● ఎన్నికల హామీల అమల్లో విఫలమైన కూటమి ప్రభుత్వం
● వేధింపులకు భయపడేదిలేదు
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
వెంకటాచలం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో తిరుగులేని విజయం తథ్యమని మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ మండల స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. గత సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో సంక్షేమ పథకాల నిధులు ప్రజల ఖాతాల్లో ప్రతి నెలా జమయ్యేవని, అయితే ప్రస్తుత సర్కార్ బోగస్ మాటలతో కాలక్షేపం చేస్తోందని ధ్వజమెత్తారు. టీడీపీ ప్రభుత్వం కొలువుదీరిన ఈ 27 నెలల్లో నూతనంగా ఒక్క పింఛన్‌ను సైతం మంజూరు చేయలేదని, అయితే స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూ.. తమ పార్టీ మద్దతుదారుల పెన్షన్లను తొలగిస్తామంటూ భయపెట్టేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. నగదును చంద్రబాబు ఇవ్వరని.. కేవలం కాగితాలనే ఇస్తారని ఎద్దేవా చేశారు. గతంలో రుణమాఫీ హామీ ఇచ్చి, రుణ విమోచన పత్రాలిచ్చి ఎలా మోసం చేశారో.. పింఛన్ల ఽకోసం ప్రస్తుతం తీసుకున్న దరఖాస్తుల పరిశీలన, వడపోత, బడ్జెట్ పేరుతో కాలయాపన చేయనున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో మంజూరైన పింఛన్ల మినహా, కొత్తగా ఒక్కటైనా ఇచ్చారానని ప్రశ్నించారు.
సర్వేపల్లిలో ఇష్టారాజ్యంగా దోపిడీ
సర్వేపల్లి నియోజకవర్గంలో ఇష్టారాజ్యంగా దోపిడీకి సోమిరెడ్డి పాల్పడుతున్నాడని ఆరోపించారు. విరువూరు, సూరాయపాళెంలో ఇసుక అక్రమ రవాణా మొదలుకొని గ్రావెల్, మట్టి తవ్వకాలు, ఫ్యాక్టరీలు, థర్మల్ పవర్ ప్రాజెక్టులకు సంబంధించిన బూడిద విక్రయాలు ఇలా అన్నింటిలోనూ అక్రమాలను సాగిస్తున్నారని దుయ్యబట్టారు. కాకుటూరులో అత్యంత విలువైన శివాలయ భూములను లేఅవుట్ యజమానులకు విక్రయించి సొమ్ము చేసుకోలేదనే విషయమై ప్రమాణం చేయగలరానని సవాల్ విసిరారు. తాజాగా కసుమూరులోని సర్వే నంబర్ 118 – 2లో ఉన్న పట్టాభిరామస్వామి దేవాలయానికి చెందిన 0.25 సెంట్లు.. 118 – 1లోని ప్రభుత్వ భూమి 1.66 ఎకరాల్లో లేఅవుట్‌ను వేసేందుకు సిద్ధం చేస్తున్న మాట వాస్తవం కాదానని ప్రశ్నించారు.
వీధి దీపాల పేరిట దుర్వినియోగం
వెంకటాచలంలోని జగనన్న కాలనీలో వీధి దీపాలు పనిచేస్తున్నా, వీటి పేరుతో సీఎస్సార్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. తక్కువ ధరకు కొనుగోలు చేసి, ఎక్కువ రేట్‌కు బిల్లులు సృష్టించి దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో తమ పార్టీ నేతలను కేసుల పేరుతో వేధించేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని, వీటికి భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. కొందరు ప్రజాప్రతినిధులపై ఏకంగా రౌడీషీట్లు ఓపెన్ చేయించేందుకు యత్నించడం, దీనిపై కోర్టు స్టే విధిస్తూ తీర్పు ఇవ్వడంతో ప్రభుత్వం అపహాస్యం పాలైందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సర్వేపల్లి నియోజకవర్గంలో తమ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులను సోమిరెడ్డి పెట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయన వేధింపులతో నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులు ఇష్టపడటంలేదని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం నేతల ఐడీ కార్డులను మండల కన్వీనర్ మోహన్‌నాయుడికి అందజేశారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య, ఎంపీపీ మందా కవిత, వైస్ ఎంపీపీలు కనుపూరు కోదండరామిరెడ్డి, మస్తానయ్య, జెడ్పీటీసీ పొట్లూరు సుబ్రహ్మణ్యం, ఎంపీటీసీ వేమారెడ్డి రఘునందన్‌రెడ్డి, కట్టంరెడ్డి శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


