్‌ను చేతిలో పట్టుకొని కుర్చీ పైనుంచి దిగుతుండగా, విద్యుదాఘాతానికి గురై కిందపడ్డారు. హాస్పిటల్‌కు సిబ్బంది తరలించగా, అప్పటికే మృతి చెందారని వైద్యులు నిర్ధారించారు. నెల్లూరు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


