breaking news
SPSR Nellore District Latest News
-
మట్టి వ్యాపారం.. కాసుల వర్షం
మట్టిని తరలించి చదును చేసిన ఏపీఐఐసీ ఆధీనంలోని ప్రైవేట్ వ్యక్తుల భూమి చిల్లకూరు: చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ప్రకృతి సంపదను అధికార పార్టీ నాయకులు కొల్లగొడుతున్నారు. గ్రావెల్, సిలికా, ఇసుక, క్వార్ట్ ్జను తవ్వి తరలించుకునేందుకు ముందుగా గనుల శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. కానీ ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు చేస్తున్నా ఇరిగేషన్, రెవెన్యూ, గనుల శాఖాధికారులు పట్టించుకోవడం లేదు. మండలంలోని ముత్యాలపాడు రెవెన్యూ పరిధిలో జాతీయ రహదారికి అతి సమీపంలో ఉన్న పోరెడ్డిగుంట కింద సుమారు 50 ఎకరాలు వరిని రైతులు సాగు చేశారు. డిసెంబర్లో వచ్చిన దిత్వా తుఫాను కారణంగా పోరెడ్డిగుంటకు గండి పడి నీరు మొత్తం దిగువకు ప్రవహించింది. దీంతో అది ఖాళీ అయ్యింది. రైతులు పంట సాగును పూర్తిగా నిలిపివేశారు. ఇదే అదునుగా భావించిన గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు గుంతల్లో ఉన్న మట్టిని యథేచ్ఛగా తవ్వి తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు. ఏపీఐఐసీసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటు కోసం భూములు కొనుగోలు చేసిన వారికి ఐదురోజులుగా 10 టిప్పర్లతో మట్టిని తరలిస్తున్నాడు. గండి పడిన పోరెడ్డిగుంటకు ఇరిగేషన్ అధికారుల అనుమతితో అక్కడే త వ్విన మట్టితో కట్టను ఏర్పాటు చేస్తే తెలుగుగంగ నీటిని గుంతకు తెప్పించికుని రైతులు వరి సాగు చేసుకునే వీలుంది. ఇలా చేస్తే తనకు ఏమి వస్తుందనుకున్న నాయకుడు ఏకంగా మట్టి తవ్వకాలు చేపట్టి దోచుకుంటున్నాడు. మట్టి తవ్వకాలమై ఇరిగేషన్ అధికారులను సంప్రదించేందుకు ప్రయత్నం చేయగా అందుబాటులోకి రాలేదు.పోరెడ్డిగుంటలో మట్టిని తవ్వుతున్న యంత్రాలు -
అంతని.. ఇంతని.. చివరికి పత్తాలేరు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఇరిగేషన్ శాఖలో తాను చెప్పిందే జరగాలని.. అంతా తానేనంటూ ఉన్నతాధికారులను సైతం గందరగోళానికి గురిచేసిన మేనేజర్ అడ్రస్ లేకుండాపోయారు. ‘ఫోన్‌పేలో లంచం... ఫైల్లో సంతకం’ అనే శీర్షికన సాక్షిలో కథనం ఈ నెల రెండున ప్రచురితమైంది. ఇది వెలుగులోకి వచ్చిన నాటి నుంచి ఆఫీస్‌లో సదరు అధికారి కుదురుగా ఉన్న సందర్భం లేకపోవడం గమనార్హం. ప్రసన్నానికి పాకులాట బుచ్చిరెడ్డిపాళెం సబ్ డివిజన్లో 31 వర్కులకు సంబంధించిన ప్రతిపాదనల ఆమోదంలో కాంట్రాక్టర్లకు మద్దతిస్తూ అర్హత లేని పనులకు సైతం అనుమతులివ్వాలంటూ ఇంజినీర్లతో మేనేజర్ గత నెల్లో గొడవపడ్డారు. ఈ తరుణంలో అక్రమాలకు సంబంధించి సాక్ష్యాధారాలతో సహా కథనం ప్రచురితం కావడంతో సదరు అధికారిలో దడ మొదలైంది. ఇంకేముంది అధికార పార్టీ నేతల కాళ్లు పట్టుకునేందుకు వారి ఇళ్లకెళ్తున్నారని ఆ శాఖ ఉద్యోగులే బహిరంగంగా పేర్కొంటున్నారు. సెలవు పెట్టకుండా నాలుగు రోజులుగా కనిపించని సదరు మేనేజర్‌పై నిజనిర్ధారణ చేయాల్సిందిగా విజయవాడ వర్క్స్ అండ్ అకౌంట్స్ జాయింట్ డైరెక్టర్‌ను నియమించారు. సాక్ష్యాలు పక్కాగా ఉండటంతో విచారణ నుంచి ఎలా తప్పించుకోవాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారని తెలు స్తోంది. కార్యాలయంలోని తన గది తాళాలను తీస్తున్నా, తలుపులను మాత్రం సిబ్బంది తెరవడంలేదు. కాగా డిప్యుటేషన్‌పై ఇన్ని రోజులు పనిచేసిన ఈయన్ను సొంత శాఖ వర్క్స్ అండ్ అకౌంట్స్‌కు సరెండర్ చేస్తారనే టాక్ నడుస్తోంది. -
చీటింగ్ కేసులో నిందితుల అరెస్ట్
నెల్లూరు(క్రైమ్): ఫ్రాంచైజర్లను మోసగించిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం నెల్లూరు దర్గామిట్ట పోలీసుస్టేషన్లో ఇన్స్పెక్టర్ బి.కల్యాణరాజు కేసు పూర్వాపరాలను వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రానికి చెంది ప్రస్తుతం నెల్లూరు శ్రీహరినగర్‌లో నివాసముంటున్న బి.విజయ్‌కుమార్ ఎండీగా, కర్నూలుకు చెంది ప్రస్తుతం నెల్లూరులో ఉంటున్న ఎ.మహేంద్రకుమార్, తిరుపతి జిల్లా నాయుడుపేటకు చెందిన ఎస్.సునీల్‌లు మేనేజర్లుగా ఆరునెలల క్రితం మాగుంటలేఅవుట్‌లో విహాన్ గ్రామీణ హోమ్ ఫుడ్స్ సంస్థను ప్రారంభించారు. సంప్రదాయ పిండివంటలు, మిఠాయిలు అందిస్తామని ప్రకటనలు గుప్పించారు. దీంతో పలువురు డిపాజిట్లు చెల్లించి ఫ్రాంచైజ్‌లను తీసుకున్నారు. కొంతకాలంగా ఉత్పత్తులు పంపకపోవడం, నగదు ఇవ్వకపోవడంతో నెల్లూరు నగరానికి చెందిన ఫ్రాంఛైజర్ మనోజ్‌కుమార్‌తోపాటు 17 మంది మూడు రోజుల క్రితం దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు కేసు మోదు చేశారు. మంగళవారం ఎండీతోపాటు ఇద్దరు మేనేజర్లను అరెస్ట్ చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. -
తండ్రీకొడుకుల అరాచకాలు ఎంతో కాలం సాగవు
● పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులు ● సీమకు అన్యాయం జరుగుతుంటే పవన్ ప్రశ్నించరు ● ధ్వజమెత్తిన మాజీ మంత్రి రోజా వెంకటాచలం (పొదలకూరు): అధికారముందనే అహంకారంతో తండ్రీకొడుకులు బరితెగించి రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అరాచకాలను సాగిస్తున్నారని, ఇవి ఎంతో కాలం సాగవని మాజీ మంత్రి రోజా స్పష్టం చేశారు. నెల్లూరు కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డితో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పొన్నూరు నియోజకవర్గ సమన్వయకర్త అంబటి మురళితో కలిసి మంగళవారం ములాఖత్ అయ్యారు. అనంతరం జైలు బయట విలేకరులతో మాట్లాడారు. తమ పార్టీ నేతలను ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో.. రేపటి రోజున వీరికీ అదే గతి పడుతుందని చెప్పారు. టీడీపీ ప్రభుత్వ 16 నెలల పాలనలో పిన్నెల్లి సోదరులపై 16 అక్రమ కేసులను నమోదు చేయించి జైలు పాల్జేశారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల ఆధిపత్య పోరులో భాగంగా హత్యలు చేసుకుంటే, ఆ కేసును పిన్నెల్లి సోదరులపై నమోదు చేయడం దారుణమన్నారు. ఎన్నికల్లో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేస్తే అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపారని విమర్శించారు. ఇక్కడ సౌకర్యాలు కల్పించాలని కోర్టు ఆదేశించినా, అమలు చేయించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎమర్జెన్సీ రెస్పాన్స్‌లో పోలీస్ వ్యవస్థ అట్టడుగున ఉందని, దీనికి ఆ శాఖ సిగ్గుపడాలన్నారు. క్రెడిట్ చోరీ చంద్రబాబుకు అలవాటే క్రెడిట్ చోరీకి పాల్పడటం చంద్రబాబుకు తొలి నుంచి అలవాటుగా మారిందని రోజా ధ్వజమెత్తారు. మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి కృషితోనే భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణం జరిగిందని సంబంధిత కాంట్రాక్ట్ పొందిన జీఎమ్మార్ సంస్థ చెప్తున్నా, చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని విమర్శించారు. తన కృషిగా నిస్సిగ్గుగా ఆయన ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. 2019 ఎన్నికలకు ముందు నెల్లూరు, కుప్పంలో ఎయిర్‌పోర్టులను నిర్మిస్తానని ప్రకటించిన చంద్రబాబు, అక్కడ ఎందుకు జరపలేకపోయారని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యం ఉంటే సమాధానం చెప్పాలని రామ్మోహన్నాయుడ్ని ప్రశ్నించారు. బూటకపు హామీలతో గద్దెనెక్కిన చంద్రబాబును దింపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజాస్పందనే దీనికి నిదర్శనమని పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ ఎక్కడ దాక్కున్నారు..? రాయలసీమలో పుట్టానని చెప్పుకొంటున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్.. సాగునీటి విషయంలో ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతుంటే ఎక్కడ దాక్కున్నా రని రోజా ప్రశ్నించారు. 15 ఏళ్లు కూటమి కలిసి ఉంటుందని చెప్తున్న ఆయన.. రాయలసీమ విషయంలో చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోతున్నారో తెలియజేయాలని డిమాండ్ చేశారు. ప్రజల మన్ననలు పొందిన కుటుంబం మాచర్లలో ప్రజల మన్ననలు పొందిన ఫ్యామిలీ పిన్నెల్లి కుటుంబానిది అని అంబటి మురళి పేర్కొన్నారు. పిన్నెల్లి సుందరామిరెడ్డి, లక్ష్మారెడ్డి, రామకృష్ణారెడ్డి వరుసగా మాచర్లలో పోటీ చేసి గెలుపొందేవారని తెలిపారు. టీడీపీ అక్కడ బలహీనంగా ఉండటంతో అభ్యర్థిని ప్రతి ఎన్నికల్లో మార్చేదన్నారు. అక్కడ ఎలాగైనా పట్టుసాధించాలనే ఉద్దేశంతో పిన్నెల్లి సోదరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. ఈవీఎంల మాయాజాలం, పోలీసుల దమనకాండతో మాచర్లలో టీడీపీ విజయం సాధించిందని ఆరోపించారు. -
గిరిజన మహిళకు మేయర్ పదవి ఇవ్వాలి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): గిరిజన మహిళకు మేయర్ పదవి ఇవ్వాలని గిరిజన సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం వారు నగరంలో గాంధీబొమ్మ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గాంధీబొ మ్మ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతలు మాట్లాడుతూ 40 ఏళ్లకు గిరిజన మహిళకు మేయర్ పదవి దక్కితే దానిని చూసి ఓర్వలేక కూటమి ప్రభుత్వం ఎన్నో కుట్రలు చేయడం దారుణమన్నారు. ఇదేనా రాజ్యాంగాన్ని గౌరవించడమని ప్రశ్నించారు. మేయర్ పదవిని మరో గిరిజన మహిళకు ఇస్తామని రూప్‌కుమార్ యాదవ్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఆయన ఇన్చార్జి బాధ్యతలు తీసుకొని ఆ విషయాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు బాపట్ల వెంకటపతి, బత్తిన లక్ష్మణశేఖర్, ఏకశిరి మురళి, సుధీర్‌బాబు, సేవూరి శ్రీనివాసులు, మైనంపాటి లక్ష్మి, లక్ష్మి, పద్మ, కమతం శీనయ్య, వెంకటేశ్వర్లు, ప్రభాకర్ పాల్గొన్నారు. -
కార్డన్ సెర్చ్‌లో వాహనాల స్వాధీనం
సంగం: మండలంలోని జెండాదిబ్బ గ్రామంలో డీఎస్పీ వేణుగోపాల్ ఆధ్వర్యంలో ఇద్దరు సీఐలు, 8 మంది ఎస్సైలు, 40 మంది సిబ్బంది మంగళవారం కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. సరైన పత్రాల్లేని 56 బైక్‌లు, 8 ఆటోలు సీజ్ చేశారు. అనంతరం రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, మహిళల రక్షణ చట్టాలపై డీఎస్పీ అవగాహన కల్పించారు. సెర్చ్‌లో సంగం, ఆత్మకూరు సీఐలు శ్రీనివాసులురెడ్డి, గంగాధర్, సంగం, ఏఎస్‌పేట, ఆత్మకూరు, చేజర్ల, అనంతసాగరం ఎస్సైలు రాజేష్, తిరుమలరావు, జిలానీ, సూర్యప్రకాష్‌రెడ్డి, సైదులు పాల్గొన్నారు. ● వింజమూరు(ఉదయగిరి): వింజమూరు పట్టణంలోని బీసీ కాలనీలో మంగళవారం తెల్లవారుజామున కావలి డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ తెల్లవారుజామున 5 నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రతి ఇల్లు క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. సరైన పత్రాల్లేని 47 బైకులతోపాటు 3 ఆటోలను సీజ్ చేశామన్నారు. కార్యక్రమంలో కలిగిరి సీఐ వెంకటనారాయణ, ఎస్సైలు వీరప్రతాప్, ఆల శ్రీను, మాల్యాద్రి, ఉమాశంకర్, 50 మంది సిబ్బంది పాల్గొన్నారు.సంగం : కార్డన్ సెర్చ్‌లో స్వాధీనం చేసుకున్న వాహనాలు వింజమూరు : సీజ్ చేసిన వాహనాలతో పోలీసులు -
మత్తు పదార్థాల జోలికెళ్లొద్దు
కోవూరు: యువత మత్తు పదార్థాల జోలికి వెళ్లొద్దని పోలీస్ అధికారులు తెలిపారు. జల్సాలకు అలవాటుపడిన కొందరు విశాఖపట్నం, ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు, కోవూరు ఇనమడుగు సెంటర్ ప్రాంతాలకు చెందిన వెంకటేశ్వర్లు, ఉదయ్, జయదేవ్, సుబ్రహ్మణ్యం, ఎస్కే అక్బర్, శ్రీనాథ్ తదితరులు గంజాయి అమ్మకాలు చేస్తున్నారు. వారి నుంచి మంగళవారం మధ్యాహ్నం రూ.3 లక్షల పైగా విలువచేసే ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిని స్థానిక పోలీస్‌స్టేషన్ నుంచి బజార్ సెంటర్ వరకు నడిపించారు. కార్యక్రమంలో సీఐ సుధాకర్‌రెడ్డి, కోవూరు ఎస్సై ముత్యాలరావు, ఏఎస్సై సత్యనారాయణ, సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవంగా ముగ్గురమ్మల తిరునాళ్ల
అల్లూరు: అల్లూరు గ్రామదేవతలైన పోలేరమ్మ, కలుగోళమ్మ, గంగమ్మ తిరునాళ్ల మహోత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. దేశ, విదేశాల్లో స్థిరపడిన అల్లూరీయులు, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. కార్యనిర్వాహకుడు, మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. 1001 కుండలతో అమ్మవారికి సద్ది నివేదన కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు. కాటంరెడ్డి నివాసం నుంచి ఆయన సతీమణి శివప్రియ ఆధ్వర్యంలో 1001 కుండలతో సద్దిని ఊరేగింపుగా పోలేరమ్మ గుడి వద్దకు తీసుకెళ్లారు. ప్రత్యేకాలంకరణలు, పొంగళ్లు, గ్రామోత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రత్యేకంగా ఉంచిన ముగ్గురమ్మవార్ల విగ్రహాలను చూసేందుకు భక్తులు తరలివచ్చారు.అమ్మవార్ల విగ్రహాలు పొంగళ్లు కార్యక్రమం నిర్వహిస్తున్న కాటంరెడ్డి దంపతులు -
ఇంకెంతకాలం ఎదురుచూడాలో?
బుచ్చిరెడ్డిపాళెం రూరల్: ఒకప్పుడు నెల్లూరంటే కోవూరు షుగర్ ఫ్యాక్టరీ పేరు ప్రముఖంగా వినిపించేది. 1979లో అప్పటి ముఖ్యమంత్రి వెంగళరావు రైతుల విజ్ఞప్తి మేరకు కోవూరు మండలం పోతిరెడ్డిపాళెం వద్ద ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి 2013 వరకు నిరంతరాయంగా నియోజకవర్గంలోని కోవూరు, విడవలూరు, కొడవలూరు, బుచ్చి, ఇందుకూరుపేట మండలాల చెరకు రైతులకు వెన్నుదన్నుగా నిలిచింది. సమీప నియోజకవర్గాలైన నెల్లూరు రూరల్, ఆత్మకూరు, కావలి నియోజకవర్గాల్లో చెరకు పండించే రైతులు లాభాలు ఆర్జించారు. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన షుగర్ ఫ్యాక్టరీ నష్టాల పేరుతో మూతపడటం, బకాయిలు చెల్లించకపోవడంతో అటు కార్మికులు, ఇటు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేలమందికి ఉపాధి ఫ్యాక్టరీ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలమందికి ఉపాధి కల్పించింది. ప్రత్యక్షంగా 600 నుంచి 700 మంది వరకు పని చేసేవారు. పరోక్షంగా 5 వేల మంది రైతులు, చెరకు కట్‌చేసే కార్మికులు, మరో మూడువేలమందికి నాలుగైదు నెలలపాటు ఉపాధి దొరికేది. అంతేకాకుండా ఎద్దుల బండ్ల రైతులు, ట్రాక్టర్లు, లారీలు కలిగిన వారు ఫ్యాక్టరీకి తరలించడం ద్వారా ఉపాధి పొందేవారు. అప్పట్లో రైతులకు ఫ్యాక్టరీ ద్వారా వివిధ బ్యాంకుల ద్వారా ఖాతాలు తెరచి ముందస్తు రుణాలు కూడా అందించేవారు. సన్నకారు రైతులు, నిరుపేద కూలీలకు చెందిన దాదాపు 10 వేల కుటుంబాలు దీనిపై ఆధారపడి జీవనం సాగించేవి. నష్టాల పేరుతో.. కాలక్రమేణా నిర్వహణ ఖర్చులు, జీతాలు తదితర ఖర్చులు పెరిగాయని ప్రభుత్వాలు ఫ్యాక్టరీని పట్టించుకోకపోవడంతో మూతపడింది. 2013 సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్, ఆ తర్వాత 2014లో టీడీపీ ప్రభుత్వం కార్మికులకు బకాయిలు చెల్లించలేదు. దీంతో నష్టాల పేరుతో మూతపడేలా చేశారు. 2019 సంవత్సరంలో ఏర్పాటైన వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఫ్యాక్టరీ తెరిచేందుకు ప్రయత్నాలు చేసింది. ఇందుకు కమిటీని కూడా నియమించింది. కమిటీ అందించిన నివేదిక ప్రకారం చెరకు సాగు తగ్గి, చేపలు, రొయ్యలు తదితర ఆక్వా ఉత్పత్తుల వైపు రైతులు ఆసక్తి చూపుతున్నారని వివరించింది. ఈలోగా 2024కు సంబంధించి ఎన్నికల కోడ్ రావడంతో ప్రభుత్వం నిధులు విడుదల చేసేందుకు వీలు పడలేదు. ఎప్పుడిస్తారో? ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి బుచ్చిరెడ్డిపాళెం బస్టాండ్ సెంటర్లో నిర్వహించిన బహిరంగ సభలో షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారంలోకి రాగానే ఆ హామీని పక్కన పెట్టేశారు. ఈ విషయమై ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డిని అనేకసార్లు కార్మికులు కలిశారు. రూ.23 కోట్ల బకాయిల విషయమై సీఎం చంద్రబాబుతో చర్చించి నిధులు విడుదలయ్యేలా చూడాలని విన్నవించుకున్నారు. గతంలో జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఈ విషయమై ఆమె ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోలేదు. దాదాపు 20 నుంచి 30 ఏళ్ల వరకు ఫ్యాక్టరీలో పనిచేసిన తమకు న్యాయబద్ధంగా రావాల్సిన వేతన బకాయిలు ప్రభుత్వ వెంటనే చెల్లించేలా నెల్లూరు ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే చొరవ చూపాలని కా ర్మికులు కోరుతున్నారు.కోవూరు షుగర్ ఫ్యాక్టరీ పాపం షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఎన్నికల హామీ నెరవేర్చని ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అందాల్సిన బకాయిలు రూ.23 కోట్లు పట్టించుకోని చంద్రబాబు ప్రభుత్వం -
అవునండీ.. నగదు బదిలీ వాస్తవమే
సాక్షి టాస్క్‌ఫోర్స్: నెల్లూరు ఇరిగేషన్ శాఖలో చోటుచేసుకున్న సిత్రాల్లో సరికొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఫోన్‌పే ద్వారా లంచాలను స్వీకరించారనే అంశంపై సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితమైంది. ఈ క్రమంలో ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ అయంది వాస్తవమేనంటూ అధికారులకు ఇచ్చిన నివేదికలో కార్యాలయాధికారి పేర్కొనడం గమనార్హం. అయితే అది కాంట్రాక్టల్లిచ్చే పర్సంటేజీ కాదని.. తన కుమారుడు ఇంజినీరింగ్ కన్సల్టెంట్‌గా ఉన్న నేపథ్యంలో ఆయన సేవలకు మెచ్చి వారు ఇచ్చిన నజరానానని పేర్కొనడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అవినీతి వాస్తవమేనని ఆ వివరణ లేఖ ద్వారా తెలుస్తోంది. ఇంత పక్కా ఆధారాలతో అవినీతి వెలుగులోకి వచ్చినా, ఏసీబీ అధికారులు స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీ నేతల ఒత్తిడితోనే ఇలా జరుగుతోందనే ప్రచారం లేకపోలేదు. చేయని పనులకూ బిల్లులు నెల్లూరు ఇరిగేషన్ కార్యాలయంలో అవినీతి మూడు వర్కులు.. ఆరు పేమెంట్లు అనే చందంగా సాగుతోంది. ప్రతి పనికీ పర్సంటేజీలను వసూలు చేసి బిల్లులివ్వడం.. చేయని వాటికి సైతం మంజూరు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అకౌంట్స్ ఆఫీసర్ స్థాయిలో ఉన్న సదరు అధికారి నిత్యం తిరుపతి జిల్లా నుంచి రాకపోకలు సాగిస్తూ కార్యాలయాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. ఇక్కడ జరిగే ప్రతి పనీ తనకు తెలిసే జరపాలంటున్నారనే ఆరోపణలున్నాయి. ఇలా ప్రతి బిల్లుకు ఐదు శాతాన్ని సదరు అధికారికే ఇవ్వాలి. ఇక ఏఈ నుంచి ఎస్ఈ స్థాయి అధికారికి దాదాపు 15 శాతం మేర సమర్పించాల్సి ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత మొత్తంలో వసూలు చేస్తుంటే పనిలో నాణ్యత ఎలా ఉంటుందో పెరుమాళ్లకే ఎరుక. కన్సల్టెంటా..? తన కుమారుడు కన్సల్టెంట్‌గా పనిచేయడంతోనే నగదు బదిలీ అయిందని సదరు అధికారి వివరణ ఇవ్వడం గమనార్హం. వాస్తవంగా ఇలా ఉండాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. మరోవైపు సదరు అధికారి తనయుడు తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తిలో ఉంటారు. అయితే ఆయన ఇక్కడ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారని చెప్పడం సదరు అధికారికే చెల్లింది. వాస్తవానికి ఒక పనికి అంచనాలేయాలంటే ప్రైవేట్ కన్సల్టెంట్‌కు అధికారులే ఇవ్వాలి. కాంట్రాక్టర్లకు ఈ అవకాశం ఉండదు. ఇలా కన్సల్టెంట్.. అధికారి.. వారి సమీప బంధువుకు ఫోన్‌పే ద్వారా నగదు బదిలీ అవ్వడంతో ఈ ముగ్గురి బ్యాంక్ ఖాతాలను సమగ్రంగా పరిశీలిస్తే ఎన్ని కోట్ల లావాదేవీలు జరిగాయో తెలుస్తుంది. మౌనమేలనోయి..? అవినీతికి పాల్పడ్డారనే అంశాన్ని తమ దృష్టికి తీసుకొస్తే వారిని జైలుకు పంపుతామంటూ ఏసీబీ అధికారులు నిరంతరం చెప్తుంటారు. అయితే ఇరిగేషన్ శాఖలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నా, స్పందన కొరవడింది. బిల్లుల్లో పర్సంటేజీల కోసం భారీగా నగదు బదిలీ అవుతోందంటూ పక్కా ఆధారాలను మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెలుగులోకి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని అందరూ ప్రచురించినా, విచారణకు ఏసీబీ అధికారులు ఏ మాత్రం ముందుకురావడంలేదు. వీరిపై రాజకీయ ఒత్తిడి ఉందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత టీడీపీ పాలన లో అవినీతి ఏ స్థాయికి చేరిందనే అంశానికి ఇదో ఉదాహరణగా నిలుస్తోంది. నెల్లూరులోని ఇరిగేషన్ కార్యాలయంలో అవినీతి కొత్త పుంతలు తొక్కింది. ముడుపులను యూపీఐ ద్వారా స్వీకరించి సరికొత్త అధ్యయానికి ఇక్కడ తెరలేపారు. ఈ ఉదంతంలో ఆ శాఖ అధికారి చెప్తున్న మాటలు విస్మయం కలిగిస్తున్నాయి. నగదు బదిలీ అయింది వాస్తవమేనని, తన కుమారుడు కన్సల్టెంట్‌గా ఉండటంతో వీటిని జమ చేశారంటూ బుకాయింపు చర్యలకు పాల్పడ్డారు. బ్యాంక్ స్టేట్మెంట్లను పరిశీలిస్తే అసలు బాగోతం బయటకొచ్చే అవకాశమున్నా, ఏసీబీ అధికారులు మాత్రం మౌనవ్రతం దాలుస్తున్నారు. నా కుమారుడు కన్సల్టెంట్‌గా ఉన్నారు అందుకే కాంట్రాక్టర్లు డబ్బులేశారు ఇరిగేషన్ అధికారి బుకాయింపు ఆధారాలున్నా, ఏసీబీ అధికారుల మౌనవ్రతం బ్యాంక్ ఖాతాలను పరిశీలిస్తే అవినీతి బయటపడే అవకాశం -
విమానాశ్రయ భూములకు రెట్టింపు పరిహారం ఇవ్వాలి
● కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట రైతుల ధర్నా కావలి(అల్లూరు): దగదర్తి విమానాశ్రయ నిర్మాణంలో భూములను కోల్పోతున్న రైతులు తమకు రెట్టింపు పరిహారాన్ని ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు కావలి ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ వంశీకృష్ణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ 2013 భూపరిహార చట్టం కింద తమ భూములకు ఎకరాకు రూ.13లక్షల పరిహారాన్ని అందజేయడం అన్యాయమన్నారు. పట్టా భూములకు ఇచ్చినట్లే రూ.25 లక్షల పరిహారాన్ని ఇవ్వాలని కోరారు. అలాగే ప్రతి కుటుంబంలోని అర్హత కలిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఎస్ మల్లి మాట్లాడుతూ ప్రస్తుత రేట్ల ప్రకారం ఎస్సీ, ఎస్టీల భూములకు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అందుకు స్పందించిన ఆర్డీఓ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి గ్రామసభ పెట్టి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. శ్రీనివాసులురెడ్డి, కే చంద్ర, బీ వెంకయ్య, మాలేపాటి గణేష్ నాయుడు, మక్కినేని వెంకయ్య, నెల్లూరు రమణారెడ్డి, జే శ్రీనివాసులురెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సీ్త్రనిధి నగదు గోల్‌మాల్‌పై ఫిర్యాదు
వరికుంటపాడు: సీ్త్రనిధి నగదు గోల్‌మాల్‌పై తోటలచెరువుపల్లికి చెందిన ఆరు స్వయం సహాయక సంఘాల సభ్యులు మండల వెలుగు కార్యాలయం ఎదుట సోమవారం నిరసన తెలిపారు. అనంతరం ఏపీఎంకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ గ్రామంలో ఆరు గ్రూపులు ఉన్నాయని తెలిపారు. సీ్త్రనిధి నుంచి ఒక్కో గ్రూపు రూ.2లక్షలు చొప్పున మొత్తం రూ.12 లక్షలు రుణంగా తీసుకున్నట్లుగా చెప్పారు. అందుకు సంబంధించి ఒక్కోగ్రూపు నెలకు రూ.9,600 చొప్పున 23 నెలలు చెల్లించాల్సి ఉండగా 25 నెలలు చెల్లించినట్లుగా తెలిపారు. అయినా ఇంకా ఆరు గ్రూపులకు సంబంధించి రూ.లక్షకుపైగా చెల్లించాలని వెలుగు సీసీ ఒత్తిడి చేస్తోందని, ఆ మొత్తం చెల్లించకపోతే కొత్త రుణాలు మంజూరు చేయబోమని చెబుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. గత నెల రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగు తున్నా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. సీసీని డిప్యుటేషన్‌పై మర్రిపాడు మండలానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా వాటిని లెక్కచేయకుండా కొనసాగుతున్నారని ఆరోపించారు. సీ్త్రనిధి నిధుల గోల్మాలకు పాల్పడుతున్న సీసీలను తక్షణమే విధుల నుంచి తొలగించాలని ఏపీఎంను కోరారు. -
ఎంపీపీ ఎన్నికను రద్దు చేయాలి
● వైఎస్సార్ సీపీ నేతల డిమాండ్ వింజమూరు(ఉదయగిరి): వింజమూరు ఎంపీపీ ఎన్నికను అధికార పార్టీ నేతలతో పోలీసులు, అధికారులు కుమ్మకై ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అక్రమంగా నిర్వహించారని, ఉన్నతాధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి వెంటనే ఎన్నికను రద్దు చేయాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు. వింజమూరులోని బంగ్లా సెంటర్లో సోమవారం వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. జెడ్పీటీసీ గణపం బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ పోలీసులు పథకం ప్రకారం తమ ఎంపీటీసీలను సమావేశ మందిరం వద్దకు వాహనాల్లో రానీయకుండా కాలినడకన నడిపించి తమ ఎంపీటీ పీ మల్లికార్జున కిడ్నాప్‌కు సహకరించారన్నారు. ఎంపీపీ ఎన్నిక ప్రక్రియను ప్రజాస్వామ్యబద్ధంగా జరపనందున వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీపీ అభ్యర్థి, జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు పల్లాల కొండారెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులు తమ సభ్యులను కిడ్నాప్ చేయడమే కాకుండా తమను సమావేశ మందిరంలోకి అనుమతించలేదన్నారు. ఎన్నిక సమయం ముగిసే రెండు నిమిషాల ముందు (11.58గంటలకు) ఒక ఎంపీటీసీని దొడ్డిదారిన లోపలికి తీసుకెళ్లి తలుపులు మూసి ఎంపీపీ ఎన్నికను పూర్తి చేయడం అప్రజాస్వామికమన్నారు. దీనికి అధికారులు పూర్తిగా సహకరించినందున కలెక్టర్ వెంటనే చర్యలు తీసుకుని ఎన్నిక ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఉదయగిరి ఏఎంసీ మాజీ చైర్మన్ షేక్ అలీఅహ్మద్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి 8 మంది ఎంపీటీసీల సంపూర్ణ మద్దతు ఉందన్నారు. అయినా తమ ఎంపీటీసీని బలవంతంగా కిడ్నాప్ చేశారని, ఇందుకు పోలీసులు పూర్తిగా సహకరించారని ఆరోపించారు. టీడీపీ వారే దౌర్జన్యానికి పాల్పడి ఆ నెపాన్ని వైఎస్సార్సీపీ మీదకు తోసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. అధికార పార్టీకి గెలిచే బలం లేకపోయినా అక్రమాలకు పాల్పడిందన్నారు. దీనిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లి న్యాయపోరాటం చేస్తామన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్పీపీ మండలాధ్యక్షుడు రేవునూరి శ్రీనివాసరెడ్డి, నేతలు మద్దూరి బాబు, కాటం రవీంద్రరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, పోలిబోయిన వెంకటేశ్వర్లు, డబ్బుకొట్టు రమణయ్య, బండి కృష్ణారెడ్డి, ఎంపీటీసీలు డేగా వంశీ, భవానీ, ఉంటా రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
● ఎమ్మెల్యే వర్గీయులపై మాలేపాటి వర్గీయుల దాడి దగదర్తి : దగదర్తి టీడీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఆదివారం రాత్రి కావలి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి వర్గానికి చెందిన కడియాల సురేష్ ఇంటిపై మాలేపాటి వర్గీయులు దాడికి తెగబడ్డారు. ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా సురేష్‌ను రోడ్డుపైకిలాగి వీధుల్లో తరిమితరిమి దాడికి పాల్పడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఇప్పటి వరకు మాలేపాటి వర్గంలో ఉన్న వడ్డే శ్రీకాంత్‌నాయుడు వారిని విభేదించి ఎమ్మెల్యే డీవీ కృష్ణారెడ్డి అండదండలతో టీడీపీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్నాయుడును మాలేపాటి సోదరులు రవీంద్రనాయుడు, సుధాకర్‌నాయుడు అనుచరులు తీవ్రంగా విభేదిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి సుధాకర్‌నాయుడుకు శ్రీకాంత్‌నాయుడు వర్గానికి చెందిన కడియాల సురేష్ ఫోన్ చేసి ఆయనతో పాటు ఆయన భార్యను కించపరుస్తూ నానా దుర్భాషలాడి బెదిరించాడు. ఈ విషయం తెలుసుకున్న మాలేపాటి వర్గీయులు సురేష్ ఇంటిపై మారణాయుధాలతో దాడికి తెగబడ్డారు. ఇంటి తలుపులు, అద్దాలతో పాటు గృహోపకరణాలను ధ్వంసం చేశారు. కడియాల సురేష్‌ను బయటకు లాగి వీధుల్లో తరిమితరిమి దాడి చేశారు. దీంతో సురేష్ తలకు తీవ్ర గాయమైంది. సురేష్‌పై దాడి చేస్తున్న విషయాన్ని తెలుసుకుని అడ్డుకునేందుకు వచ్చిన వడ్డే శ్రీకాంత్‌నాయుడు, సోదరుడు వినయ్పైన దాడికి దిగారు. దీంతో వారు తప్పించుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివాదాన్ని సర్దుమణిగించారు. గాయపడిన సురేష్‌ను చికిత్స నిమిత్తం 108 వాహనంలో కావలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కాగా దగదర్తిలో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా పికెట్ ఏర్పాటు చేశామని, దాడులకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జంపాని కుమార్ తెలిపారు. -
ఎంపీపీ ఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం
ఉదయగిరి: వింజమూరు ఎంపీపీ ఎన్నికలో అధికార టీడీపీ దౌర్జన్యాలు, కిడ్నాప్‌లు, అక్రమాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వింజమూరులో ఎంపీపీ ఎన్నిక జరిగిన తీరుపై ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్సీపీకి 8 మంది ఎంపీటీసీ సభ్యుల మద్దతు ఉందని తెలిపారు. టీడీపీ నాయకులు ఓటమి భయంతో కిడ్నాప్, దౌర్జన్యాలు, కుట్రలు చేసి ఎంపీపీ పదవిని పొందడం సిగ్గుచేటు అన్నారు. ఉదయగిరి రాజకీయ చరిత్రలో ఎన్నడూ కిడ్నాప్‌లు లేవన్నారు. టీడీపీ నేతలు నాటుతున్న ఈ విషబీజం మానై భవిష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదన్నారు. పోలీసుల సమక్షంలోనే వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి, మరో మహిళా ఎంపీటీసీని గాయపరిచి ప్రజాస్వామ్యాన్ని పాతిపెట్టి తాము విజయం సాధించామని చెప్పుకోవడం సిగ్గుచేటుగా అభివర్ణించారు. ఈ ఎన్నికలో టీడీపీ విజయం సాధించామని చెప్పుకున్నా, నైతికంగా తమ పార్టీ విజయం సాధించినట్లేనన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు, పోలీసుల అరాచకాలకు లొంగకుండా ధైర్యంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న తమ పార్టీ ఎంపీటీసీలు, నేతలకు భవిష్యత్తులో మంచి స్థానం కల్పిస్తామన్నారు. ఈ అరాచక చర్యలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలిచిన నేతలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. -
ప్రజాక్షేత్రంలో టీడీపీ ప్రజాదరణ కోల్పోయింది. అడ్డదారుల్లోనూ చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు అధికారం దక్కించుకున్న ప్రతీసారి ఎన్నిక ఏదైనా అరాచకమే ఆయుధంగా చేసుకుని అడ్డదారులు తొక్కడం టీడీపీకి పరిపాటిగా మారింది. గతంలో జెడ్పీ చైర్మన్‌తో పాటు నెల్లూరు కార్పొరే
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: జిల్లాలో ఖాకీల సాక్షిగా ఖూనీ అవుతున్న ప్రజాస్వామ్యం కుమిలి కుమిలి ఏడుస్తోంది. పోలీస్ వ్యవస్థ అధికార పార్టీకి పాదాక్రాంతం కావడంతో రెడ్‌బుక్ రాజ్యాంగం ముందు భారత రాజ్యాంగం అపహాస్యం పాలవుతోంది. ప్రజాదరణతో గెలవలేని టీడీపీ అడ్డదారుల్లో పదవులను తమ ఖాతాలో వేసుకునేందుకు అరాచకాలకు పాల్పడుతోంది. గతంలో ప్రతిపక్ష పార్టీ నుంచి గెలిచిన ప్రజాప్రతినిధులకు రూ.లక్షల్లో ఎరవేసి సంతలో పశువులను కొన్నట్లుగా కొంటే.. ఇప్పుడు పోలీసుల ఎస్కార్ట్‌తో అరాచక శక్తులను ప్రోద్బలచి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులను కిడ్నాప్ చేయ డం, దౌర్జన్యం చేయడానికి తెగబడుతోంది. తాజా గా ఒక ఎంపీటీసీ సభ్యుడు కూడా లేని టీడీపీ వింజమూరు ఎంపీపీ పదవిని ౖకైవశం చేసుకునేందుకు పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకం సాగించింది. ఒక వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేస్తే.. మరో మహిళా ఎంపీటీసీని సైతం ఎత్తుకెళ్లేందుకు బరితెగించారు. మాజీ ఎంపీపీని పోలీసుల ద్వారా అజ్ఞాతంలో నిర్బంధించగా, తాత్కాలిక ఎంపీపీని సైతం దాచేసి, ఆఖరి క్షణంలో తీసుకొచ్చి ఎంపీపీ పదవిని కొల్లగొట్టి.. టీడీపీ ముద్ర వేసుకున్నారు. అరాచకమే ఆయుధంగా.. టీడీపీ అధికారంలో వచ్చాక అరాచకాలే ఆయుధంగా రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో అడ్డదారుల్లో అందలమెక్కుతోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీకి అధికారం దక్కగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభంజనం సృష్టించింది. అప్పట్లోనూ అధికారాన్ని అడ్డం పెట్టుకుని కనీస స్థానాలు కూడా లేని జెడ్పీ చైర్మన్, నెల్లూరు కార్పొరేషన్ మేయర్ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కి.. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన ప్రజాప్రతినిధులను బెదిరించి కొందరిని, రూ.లక్షలు ఇచ్చి ప్రలోభ పెట్టి సంతలో పశువుల్లా కొనుగోలు చేసినా.. టీడీపీకి పరాభవం దక్కగా, చివరకు వైఎస్సార్సీపీనే అధికార పీఠాలు దక్కించుకుంది. తాజా సార్వత్రిక ఎన్నికల్లో అడ్డదారుల్లో అధికారంలోకి వచ్చిన టీడీపీ అదే పంథాలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కొలువుదీరిన పీఠాలపై ఆ పార్టీ ముద్ర వేసుకునేందుకు అరాచకాలకు తెగించింది. నెల్లూరు కార్పొరేషన్లో 54 కార్పొరేటర్ల స్థానాలు ఉండగా, వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. ఇక్కడ ఒక్క కార్పొరేటర్ స్థానం టీడీపీకి లేదు. అయినా అధికారంలోని టీడీపీ వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మెడపై పోలీస్ కేసుల గన్ పెట్టి పచ్చ కండువాలు కప్పేసి.. టీడీపీ కార్పొరేటర్లంటూ చెప్పుకుంది. ఇదే సమయంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక జరిగితే.. పచ్చ కండువా కప్పుకున్న వైఎస్సార్సీపీ కార్పొరేటర్లతో టీడీపీ ముద్రతో ఆ పదవిని దక్కించుకుంది. బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన రెండు డిప్యూటీ చైర్మన్ల ఎన్నిక సమయంలో కూడా బలం లేని టీడీపీ రాత్రికి రాత్రే వైఎస్సార్సీపీ సభ్యులను డబ్బు సంచులతో కొనుగోలు చేసి విప్ భయంతో స్వతంత్ర అభ్యర్థిగా తమ ఖాతాలో వేసుకున్నారు. సాగునీటి సంఘాల ఎన్నికల సమయంలో కూడా వైఎస్సార్సీపీ సభ్యులను రానివ్వకుండా విలువలకు పాతరేసి ఎన్నిక జరిపినట్లుగా చూపించి పేర్లు రాసుకున్నారు.. ఇలా ఏ ఎన్నిక జరిగినా సరే అడ్డదారులు తొక్కి తమ ఖాతాలో వేసుకుని తాత్కాలికంగా పైశాచికానందం పొందడం టీడీపీకే చెల్లింది. తాజాగా నెల్లూరు మేయర్ విషయంలోనూ టీడీపీ అరాచకాలు పతాక స్థాయికి చేరాయి. మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు సామదాన దండోపాయాలు ప్రదర్శించారు. అవిశ్వాసానికి సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో కొందరు తిరిగి సొంత గూటికి చేరడంతో ఏకంగా పోలీసులతోనే వారిని కిడ్నాప్ చేయించి, చివరాఖరుకు టీడీపీ శిబిరానికి అప్పగించే విధంగా క్రూరంగా వ్యవహరించారు. వింజమూరులో ప్రజాస్వామ్యం ఖూనీ.. వింజమూరు ఎంపీపీ ఎన్నిక వేళ పోలీసులు వ్యవహరించిన తీరుతో ప్రజాస్వామ్యాన్ని పట్టపగలు ఖూనీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ నేతృత్వంలో టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీని కిడ్నాప్ చేసి, మరో మహిళా ఎంపీటీసీపై దౌర్జన్యానికి తెగబడ్డారు. పోలీసుల సాక్షిగా అరాచకాలు జరుగుతున్నా.. కట్టడి చేయకపోగా, టీడీపీ గూండాలకు కొమ్ముకాశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి వింజమూరు మండలంలో టీడీపీకి ఒక్క ఎంపీటీసీ స్థానం కూడా లేదు. అయినా ఎంపీపీ పదవిని తమ ఖాతాలో వేసుకునేందుకు టీడీపీ పెద్దలు ఖాకీలతోనే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయించారు. మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. ఇందులో 8 మంది వైఎస్సార్సీపీ ఎంపీటీసీలే. ముగ్గురు ఇండిపెండెంట్లు, ఒకరు జనసేన ఎంపీటీసీగా గెలిచిన వారే. టీడీపీ ఒక్క ఎంపీటీసీ స్థానంలో కూడా గెలవలేకపోయింది. అప్పట్లో వైఎస్సార్సీపీ నుంచి గెలిచిన ఇనగలూరి మోహన్‌రెడ్డిని ఎంపీపీగా ఎంపిక చేసింది. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో ఎంపీపీతోపాటు మరో ఇద్దరు టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇద్దరి నేతల మధ్య ఆదిపత్య పోరు నేపథ్యంలో ఎంపీపీపై అవిశ్వాసం పెట్టి దించేశారు. ఆ స్థానానికి జరిగే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి గెలుపొంది టీడీపీలో చేరిన మహిళను ఎంపీపీగా ఎన్నుకునేందుకు అరాచకం సాగించి ప్రజాస్వామ్యానికి పాతరేశారు. ఇటీవల నెల్లూరు మేయర్ ఎన్నికల సమయంలో కూడా తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కార్పొరేటర్‌ను పోలీసులు కిడ్నాప్ చేసి టీడీపీ క్యాంపులో వదిలి పెట్టిన సంగతి మరవక ముందే వింజమూరులో కూడా ఖాకీల సాక్షిగా టీడీపీ గూండాలు వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేస్తున్నా చోద్యం చూసి వదిలేయడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతుంది. జిల్లాలో అన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ ఘోర పరాజయం అధికారం మారగానే తమ ఖాతాలో వేసుకునేందుకు అడ్డదారులు ఎంపీపీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్ పదవులపై టీడీపీ ముద్ర వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు పచ్చ కండువాలు వేసి.. టీడీపీ బలంగా చెప్పుకోవడం పరిపాటి పరాయి బిడ్డలకు తానే తండ్రిననే రీతిలో టీడీపీ వ్యవహారం తాజాగా వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో కిడ్నాప్‌లు, దాడులు అధికారానికి కొమ్ము కాస్తున్న ఖాకీలు -
ట్రాన్స్‌కోకు నష్టం
అధికారుల నిర్ణయం..● రూ.4 కోట్లు ఎక్కువ టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు పనులు ● సబ్‌స్టేషన్ నిర్మాణంతో వెలుగులోకి స్కామ్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): అధికారుల తీసుకున్న నిర్ణయంతో ట్రాక్స్కోకు నష్టం వస్తోందని ఆరోపణలున్నాయి. ఏపీ ట్రాన్స్‌కో గతేడాదిలో నెల్లూరు నగరంలోని రాజేంద్రనగర్ ప్రాంతంలో డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందిన రెండెకరాల స్థలంలో 132 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటుకు టెండర్లు పిలిచింంది. రూ.32 కోట్లకు వచ్చిన టెండర్‌ను ఖరారు చేశారు. అయితే కొందరు రాజకీయ నాయకుల ఒత్తిడితో కాంట్రాక్టర్‌కు లబ్ధి చేకూర్చేలా వ్యవహరించారని ప్రచారముంది. అయితే ఖరారు చేసిన వ్యక్తికి కాకుండా అదనంగా రూ.36 కోట్లకు టెండర్ వేసిన కాంట్రాక్టర్‌కు నిర్మాణ పనులు అప్పజెప్పేలా నేతలు ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలున్నాయి. దీంతో ట్రాన్స్‌కోలో టెండర్స్కాం వెలుగులోకి వచ్చింది. అదనపు భారం సబ్‌స్టేషన్ నిర్మాణానికి తక్కువ టెండర్ వేసిన కాంట్రాక్టర్‌ను కాదని రూ.4 కోట్లు అదనంగా వేసిన వ్యక్తికి పనులు కేటాయించడంతో ఏపీ ట్రాన్స్కోపై భారం పడనుంది. ఈ టెండర్ స్కామ్‌లో నాయకులు, అధికారుల పాత్ర ఏ మేర ఉందో తెలియాల్సి ఉంది. రాజేంద్రనగర్‌లో నిర్మించనున్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ స్థలం డీఎంహెచ్ఓ కార్యాలయానికి చెందింది. నిర్మాణానికి ఆ స్థలం కేటాయించడంతో అందుకు బదులుగా ట్రాన్స్‌కోకు చెందిన 2 ఎకరాల స్థలాన్ని డీఎంహెచ్ఓ కార్యాలయానికి ట్రాన్స్‌కో ఇవ్వాల్సి ఉంది. ట్రాన్స్‌కోకు నెల్లూరులోని అంబాపురం, కావలి, గూడూరు ప్రాంతాల్లో భూములున్నాయి. డీఎంహెచ్ఓ వారు ఏ ప్రాంతంలో కావాలంటే అక్కడ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. ఏది ఏమైనా ట్రాన్స్‌కో వారు అదనంగా రూ.4 కోట్లు టెండర్ దాఖలు చేసిన కాంట్రాక్టర్‌కు సబ్‌స్టేషన్ నిర్మాణ పనులు అప్పజెప్పడం చర్చనీయాంశమైంది.నిర్ణయాలు అక్కడే జరుగుతాయి ట్రాన్స్‌కో వారు నిర్మిస్తున్న 132 కేవీ విద్యుత్ సబ్స్టేషన్లకు సంబంధించిన నిర్ణయాలు విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో తీసుకుంటారు. అదనంగా నగదు కేటాయించే అధికారాలు మాకు లేవు. ట్రాన్స్‌కో ఆదేశాల మేరకు జిల్లా అధికారులు సబ్స్టేషన్ల నిర్మాణ ప్రక్రియను, నాణ్యతా ప్రమాణాలను మాత్రమే పర్యవేక్షిస్తారు. టెండర్ల విషయంలో జిల్లా ట్రాన్స్‌కో అధికారులకు ఎలాంటి సంబంధం ఉండదు. – రత్నం, ఏపీ ట్రాన్స్‌కో ఈఈ (ఇన్చార్జి కన్స్ట్రక్షన్ విభాగం) -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
● ఎస్పీ అజిత వేజెండ్ల నెల్లూరు(క్రైమ్): జిల్లాలోని 36 బ్లాక్స్పాట్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు చేపట్టాలని ఎస్పీ అజిత వేజెండ్ల పోలీస్ అధికారులను ఆదేశించారు. బ్లాక్స్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, రోడ్డు భద్రతా చర్యలపై సోమవారం నెల్లూరు పోలీసు కార్యాలయం నుంచి జిల్లాలోని పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బ్లాక్స్పాట్లలో స్పెషల్ డ్రైవ్‌లు, అవగాహన కార్యక్రమాలు నిరంతరం నిర్వహించాలన్నారు. వాహనదారులకు స్పష్టంగా అర్థమయ్యే రీతిలో హెచ్చరిక బోర్డులు, లైటింగ్, ఇసుక డ్రమ్ములు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్, బహిరంగ మద్యసేవనం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనులపై కేసులు నమోదు చేయాలన్నారు. ఫేస్ వాష్ కార్యక్రమాన్ని రాత్రివేళల్లో నిర్వహించాలని ఆదేశించారు. ద్విచక్ర వాహనదారులు విధిగా ప్రామాణికత కలిగిన హెల్మెట్లను ధరించాలన్నారు. అతివేగం ప్రమాదాకరమని, ఇంటివద్ద తమ కోసం కుటుంబ సభ్యలు ఎదురుచూస్తున్నారనే విషయాన్ని గుర్తెరిగి బాధ్యతగా వాహనాలు నడపాలని సూచించారు. కాన్ఫరెన్స్‌లో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఎస్బీ డీఎస్పీ శ్రీనివాసరావు, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
పిల్లల భద్రతపై తల్లిదండ్రుల ఆందోళన
చిల్లకూరు: పిల్లలకు గురుకుల పాఠశాలలో భద్రత కరువైందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. సైదాపురం మండలం కృష్ణారెడ్డిపల్లికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి కుటుంబం, ప్రజా సంఘాల నాయకులు కలిసి సోమవారం చిల్లకూరు బాలుర గురుకుల పాఠశాలకు చేరుకుని ప్రిన్సిపల్ అనిల్‌కుమార్‌తో వాగ్వాదానికి దిగారు. సుధాకర్ వివరాలు వెల్లడించారు. తన కుమారుడు అరవింద్ ఆరో తరగతి చదువుతున్నట్లు చెప్పారు. ఆదివారం పాఠశాల ఆవరణలోని మరుగుదొడ్ల వద్దకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అరవింద్‌కు మత్తు ఇచ్చాడన్నారు. దీంతో అతను గంటకు పైగా అక్కడే ఉన్నాడని, మెలకువ వచ్చాక 9వ తరగతి విద్యార్థులు గుర్తించి తరగతి ఇన్చార్జికు సమాచారం ఇచ్చారన్నారు. అరవింద్‌ను గూడూరు ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించిన అనంతరం తమకు సమాచారం అందించారని ఆరోపించారు. తాము గురుకులానికి వచ్చి పిల్లవాడ్ని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించామన్నారు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా ప్రిన్సిపల్, టీచర్లు పర్యవేక్షణ చేయకపోవడం దారుణమని విమర్శించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ప్రిన్సిపల్ మాట్లాడుతూ అరవింద్‌కు వైద్యం చేయించామన్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఎక్కడిక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీంతో సుధాకర్ స్పందించి తమ బిడ్డను కొద్దిరోజులపాటు ఇంటికి తీసుకెళ్తామన్నారు. విద్యార్థి చెప్పిన విషయంపై గురుకులం సిబ్బంది దృష్టిసారించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జై భారత్ నేషనల్ పార్టీ నాయకుడు వెంకటేశ్వర్లు కోరారు. -
చమురు నిక్షేపాలు కొల్లగొట్టేందుకే దాడి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): వెనెజువెలా దేశంలో ఉన్న చమురు నిక్షేపాలను కొల్లగొట్టేందుకే అమెరికా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మదురోను కిడ్నాప్ చేసిందని వామపక్ష పార్టీల నాయకులు అన్నారు. నెల్లూరు బాలాజీ నగర్‌లోని సీపీఎం జిల్లా కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశం జరిగింది. సీపీఎం జిల్లా సెక్రటేరియల్ సభ్యుడు మోహన్‌రావు, సీపీఐ జిల్లా మాజీ కార్యదర్శి వీరమరాజు, సీపీఐ ఎంఎల్ నాయకుడు కె.రాంబాబు మాట్లాడారు. దాడిని ఖండిస్తూ మంగళవారం నెల్లూరులో నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. అంతర్జాతీయ కోర్టు, ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ భద్రతా మండలి న్యాయసూత్రాలకు విరుద్ధం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. వెనెజువెలా ఘటనను ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ ప్రభుత్వం ఖండించకపోవడం దారుణమన్నారు. మదురోను వెంటనే విడుదల చేసి అంతర్జాతీయ కోర్టులో ట్రంప్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ర్యాలీలో పెద్ద సంఖ్యలో ప్రజాతంత్రవాదులు పాల్గొనాలని కోరారు. సమావేశంలో సీపీఎం నాయకులు మాదాల వెంకటేశ్వర్లు, పుల్లయ్య, దయాకర్ పాల్గొన్నారు. -
కన్నీళ్లు దిగమింగి.. కష్టాలు పడుతూ..
పాలకులు, అధికారులు దృష్టి పెడితే ప్రజలకు కష్టాలు తప్పుతాయి. కానీ అలా జరగడం లేదు. కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలానికి చెందిన శ్రీదేవికి నాగ్ గోవర్ధన్ అనే కుమారుడున్నాడు. అతను దివ్యాంగుడు. మంచానికే పరిమితమయ్యాడు. పింఛన్‌ను రూ.15,000కు పెంచాలంటూ ఆ తల్లి ప్రజాప్రతినిధులు, యంత్రాంగం చుట్టూ తిరుగుతోంది. అయితే ఎవరూ కనికరించలేదు. దీంతో సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి కుమారుడిని ఆటోలో తీసుకొచ్చింది. గోవర్ధన్‌ను కిందకు దించేందుకు అక్కడి సిబ్బంది సాయం తీసుకుని ఉన్నతాధికారులను వేడుకుంది. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
మీరైనా న్యాయం చేయండి
● పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● 124 వినతుల అందజేత నెల్లూరు(క్రైమ్): ‘క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాలేదు. మీరైనా విచారించి న్యాయం చేయండి’ అని పలువురు పోలీసు ఉన్నతాధికారులను కోరారు. సోమవారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా వ్యాప్తంగా 124 మంది తమ సమస్యలను అర్జీల రూపంలో ఎస్పీ అజిత వేజండ్లకు అందజేశారు. వాటిని పరిశీలించిన ఆమె చట్టపరిధిలో సమస్యలు పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్, మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్లు భక్తవత్సలరెడ్డి, టీవీ సుబ్బారావు, ఫిర్యాదుల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మాను. ఇప్పుడు పెళ్లి చేసుకోకుండా ముఖం చాటేస్తున్నాడు. ప్రశ్నిస్తే కుటుంబ సభ్యులతో కలిసి బెదిరిస్తున్నాడని కావలికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నా ఫోన్ నంబర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు సేకరించి సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అర్ధరాత్రుల్లో గుర్తుతెలియని వ్యక్తులు కాల్స్, మెసేజ్‌లు చేస్తూ మానసికంగా వేధిస్తున్నారు. విచారించి చర్యలు తీసుకోవాలని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● నూరుల్లా అనే వ్యక్తి అన్నలా ఉండేవాడు. నా ఫోన్ నంబర్ తీసుకున్నాడు. మూడునెలల నుంచి నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడు. నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తికి సైతం తప్పుడు ప్రచారం చేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని పొదలకూరుకు చెందిన ఓ మహిళ వినతిపత్రం సమర్పించారు. ● వినోద్ అనే వ్యక్తితో నాకు వివాహమైంది. రెండునెలల తర్వాత అతను కువైట్‌కు వెళ్లాడు. వీసా పంపి నన్ను తీసుకెళ్తానని నమ్మబలికాడు. మూడు సంవత్సరాలైనా తీసుకెళ్లలేదు. ఈ విషయమై ప్రశ్నించగా భర్త, అత్తింతివారు రూ.10 లక్షల అదనపుకట్నం తీసుకుని వస్తేనే కువైట్‌కు తీసుకెళ్తామని చెబుతున్నారు. కౌన్సెలింగ్ చేసి కాపురాన్ని చక్కదిద్దాలని గూడూరుకు చెందిన ఓ మహిళ కోరారు. ● భర్త అనుమానిస్తూ నా వ్యక్తిగత ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతానని బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నెల్లూరు రూరల్ పరిధికి చెందిన ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ● నాకు ఏడేళ్ల క్రితం వివాహమైంది. నా భర్త ఇటీవల ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. ఆచూకీ కనుగొని అప్పగించాలని చిల్లకూరుకు చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. -
ఇదే ఆఖరి అవకాశం
● పన్నులు చెల్లించండి నెల్లూరు(బారకాసు): పన్నులకు సంబంధించి మొండి బకాయిలున్నవారు ఆఖరి అవకాశంగా భావించి వెంటనే చెల్లించాలని కమిషనర్ నందన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, వారి ఆస్తులను జప్తు చేసేందుకు వెనుకాడబోమని హెచ్చరించారు. నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 15,737 అసెస్మెంట్ల నుంచి చెల్లించాల్సిన ఆస్తి పన్ను మొత్తం రూ.108.82 కోట్లన్నారు. ఇది 10 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్ల పరిధిలో జమ కావాల్సి ఉందని, మొండి బకాయిలను వసూలు చేయడానికి స్వయంగా క్షేత్రస్థాయిలో పర్యటించనున్నట్లు తెలియజేశారు. రూ.10 వేలకు పైగా బకాయిలున్న వారికి నోటీసులు జారీ చేసినా స్పందన రాలేదన్నారు. దీంతో కారణాలు తెలుసుకునేందుకు బకాయిదారులతో నేరుగా మాట్లాడాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్ ● వాహనాల స్వాధీనం ఆత్మకూరు: మున్సిపల్ పరిధిలోని టిడ్కో గృహాల వద్ద డీఎస్పీ కె.వేణుగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు సోమవారం రాత్రి కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మొత్తం 1,028 గృహాలున్న ఈ ప్రాంతంలో ఇద్దరు సీఐలు, ఆరుగురు ఎస్సైలు, 50 మంది పోలీసులు సెర్చ్‌లో పాల్గొని ఆధార్‌కార్డులు పరిశీలించారు. సరైన పత్రాల్లేని రెండు కార్లు, నాలుగు ఆటోలు, 30 మోటార్‌బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐలు జి.గంగాధర్, శ్రీనివాసులురెడ్డి, ఎస్సైలు ఎస్కే జిలానీ, బి.సాయిప్రసాద్, సైదులు తదితరులు పాల్గొన్నారు. మినీ ట్రాక్టర్ కింద పడి..● వ్యక్తి మృతి సోమశిల(చేజర్ల): పేద కుటుంబానికి చెందిన ఓ రైతు ప్రమాదవశాత్తు మినీ ట్రాక్టర్ కిందపడి మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. చేజర్ల మండల పరిధిలోని చిత్తలూరు గ్రామానికి చెందిన షేక్ దస్తగిరి (35) అనే వ్యక్తి వ్యవసాయ పనులు చేస్తుంటాడు. కోళ్ల ఫారం పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతడికి వివాహమైంది. ఇద్దరు పిల్లలున్నారు. ఈ నేపథ్యంలో మరొకరి పొలంలో మినీ ట్రాక్టర్‌తో బురద దుక్కి దున్నతుండగా ప్రమాదవశాత్తు దాని కిందే పడి ప్రాణాలు కోల్పోయాడు. దీనిని గమనించిన స్థానికులు మృతదేహాన్ని వెలికితీసి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా రోదించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. దస్తగిరి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. ఎస్సీ, ఎస్టీ కేసు నమోదునెల్లూరు(క్రైమ్): ప్రభుత్వ ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించడంతోపాటు కులంపేరుతో దూషించిన మాజీ విద్యార్థి సంఘ నేతపై నెల్లూరు సంతపేట పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. సోమవారం వారు వివరాలు వెల్లడించారు. బాలాజీ నగర్ గౌడ్ హాస్టల్ సెంటర్‌కు చెందిన ఎం.పెంచలయ్య నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో ఇన్చార్జి ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈనెల 2వ తేదీన అతను కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఓ మహిళకు సంబంధించిన కుటుంబ సభ్యుల ధ్రువీకరణపత్రం విషయమై అర్బన్ తహసీల్దార్‌తో మాజీ విద్యార్థి సంఘ నేత జీవీ ప్రసాద్ వాగ్వాదానికి దిగాడు. గమనించిన ఇన్చార్జి ఆర్ఐ గొడవ చేయొద్దని ప్రసాద్‌ను వారించాడు. దీంతో ప్రసాద్ సదరు ఆర్ఐని కులం పేరుతో దూషించడమే కాకుండా విధులకు ఆటంకం కలిగించాడు. బాధిత ఉద్యోగి సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా ప్రసాద్‌పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.కండలేరులో 61.290 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 61.290 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,200 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 700, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 75 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వివరించారు. 10, 11 తేదీల్లో పక్షుల పండగదొరవారిసత్రం: ఈనెల 10, 11 తేదీల్లో జరిగే పక్షుల పండగకు నేలపట్టు పక్షుల కేంద్రానికి విచ్చేసే సందర్శకుల కోసం పక్కాగా ఏర్పాట్లు చేయాలని శ్రీకాళహస్తి ఆర్డీఓ, పక్షుల పండగ ప్రత్యేకాధికారి భానుప్రకాష్‌రెడ్డి ఆదేశించారు. పక్షుల కేంద్రంలో సోమవారం అన్ని శాఖల మండల అధికారులతో సమావేశం నిర్వహించారు. కేంద్రాన్ని సందర్శించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పోలీస్, అటవీ శాఖలకు సూచించారు. ఆయన మాట్లాడుతూ తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు. -
నేడు వింజమూరు ఎంపీపీ ఎన్నిక
వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికను సోమవారం నిర్వహించనున్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిర్మలాదేవి పర్యవేక్షణలో ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. మండలంలో 12 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో కొందరు టీడీపీ, వైఎస్సార్సీపీ శిబిరాల్లో తలదాచుకుంటున్నారు. ఎన్నిక సమయానికి రెండు శిబిరాల్లోని ఎంపీటీసీలు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఎంపీపీ ఎన్నిక ఉత్కంఠ భరితంగా సాగే అవకాశం ఉంది. ఎంపీపీ ఎన్నికలో మాజీ ఎంపీపీ మోహన్‌రెడ్డి, ప్రస్తుత తాత్కాలిక ఎంపీపీ ఆనంగి రమణయ్య ఓట్లు కీలకంగా మారనున్నాయి. వీరి ఓటింగ్‌పైన ఆధారపడి ఫలితం ఉండనుంది. మొత్తం మీద ఎంపీపీ కుర్చీలో టీడీపీకి చెందిన వనిపెంట హైమావతి లేక వైఎస్సార్సీపీకి చెందిన పల్లాల కొండారెడ్డి కూర్చుంటారా లేక అనూహ్య పరిణామాలు చోటు చేసుకుని తాత్కాలిక ఎంపీపీ ఆనంగి రమణయ్యని వరిస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఎస్ఈఐఎల్ ఎనర్జీ నూతన కార్యాలయ ప్రారంభం ముత్తుకూరు(పొదలకూరు): ముత్తుకూరు మండలంలోని స్వతంత్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన ఎస్ఈఐఎల్ ఎనర్జీ ఇండియా లిమిటెడ్ విజయవాడలో ఏర్పాటు చేసిన నూతన కార్యాలయాన్ని ఆ కంపెనీ సీఈఓ జన్మేజయ మహాపాత్ర ఆదివారం వర్చువల్‌గా ప్రారంభించారు. కొత్త కార్యాలయంలో హెచ్ఆర్ హెడ్ బ్రిగేడియర్ సీహెచ్‌డీ శంకర్‌ప్రసాద్, అడ్మిన్, ఈఆర్హెచ్ జీఎన్ రఘురామ్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సీఈఓ మాట్లాడుతూ తమ సంస్థకు చెందిన మొత్తం 2,640 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో గణనీయమైన భాగాన్ని రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చేందుకు వినియోగిస్తున్నట్టు తెలిపారు. విజయవాడలో ఏర్పాటు చేసిన తమ కొత్త కార్యాలయం ద్వారా రాష్ట్రంలో తమ కంపెనీ ఉనికి మరింతగా బలోపేతమై వినియోగదారులకు సేవలు అందించనున్నట్లు చెప్పారు. నిత్యాన్నదాన పథకానికి రూ.లక్ష విరాళం రాపూరు: పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి నిత్యాన్నదాన పథకానికి పొదలకూరు మండలం చిట్టేపల్లికి చెందిన మోదేపల్లి కృష్ణప్రసాద్, రాధ, కుమారుడు జయసింహలు రూ 1,00,116 విరాళాన్ని ఆదివారం అందజేశారు. వీరికి దేవస్థాన ఏసీ శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. సొంత పార్టీ నేతలపైనే కాకర్ల విసుర్లు నెల్లూరు సిటీ: సొంత పార్టీ నేతలపైనే ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అసహనం వ్యక్తం చేశారు. నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. తనను అప్రతిష్ట పాల్జేసేందుకు అధికార పక్షంలోనే ప్రతిపక్షంగా కొందరు నేతలు తయారయ్యారని విమర్శించారు. అందులో భాగంగానే వెంగమాంబ అనే మహిళ వీడియోను విడుదల చేశారని, దీని వెనుక నాటకదారులు, సూత్రధారులు ఎవరో తేలుస్తానని హెచ్చరించారు. తనపై చేస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటుండడాన్ని చూసి ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని నిందలు వేయాలని చూస్తున్నారన్నారు. తనపైన నిరాధారమైన ఆరోపణలు చేసిన వెంగమాంబ సెప్టెంబర్‌లో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి దుత్తలూరు మండలం ఏరుకొల్లుకు వెళ్లిన క్రమంలో పరిచయమైందన్నారు. పార్టీకి, ప్రజలకు సేవ చేయాలని ఉందని చెప్పడంతో అంగన్వాడీ కోఆర్డినేటర్‌గా నియమించామని తెలిపారు. అయితే విజయవాడలో ఆమెను ఉపయోగించి తనపై కుట్రకు యత్నించినట్లుగా తన దృష్టికి వచ్చిందన్నారు. మహిళ విషయం కాబట్టి అక్కడితో వదిలివేశానన్నారు. ఇలాంటి కుట్రలకు భయపడేది లేదని, దీని వెనుక ఎవరు ఉన్నారో తెలుస్తానన్నారు. తన దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయన్నారు. అడ్డదిడ్డంగా, ఇష్టం వచ్చినట్లు రాతలు రాస్తే చూస్తూ ఊరుకోబోనని, అటువంటి వారిపై చట్టపరంగా వెళ్తానని హెచ్చరించారు. జెడ్పీ మాజీ చైర్మన్ పొన్నెబోయిన చెంచలబాబుయాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఎల్సీ రమణారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధులు చేజర్ల మల్లికార్జున, మద్దసాని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
దశాబ్దాల దుస్థితి.. ఐదేళ్ల ప్రగతి
రూ.72 కోట్లు మంజూరు ●ట్రాఫిక్ కష్టాలు తొలగాయి పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారిని విస్తరించడంతో ట్రాఫిక్ కష్టాలు తొలగాయి. గతంలో నెల్లూరు నగరంలోకి సరుకు రవాణా వాహనాలు వెళ్లేందుకు అరగంటకుపైగా సమయం పట్టేది. ప్రస్తుతం రోడ్డు విస్తరణతో సమయం బాగా ఆదావుతోంది. గతంలో ట్రాఫిక్‌తో ఇంధన ఖర్చు ఎక్కువయ్యేది. ఇప్పుడు బాగా తగ్గింది. –నెల్లూరు సుబ్బయ్య, వ్యాపారి, పడుగుపాడు పార్కింగ్ సమస్య తప్పింది రోడ్డు విస్తరణకు ముందు దుకాణాల ఎదుట వాహనాల పార్కింగ్‌కు ఇబ్బందిగా ఉండేది. దీంతో దుకాణాల వద్దకు కస్టమర్లు వచ్చేందుకు ఆసక్తి చూపేవారు కాదు. ప్రస్తుతం రోడ్డు విస్తరణతో పార్కింగ్ సమస్య తప్పింది. డ్రైనేజీ నిర్మాణంతో వర్షపు నీరు నిల్వక పోడంతో వ్యాపారానికి ఆటంకం కలగడం లేదు. –కడింపాటి శశిధర్ గత ప్రభుత్వ హయాంలో జాతీయ రహదారుల సంస్థ 2023–24 ఆర్థిక సంవత్సరంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి విస్తరణకు రూ.72 కోట్లను మంజూరు చేసింది. ఆరు లేన్లుగా రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు. అందుకు సంబంధించి 118 మంది బాధితులకు రూ.1.80లక్షలు చొప్పున రూ.2,12,40,000 పరిహారాన్ని అందజేశారు. కోవూరు : రాజకీయాల్లో మాటలు చెప్పేవారు కొందరైతే.. పనులు చేసి చూపించేవారు మరికొందరు. ఆ కోవకే చెందుతారు మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్. కోవూరు నియోజకవర్గ ముఖద్వారమైన పడుగుపాడు ప్రాంతాన్ని చూస్తుంటే ఇది అక్షర సత్యమనిపిస్తుంది. దశాబ్దాలుగా ఎవరూ పట్టించుకోని పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రూపురేఖలను సమూలంగా మార్చివేసిన ఘనత ఈ ఇద్దరు నేతలకే దక్కుతుంది. గతంలో అధ్వానంగా రహదారి గతంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం జాతీయ రహదారి అధ్వానంగా ఉండేది. ఈ రహదారి ఏషియన్ హైవే 16తో నెల్లూరు–ముంబై రహదారిని కలుపుతుంది. అలాగే జాతీయ రహదారి నుంచి నెల్లూరు నగరంలోకి వెళ్లేందుకు ప్రధానమైన రోడ్డుగా ఉంది. జాతీయ రహదారుల పరిధిలోని ఈ రహదారి దశాబ్దాలుగా విస్తరణకు నోచుకోక ప్రయాణికులు ఇబ్బందులు పడుతుండేవారు. లారీయార్డు నుంచి వెంకటేశ్వరపురం ఫ్లయిఓవర్ వరకు సుమారు మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణం నరకప్రాయంగా ఉండేది. నిత్యం ప్రమాదాలు చోటు చేసుకునేవి. మరోవైపు నిత్యం ట్రాఫిక్ సమస్యతో ప్రయాణికులు అల్లాడిపోయేవారు. ఈ నేపథ్యంలో ఈ రహదారిపై గత ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. రహదారి విస్తరణ ద్వారా పడుగుపాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు. అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌తో కలిసి రోడ్డు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు మంజూరు చేయించారు. ఆధునిక హంగులతో ఆరులేన్లుగా.. గత ప్రభుత్వ హయాంలో పడుగుపాడు నుంచి వెంకటేశ్వరపురం వరకు ఆధునిక హంగులతో ఆరు వరుసల రహదారి నిర్మాణ పనులను ప్రారంభించారు. ఎన్నికల నాటికి దాదాపుగా పనులు పూర్తయ్యాయి. భారీ వాహనాల రాకపోకలను తట్టుకునేలా అత్యంత నాణ్యమైన బీటీరోడ్లను నిర్మించారు. ఇరువైపులా సర్వీసురోడ్లతో పాటు రెయిలింగులను ఏర్పాటు చేశారు. రోడ్డు విస్తరణతో పాటు శాశ్వత ప్రాతిపదికన డ్రైనేజీ పనులను చేపట్టడంతో వర్షపు నీటి సమస్యకు చెక్ పడింది. రోడ్డు మధ్యన ఏర్పాటు చేసిన అధునాతన విద్యుద్దీపాలు పడుగుపాడు ప్రాంతానికి కొత్త శోభను తెచ్చాయి. గతంలో చీకటిలో భయం భయంగా వెళ్లే ప్రయాణికులు ఇప్పుడు ధైర్యంగా రాకపోకలు సాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గ్రహణం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పడుగుపాడు– వెంకటేశ్వరపురం రహదారి విస్తరణకు సంబంధించి దాదాపుగా 98 శాతం పనులు పూర్తయ్యాయి. అయితే అప్పటికి ఎన్నికల కోడ్ రావడంతో కేవలం 200 మీటర్ల రోడ్డు విస్తరణ, డ్రైనేజీ నిర్మాణ పనులు మాత్రమే పెండింగ్ ఉన్నాయి. అయితే కూటమి ప్రభుత్వం వచ్చాక రహదారి విస్తరణ పనులు ముందుకు సాగలేదు. తుదిదశ పనులకు దాదాపు 18 నెలల గ్రహణం తరువాత మోక్షం కలిగింది. ప్రస్తుతం మిగిలిన పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఈ రహదారిని పెన్నానదిపై కొత్తగా నిర్మిస్తున్న బ్రిడ్జితో లింక్ చేయడం వల్ల పాతబ్రిడ్జిపై ట్రాఫిక్ ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది. జాతీయ రహదారి నుంచి వచ్చే వాహనాలు పడుగుపాడు, వెంకటేశ్వరపురం మీదుగా నెల్లూరు నగరంలోకి ప్రవేశించే అవకాశం కలుగుతుంది. దీనివల్ల ఏషియన్ హైవే నుంచి నెల్లూరు నగరంలోకి ఉన్న మిగిలిన లింక్‌రోడ్లపై ట్రాఫిక్ ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అభివృద్ధికే తలమానికం కోవూరు ముఖద్వారం డబుల్ రోడ్డు నుంచి ఆరు వరుసల రహదారి విస్తరణ సెంటర్ లైటింగ్‌తో వెలుగులీనుతున్న మార్గాలు మాజీ మంత్రులు నల్లపరెడ్డి, అనిల్ చొరవతో 98 శాతం పనులు పూర్తి మిగిలిన తుది దశ పనులకు 18 నెలల గ్రహణం తర్వాత మోక్షం -
కూటమి గొప్పలు.. రైతులకు తిప్పలు
● తప్పుల తడకలుగా పాస్ పుస్తకాలు ● పది మంది రైతుల పాస్ బుక్స్‌లో ఒకే వ్యక్తి ఫొటో ● జిల్లా వ్యాప్తంగా 1.13 లక్షలు మంజూరు నెల్లూరు (దర్గామిట్ట): కూటమి ప్రభుత్వం మరోసారి గొప్పలకు పోయి రైతులకు మళ్లీ తిప్పలు తెచ్చింది. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పాస్ పుస్తకాల్లో తప్పులు దొర్లాయంటూ నానా హంగామా సృష్టించి తాము అధికారంలోకి వస్తే తప్పులు లేని పాస్ పుస్తకాలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. కూటమి మళ్లీ అవే తప్పులతో పాసు పుస్తకాలను రాజముద్ర వేసి మరీ రైతులకు అంటగడుతూ ఏదో ఇచ్చేశామంటూ చెప్పుకొస్తూ రైతులను మరింత ఇబ్బందులకు గురి చేసింది. గత ప్రభుత్వంలో రీ సర్వే జరిగిన సమయంలో క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారులు ఇష్టారీతిన భూముల వివరాల నమోదులో తప్పులకు పాల్పడ్డారు. వీటిని సరిచేసేందుకు అప్పటి ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంది. తప్పులు సరిదిద్దకుండానే.. రీ సర్వే చేసిన గ్రామాల్లో రైతుల భూముల వివరాల నమోదులో జరిగిన తప్పులను సరిదిద్దకుండానే పాస్‌పుస్తకాలు మంజూరు చేయడంతో రైతులు ఏ విధంగానూ ఉపయోగం లేకుండా పోతున్నాయి. తమ హక్కులు కోల్పోతున్నామంటూ ఆందోళన చెందుతున్నారు. అనేక గ్రామాల్లో ఒకే ఫొటోతో పదుల కొద్దీ పాసుపుస్తకాలు ఇవ్వడంతో రైతులు లబోదిబోమంటున్నారు. కూటమి ప్రభుత్వం తన ఆర్భాటాన్ని ప్రదర్శించేందుకు రూ. కోట్లాది ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తోంది. 328 గ్రామాల్లో రీ సర్వే వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో జిల్లాలో 737 గ్రామాలకు గాను 328 గ్రామాల్లో భూముల రీసర్వే ప్రక్రియను పూర్తి చేసింది. ఆయా గ్రామాల్లో దాదాపు 1.13 లక్షల పట్టాదారు పాసు పుస్తకాలను మంజూరు చేశారు. అయితే రీ సర్వే జరిగిన గ్రామాల్లో సర్వే నంబర్లు, విస్తీర్ణం, సబ్ డివిజన్లు లేకపోవడం, ఆసైన్డ్, చుక్కల భూములు, సర్వీస్ ఇనాం ఇలాంటి అనేక కాలమ్స్ తప్పుగా రావడంతో రైతులు వీటన్నింటిపై నూతన ప్రభుత్వానికి వినతులు సమర్పించారు. అయితే వీటన్నింటిని సరి చేయకుండానే కూటమి ప్రభుత్వం పాత డేటాతోనే కొత్తగా పాసు పుస్తకాలు ప్రింట్ చేయించి రైతులకు మంజూరు చేస్తుండడంతో వీటిని సరిచేసుకునేందుకు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు తప్పడం లేదంటూ రైతులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఒకే వ్యక్తి ఫొటో 10 పుస్తకాల్లో.. జిల్లాలోని దగదర్తి మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉండగా అందులో 9 గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయింది. ఇందులో లింగాలపాడులో నూతనంగా ప్రభుత్వం మంజూరు చేసిన పాసు పుస్తకాల్లో ఒకే వ్యక్తి ఫొటో 10 పాసుపుస్తకాల్లో రావడంతో అధికారులు ఖంగుతిన్నారు. దీంతో అధికారులు వాటిని సరిచేసి ఇస్తామంటూ మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో వాటిని రైతులకు అందజేయకుండానే తీసుకుంటున్నారు. దీనిపై దగదర్తి తహసీల్దారు టీ కృష్ణను వివరణ కోరగా ఇలా ఒక వ్యక్తి ఫొటో 10 పాసు పుస్తకాల్లో వచ్చింది నిజమేనంటూ వివరణ ఇచ్చారు. -
యూనియన్ సభ్యుల సంక్షేమానికి కృషి
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ఏపీ బహుజన ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యుల సంక్షేమానికి కృషి చేస్తామని రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పోతుల సురేష్, ప్రధాన కార్యదర్శి అంజయ్య, కంపెనీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం (ఏఈ) అన్నారు. నెల్లూరులోని ఏఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో రెండు రోజులుగా జరుగుతున్న యూనియన్ రాష్ట్ర సర్వసభ్య సమావేశాలు ఆదివారంతో ముగిశాయి. సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యూనియన్ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోటారాలు చేసేందుకు యూనియన్ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్ర కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సుందరకుమార్ వ్యవహరించారు. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎస్.సురేష్, కార్యనిర్వహక అధ్యక్షుడిగా పులి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులుగా నాగేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా అంజయ్య, కోశాధికారిగా రాజు ఎన్నికయ్యారు. సహాయ కార్యదర్శిగా ఎస్కే మీరావలీ, సంయుక్త కార్యదర్శిగా వాసుదేవ్, కార్యనిర్వాహక కార్యదర్శిగా శుభకర్, సభ్యులుగా దేవదాసు, పూర్ణచంద్రరావు, జార్జి, గోపిరాజును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో వందనకుమార్, సువర్ణ కుమారి, అడ్వైజర్ రవినారాయణ(డీఈఈ), బెనర్జీ (కావలి ఈఈ), డిస్కం సెక్రటరీ బాలరాజు, జిల్లా అధ్యక్షురాలు సౌజన్య, సెక్రటరీ వినోద్ తదితరులు పాల్గొన్నారు. -
ఉప్పు సాగు బంద్
ముత్తుకూరు(పొదలకూరు): మండలంలోని కృష్ణపట్నం పంచాయతీ గోపాలపురంలో ఉప్పు సాగు నిలిచిపోయింది. బ్రిటిష్ హయాం నుంచి ఉత్పత్తి ఉండగా.. దశాబ్దం క్రితం వరకూ కళకళలాడింది. అయితే కృష్ణపట్నం పోర్టు వెదజల్లుతున్న బొగ్గు, దుమ్ము, ధూళి కాలుష్యం కారణంగా సాగు బంద్ అయింది. దీనిపై ఆధారపడిన సుమారు 1,000 మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. సుమారు 700 ఎకరాల్లో ఉప్పు కయ్యలు వర్షపునీటితో నిండిపోయాయి. పోర్టు యాజమాన్యం ప్రతి ఏడాది సాల్ట్ లీజుదారులకు అందజేస్తున్న జీవనభృతి మాకు అందజేయాలని కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఎంతోమందికి ఆధారం ఉప్పు ఉత్పత్తి వెయ్యిమంది కూలీలకు ఆధారంగా ఉండేది. కృష్ణపట్నం, గోపాలపురం, చలివేంద్రం, బలిజపాళెం, సుబ్బారెడ్డిపాళెం, పాదర్తిపాళెం, శంభునితోపు గ్రామాలకు చెందినవారు పనికి వెళ్లేవారు. కాలుష్యం కారణంగా కూలీలు వీధినపడ్డారు. అప్పట్లో సేద్య కాపులు మడవ కట్టి తొక్కుడు తొక్కి ఉప్పు మోసేవారు. కొలత, కువ్వ తట్టడం, ప్యాకింగ్ తదితర పనులుండేవి. ఇందుకోసం గుమస్తాలు దగ్గరుండి లోడ్ చేసి ఎగుమతి చేశారు. గోపాలపురంలో సాల్ట్ కార్యాలయం కూడా ఉండేది. అది నేడు శిథిలావస్థకు చేరుకుంది. ప్రతి ఏడాది ఏడునెలలపాటు ఈ ఉత్పత్తిపై ఆధారపడి జీవనం సాగించేవారు. సాగు పూర్తిగా లేకపోవడంతో చాలామంది సరైన పనుల్లేక ఖాళీగా ఉంటున్నట్టు వెల్లడిస్తున్నారు. వయస్సు పైపడిన వారు కావడంతో పోర్టులో సైతం పనులు ఇవ్వడం లేదంటున్నారు. పూటగడవటం కూడా కష్టంగా మారిందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్యాకేజీ అందజేయాలి ఉప్పు రైతులు తమ భూములను పోర్టుకు అప్పగించారు. అయితే ఆ పరిశ్రమను నమ్ముకుని జీవించే వందలాది మంది కార్మికులు మాత్రం పనుల్లేక పస్తులు ఉంటున్నారు. దీంతో అప్పట్లో ప్రభుత్వం దృష్టికి కార్మికుల సమస్యలను తీసుకుని వెళ్లడంతో పోర్టు యాజమాన్యం ప్యాకేజీ అందజేస్తామని ప్రకటించింది. ఇప్పటి వరకు ఎలాంటి ప్యాకేజీ అందలేదని వారు చెబుతున్నారు. పోర్టు యజమాన్యం ఇప్పటికై నా స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇందుకోసం వెయ్యిందికి పైగా ఎదురు చూస్తున్నారు. నవయుగ ఆధ్వర్యంలో పోర్టు నడిచే సమయంలో వారు కార్మికులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది ఉప్పు పరిశ్రమ రైతులకు పోర్టు యాజమాన్యం ఆర్థిక సాయం అందిస్తోంది. అయితే కార్మికులను మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో 700 ఎకరాల్లో సాగు నేడు బీడుగా మారిన భూములు దశాబ్ద కాలంగా ప్యాకేజీ కోసం కార్మికుల నిరీక్షణ ఉపాధి కోల్పోయిన వెయ్యి మంది గోడు వినాలని పోర్టు యాజమాన్యానికి విజ్ఞప్తి -
టిడ్కో గృహాల్లో కార్డన్ సెర్చ్
● వాహనాల స్వాధీనంనెల్లూరు(క్రైమ్): నెల్లూరు నవాబుపేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని భగత్‌సింగ్ కాలనీ టిడ్కో గృహాల్లో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. నగర ఇన్చార్జి డీఎస్పీ ఎం.గిరిధర్ ఆధ్వర్యంలో పోలీసు అధికారులు బృందాలుగా ఏర్పడి ప్రతి ఇంట్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి అందులో నివాసం ఉంటున్న వివరాలను సేకరించారు. వారి ఆధార్‌కార్డులను పరిశీలించారు. అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకుని ఫిన్స్ సాయంతో వేలిముద్రలు సేకరించారు. వాహనపత్రాల్లేని 24 మోటార్‌బైక్‌లు, మూడు ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా నిర్వహిస్తున్న కార్డన్ సెర్చ్‌లకు ప్రజలు సహకరించాలని పోలీసు అధికారులు కోరారు. ప్రజలు తమవంతు బాధ్యతగా అనుమానాస్పద వ్యక్తులు, చట్టవ్యతిరేక కార్యకలాపాలు, మత్తు పదార్థాల వినియోగంపై డయల్ 112, స్థానిక పోలీసులకు సమాచారం అందిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో నవాబుపేట సంతపేట, దర్గామిట్ట, వేదాయపాళెం, బాలాజీ నగర్ ఇన్స్పెక్టర్లు జి.వేణుగోపాల్‌రెడ్డి, వైవీ సోమయ్య, బి.కల్యాణరాజు, కె.శ్రీనివాసరావు, కె.సాంబశివరావు, ఎస్సైలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అల్లీపురంలో.. నెల్లూరు సిటీ: రూరల్ పరిధిలోని అల్లీపురంలో టిడ్కో గృహాల్లో ఆదివారం తెల్లవారుజామున కార్డన్ సెర్చ్ జరిగింది. మొత్తం 120 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది కలిసి 300 ఇళ్లలో తనిఖీలు చేశారు. సరైన పత్రాల్లేని 46 మోటార్‌బైక్‌లు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్స్ ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. -
సాయం అందించాలి
ఉప్పు సాగునే నమ్ముకుని జీవించేవారం. పదేళ్లుగా సరైన పనుల్లేక ఇబ్బందులు పడుతున్నాం. ప్యాకేజీ రైతులతోపాటు మాలాంటి కార్మికులకు సైతం పోర్టు వారు సాయం అందజేస్తే కొంత వెసులుబాటు ఉంటుంది. జీవనం కూడా కష్టం మారింది. పోర్టులో మాకు తగిన పనులు లేవంటున్నారు. – ఎం.రమణమ్మ, గోపాలపురం, ఉప్పు కార్మికురాలు యాజమాన్యం పట్టించుకోవాలి కృష్ణపట్నం పోర్టు రావడం మాకు సంతోషమే. కానీ మాకు జీవనాధారం లేకుండాపోయింది. గతంలో ఉప్పు సాగు వల్ల చేతినిండా పనులు లభించేవి. నేడు మాకు తెలిసిన పనులు చేసేందుకు వీలులేకుండాపోయింది. పోర్టు యాజమాన్యం పెద్ద మనస్సు చేసుకుని ప్యాకేజీ ప్రకటించాలి. – జి.సుబ్రహ్మణ్యం, కృష్ణపట్నం, ఉప్పు కార్మికుడు ● -
డయల్ యువర్ ఎస్ఈ నేడు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): ‘డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని సోమవారం విద్యుత్ భవన్లో ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ రాఘవేంద్రం నిర్వహించనున్నారు. ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు 0861 – 2320427 నంబర్‌కు వినియోగదారులు ఫోన్ చేసి సమస్యలు చెప్పొచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్ఈ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరు● జేవీవీ నాయకులు నెల్లూరు(అర్బన్): ప్రశాంతంగా ఉన్న జిల్లాలో విచ్చలవిడిగా పెరిగిన మాదకద్రవ్యాలు, మత్తు మందులు, గంజాయి మాఫియాకు వ్యతిరేకంగా పోరు నిర్వహించనున్నట్లు జనవిజ్ఞాన వేదిక (జేవీవీ) ఆరోగ్య సబ్ కమిటీ కన్వీనర్ డాక్టర్ శ్రీనునాయక్ తెలిపారు. ఆదివారం నెల్లూరు హరనాథపురంలోని జేవీవీ జిల్లా కార్యాలయంలో ఆ సంఘం కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచలయ్యను గంజాయి మూకలు హత్య చేయడం దారుణమన్నారు. ఇలాగే ఉంటే సమాజం తిరోగమనంలో నడుస్తుందన్నారు. ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలతో కలిసి మత్తు మందులు, గంజాయికి వ్యతిరేకంగా ఉద్యమించేందుకు తీర్మానించామన్నారు. అలాగే జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, కూల్‌డ్రింక్స్ వల్ల కలిగే అనర్థాలు, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వేదిక నాయకులు మోహన్‌రెడ్డి, డాక్టర్ కాలేషాబాషా, హెచ్ఎం ఎంవీ చలపతి, డాక్టర్ రఫీ, బుజ్జయ్య, నగర కార్యదర్శి కృష్ణ, ఉదయభాస్కర్, మాదాల రాము, విద్యాచరణ్, పోలయ్య, సుందరరాజ్ తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ వృద్ధురాలు మృతిచెందింది. పోలీసుల కథనం మేరకు.. చైతన్యపురి కాలనీలో మురళీకృష్ణ కుటుంబం నివాసముంటోంది. అతని తల్లి ధనమ్మ (66)కి హార్ట్ బైపాస్ సర్జరీ జరిగింది. బీపీ, షుగర్‌తో ఆమె బాధపడుతూ వాటికి మందులు వాడుతోంది. ప్రతి చిన్న విషయానికి అందరిపై కోప్పడేది. ఆరోగ్య సమస్యలతో మనస్తాపానికి గురైన ఆమె చనిపోవాలని ఉందని తరచూ కుటుంబ సభ్యులకు చెప్పగా వారు సర్ది చెప్పేవారు. ఈ నేపథ్యంలో ఈనెల 3వ తేదీన ఆమె బాత్రూమ్లో యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందారు. బాధిత కుమారుడు వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేయగా మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు.మహిళపై బ్లేడ్‌తో దాడి● హత్యాయత్నం కేసు నమోదు నెల్లూరు(క్రైమ్): వివాదం వద్దని సర్దిచెప్పిన ఓ మహిళపై బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడి చేసిన మరో మహిళపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వారి కథనం మేరకు.. రంగనాయకులపేట ఉప్పరపాళెంలో నివాసముంటున్న రాజేశ్వరి, కీర్తిల మధ్య డ్రెయినేజీ నీరు వెళ్లే దారి విషయంలో వివాదం ఉంది. ఈనెల మూడో తేదీన వారి మధ్య గొడవ జరుగుతుండగా అదే ప్రాంతానికి చెందిన కృష్ణవేణి, మరికొందరు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. దీంతో గొడవ ఆగిపోయింది. కీర్తి పాత గొడవను మనసులో పెట్టుకుని ఆదివారం రాజేశ్వరిపై దాడి చేసింది. అడ్డువెళ్లిన కృష్ణవేణి కుడిచేతి చిటికిన వేలును కొరికి చంపేస్తానని బెదిరించింది. దీంతో ఆమె తన భర్త, రాజేశ్వరి, లక్ష్మీలతో కలిసి సంతపేట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్తుండగా కీర్తి అడ్డుకుంది. కృష్ణవేణిపై బ్లేడ్‌తో విచక్షణారహితంగా దాడిచేసి పరారైంది. ఎడమ చెంపపై తీవ్రగాయమైన కృష్ణవేణిని ఆమె భర్త, అక్కడున్నవారు వెంటనే చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. బాధితురాలు సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నిందితురాలిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. -
డిపార్ట్మెంటల్ పరీక్షలపై సమావేశం
నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలో రేపటి నుంచి 10వ తేదీ వరకు జరగనున్న డిపార్ట్మెంటల్ టెస్ట్ పరీక్షలపై డీఆర్వో విజయ్‌కుమార్ శనివారం తన చాంబర్లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అభ్యర్థులు ఉదయం పరీక్షకు 8.30 నుంచి 9.15 గంటల వరకు, మధ్యాహ్నం 1.30 నుంచి 2.15 గంటల మధ్య మాత్రమే పరీక్ష కేంద్రానికి అనుమతి ఉంటుందన్నారు. ఆలస్యంగా వచ్చిన వారికి 15 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఉంటుందని తెలిపారు. కాగా పరీక్షల నిర్వహణకు అమసరమైన మౌలిక వసతుల ఏర్పాటు విషయమై తనిఖీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అభ్యర్థులు వారి హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ఫొటో ఆధారిత ధ్రువపత్రం తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు. -
నడిచి వెళ్తుండగా..
● మహిళ వద్ద రూ.లక్ష నగదు, సెల్‌ఫోన్ అపహరణ వెంకటాచలం: బ్యాంక్ నుంచి నగదు తీసుకుని వెళ్తున్న మహిళ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మోటార్ బైక్‌పై వచ్చి రూ.లక్ష నగదు, సెల్‌ఫోన్ లాక్కొని పరారైన ఘటన మండల కేంద్రమైన వెంకటాచలంలో శనివారం జరిగింది. చెముడుగుంట గ్రామానికి చెందిన సుకన్య శనివారం స్థానికంగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాకు వెళ్లి, రూ.లక్ష నగదు తీసుకుని కాలినడకన కసుమూరు క్రాస్‌రోడ్డు వద్దకు వెళ్తుండగా, మోటార్ బైక్‌పై వెళ్తున్న గుర్తు తెలియని వ్యక్తి సెల్‌ఫోన్‌ను, రూ.లక్ష నగదును లాక్కొన్నాడు. దీంతో మహిళ పెద్దగా కేకలు వేసే లోపే ఆ వ్యక్తి అక్కడి నుంచి బైక్‌పై పరారయ్యాడు. బాధితురాలు వెంకటాచలం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కార్పొరేట్‌కు కీలుబొమ్మల్లా బ్యాంక్‌లు కావలి (అల్లూరు): దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కార్పొరేట్ శక్తుల చేతుల్లో కీలుబొమ్మలా మారిందని, పేదలకు అందాల్సిన రుణాలు బడా బాబులకు మళ్లిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ ధ్వజమెత్తారు. కావలి పట్టణంలోని జర్నలిస్ట్ క్లబ్లో శనివారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను విద్యనభ్యసించిన జవహర్ భారతి కళాశాల ప్రస్తుతం ప్రభుత్వం నుంచి స్కాలర్షిప్లు సక్రమంగా రాకపోవడం వల్ల వెనుకబడిపోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు రూ.14.30 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని ఆరోపించారు. రాజ్యాంగం కల్పించిన పత్రికా స్వేచ్ఛను హరించేలా కావలిలో ఆరుగురు జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. రైలు దిగిన వృద్ధురాలి అదృశ్యంనెల్లూరు(క్రైమ్): వృద్ధురాలు అదృశ్యమైన ఘటనపై నెల్లూరు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. తెలంగాణ రాష్ట్రం నల్లగొండ జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన పి.బాలమ్మ గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక బాధపడుతోంది. ఆమె కుమారుడు చైన్నెలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈనెల 1వ తేదీ చైన్నెలోని కుమారుడిని చూసేందుకు ఆమె తన తమ్ముడు నరసింగరావుతో కలిసి చైన్నె ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరింది. 2వ తేదీ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రైలు నెల్లూరుకు చేరుకుంది. తమ్ముడు నిద్రలో ఉండగా బాలమ్మ రైలు దిగి ఎటో వెళ్లిపోయింది. కొద్దిసేపటి తర్వాత నిద్ర నుంచి లేచిన నరసింగరావు తన అక్క కనిపించకపోవడంతో బోగి అంతా గాలించాడు. జాడ తెలియరాలేదు. ఈ మేరకు ఆయన శనివారం నెల్లూరు రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్సై హరిచందన వృద్ధురాలి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఆచూకీ తెలిసిన వారు 94406 27644, 99664 16581 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్సై కోరారు. 5,500 లీటర్ల డీజిల్ సీజ్ ● మూడు వాహనాల స్వాధీనం నెల్లూరు సిటీ: గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా డీజిల్ తరలింపుపై విజలెన్స్ అధికారులు శనివారం దాడులు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రూరల్ పరిధిలోని అల్లీపురం గ్రామంలో భగవాన్ వెంకయ్య స్వామి లేఅవుట్‌కు సమీపంలో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరు వ్యక్తులు అక్రమంగా ఇతర రాష్ట్రాల నుంచి డీజిల్‌ను దిగుమతి చేసుకుంటున్నారు. బిల్లులు, లైసెన్స్ లేకుండా విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. అందులో భాగంగా మూడు వాహనాల నుంచి రూ.17.38 లక్షలు విలువ చేసే 5,500 లీటర్ల ఆయల్ ట్యాంకర్లను స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను సీజ్ చేసి 6–ఏ కింద కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ శ్రీహరి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రైలు ఢీకొని వృద్ధుడి మృతి కావలి(అల్లూరు): కావలి రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తుతెలియని వృద్ధుడిని రైలు ఢీకొని మృతిచెందారు. రైల్వే ఎస్సై వెంకట్రావ్ వివరాల మేరకు.. ఓ వృద్ధుడు ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి చనిపోయారు. మృతుడు తెల్లరంగు చొక్కా, గ్రీన్ కలర్ లుంగీ ధరించి ఉన్నారు. మృతుడి జేబులో తూర్పు ఎర్రబెల్లి నుంచి కావలికి వచ్చిన బస్ టికెట్ ఉందని, మృతదేహాన్ని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీస్ అదుపులో నిందితుడు? ఉదయగిరి: సీతారామపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతిని పెళ్లి పేరిట మోసం చేసిన అఖిల్ అనే వ్యక్తిని శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎస్సై ఇంద్రసేనారెడ్డి కేసు నమోదు చేసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో నిందితుడిని విచారించి ఒకట్రెండు రోజుల్లో కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. -
ఒక్క విద్యార్థికి రూ.14 లక్షల ఖర్చు
ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేయడమే లక్ష్యంగా టీడీపీ పాలన సాగిస్తోంది. నెమ్మదిగా విద్యార్థుల సంఖ్యను తగ్గించి ప్రాథమిక పాఠశాలలే లేకుండా చేసేందుకు అడుగులు వేస్తోంది. విలీన ప్రక్రియ వల్ల కోవూరు నియోజకవర్గంలోని రెండు పాఠశాలలు కేవలం ఒక్కో విద్యార్థితో నడిపిస్తూ రేపటి రోజున వాటిని కూడా మూతపడేలా చేస్తోంది. ఇలాంటి పాఠశాలలు జిల్లాలో అనేకం ఉన్నాయి. విద్యార్థుల సంఖ్యను పెంచాలి చదువు అంటే కేవలం పుస్తకాలు మాత్రమే కాదు. తోటి విద్యార్థులతో కలిసి ఆడుకోవడం, పోటీ పడడం ద్వారానే పిల్లల్లో మానసిక, సామాజిక ఎదుగుదల సాధ్యమవుతుంది. కానీ ఇక్కడ ఆ బాబుకు తోటి స్నేహితులే లేరు. ముగ్గురు పెద్దల మధ్య ఆ ఒక్క చిన్నారి చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి విద్యార్థుల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉంది. కోవూరు: ‘విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం.. ప్రపంచ స్థాయి ప్రమాణాలు తీసుకొస్తాం’ అంటూ చంద్రబాబు ఇచ్చిన హామీలు ప్రకటనలకే పరిమితమైంది. కోవూరు మండలంలోని చావడివీధి, ఇనమడుగు ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఒక్క టీచర్, ఒక్క విద్యార్థితో కొనసాగుతోంది. అదే తరహాలో బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళెం (వడ్డిపాళెం) ఎంపీపీ పాఠశాల పరిస్థితి ఉంది. ఇలా ఒక్క విద్యార్థి కోసం ఏటా అక్షరాలా రూ.14 లక్షల ప్రజాధనాన్ని వినియోగిస్తోంది. గణాంకాలు ఇలా.. ఓ వైపు ఉపాధ్యాయుల కొరతతో రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడుతుంటే, ఇక్కడ మాత్రం విరుద్ధ పరిస్థితి కనిపిస్తోంది. నెలకు సుమారు రూ.80 వేల పైచిలుకు జీతం తీసుకునే ఒక ఉపాధ్యాయుడితో పాటు ఆయా వంట మనిషి, మొత్తం ముగ్గురు సిబ్బంది ఆ ఒక్క పిల్లాడికే సేవలు అందిస్తున్నారు. జీతాలు, మధ్యాహ్న భోజన వ్యయం కలిపి ఏడాదికి రూ.14 లక్షలు ఆ ఒక్క విద్యార్థిపై ఖర్చు అవుతోంది. విలీనమే కారణమా? గతంలో ఐదో తరగతి వరకు కళకళలాడిన ఈ పాఠశాలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అస్తవ్యస్తమైన ‘విలీన’ నిర్ణయాలతో కుదించేశారు. మూడు, నాలుగు, ఐదో తరగతులను మరో పాఠశాలలో కలిపేసి, ఇక్కడ కేవలం ఒక్క విద్యార్థిని మాత్రమే వదిలేశారు. ప్రాథమిక పాఠశాలలకు విలీన శాపం చాలాచోట్ల సింగిల్ స్టూడెంట్లకు పరిమితమైన పాఠశాలలు విద్యార్థుల సంఖ్యను పెంచకుండా మీనమేషాలు -
కనుల పండువగా ఆరుద్రోత్సవం
నెల్లూరు(బృందావనం): మూలాపేటలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి దేవస్థానంలో శనివారం శివముక్కోటిని (ఆరుద్రోత్సవం) కనులపండువగా నిర్వహించారు. తొలుత శివ కామసుందరి సమేత నటరాజస్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం జరిపారు. స్వామివారికి రుద్ర పారాయణ సహిత అన్నాభిషేకం ఉదయం 10 గంటలకు నిర్వహించారు. స్వామివారికి అత్యంత ప్రీతికరమైన నాట్యం, నాదం, గానం మండపంలో నేత్రపర్వంగా చేశారు. ఆరుద్రోత్సవంలో స్వామివారిని దర్శించుకునేందుకు తరలివచ్చి భక్తజనంతో దేవస్థానం కిటకిటలాడింది. తదుపరి రాత్రి స్వామివారి పేట ఉత్సవం ఘనంగా నిర్వహించారు. ఉభయదాతలుగా దేవిశెట్టి వెంకటసుబ్బయ్య కుమారులు వ్యవహరించారు. కార్యక్రమాలను దేవస్థానం ఈఓ అర్వభూమి వెంకట శ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. -
ఈవీ స్టేషన్లకు ప్రత్యేక విద్యుత్ ఫీడర్లు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ వాహనాలకు చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు కోసం ప్రత్యేకంగా విద్యుత్ ఫీడర్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ (టెక్నికల్) గురవయ్య అన్నారు. ఆయన నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాకు త్వరలో రానున్న ఎలక్ట్రికల్ బస్సుల కోసం విద్యుత్ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు స్థల పరిశీలన చేశామని, 220 కేవీ అంబాపురం విద్యుత్ సబ్‌స్టేషన్ నుంచి ఆర్టీసీ బస్టాండ్ వరకు నూతనంగా ఏర్పాటు చేయనున్న విద్యుత్ ఫీడర్ల ద్వారా వీటికి సరఫరా సులభతరం అవుతుందన్నారు. అనంతరం నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద నిర్మిస్తున్న కంటైనర్ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను, నగరంలో నిర్మాణంలో ఉన్న 132 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ పనులను పర్యవేక్షించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు శేషాద్రి బాలచంద్ర, శ్రీధర్, పరంధామయ్య, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కిరణ్, ట్రాన్స్‌కో, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. -
రేపట్నుంచి ఎఫ్ఏ – 3 పరీక్షలు
నెల్లూరు (టౌన్): జిల్లాలోని ఆన్ని యాజమాన్య పాఠశాలల్లో ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు ఎఫ్ఏ – 3 పరీక్షలను సోమవారం నుంచి గురువారం వరకు నిర్వహించాలని డీఈఓ బాలాజీరావు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీఈఆర్టీ ఇచ్చిన ప్రశ్నపత్రాలతోనే నిర్వహించాలని చెప్పారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గవర్నమెంట్ పంపిణీ చేసిన అసెస్మెంట్ బుక్స్‌లోనే రాయించాలని చెప్పారు. అనంతరం ఉపాధ్యాయులు మూల్యాంకనం చేసి మార్కులను అప్లోడ్ చేయాలని సూచించారు. పులి సంచారంపై వీడని కలకలం దుత్తలూరు: మండలంలోని నందిపాడు ఎస్సీ కాలనీ సమీపంలో పులి సంచరించిందనే ప్రచారం శనివారం జరిగింది. మండలంలోని నందిపాడు బీట్ పరిధిలో గల రేగుమానుకుంటలో గేదె కళేబరాన్ని స్థానికులు గుర్తించారు. నందిపాడు ఎస్సీ కాలనీకి చెందిన ప్రభాకర్‌కు చెందిన గేదె అటవీ ప్రాంతంలో మృతి చెందిందనే అంశాన్ని కనుగొన్నారు. పులి చంపి ఉంటుందనే ప్రచారం జరిగింది. ఈ వార్త దావనంలా వ్యాపించడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఘటన స్థలానికి అధికారులు చేరుకొని.. గేదె కళేబరం, పెంటికలు, పాదముద్రలను గుర్తించి ఉన్నతాధికారులకు పంపగా, పులి కాదని నిర్ధారించారు. గ్రామస్తులు మాత్రం పులి లేదా చిరుతపులి అని భావిస్తున్నారు. గేదెకు పోస్ట్‌మార్టాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఏబీఓ బచ్చల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఆత్మకూరు: ప్రభుత్వం అందించే సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని విద్యలో రాణించి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాలని ఎస్సీ సంక్షేమ సాధికారత జిల్లా అధికారి శోభారాణి పేర్కొన్నారు. పట్టణంలోని ఎస్సీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని బాలబాలికల హాస్టళ్లను ఆర్డీఓ పావనీతో కలిసి శనివారం సందర్శించారు. అక్కడి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, విద్యాసామగ్రిని అందజేశారు. అనంతరం ఆర్డీఓ మాట్లాడారు. చదువుల్లో విద్యార్థులు చక్కగా రాణించి మంచి పేరు తీసుకురావాలని కాంక్షించారు. ఏఎస్డబ్ల్యూఓ (బీసీ) బ్రహ్మానందచారి, వార్డెన్లు పద్మనాభరెడ్డి, స్పందన తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 83,032 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాల ను 27,272 మంది అర్పించారు. కానుకల రూ పంలో హుండీలో రూ.3.81 కోట్లను సమర్పించారు. టైమ్‌స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. మూడు కిలోల బంగారు ఆభరణాల స్వాధీనం నెల్లూరు(క్రైమ్): కారులో ఎలాంటి బిల్లుల్లేకుండా అక్రమంగా తరలిస్తున్న బంగారు ఆభరణాలను జీఎస్టీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల బృందం స్వాధీనం చేసుకుంది. వివరాలు.. నగరానికి చెందిన ఓ వ్యాపారి ఎలాంటి బిల్లుల్లేకుండా పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలను విక్రయించేందుకు కారులో చైన్నె తరలిస్తున్నారనే సమాచారం జీఎస్టీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు శుక్రవారం అందింది. దీంతో వారి బృందం వెంకటాచలం టోల్‌ప్లాజా వద్ద కారును ఆపి తనిఖీలు చేశారు. అక్రమంగా తరలిస్తున్న సుమారు రూ.3.7 కోట్ల విలువజేసే 3.1 కిలోల బంగారు ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ట్రెజరీలో భద్రపర్చారు. సదరు వ్యక్తికి సంబంధించిన వ్యాపార లావాదేవీలపై జీఎస్టీ అధికారులు ఆరాతీస్తున్నారు. -
నిషేధిత పాపం చంద్రబాబుదే
నెల్లూరు రూరల్: రెవెన్యూ సమస్యలను తామే పరిష్కరిస్తున్నామనే రీతిలో టీడీపీ ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటోందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడారు. 22ఏ జాబితాలో భూములను పెట్టిందే చంద్రబాబు అని, ఈ విషయంలో వక్రీకరణతో కూడిన ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. , 2014 – 19 మధ్య వెబ్‌ల్యాండ్ పేరు చెప్పి, తహసీల్దార్ కార్యాలయాల్లో టీడీపీ కార్యకర్తలు, వారికి సంబంధించిన మనుషులను పెట్టి గిట్టని వారి భూములన్నింటినీ 22ఏలో పెట్టారని, ఫలితంగా యజమానులు నానా అవస్థలు పడుతున్నారని చెప్పారు. తమ ప్రభుత్వం వచ్చాకే బాధితులకు ఊరట లభించిందనే అంశాన్ని గుర్తుచేశారు. 2024 తర్వాత కష్టాలు ప్రారంభం 2024లో చంద్రబాబు మరోసారి సీఎం అయ్యాక అసైన్డ్, ఇతర కేటగిరీల భూములకు సంబంధించిన ఫ్రీ హోల్డ్ విషయంలో నానా ఆరోపణలు చేసి, ఇప్పటికీ యజమానులను నానా కష్టాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. అక్రమాలు జరిగాయని ఎన్ని ఆరోపణలు చేసినా, ఎలాంటి ఆధారాల్లేవని అధికారులే చెప్పారన్నారు. రాజధాని పేరిట అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను మభ్యపెట్టి 1100 ఎకరాలను కొట్టేశారని ఆరోపించారు. అసైనన్డ్దారుల చేతుల్లో భూములుంటే పరిహారం రాదని.. ప్లాట్లు రావంటూ పథకం ప్రకారం ప్రచారం చేసి లాగేసుకున్నారని విమర్శించారు. ఆ తర్వాత జీఓ ఇచ్చి, వాటిని పప్పుబెల్లాలకు కొనుగోలు చేసి, చేతులు మారాక పూలింగ్‌లోకి తీసుకొని, ప్లాట్లు కేటాయించి వాటిని తిరిగి విక్రయించి రూ.కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. సమస్యకు తమ హయాంలోనే పరిష్కారం పేదలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అసైన్డ్ చట్టానికి జగన్మోహన్రెడ్డి సవరణలు చేశారని చెప్పారు. ఒరిజినల్ అసైనీలు మాత్రమే న్యాయబద్ధంగా, తమ ఇష్టపూర్వకంగా అవసరానికి విక్రయించుకునే హక్కును కల్పించారని గుర్తుచేశారు. ఈ చట్టం పేదలకు పూర్తిగా అండగా నిలిచిందని, ఇలాంటి సందర్భాల్లో కుంభకోణాలకు ఆస్కారం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు.. ఈ చట్టాన్ని తెస్తున్న సమయంలో చాలా మంది ఒత్తిళ్లు తెచ్చారని, అయితే అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి ససేమిరా అన్నారన్నారు. ప్రతి విషయంలోనూ ప్రభుత్వం ఎన్నో జాగ్రత్తలు తీసుకుందని తెలిపారు. ఈ రకంగా దాదాపు తొమ్మిది లక్షల ఎకరాలను 22ఏ నుంచి తొలగించారని, అలాంటిది టీడీపీ ప్రభుత్వం వచ్చాక రిజిస్ట్రేషన్లు నిలిపేయమని, ఫ్రీ హోల్డ్ చేయొద్దని ఆదేశాలిచ్చి భూ యజమానులను ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు. 27.4 లక్షల ఎకరాలకు సంబంధించి 15.2 లక్షల మంది రైతులకు మేలు చేసింది తామే.. 22ఏ నుంచి మినహాయించామంటూ రెవెన్యూ మంత్రి ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. తమ హయాంలో సమగ్ర సర్వే జరిగితే రైతుల భూములు పోతాయంటూ దుష్ప్రచారం చేశారని, ల్యాండ్ టైట్లింగ్‌ను భూతంగా చూపారని ఆరోపించారు. ఇప్పుడు సమగ్ర సర్వే అంటూ తమ పద్ధతులనే అనుసరిస్తున్నారని తెలిపారు. 22ఏలో భూములు చేర్చిన వైనం నాటి సీఎం జగన్ హయాంలో వీటికి మోక్షం తిరిగి అదే జాబితాలోకి మార్చిన సర్కార్ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
రాష్ట్రస్థాయి కెరీర్ ఎక్స్‌పోకు ఐదు ప్రాజెక్ట్‌లు
నెల్లూరు (టౌన్): సంతపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లిష్ మీడియం స్కూల్లో జిల్లాస్థాయి కెరీర్ ఎక్స్పో / ఎగ్జిబిషన్‌ను సమగ్రశిక్ష ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. జిల్లా నుంచి నాలుగు విభాగాల్లో 126 నమూనాలను విద్యార్థులు ప్రదర్శించారు. విభాగానికి ఒకటి చొప్పున నాలుగింటిని రాష్ట్రస్థాయి కెరీర్ ఎక్స్‌పోకు ఎంపిక చేశారు. హెల్త్ అండ్ బ్యూటీ వెల్నెస్ విభాగం నుంచి బ్రాహ్మణకాక జెడ్పీహెచ్ఎస్ విద్యార్థి ఆర్షియా.. మోడల్స్ విభాగం నుంచి బుచ్చి జెడ్పీహెచ్ఎస్ స్టూడెంట్ సాహితి.. ఒకేషనల్ డ్రస్ అప్ విభాగం నుంచి గండవరం జెడ్పీహెచ్‌ఎస్‌కు చెందిన ప్రేమచరణ్.. పోస్టర్ మేకింగ్ విభాగం నుంచి పేరారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్ నిహారిక ప్రదర్శించిన ప్రాజెక్ట్‌లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యాయి. ఈ విభాగాల్లో తొలి మూడు నమూనాలను ఎంపిక చేసి విద్యార్థులకు బహుమతులను అందజేశారు. డీఈఓ బాలాజీరావు, సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
సాంకేతికతతో త్వరితగతిన కేసుల ఛేదన
నెల్లూరు(క్రైమ్): సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి కేసులను త్వరితగతిన ఛేదించాలని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సూచించారు. పోలీస్ శాఖలో అందుబాటులో ఉన్న సాంకేతిక టూల్స్‌పై తన కార్యాలయం నుంచి నెల్లూరు జిల్లా పోలీస్ అధికారులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం అవగాహన కల్పించిన అనంతరం ఆయన మాట్లాడారు. నేర నియంత్రణ, కేసుల దర్యాప్తు, ఆధారాల సేకరణలో ఆధునిక సాంకేతిక టూల్స్ కీలకపాత్రను పోషిస్తున్నాయని చెప్పారు. సీసీటీఎన్నెస్, డిజిటల్ అండ్ సైబర్ ఫొరెన్సిక్, మొబైల్ డేటా విశ్లేషణ, సాఫ్ట్వేర్ ఆధారిత పోలీసింగ్ టూల్స్, సీసీ కెమెరాల ఫుటేజీ విశ్లేషణ, డ్రోన్ టెక్నాలజీని సమర్థంగా వినియోగించుకోవాలని ఆదేశించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా అధికారులు తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డీపీఓలోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి సదస్సుకు ఎస్పీ అజిత వేజెండ్ల తదితరులు హాజరయ్యారు. -
పోలీసుల తీరుపై ప్రైవేట్ కేసులేస్తాం
చట్టాన్ని ఖాకీలు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలే లక్ష్యంగా అక్రమ కేసులను నమోదు చేస్తున్నారు. ఇలా చేయడం నేరమే అవుతుంది. పౌరహక్కులను కాలరాయొద్దని సుప్రీంకోర్టు ఓ వైపు ఆదేశాలిస్తోంది. అయితే ఖాకీలు మాత్రం అధికార పార్టీ నేతల మెప్పు కోసం థర్డ్ డిగ్రీలు ఉపయోగిస్తున్నారు. తోటపల్లిగూడూరు మండలంలో నివాసాన్ని కూలదోసిన ఘటనలో ప్రైవేట్ కేసుతో పాటు డ్యామేజ్, ప్రాసిక్యూషన్ కోసం పిటిషన్‌ను వేస్తాం. – ఉమామహేశ్వర్‌రెడ్డి, సీనియర్ న్యాయవాది, నెల్లూరు ● -
బంగారం చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
● 40.44 గ్రాముల బంగారం స్వాధీనం విడవలూరు: బంగారం చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విడవలూరులోని పోలీస్‌స్టేషన్‌లో బుచ్చిరెడ్డిపాళెం సీఐ సురేంద్రబాబు, ఎస్సై నరేష్ వివరాలు వెల్లడించారు. వావిళ్ల గ్రామానికి చెందిన గుంజి నాగమ్మ అనే మహిళ గతేడాది సెప్టెంబర్‌లో రామేశ్వరం వెళ్లారు. ఇంటికి తిరిగొచ్చేసరికి గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనం చేశారు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు సాంకేతికత ఆధారంగా నెల్లూరు హరనాథపురానికి చెందిన చల్లా మధు, విడవలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు తంబి నరేష్, తంబి సతీష్ దొంగతనానికి పాల్పడినట్లు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం చేసినట్లు అంగీకరించారు. సతీష్ పరారీలో ఉన్నాడు. చోరీ చేసిన బంగారాన్ని నరేష్, సతీష్ తమ తల్లి తంబి వజ్రమ్మ వద్ద ఉంచారన్న సమాచారంతో ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. 40.44 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. -
ఎన్నాళ్లీ పడిగాపులు
చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రతినెలా రేషన్ అందుకునేందుకు ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఎండీయూ వాహనాలు ఇళ్ల వద్దకే వచ్చి సరుకులు అందించాయి. నేడు లబ్ధిదారులు చౌకదుకాణాలకు వెళ్లి క్యూలైన్లలో నిలబడి రేషన్‌ను మోసుకుంటూ ఇంటికెళ్తున్న దృశ్యాలు సర్వసాధారణమయ్యాయి. చాలామంది రోజువారీ పనులు మానుకుని వేచి చూస్తున్న పరిస్థితి ఉంది. బియ్యం తీసుకెళ్లేందుకు వృద్ధులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
బైక్ ఢీకొని మహిళ మృతి
నెల్లూరు సిటీ: మోటార్‌బైక్‌పై ఢీకొనడంతో ఓ మహిళ మృతిచెందిన ఘటన నెల్లూరులో జరిగింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. మూడో మైలులోని యనమలవారి వీధి మామిడిచెట్ల సెంటర్లో మన్నెపల్లి శీనయ్య, కామాక్షమ్మ (51) దంపతులు నివాసముంటున్నారు. ఆత్మకూరు బస్టాండ్‌లోని పూలమార్కెట్లో కామాక్షమ్మ పనిచేస్తోంది. గురువారం రాత్రి పని ముగించుకుని ఇంటికి బయలుదేరింది. లిఫ్ట్ అడిగి బైక్‌పై వెనుక కూర్చొంది. ఇంటి వద్ద బైక్‌ను ఆపగా వెనుక నుంచి ఓ వ్యక్తి వేగంగా బైక్‌పై వచ్చి ఢీకొన్నాడు. దీంతో కామాక్షమ్మ తలకు తీవ్రగాయమై అపస్మారక స్థితికి చేరుకుంది. స్థానికులు 108 అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు తరలించారు. అప్పటికే ఆమె మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి కుటుంబ సభ్యులు శుక్రవారం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు. -
తప్పులుంటే సవరించుకోండి
కొడవలూరు: కొత్తగా పంపిణీ చేసిన పట్టాదారు పాస్‌పుస్తకాల్లో తప్పులు దొర్లి ఉంటే సవరించుకోవాలని జేసీ వెంకటేశ్వర్లు సూచించారు. మండలంలోని నార్తురాజుపాళెంలో పట్టాదారు పాస్‌పుస్తకాలను రైతులకు శుక్రవారం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడారు. పాత పాస్‌పుస్తకాల స్థానంలో కొత్త వా టిని ఈ నెల తొమ్మిది వరకు పంపిణీ చేయను న్నామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తహసీల్దార్ స్ఫూర్తిరెడ్డి, వీఆర్వోలు మల్లికార్జున, ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు. బ్రిడ్జి కోర్సుల్లో ఐదు నుంచి శిక్షణ నెల్లూరు (టౌన్): జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో రెండేళ్ల కాలం కలిగిన ట్రేడ్లలో శిక్షణ పొంది 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థులకు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి బ్రిడ్జి కోర్సుల్లో ట్రెయినింగ్‌ను ఇవ్వనున్నామని ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ నెల ఐదు నుంచి వచ్చే నెల నాలుగు వరకు శిక్షణను ఇవ్వనున్నామని వివరించారు. ఇక్కడ ఉత్తీర్ణులయ్యే వారు సాంకేతిక విద్య, శిక్షణ శాఖ విజయవాడ వారు నిర్వహించే ప్రవేశ పరీక్షకు అర్హులని తెలిపారు. అక్కడ పాసయ్యే వారు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి అర్హత సాధిస్తారని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు అన్ని అవసరమైన పత్రాలతో వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐని సంప్రదించాలని సూచించారు. రాజకీయ భవిష్యత్తును నాశనం చేశారు ● ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌పై ఆరోపణలు చేసిన మహిళ ఉదయగిరి: స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ తనను రాజకీయంగా వాడుకొని.. రాజకీయ భవిష్యత్తును అంతం చేశారంటూ సోషల్ మీడియా ద్వారా దుత్తలూరు మండలం ఏరుకొల్లుకు చెందిన చల్లా వెంగమాంబ గత నెల 29న ఆరోపణలు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక తన స్వగ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీపై అంకితభావంతో కృషి చేస్తున్న అంశాన్ని గ్రహించి తన క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే నియమించుకున్నారని చెప్పారు. అంగన్వాడీ కోఆర్డినేటర్‌గా బాధ్యతలు అప్పగించడంతో తాను చిత్తశుద్ధితో పనిచేశానన్నారు. రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి లేకపోయినా, ఎమ్మెల్యే ఆశలు రేపారని పేర్కొన్నారు. అయితే కొన్ని నెలల తర్వాత కార్యాలయం నుంచి పంపేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ కావడం.. ఛానల్లో శుక్రవారం ప్రసారం కావడం ఉదయగిరి నియోజకవర్గ ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. పలు వివాదాస్పద అంశాల్లో ఎమ్మెల్యే వార్తల్లోకి ఎక్కుతుండటం ఆ పార్టీ వర్గాలను కలవరపెడుతోంది. -
పోలీసా..?.. టీడీపీ బానిసా..?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తాను పోలీసుననే అంశాన్ని మరిచి.. వెంకటాచలం సీఐ సుబ్బారావు టీడీపీకి బానిసలా పనిచేస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. వెంకటాచలం మండలంలోని ఇడిమేపల్లికి చెందిన పార్టీ కార్యకర్త బెల్లంకొండ గురవయ్యను స్థానిక పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి సీఐ బూతులు తిట్టి.. కొట్టడంతో పాటు చిత్రహింసలకు గురిచేయడంతో వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడి నగరంలోని పెన్నా హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితుడ్ని కాకాణి శుక్రవారం పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. గురవయ్యకు ప్రాణహాని జరిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. టీడీపీ పాలనలో పోలీసులు బరితెగించి, అధికార పార్టీ నేతలకు సలామ్ కొడుతూ వారి వద్ద గులాంగిరీ చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షానికి చెందిన వారిని హింసించడమే పనిగా పెట్టుకొని పోలీసులు వ్యవహరిస్తున్న తీరు దారుణమన్నారు. సీఐ సుబ్బారావు మరింత బరితెగించి అధికార పార్టీ నేతలకు కొమ్ము కాస్తూ, వారి అడుగులకు మడుగులొత్తుతూ అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమ పార్టీ శ్రేణులను నిరంతరం వేధింపులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. గురవయ్య ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఐపై హత్యాయత్నం కేసును నమోదు చేసి, చర్యలు చేపట్టాలని ఎస్పీని కోరారు. ప్రజలు తిరగబడితే.. తట్టుకోలేరు అధికార పార్టీ నేతలను సంతృప్తిపర్చేందుకు ప్రతిపక్ష పార్టీలకు చెందిన వారిపై ఖాకీలు దాడులు చేయడం, అవమానించడాన్ని ఆనవాయితీగా పెట్టుకున్నారని మండిపడ్డారు. మీడియా ముందు మాట్లాడినా.. ప్రభుత్వాన్ని, అధికార పార్టీని ప్రశ్నించినా వెంటనే రంగప్రవేశం చేసి దారుణంగా హింసించడం దుర్మార్గమన్నారు. సీఐ సుబ్బారావు అవినీతి, అక్రమాలపై గత ఎస్పీ కృష్ణకాంత్‌కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా, అధికార పార్టీకి తొత్తులా వ్యవహరించి ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ప్రస్తుత ఎస్పీ విచారణ జరిపి తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు తమ తీరు మార్చుకొని శాంతిభద్రతలను అందించలేకపోతే.. ప్రజలు తిరగబడితే తట్టుకోలేరని హెచ్చరించారు. గురవయ్యకు ప్రాణహాని జరిగితే తీవ్ర పరిణామాలు వివాదాస్పదంగా సీఐ సుబ్బారావు తీరు ఎస్పీకి గతంలోనే ఫిర్యాదు చేసినా చర్యలేవీ..? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
ఆశ వర్కర్ల ఆకలి కేకలు
● మూడు నెలలుగా జీతాలేవీ..? ● దయనీయంగా 134 మంది పరిస్థితి ఆత్మకూరు: ఎంకి పెళ్లి.. సుబ్బి చావుకు వచ్చిందనే చందాన మారింది జిల్లాలోని 134 మంది ఆశ కార్యకర్తల పరిస్థితి. ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్‌ను ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా ఇటీవల మార్చారు. ఈ క్రమంలో ఖాతాదారుల అకౌంట్ నంబర్లూ మారాయి. ఫలితంగా నూతన నంబర్లు ఇవ్వాల్సిందిగా పీహెచ్‌సీలకు డీఎంహెచ్ఓ కార్యాలయం నుంచి ఆదేశాలందాయి. ఇది జరిగి మూడు నెలల కావొస్తోంది. దీంతో బ్యాంకులకు ఆశ కార్యకర్తలెళ్లి కావాల్సిన మేరకు వివరాలను నమోదు చేసి.. పీహెచ్‌సీల ద్వారా జిల్లా కార్యాలయానికి అందజేశారు. ఒకసారి నూతన ఖాతా నంబర్ కావాలని.. మరోసారి బ్యాంక్‌లో ఎలాంటి బకాయిల్లేవని లేఖ తేవాలని.. ఐఎఫ్ఎస్సీ కోడ్ కావాలని చెప్పగా, ఆ మేరకూ పంపారు. అయినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది. కుటుంబపోషణ భారం సంక్రాంతి నాటికై నా జీతాలొస్తాయనే ఆశ వీరిలో కరువైంది. కుటుంబపోషణకు అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు కట్టాలనే ఒత్తిడీ పెరుగుతోందని వాపోతున్నారు. కాగా ఈ విషయమై డీఎంహెచ్ఓ సుజాతను సంప్రదించగా, విషయం తన దృష్టికి రాలేదని, వివరాల కోసం డీసీఎం సునీతను సంప్రదించాలని సూచించారు. ఆమెను సంప్రదించగా, బ్యాంకుల విలీనంతో సమస్య ఏర్పడిందని, జీతాలు రాని విషయం వాస్తవమేనని అంగీకరించారు. గత నెల 26 నాటికి వారి జీతభత్యాలను పూర్తి చేసి థంబ్ వేసే క్రమంలో సమయం మించిపోవడంతో నిలిచిపోయిందని తెలిపారు. విజయవాడలోని సీఎమ్మెఎఫ్ఎస్ కార్యాలయాన్ని సంప్రదించామని, థంబ్ వేసేందుకు ఈ నెల ఆరున మరోసారి అవకాశం ఉంటుందని చెప్పారు. అయితే తొమ్మిది మంది వలంటీర్ల ఐడీలు నమోదు కాకపోవడంతో ప్రత్యేక ప్రక్రియ ద్వారా జీతాల కోసం పెట్టాల్సి ఉంటుందన్నారు. మిగిలిన వారికి సాధ్యమైనంత త్వరలో అందించేలా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. -
ఎడాపెడా తాగేశారు..!
● నూతన సంవత్సర సందర్భంగా ఏరులై పారిన మద్యం ● నాలుగు రోజుల్లో రూ.30.50 కోట్ల మేర విక్రయాలు నెల్లూరు(క్రైమ్): నూతన సంవత్సర వేడుకల్లో జిల్లాలో మద్యం ఏరులై పారింది. 2025కు వీడ్కోలు పలుకుతూ.. 2026కు ఘనంగా స్వాగతం పలుకుతూ అక్షరాల రూ.30.5 కోట్ల లిక్కర్‌ను మద్యం ప్రియులు తాగేశారు. మందేస్తూ...చిందేస్తూ న్యూ ఇయర్‌ను స్వాగతించారు. జిల్లాలో 200 వైన్ షాపులు, 34 బార్లలో రోజూ సగటున రూ.4.5 కోట్ల మేర విక్రయాలు సాగుతుంటాయి. అయితే కొత్త సంవత్సరాది వేడుకల్లో మద్యం విక్రయాలతో ఆదాయాన్ని భారీగా సమకూర్చుకోవాలని భావించిన ప్రభుత్వం దానికి అనుగుణంగా డిసెంబర్ 31, జనవరి ఒకటిన అర్ధరాత్రి ఒంటి గంట వరకు సమయాన్ని పొడిగించింది. భారీగా నిల్వలు మందుబాబులను మత్తులో ముంచేలా నాలుగు రోజుల నుంచే దుకాణాల్లో భారీగా నిల్వ చేశారు. పర్మిట్ రూమూల్లో బార్లను తలపించేలా ఏర్పాట్లు చేశారు. నూతన సంవత్సర కళంతా వైన్‌షాపులు, బార్ల వద్దే కనిపించింది. డిసెంబర్లో రూ.143 కోట్లు గతేడాది డిసెంబర్లో జిల్లాలో రూ.139.58 కోట్ల విలువజేసే 1,92,966 కేసుల మద్యం, 41,242 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ ఏడాది ఇది రూ.143.79 కోట్లుగా నమోదైంది. 2,05,557 కేసుల మద్యం, 57,966 కేసుల బీర్లు విక్రయమయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది రూ.4.21 కోట్ల అదనపు ఆదాయం ప్రభుత్వానికి సమకూరింది. -
పిన్నెల్లి సోదరులకు జైల్లోనూ వేధింపులు
● అక్రమ కేసులు మోపడం దుర్మార్గం ● యర్రగొండపాళెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ వెంకటాచలం: మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి జైల్లో పెట్టారని, అక్కడా వేధించడం దుర్మార్గమని యర్రగొండపాళెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వం మోపిన అక్రమ కేసులతో నెల్లూరు కేంద్ర కారాగారంలో ఉన్న పిన్నెల్లి సోదరులతో శుక్రవారం ములాఖత్ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అరాచక పాలనకు పిన్నెల్లి సోదరుల ఉదంతమే ఉదాహరణగా నిలుస్తోందని చెప్పారు. ఏ సంబంధం లేని కేసులో వీరిని ఇరికించి జైలుకు పంపడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మాచర్ల, వినుకొండ ప్రాంతాల్లో విధ్వంసకరపాలన కొనసాగుతోందని ఆరోపించారు. జూలకంటి బ్రహ్మానందరెడ్డి అనుచరులు టీడీపీకి చెందిన వారినే చంపేస్తే.. పిన్నెల్లి సోదరులకు ఏమి సంబంధమని ప్రశ్నించారు. టీడీపీ నేతలు అదే పార్టీకి చెందిన ఇద్దరు అన్నదమ్ములను ఇటీవల హతమార్చారని, పిన్నెల్లి సోదరులు జైలు బయట ఉంటే ఆ కేసులోనూ ఇరికించేవారని ధ్వజమెత్తారు. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి సోదరులు ప్రజాదరణ ఉన్న వారు కావడంతో కుట్రలతో ఈ కేసులో ఇరికించారని ధ్వజమెత్తారు. అక్కడ కొబ్బరికాయలు నరికే కత్తులతో విచక్షణరహితంగా తలలు నరికేస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. మాదకద్రవ్యాలు విక్రయించే వారు.. శాంతిభద్రతలపై పోలీసులు పట్టించుకోకుండా.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులపై అక్రమ కేసులు పెట్టడంపైనే దృష్టి సారిస్తున్నారని విమర్శించారు. పలుమార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏ కేటగిరీ సౌకర్యాలను కల్పించాలని న్యాయస్థానం ఆదేశించినా, పట్టించుకోకుండా జైల్లోనూ వేధించడం దుర్మార్గమన్నారు. భోజనం తిని 20 రోజులైందని చెప్తున్నారని, గుండె తరుక్కుపోతోందని తెలిపారు. రానున్న ఎన్నికల్లో మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నడూ లేనంత మెజార్టీతో గెలుపొందడం ఖాయమని స్పష్టం చేశారు. -
మరోసారి కంటపడిన పులి
● రోడ్డు దాటుతుండగా గుర్తించిన వాహనచోదకులు ఉదయగిరి రూరల్: మండలంలోని కొండ కింది గ్రామాల్లో పెద్ద పులి సంచారం భయాందోళనలకు గురిచేస్తోంది. తాజాగా కుర్రపల్లి – కృష్ణాపురం రహదారి మార్గంలో అన్నంపల్లె సమీపంలోని జువ్విమాను బాడవ వద్ద పులి రోడ్డు దాటుతుండటాన్ని బుధవారం రాత్రి ఏడు గంటల సమయంలో మండలంలోని కృష్ణారెడ్డిపల్లెకు చెందిన దేవసాని శ్రీనివాసులురెడ్డి, మరికొందరు వాహనదారులు గుర్తించారు. ఆందోళనకు గురై కొద్దిసేపు అక్కడే ఉండి ఆపై వెళ్లారు. ఉదయగిరి అటవీ ప్రాంతంలో కణితులు, చుక్కల దుప్పులు, గోవులు అధికంగా ఉండటంతో వాటిని ఆహారంగా తీసుకుంటూ ఇక్కడే సంచరిస్తూ ఉండొచ్చని పలువురు భావిస్తున్నారు. మరోవైపు ట్రాప్ కెమెరాలను పరిశీలించేందుకు వారం పడుతుందని అటవీ అధికారులు చెప్తున్నారు. రేషన్ షాపుల్లో గోధుమ పిండి నెల్లూరు(పొగతోట): చౌక దుకాణాల్లో కార్డుదారులకు గోధుమ పిండి, జొన్నలను పంపిణీ చేయనున్నామని డీఎస్ఓ లీలారాణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోని కార్డుదారులకే గోధుమపిండి కిలో మేర అందజేయనున్నామని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా కార్డుదారులకు బియ్యాన్ని తగ్గించి మూడు కిలోల జొన్నలను ఇవ్వనున్నామని వివరించారు. ఇది అవసరం లేని వారు బియ్యాన్ని పొందొచ్చని తెలిపారు. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. వైకుంఠ ద్వారం ద్వారా 70,256 మంది బుధవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 25,102 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.79 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి దర్శనం సకాలంలో లభిస్తోంది. జోరుగా గ్రావెల్ అక్రమ తవ్వకాలు వింజమూరు(ఉదయగిరి): వింజమూరులోని గాయత్రినగర్ సమీపంలో గల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద నిర్మిస్తున్న నూతన గృహాలకు గ్రావెల్‌ను అక్రమంగా తరలించారు. కలిగిరి మండలం భట్టువారిపాళెం రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో జేసీబీల ద్వారా తవ్వకాలు జరిపి టిప్పర్ల ద్వారా తరలించారు. కొన్ని రోజులుగా ఈ తంతు జరుగుతున్నా, రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదు. పేదలు తమ అవసరాల నిమిత్తం గ్రావెల్‌ను తరలిస్తే ఆంక్షలు పెట్టి వేధించే అధికారులు దీన్ని పట్టించుకోకపోవడం శోచనీయమని పలువురు పేర్కొంటున్నారు. ఓపెన్ ఫోరమ్ నేడునెల్లూరు(బారకాసు): నగరపాలక సంస్థ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ సమావేశ మందిరంలో ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు టౌన్ ప్లానింగ్ విభాగ ఆధ్వర్యంలో నిర్వహించనున్నామని ఇన్చార్జి సిటీ ప్లానర్ రఘునాథరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కమిషనర్ నందన్ నేతృత్వంలో జరగనున్న కార్యక్రమంలో పెండింగ్ ప్లాన్ అనుమతులు, ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు, మార్ట్గేజ్ రిలీజ్, లే అవుట్ రెగ్యులరైజేషన్ వంటి టౌన్ ప్లానింగ్ విభాగానికి సంబంధించిన ఇతర సమస్యలతో పాటు బీపీఎస్ పథకంపై అవగాహన కల్పించడం, పరిష్కారాలు అందించేందుకు అధికారులందరూ హాజరవుతారని తెలిపారు. సంబంధిత భవన యజమానులు, ఎల్టీపీలు, లైసెన్స్డ్ సర్వేయర్లు, ఇంజినీర్లు హాజరై సమస్యలను పరిష్కరించుకోవాలని కోరారు. -
రోడ్డు భద్రత మాసోత్సవాల బ్యానర్ల ఆవిష్కరణ
నెల్లూరు (టౌన్): రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకొని బ్యానర్లు, కరపత్రాలను సంతపేటలోని తన నివాసంలో రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ నెల 31 వరకు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. డీటీసీ చందర్, ఆర్టీఓ మదానీ, ఎమ్వీఐలు బాలమురళి, రఫీ, రాములు, ఏఎమ్వీఐలు పూర్ణచంద్రరావు, మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. గుడ్డు ధర చూసి గుడ్లు తేలేస్తూ..! నెల్లూరు(వీఆర్సీసెంటర్): గతంలో ఎన్నడూ లేని విధంగా కోడి గుడ్డు ధరలు ఆకాశాన్నంటుతుండటంతో గుడ్లు తేలేయడం వినియోగదారుల వంతవుతోంది. హోల్‌సేల్ మార్కెట్లో ఒక గుడ్డు ధర రూ.7.10 ఉండగా, రిటైల్‌లో రూ.7.5 నుంచి రూ.ఎనిమిది వరకు పలుకుతోంది. 30 కోడిగుడ్ల షీట్ రూ.213గా నమోదైంది. గుడ్లు ఇతర ప్రాంతాలకు ఎగుమతవ్వడంతో పాటు రెండు నెలల క్రితం వచ్చిన భారీ వర్షాలు, తుఫాన్లు, వరదల తాకిడికి తెలుగు రాష్ట్రాల్లో ఏడు లక్షలకుపైగా కోళ్లు, బ్రాయిలర్ కోళ్లు మృతి చెందాయి. ధరల పెరుగుదలకు ఇదీ ఓ కారణమని తెలుస్తోంది. మరోవైపు చికెన్ ధరలూ పెరిగాయి. కిలో చికెన్ రూ.280.. స్కిన్లెస్ రూ.300గా ఉంది. రానున్న రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. -
సీసీ కెమెరాలా.. వద్దు బాబోయ్
నెల్లూరు(పొగతోట): జిల్లాలో పేదల బియ్యం పక్కదారి పడుతోంది. డీలర్లు, మాఫియా కుమ్మకై ్క తమ పనిని యథేచ్ఛగా కానిస్తూ భారీగా దోచుకుంటున్నారు. ఈ తరుణంలో వీటికి అడ్డుకట్ట పడుతుందనే లక్ష్యంతో ఒక్కో రేషన్ షాపులో రెండు చొప్పున సీసీ కెమెరాల ఏర్పాటుకు సంకల్పించారు. ఈ ఒక్క నిర్ణయం వీరిలో కలకలాన్ని రేపింది. అందరూ ఏకమై.. అడ్డుకొని సీసీ కెమెరాల ఏర్పాటులో జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధికారులకు ఆదేశాలూ అందాయి. అయితే ఈ ప్రతిపాదనతో చౌక దుకాణ డీలర్లు ఏకమై వ్యవహారాన్ని అటకెక్కించారు. దీనికి కూటమి పార్టీల నేతల మద్దతు సైతం తోడైంది. మరోవైపు వీటిని ఏర్పాటు చేయాలంటే ఒక్కో డీలర్‌కు రూ.20 వేల నుంచి రూ.30 వేలు ఖర్చవుతుందని, దీన్ని తాము భరించలేమంటూ రాష్ట్ర, జిల్లా అధికారులకు విన్నవించుకున్నారు. ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకు రాకపోవడంతో ప్రస్తుతం ఈ ప్రతిపాదన దాదాపు నిలిచిపోయిందని సమాచారం. జిల్లాలో ఇలా.. జిల్లాలో 1513 చౌక దుకాణాలు, 7.2 లక్షల రేషన్ కార్డులున్నాయి. ప్రతి నెలా 11 వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని కార్డుదారులకు పంపిణీ చేస్తున్నారు. అయితే ఇందులో సుమారు ఎనిమిది వేల మెట్రిక్ టన్నుల మేర అక్రమంగా రవాణా అవుతోంది. ఈ అంశమై సాక్షిలో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై స్పందించిన సివిల్ సప్లయ్స్ శాఖ కమిషనర్.. అధికారులు, చౌక దుకాణ డీలర్ల సంఘ నేతలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జిల్లాలోని రేషన్ షాపులు, ఎమ్మెల్‌ఎస్ పాయింట్లల్లో సీసీ కెమెరాలు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. మొదటికే మోసమొస్తుందనే భయం ఈ ప్రతిపాదన కార్యరూపం దాలిస్తే మొదటికే మోసం వస్తుందని డీలర్లు భావించి కూటమి నేతల ఎదుట మొరపెట్టుకున్నారు. కెమెరాల ఖర్చును భరంచలేం.. అవసరమైతే ప్రభుత్వమే ఏర్పాటు చేసి ప్రతి నెలా ఖర్చు చేయాలని సివిల్ సప్లయ్స్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో విషయం ప్రస్తుతానికి ఆగిపోయిందని డీలర్లే బహిరంగంగా చెప్తున్నారు. బియ్యం అక్రమ రవాణాతో ప్రతి నెలా కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటే వీటి ఏర్పాటుకు డీలర్లు ఎలా అంగీకరిస్తారని పలువురు పేర్కొంటున్నారు. చౌక దుకాణాల్లో వీటి ఏర్పాటుకు నిర్ణయం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుందని డీలర్లలో ఆందోళన ఖర్చు భరించలేమంటూ మోకాలడ్డు అటకెక్కిన ప్రతిపాదన ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ఎమ్మెల్‌ఎస్ పాయింట్లు, చౌక దుకాణాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆదేశించారు. అయితే వీటి ఏర్పాటుకయ్యే ఖర్చును భరించలేమని డీలర్లు కలిసి విన్నవించుకున్నారు. దీంతో ఏర్పాటు ప్రక్రియ ప్రస్తుతానికి ఆగింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే చర్యలు చేపడతాం. బియ్యం అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటాం. – వెంకటేశ్వర్లు, జేసీ పేదల బియ్యం అక్రమ రవాణా కట్టడే లక్ష్యంగా చౌక దుకాణాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్ సంకల్పించారు. దీనికి గానూ జిల్లాను పైలట్ ప్రాజెక్ట్‌గా తీసుకొని ఒక్కో షాపులో రెండింటిని ఏర్పాటు చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ ప్రతిపాదన రేషన్ డీలర్లు, బియ్యం మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తించాయి. అందరూ ఏకమై కూటమి నేతలను సంప్రదించి ప్రక్రియను అటకెక్కించారు. -
ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: నా నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూముల్ని ఆక్రమిస్తే సహించేది లేదు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకొచ్చే వారు మా పార్టీ వారైనా ఉపేక్షించేది లేదంటూ పలు సందర్భాల్లో రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ప్రకటించారు. కానీ క్షేత్రస్థాయిలో జరుగుతోంది వేరు. టీడీపీ నేతలు షాడో మంత్రి అండదండలతో రూ.కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి విక్రయిస్తున్నారు. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ భగత్‌సింగ్ కాలనీలో కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ, ఇరిగేషన్‌కు సంబంధించిన రూ.కోట్ల విలువ చేసే స్థలాలను కొందరు టీడీపీ నాయకులు ఆక్రమించి, ఇళ్ల నిర్మాణాలు చేపట్టి ఇతరులకు అమ్ముకుంటున్నారు. అంతేకాకుండా రూ.కోటి విలువైన మూడెకరాల ప్రభుత్వ భూమికి ఫెన్సింగ్ వేసి వారి ఆధీనంలో పెట్టుకున్నారు. వ్యతిరేకిస్తూ.. ప్రభుత్వ స్థలాల ఆక్రమణలపై స్థానికుడైన ఈశ్వర్ అనే వ్యక్తి కొన్ని సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. దీంతో టీడీపీ నాయకులు ఈశ్వర్, అతని కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించడంతోపాటు భౌతిక దాడులకు పాల్పడిన ఘటనలున్నాయి. అతను ఆధారాలతోసహా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లకు ఫిర్యాదు చేశారు. గతంలో మూడుసార్లు అధికారులు ఇది ప్రభుత్వ స్థలం అని బోర్టులు పెట్టిన చోటే ఆక్రమణ నిర్మాణాలు చేస్తుడటం విశేషం. ఇటీవల భగత్‌సింగ్ కాలనీలో ఉన్న పాత స్కూల్ భవనాన్ని పైతం కూల్చేసి నిర్మాణాలు సాగిస్తున్నారని ఈశ్వర్ నెల్లూరు అర్బన్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ఫ్లెక్సీ రూపంలో నిరసనకు దిగారు. అధికారులను అడ్డుకుని.. కొన్నిరోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఆక్రమిత స్థలాల సర్వే కోసం వస్తే వారిని మహిళలతో బెదిరించి అధికారులను సైతం అడ్డుకుని దాడులకు యత్నించారు. నాయకుల తీరుతో చేసేదేమీ లేక అధికారులు సర్వే చేయకుండానే వెనుదిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రాంతానికి ఏ అధికారి వెళ్లాలన్నా భయపడుతున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ నేతల ఇష్టారాజ్యం రూ.కోట్ల విలువైన స్థలాలు, భూముల కబ్జా స్కూల్ భవనాన్ని కూల్చి మరీ అక్రమ నిర్మాణాలు అధికారులపై దాడికి పాల్పడుతున్న పచ్చమూకలు కాపాడేందుకు ఓ వ్యక్తి పోరాటం -
పిల్లల మధ్య న్యూ ఇయర్ వేడుకలు
నెల్లూరు(దర్గామిట్ట): అనాథ పిల్లలతో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని కలెక్టర్ హిమాన్షు శుక్లా అన్నారు. గురువారం నెల్లూరు నగరంలోని ఆర్కే నగర్లో ఉన్న జనహిత వాత్సల్య అనాథాశ్రమాన్ని కలెక్టర్ సందర్శించారు. పిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. తొలుత బాలికల కోలాట ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిన్నపిల్లలతో గడపడం తనకెంతో ఇష్టమన్నారు. ఎటువంటి ప్రభుత్వ తోడ్పాటును ఆశించకుండా దాతల సహకారంతో మూడు దశాబ్దాలకు పైగా ఆశ్రమాన్ని నిర్వహించడం, విలువలతో కూడిన విద్యా బోధన అందించడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా చిన్నారులకు నిఘంటువులు, నోట్ పుస్తకాలు, విద్యా సామగ్రిని పంపిణీ చేశారు. బాగా చదివి ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాక్షించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రిని త్వరలో అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో ఆశ్రమ ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవీ సాంబశివరావు పాల్గొన్నారు. -
ప్రయాణం.. నరకప్రాయం
● రోడ్డు పనుల్లో నిర్లక్ష్యం ● దుమ్ముతో వాహనదారుల అవస్థలు కోవూరు: రోడ్డు విస్తరణ పనులు ప్రయాణికుల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. నిబంధనల ప్రకారం పనులు చేపట్టాల్సిన కాంట్రాక్టర్లు, పర్యవేక్షించాల్సిన అధికారులు మొద్దునిద్ర పోతుండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడుగుపాడు సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల వద్ద కనీస జాగ్రత్తలు పాటించకపోవడంతో ఈ ప్రాంతం ప్రమాదాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం జరుగుతున్న పనుల వల్ల రోడ్డుపై భారీగా దుమ్ము పేరుకుపోయింది. వాహనాలు వెళ్తున్న సమయంలో దుమ్ము పైకి లేస్తుండడంతో వెనుక వచ్చే వాహనదారులకు దారి కనిపించడం లేదు. దీనివల్ల ఎదురెదురుగా వచ్చే వాహనాలు ఢీకొనే ప్రమాదం ఉందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారుల కళ్లలో దుమ్ము పడుతుండడంతో అదుపుతప్పి కింద పడి గాయపడుతున్నారు. సాధారణంగా రోడ్డు పనులు జరిగే సమయంలో దుమ్ము లేవకుండా ఎప్పటికప్పుడు నీళ్లు చల్లాలి. అయితే ఇక్కడ కాంట్రాక్టర్లు అలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కనీసం నీళ్లు చల్లించేలా చర్యలు తీసుకోవాలని పలువురు వాహనచోదకులు కోరుతున్నారు. -
విద్యార్థులు పోటీతత్వంతో చదవాలి
● వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు వెంకటాచలం: విద్యార్థులు పోటీతత్వంతో చదవాలని విక్రమ సింహపురి యూనివర్సిటీ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వర్సిటీలో గురువారం సెంటర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్‌ను వీసీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించేందుకు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాలు, వివిధ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ కేంద్రం ద్వారా సమగ్ర శిక్షణతోపాటు, సరైన మార్గదర్శకత్వం లభిస్తుందని చెప్పారు. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించి వీఎస్‌యూకు పేరు తీసుకురావాలన్నారు. ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా నిపుణలచే శిక్షణ, పరీక్షలపై అవగాహన, స్టడీ మెటీరియల్, మాక్ టెస్టులు అందించనున్నట్లు తెలియజేశారు. విద్యార్థుల లక్ష్యాలను సాధించడంలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో కేంద్రం డైరెక్టర్ డాక్టర్ విజేత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ తదితరులు పాల్గొన్నారు. -
కోడిపందేల స్థావరాలపై దాడులు
కలిగిరి: మండలంలోని తుర్పుగుడ్లదొన అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై ఎస్సై ఉమాశంకర్ గురువారం దాడులు నిర్వహించారు. పదిమంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. రూ.4,500 నగదు, రెండు కోడిపుంజులను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ గ్రామాల్లో కోడిపందేలు, పేకాట నిర్వహిస్తుంటే 94407 00098 ఫోన్ నంబర్‌కు సమాచారం ఇవ్వాలన్నారు.● మనుబోలు: మండలంలోని వడ్లపూడి అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరంపై పోలీసులు గురువారం రాత్రి దాడులు చేశారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. రూ.2,050 నగదు, ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడుల్లో ఎస్సై శివరాకేష్, కానిస్టేబుళ్లు పాల్గొన్నారు. ఆడుకుంటూ తప్పిపోయి..● తండ్రి చెంతకు బాలుడు దగదర్తి: తప్పిపోయిన బాలుడిని తండ్రి చెంతకు చేర్చిన ఘటన గురువారం దగదర్తిలో చోటుచేసుకుంది. ఎస్సై జంపాని కుమార్ కథనం మేరకు.. దగదర్తి గ్రామంలో ఉన్న ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్ చర్చిలో ప్రకాశం జిల్లా పామూరుకు చెందిన నల్లగట్ల సుబ్బారాయుడు తన మూడు సంవత్సరాల కుమారుడు అనోస్తో ప్రార్థనలకు విచ్చేశాడు. ఈ క్రమంలో అనోస్ ఆడుకుంటూ బయటకు వెళ్లిపోయాడు. దగదర్తి శివారులోని సున్నపుబట్టి అటవీ ప్రాంతానికి ఏడుస్తూ వెళ్తుండగా అదే గ్రామానికి చెందిన విజయనిర్మల అనే మహిళ గమనించింది. బాలుడిని తీసుకుని వెంటనే స్థానిక పోలీస్‌స్టేషన్‌లో అప్పగించింది. ఎస్సై తన సిబ్బందితో కలిసి గ్రామంలోని పరిసర ప్రాంతాల వారిని విచారించారు. ఇంతలో సుబ్బారాయుడు తన కుమారుడి కోసం వెతుకుతున్నాడు. దీంతో వివరాలు తెలుసుకుని బాలుడిని అప్పగించారు. విజయనిర్మలను ఎస్సై అభినందించారు. కిసాన్ కాల్ సెంటర్ ఏర్పాటు నెల్లూరు(పొగతోట): పంటల సాగు సమయంలో రైతులు ఎదుర్కొనే సమస్యలను పరిష్కరించేందుకు, సందేహాలను నివృత్తి చేసుకునేందుకు శాస్త్రవేత్తలు, అధికారులతో కిసాన్ కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయశాఖాధికారిణి సత్యవాణి తెలిపారు. రైతులు ఉదయం 9 నుంచి సాయంత్రం నాలుగు గంటల మధ్య ఫోన్ చేసి సాగులో సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. వరి, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు సంబంధించి సందేహాలను ఒ.వెంకటేశ్వర్లు, యు.వినీత, ఐ.పరమశివ, సీహెచ్ శ్రీలక్ష్మి, పి.మధుసూదన్ తీరుస్తారన్నారు. 0861 – 2327803, 94903 27424 ఫోన్ నంబర్లను సంప్రదించాలన్నారు. వేరుశనగపై ఎ.ప్రసన్న రాజేష్‌కు 94405 66582 నంబర్‌కు ఫోన్ చేయాలని కోరారు. ఉద్యాన, వ్యవసాయ పంటల్లో తెగుళ్ల నియంత్రణకు సంబంధించి డి.విజయకుమార్ నాయక్‌కు 0861 – 2349356 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఉద్యాన పంటల్లో విత్తన రకాలు, కలుపు నియంత్రణ తదితర వాటిపై పి.లక్ష్మిని 79950 88181 ఫోన్ నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఆటో కార్మికులకు సహకారం అందించాలి చిల్లకూరు: రవాణాశాఖాధికారులు ఆటో కార్మి కులకు సహకారం అందించాలని సీఐటీయూ నాయకులు కోరారు. గూడూరు పోటుపాళెం సమీపంలో ఉన్న రవాణా శాఖ కార్యాలయంలో గురువారం నేతలు అధికారులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటో కార్మికులు చిన్న పొరపాట్లు చేసిన సమయంలో భారీగా జరిమానాలు వేసి ఇబ్బందులు పెట్టకుండా తొలి హెచ్చరిక ఇవ్వాలన్నారు. తర్వాత అదే తప్పు చేస్తే జరిమానా విధించాలని కోరారు. అలాగే డ్రైవ్ ఒకేసారి చేపట్టి ఆటోల కండీషన్‌ను తనిఖీ చేయాలని, ఇలా చేయడం వల్ల కార్మికులకు ఇబ్బంది ఉండదన్నారు. మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అజాద్ జాకీర్, ఎంవీఐలు ప్రభాకర్, శాంతికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు బీవీ రమణయ్య, శేఖరయ్య, సయ్యద్ మీరాషా, ఉదయ్‌కిరణ్ తదితరులు పాల్గొన్నారు.నిమ్మ ధరలు (కిలో)పెద్దవి : రూ.20 సన్నవి : రూ.14 పండ్లు : రూ.10 -
వేర్వేరు ప్రమాదాల్లో పలువురికి గాయాలు
జిల్లాలోని వేర్వేరు మండలాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో పలువురు గాయపడ్డారు. మోటార్‌బైక్‌లు ఢీకొని.. మర్రిపాడు: మండలంలోని డీసీపల్లి సమీపంలో ఎదురెదురుగా రెండు మోటార్‌బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని రామానాయుడుపల్లికి చెందిన రామయ్య మోటార్ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గురువారం ఆత్మకూరు మండలం వెన్నవాడలో మోటార్ మరమ్మతులు చేసి తిరిగి బైక్‌పై వస్తున్నాడు. అదే సమయంలో డీసీపల్లి నుంచి వెన్నవాడకు రాజమండ్రికి చెందిన వ్యక్తి బైక్‌పై వెళ్తున్నాడు. రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రాజమండ్రికి చెందిన వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గుర్తించి అతడిని హైవే అంబులెన్స్‌లో ఆత్మకూరు వైద్యశాలకు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. మోకానిక్ రామయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. బైక్‌ను ఢీకొట్టిన కారు వింజమూరు(ఉదయగిరి): మండలంలోని జువ్వగుంటపాళెం బస్టాండ్ వద్ద బైక్‌ను కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై ఉన్న వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. జువ్వగుంటపాళేనికి చెందిన కుమ్మెద శ్రీధర్ పొలం పనులు ముగించుకుని బైక్‌పై ఇంటికి బయలుదేరాడు. ఈ క్రమంలో వింజమూరు నుంచి దుత్తలూరు వైపు వెళ్తున్న వరికుంటపాడు ఎస్పీడీసీఎల్ సిబ్బందికి చెందిన కారు రోడ్డుకు అడ్డంగా వెళ్తుతున్న ఓ బాలుడిని తప్పించబోయి బైక్‌ను ఢీకొట్టి రోడ్డు కిందికి వెళ్లిపోయింది. దీంతో శ్రీధర్ కాలికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుడిని కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం చైన్నెకి తీసుకెళ్లారు. ఈ ఘటనలో కారు, బైక్‌లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేదని ఎస్సై వీరప్రతాప్ తెలిపారు. -
చందన, సీఎంఆర్‌లో లక్కీ డ్రా
నెల్లూరు(బృందావనం): చందన, సీఎంఆర్ ఫెస్టీ వండర్ సందర్భంగా గురువారం నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఆయన సతీమణి కె.సంధ్య డ్రా తీశారు. న్యూ ఇయర్ మలేసియా ట్రిప్ విజేతగా బుచ్చిరెడ్డిపాళేనికి చెందిన పి.సురేష్ నిలిచారు. వీక్లీ డ్రా హీరో ప్లెషర్ స్కూటీ విజేతగా కె.మోహన్‌రెడ్డిని ప్రకటించారు. అలాగే డైలీ డ్రా విజేతలుగా కె.ప్రవీణ (గ్రైండర్), ఎస్కే శామ్యూల్ (పాన్సెట్), వై.సహస్ర (మిక్సీ), ఎం.గురుప్రకాష్ (మిక్సీ), ఎ.లతిక (డిన్నర్‌సెట్)కు దక్కాయి. ఈ సందర్భంగా శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల క్రితం నెలకొల్పిన చందన, సీఎంఆర్ సంస్థలు ప్రజల ఆదరణ పొంది నెల్లూరీయుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయన్నారు. చందన అధినేత ఎం.శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్రాంతికి బంపర్ ఆఫర్‌గా టాటా టియోగా కారును లక్కీ డ్రా ద్వారా వినియోగదారులకు అందజేస్తున్నామన్నారు. తక్కువ ధరలకే బంగారం, వస్త్రాలు అమ్మకాలు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో మోపూరు పెంచలయ్య, శైలేష్, మేనేజర్లు కిషోర్, వాసు తదితరులు పాల్గొన్నారు. -
పక్షుల కేంద్రంలో సందర్శకుల సందడి
దొరవారిసత్రం: నూతన సంవత్సరం సందర్భంగా మండలంలోని నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రం సందడిగా మారింది. పలు ప్రాంతాల నుంచి పక్షి ప్రేమికులు, పర్యాటకులు ఉదయం 9 గంటలకే పక్షుల కేంద్రానికి చేరుకుని విహంగాలను వీక్షించారు.చెరువుల్లోని కడప చెట్లపై విడిది చేసే విహంగాలను వీక్షిచండమే కాకుండా పర్యావరణ కేంద్రంలోని కృత్రిమ విహంగాలు పక్షి జాతుల ప్రాధ్యానతతోపాటు పర్యావరణ కేంద్రంలో జీవన శైలి చిత్రాలను స్థానిక వన్యప్రాణి సిబ్బంది ప్రదర్శించారు. మార్గమధ్యలోని జింకల పార్క్‌లో ఉన్న జింకలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. పిల్లల పార్కులో చిన్నారులు ఆటపాటలతో ఆనందంగా గడిపారు. తిరుపతి, విజయవాడ, చైన్నె, బెంగళూరు, గూడూరు, నెల్లూరు, చిత్తూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట తదితర ప్రాంతాల నుంచి వాహనాల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. సందర్శకుల కోసం వన్యప్రాణి విభాగం అధికారులు తాగునీటి వసతి, చెరువు కట్టపై ఉన్న వ్యూ పాయింట్లు వద్ద పక్షులను దగ్గరగా వీక్షించేలా బైనోక్యూలర్లు తదితరాలు అందుబాటులో ఉంచారు.వ్యూ పాయింట్ వద్ద సందర్శకులుగూడబాతు విన్యాసాలు -
వైఎస్సార్ టీఏ క్యాలెండర్ ఆవిష్కరణ
నెల్లూరురూరల్: రాంజీ నగర్‌లోని వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ కార్యాలయంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నూతన సంవత్సర క్యాలెండర్, వాల్ స్టిక్కర్, సీఎల్ బుక్స్‌ను ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి బుధవారం ఆవిష్కరించారు. నూతన సంవత్సరంలో వైఎస్సార్‌టీఏ మరింత బలోపేతం దిశగా నేతలు కృషి చేయాలని చంద్రశేఖర్‌రెడ్డి ఆకాంక్షించారు. ఉపాధ్యాయులకు అండగా ఉంటూ వారి సమస్యలపై అలుపెరుగని పోరాటం సాగించాలని సూచించారు. వైఎస్సార్ టీఏ రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు పాల్గొన్నారు. -
స్కూల్ నిర్మాణంపై బ్లూ ప్రింట్ ఎక్కడ?
నెల్లూరురూరల్: ఐదెకరాల వక్ఫ్ బోర్డు స్థలంలో నిర్మించబోతున్న ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మాణానికి సంబంధించిన బ్లూ ప్రింట్ ఎక్కడని వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి సమీర్ ఖాన్ ప్రశ్నించారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. అక్కడ స్కూల్ నిర్మాణానికి మేము వ్యతిరేకం కాదని, సీఎస్సార్ ఫండ్స్‌తో నిర్మిస్తే దానిని ఎవరు నడుపుతారని ప్రశ్నించారు. ఈనెల 4న శంకుస్థాపన చేసే స్కూల్‌కు బ్లూ ప్రింట్ అడిగితే అధికారులు మాకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరమని, అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్‌తో నడుస్తోందని, ప్రస్తుతం సెంట్రల్తో ఉన్న మీరు బాధ్యత కూడా కేంద్రం తీసుకునే విధంగా చేయాలన్నారు. మంత్రి నారాయణ ఎప్పుడూ శంకుస్థాపన చేసి వెళ్తాడని, కట్టేది మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి అని అన్నారు. దానికి ప్రత్యక్ష ఉదాహరణ గోషామహల్ హాస్పిటల్, షాదీ మహల్ అని తెలిపారు. ఇన్చార్జి మేయర్ రూప్‌కుమార్ యాదవ్ ఎమ్మెల్సీకి ఏమీ తెలియదని అంటున్నారని, ఆయనకు మీలా క్యాంపు రాజకీయాలు, ప్రజలను మభ్య పెట్టడం, మీలా బరితెగించడం నిజంగా తెలియదన్నారు. ముందు మీరు బాగా మాట్లాడడం నేర్చుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు షేక్ సిద్ధీఖ్, పార్టీ మైనార్టీ సెల్ నగర నియోజకవర్గ అధ్యక్షుడు షేక్.అబ్దుల్ మస్తాన్, సీనియర్ నాయకుడు జియా ఉల్హక్ తదితరులు పాల్గొన్నారు. -
సైబర్ నేరాలపై అప్రమత్తత అవసరం
నెల్లూరు(క్రైమ్): సైబర్ నేరాలపై ప్రతిఒక్కరిలో అప్రమత్తత అవసరమని ఎస్పీ అజిత వేజెండ్ల అన్నారు. నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో బుధవారం వాకర్స్ అసోసియేషన్ సభ్యులకు సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ పాల్గొని వాకర్స్, సీనియర్ సిటిజెన్స్‌కు పలు సూచనలు చేశారు. నేరగాళ్లు సాంకేతికతను ఆసరాగా చేసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్నారన్నారు. యువత, మహిళలు తమ వ్యక్తిగత సమాచారం ఎవరికీ ఇవ్వరాదని, అవసరం లేని సామాజిక మాధ్యమాల వినియోగానికి దూరంగా ఉండాలన్నారు. సైబర్ మోసాలకు గురైతే 1930 లేదా సైబర్‌క్రైమ్.జీఓవి.ఇన్‌కు లేదా స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అనంతరం రోడ్డుప్రమాదాల నివారణ, సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఏఎస్పీ సౌజన్య, డీఎస్పీలు ఎం.గిరిధర్, ఘట్టమనేని శ్రీనివాసరావు, ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు. 4,250 కేజీల రేషన్ బియ్యం పట్టివేత మనుబోలు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు మండల పరిధిలోని జాతీయ రహదారిపై గురివిందపూడి సమీపంలో బుధవారం స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ సీఐ కె.నరసింహారావు, విజిలెన్స్ తహసీల్దార్ కృష్ణప్రసాద్ తదితరులు ఆకస్మికంగా తనిఖీలు చేస్తున్న తరుణంలో ఓ మినీ లారీలో అక్రమంగా తరలిస్తున్న 4,250 కేజీల బియ్యాన్ని గుర్తించి సీజ్ చేశారు. అనంతరం లారీని మనుబోలు పోలీసులకు అప్పగించారు. బియ్యం తరలిస్తున్న మురళీమోహన్, డ్రైవర్ హరీష్, వాహన యజమాని వెంకటాద్రిలపై కేసులు నమోదు చేశారు. ఈ తనిఖీల్లో పొదలకూరు, వెంకటాచలం సీఎస్‌డీటీ రవి, సైమన్‌బాబు ఉన్నారు. చెరువులో రెండేళ్ల చిన్నారి మృతదేహం నెల్లూరు సిటీ: చెరువులో రెండేళ్ల చిన్నారి మృతిచెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు.. రూరల్ మండలంలోని ఆమంచర్లలోని అరుంధతీవాడకు చెందిన పెంచలయ్య, సావిత్రిలకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. కాగా కొంతకాలంగా సావిత్రి తన పిల్లలను పోషిస్తోంది. ఈ క్రమంలో మూడో కుమార్తె ముత్యాలమ్మ బుధవారం కనిపించకపోవడంతో ఆందోళనకు గురైంది. దీంతో సమీప ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. చెరువులోని ఓ మూలన నీటిలో పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. అప్పటికే చిన్నారి మృతిచెందింది. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సైనిక సంక్షేమానికి రూ.1.30 లక్షల విరాళం
నెల్లూరు(దర్గామిట్ట): సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని డీసీఓ బి.గుర్రప్ప ఆధ్వర్యంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, సహకార శాఖ సిబ్బంది సంయుక్తంగా సైనిక సంక్షేమ నిధికి రూ.1.30 లక్షలు వితరణ చేశారు. ఈ మేరకు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో బుధవారం కలెక్టర్, జిల్లా సైనిక బోర్డు చైర్మన్ హిమన్షు శుక్లాకు మెగా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి కింద వచ్చిన మొత్తాన్ని యుద్ధంలో మరణించిన వీర సైనికుల కుటుంబాలకు, మాజీ సైనికులు, గాయపడిన సైనికుల సంక్షేమానికి వినియోగిస్తారని తెలిపారు. జేసీ వెంకటేశ్వర్లు, జిల్లా సైనిక సంక్షేమాధికారి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
చర్చ లేకుండానే నిర్ణయాలు
● కమిషనర్ చర్యలకు తగిన మూల్యం తప్పదు ● ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరు(బారకాసు): కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశం అధికార పార్టీ నిర్ణయాలకు మాత్రమే పరిమితమైందని, అజెండాలోని ఏ అంశంపై కూడా చర్చ లేకుండా నేరుగా నిర్ణయాలు తీసుకున్నారని ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ నెల్లూరు సిటీ నియోజకవర్గ ఇన్చార్జి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశం నుంచి బయటికి వచ్చిన అనంతరం ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఎక్కడా ప్రజా సమస్యలను చర్చించేందుకు తావులేకుండా చేశారని మండిపడ్డారు. వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లలు మంత్రి నారాయణకు సంబంధించిన ఎన్టీమ్ వారే చేపడుతున్నారని ప్రశ్నిస్తే, సీఎస్సార్ ఫండ్స్‌తో అభివృద్ధి చేశామని దాటవేసే విధంగా సమాధానం ఇస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నాడు–నేడు కింద రాష్ట్రంలో 43 వేల ప్రభుత్వ పాఠశాలను ఆధునికీకరించి వసతులు సమకూర్చామన్నారు. ఆ పనులు పారదర్శక విధానంలో నిర్వహించి అడ్మిషన్లను ప్రభుత్వ నిబంధనల ప్రకారం జరిపామన్నారు. మంత్రి నారాయణ ఏకపక్షంగా వీఆర్ఐ స్కూల్లో అడ్మిషన్ నిర్వహిస్తూ.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. నగరపాలక సంస్థ కమిషనర్ నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఎక్స్ అఫీషీయో మెంబర్ హోదాలో ప్రజా సమస్యలపై పలుమార్లు లేఖలు రాస్తే కనీసం సమాధానం చెప్పే పరిస్థితిలో కూడా లేరన్నారు. ఆయన చేస్తున్న తప్పులకు చట్టం పరిధిలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. 13వ డివిజన్లో ఒక సెంటు కంటే చిన్న స్థలంలో నివాసం ఉంటున్న దళిత మహిళ ఇంటి బాత్ రూమ్‌ను దయ లేకుండా కమిషనర్ దగ్గరుండి కూల్చి వేయించారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 46వ డివిజన్లో నిర్మించిన ఓ వాటర్‌ప్లాంట్‌ను నిర్వీర్యం చేశారని, దానిపై ఫిర్యాదు చేసినా కమిషనర్ స్పందన లేదన్నారు. అధికార పార్టీకి తొత్తుగా కమిషనర్ వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త తరలింపు విషయంలో ట్రాక్టర్లను ఏర్పాటు చేసి వాటికి రూ.11 కోట్లు చెల్లిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని దుయ్యబట్టారు. -
పింఛన్ ఇప్పించండయ్యా..
తొమ్మిది గంటలకు పిలిచి.. 10 గంటలకు పంపిణీ ● అవస్థలు పడిన వృద్ధులు, దివ్యాంగులు ఆత్మకూరు: పింఛన్ల పంపిణీని టీడీపీ నేతలు మెహర్భానీకి వినియోగించుకున్నారు. అధికారులు పంపిణీ చేయాల్సిన పింఛన్లను స్థానిక టీడీపీ నేతలు ప్రచార ఆర్భాటాలకు పోయి లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దివ్యాంగులు, వృద్ధులను గ్రామంలో ప్రాథమిక పాఠశాల వద్దకు, రచ్చబండ వద్దకు పిలిపించి నిరీక్షించేలా చేసి టీడీపీ చోటా నాయకులు పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం చేజర్ల మండలం యనమదల గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు వెంకట రమణారెడ్డి గిరిజనులను, వృద్ధులను గ్రామ రచ్చబండ వద్దకు పిలిచి ఆయన చేతుల మీదుగా పింఛన్లను మెహర్భాని ప్రదర్శిస్తూ పంపిణీ చేశారు. అదే క్రమంలో గొల్లపల్లి గ్రామంలో స్థానిక టీడీపీ నాయకుడు ఉడతా హజరత్తయ్య సైతం గ్రామ పాఠశాల వద్దకు పింఛన్‌దారులను ఉదయం తొమ్మిది గంటలకు పిలిపించారు. అందరూ ఒకచోట చేరిన తర్వాత 10 గంటలకు ఒకేసారి పింఛన్ అందజేశారు. సచివాలయ ఉద్యోగులు సైతం ఆయా గ్రామాల్లో టీడీపీ నాయకులు చెప్పినట్లే చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. గత వైఎస్సార్సీపీ పాలనలో సామాజిక పింఛన్లను తెల్లవారుజామున 5 గంటల నుంచే వలంటీర్లు ఇళ్ల వద్దకు వచ్చి ఇచ్చేవారని వృద్ధులు, దివ్యాంగులు గుర్తు చేసుకుంటున్నారు. ● ఎమ్మెల్యేను వేడుకున్న వృద్ధురాలు వింజమూరు(ఉదయగిరి): వింజమూరు మండలం ఊటుకూరు పంచాయతీ తక్కెళ్లపాడు ఎస్సీ కాలనీలో పెంచలమ్మ అనే వృద్ధురాలు తనకు పింఛను ఇప్పించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌ను బుధవారం వేడుకుంది. రెండేళ్ల క్రితం తన భర్త పింఛన్ పొందుతూ చనిపోయాడని, ఆయన స్థానంలో తనకు పింఛన్ ఇప్పించాలని అధికారులను కోరుతున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అదేవిధంగా మరికొంత మంది దివ్యాంగులు, వృద్ధులు తమకు కూడా పింఛన్ రాలేదని, పింఛన్ కోసం ఎమ్మెల్యే ఎదుట వాపోయారు. దీంతో పాటు గ్రామంలో వాటర్ ప్లాంట్ చెడిపోయినా పట్టించుకోవడం లేదని, నీటి కోసం ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. కాలనీలో సీసీరోడ్డు లేనందున త్వరలో జరిగే పంచాయతీ స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదని, ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే ముందు ఆవేదన వ్యక్తం చేశారు. -
పెరిగిన నేర శాతం
నెల్లూరు(క్రైమ్): గతేడాదితో పోలిస్తే జిల్లాలో ఈ సంవత్సరం నేరాల సంఖ్య 7.55 శాతం మేర పెరిగింది. హత్యలు, హత్యాయత్నాలు, మర్డర్ ఫర్ గెయిన్ లాంటి క్రైమ్‌లు తగ్గినా, ఆస్తి, వైట్ కాలర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలు గణనీయంగా పెరిగాయి. నేరాల అదుపునకు పోలీస్ శాఖ సరికొత్త మార్గాలను అన్వేషిస్తున్నా, ఆగడాలకు అడ్డుకట్ట ఏ మాత్రం పడటం లేదు. రూ.23.57 కోట్లు కొల్లగొట్టారు.. సాంకేతికతను అడ్డంపెట్టుకొని సైబర్ నేరగాళ్లు పంజా విసురుతున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ తదితరాల పేరుతో ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. గతేడాది 85 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం ఇది 101కు ఎగబాకింది. గతేడాది రూ.15,02,26,000ను దోచు కోగా, ఈ ఏడాది ఇది రూ.23,57,97,426కు చేరింది. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు రూ.1,07,71,858 మేర రికవరీ చేసి నేరగాళ్ల బ్యాంక్ ఖాతాల్లోని నగదును స్తంభింపజేశారు. రక్తమోడిన రహదారులు రహదారి ప్రమాదాలు సైతం పెరిగాయి. వాహనదారుల నిర్లక్ష్యం, మితిమీరిన వేగం, డ్రంకెన్ డ్రైవ్, పరిమితికి మించిన రాకపోకలు.. ఇలా కారణాలు ఏదైనా రహదారులు రక్తమోడాయి. గతేడాది 843 ప్రమాదాలు జరగ్గా, ఈ ఏడాది 928 చోటుచేసుకున్నాయి. 514 మంది మృతి చెందగా, 894 మంది క్షతగాత్రులయ్యారు. చెలరేగిన చోరులు దొంగలు చెలరేగిపోయారు. గతేడాది 816 చోరీలు జరగ్గా, ఈ ఏడాది 899 నమోదయ్యాయి. పగలు, రాత్రనే తేడా లేకుండా తమ హస్తలాఘవాన్ని ప్రదర్శించి రూ.14,72,67,725ను కొల్లగొట్టారు. 511 కేసులకు సంబంధించి రూ 6,47,85,374ను మాత్రమే పోలీసులు స్వాధీనం చేసుకోగలిగారు. గుప్పుమంటున్న గంజాయి జిల్లాలో గంజాయి, మద్యం అక్రమ రవాణా, విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. 34 కేసులను నమోదు చేసి 510 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 102 మందిని కటకటాల వెనక్కి పంపి, 14 వాహనాలను సీజ్ చేశారు. మద్యానికి సంబంధించి 55 కేసులను నమోదు చేసి, 58 మంది నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి 123 లీటర్లను స్వాధీనం చేసుకున్నారు. లింగసముద్రం పరిఽధిలో 50 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి నిందితుడ్ని అరెస్ట్ చేశారు. సంచలనం రేకెత్తించిన హత్యలు జిల్లాలో పలు హత్య కేసులు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించాయి. గతేడాది 45 మర్డర్లు జరగ్గా, ఈ ఏడాది 39 సంభవించాయి. వీటిలో అధిక శాతం హత్యలు నగరంలోనే నమోదయ్యాయి. మర్డర్ ఫర్ గెయిన్ కింద ఎనిమిది కేసులు గతేడాది నమోదు కాగా, ఈ ఏడాది ఐదు.. కొట్లాట కేసులు 1032 నమోదు కాగా, ఈ సంవత్సరం 1017 రికార్డయ్యాయి. ప్రమాదాల కట్టడికి చర్యలు జిల్లా వ్యాప్తంగా 33 బ్లాక్ స్పాట్లను గుర్తించి రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వాహన తనిఖీలను ముమ్మరం చేసింది. నిబంధనల ఉల్లంఘనలపై 51,093 ఈ చలానాల ద్వారా రూ. 2,62,13,990 అపరాధ రుసుమును విధించారు. హెల్మెట్ ధరించని వారిపై 14,663.. ఓవర్ స్పీడ్‌పై 4262, డ్రంకెన్ డ్రైవ్‌పై 4741 కేసులను నమోదు చేశారు. పీడీ యాక్ట్‌ల నమోదు జిల్లాలో తీరుమారని 16 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌లను నమోదు చేశారు. మరో తొమ్మిది మందిపై త్వరలోనే అమలు చేయనున్నారు. గంజాయి కేసుల్లో పట్టుబడిన 17 మందిపై నమోదుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పోక్సో, హత్య తదితర కేసుల్లో 25 మందికి జైలు శిక్షలు పడ్డాయి. వార్షిక నేర నివేదిక విడుదల 2025కు సంబంధించిన వార్షిక నేర నివేదికను నగరంలోని ఉమేష్‌చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో ఎస్పీ అజిత వేజెండ్ల బుధవారం విడుదల చేశారు. గతేడాది 4381 కేసులు నమోదు కాగా, ఈ సంవత్సరం 4712 రికార్డయ్యాయని వివరించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు 4521 అర్జీలు రాగా, వాటిలో 4396ను పరిష్కరించామని చెప్పారు. 1140 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించామన్నారు. 2026లో మెరు గైన శాంతిభద్రతలను అందిస్తామని తెలిపారు. జిల్లా ప్రజలు, పోలీస్ అఽధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేశారు. జిల్లాలో ఉత్త మ ప్రతిభ కనబర్చిచిన పోలీసులకు రివార్డులను అందజేశారు. ఏఎస్పీ సౌజన్య తదితరులు పాల్గొన్నారు.వార్షిక నివేదికను వెల్లడిస్తున్న ఎస్పీ అజిత గతేడాదితో పోలిస్తే 7.55 మేర అదనం పంజా విసిరిన సైబర్ నేరగాళ్లు 16 మంది రౌడీషీటర్లపై పీడీ యాక్ట్‌లు -
జిల్లా అభివృద్ధే ప్రధాన లక్ష్యం
● కలెక్టర్ హిమాన్షు శుక్లా నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా అభివృద్ధే లక్ష్యంగా కీలక రంగాల్లో సమగ్ర చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ హిమాన్షు శుక్లా పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో జేసీ వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయకుమార్‌తో కలిసి బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో చాంపియన్ ఫార్మర్ అనే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చామని చెప్పారు. వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తల సలహాలు, సూచనలను రైతులు తెలుసుకునేలా చర్యలను చేపట్టడంతో పాటు వాట్సాప్ నంబర్లను సైతం అందుబాటులో ఉంచామని వెల్లడించారు. ఫిర్యాదుల పరిష్కారంలో ఏడో స్థానంలో.. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా అర్జీల క్లియరెన్స్‌లో రాష్ట్రంలో జిల్లా ఏడో స్థానంలో ఉందని చెప్పారు. వచ్చే నెల నుంచి గ్రామాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నామని వెల్లడించారు. దగదర్తి వద్ద ఏర్పాటు చేయనున్న గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయానికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. ఇండోసోల్ పరిశ్రమ స్థాపనకు 1200 ఎకరాలను సేకరించామని పేర్కొన్నారు. బీపీసీఎల్ సంస్థ ఏర్పాటుకు గానూ ఆరు వేల ఎకరాలను సేకరించగా, ఇందులో మూడు వేలు కందుకూరుకు సంబంధించినవన్నారు. మరో మూడు వేలు కావలి డివిజన్లోని రెండు గ్రామాల్లో ఉన్నాయని తెలిపారు. మార్చి నాటికి వీటిని సంస్థకు అప్పగించనున్నామని ప్రకటించారు. ఉగాది నాటికి అందరికీ ఇల్లులందేలా కృషి చేయనున్నామని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లా అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేసి డైరీలను అందజేశారు. -
అధికారుల తీరుతో గౌరవం లభించడంలేదు
● పలు అంశాలను ప్రస్తావించిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి, కార్పొరేటర్లు ● కౌన్సిల్ సర్వసభ్య సమావేశంలో ఆల్ పాస్నెల్లూరు(బారకాసు): డివిజన్లలో జరిగే అభివృద్ధి పనుల విషయంలో తమకెలాంటి సమాచారం లేకుండా కార్పొరేషన్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజల్లో గౌరవం లేకుండాపోతోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్పొరేటర్లు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలోని అబ్దుల్ కలామ్ సమావేశ మందిరంలో ఇన్చార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ అధ్యక్షతన కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం నిర్వహించారు. ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన పది మంది.. టీడీపీకి చెందిన 40 మంది కార్పొరేటర్లు హాజరయ్యారు. 118 మెయిన్.. 53 సప్లిమెంటరీ.. టేబుల్ అజెండాలుగా 16.. ఇలా మొత్తం 187 తీర్మానాలను కౌన్సిల్ ఆమోదించింది. లేఖలు రాసినా స్పందనేదీ..? గత మేయర్ స్రవంతి హయాంలో సమావేశాలను పక్కాగా నిర్వహించారని, రానున్న రోజుల్లోనూ ఇదే తరహాలో జరగాలని ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి కాంక్షించారు. కమిషనర్‌తో పాటు ఇతర అధికారులకు ఫోన్ చేసినా, స్పందించడంలేదని ఈ విషయమై అధిక శాతం మంది కార్పొరేటర్లు అసంతృప్తిగా ఉన్నారని చెప్పారు. వీఆర్ మున్సిపల్ హైస్కూల్‌కు సంబంధించిన విషయాలను తెలియజేయాలని కమిషనర్‌కు పలుమార్లు లేఖలు రాసినా స్పందన లేదన్నారు. 43వ డివిజన్‌కు సంబంధించిన ఓటరు జాబితాను కోరినా, సమాధానం లేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రొటోకాల్‌ను ఎందుకు పాటించడంలేదని ప్రశ్నించారు. ఆక్రమణకు గురైన 12 కాలువలను వెడల్పు చేసేందుకు గానూ అడ్డంకిగా ఉన్న 2500 ఇళ్లను తొలగించాలనే నిర్ణయంపై బాధితుల్లో ఆందోళన నెలకొందన్నారు. వీఆర్ హైస్కూల్లో అడ్మిషన్లెలా జరుగుతున్నాయనే విషయాలను ఇన్చార్జి మేయర్ ద్వారా అధికారులు తెలియజేయాలని కోరారు. గ్రాంట్‌ను ఎందుకు తీసుకురాలేకపోయారు..? భూగర్భ డ్రైనేజీ పనులు ఎప్పటికి పూర్తవుతాయని 21వ డివిజన్ కార్పొరేటర్ మొయిళ్ల గౌరి ప్రశ్నించారు. తాగునీటి కుళాయి కనెక్షన్లను ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. వీటికి హడ్కో నుంచి రూ.993 కోట్ల రుణాన్ని పొందారని, దీనికి గానూ అసలు.. వడ్డీకి కలిపి కార్పొరేషన్ ఏటా రూ.150 కోట్లను చెల్లించాల్సి ఉందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఉండి కూడా గ్రాంట్‌ను ఎందుకు తీసుకురాలేకపోయారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తీరును తప్పుబడితే నేరమా..? గతంలో సమ్మె చేపట్టిన సమయంలో పారిశుధ్య కార్మికులకు జీతాలను ఇప్పిస్తామని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి హామీ ఇచ్చారని, అయితే సమస్య నేటికీ పరిష్కారం కాలేదని గౌరి తెలియజేశారు. దీంతో కొందరు టీడీపీ కార్పొరేటర్లు లేచి శాసనసభ్యుడ్ని తప్పుబడతారానంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇన్చార్జి మేయర్ కలగజేసుకున్నారు. కార్పొరేటర్లు ఊటుకూరు నాగార్జున, వేలూరి ఉమామహేష్, సత్తార్, కామాక్షి, డిప్యూటీ మేయర్ తహసీన్, కో ఆప్షన్ సభ్యులు జమీర్, వహీదా, కమిషనర్ నందన్ తదితరులు పాల్గొన్నారు. -
రైతులను అడ్డుపెట్టుకొని దోచుకోవడం దుర్మార్గం
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి వెంకటాచలం: రైతులను అడ్డుపెట్టుకొని ఇరిగేషన్ పనుల్లో సోమిరెడ్డి దోచుకోవడం దుర్మార్గమని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. మండలంలోని ఇస్కపాళెంలో బుధవారం పర్యటించిన ఆయన మాట్లాడారు. టీడీపీ పాలనలో అవినీతి తప్ప, అభివృద్ధి కానరావడంలేదని విమర్శించారు. సర్వేపల్లి నియోజకవర్గంలో దోపిడీ సర్వసాధారణమైపోయిందని ఆరోపించారు. టీడీపీ ఎమ్మెల్యేలకు ప్రజాబలం లేకపోవడంతో పోలీసులపై ఆధారపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఇరిగేషన్ పనుల్లో రైతులను అడ్డుపెట్టుకొని దోపిడీకి పాల్పడటంతో వారు ఛీ కొడుతున్నారని చెప్పారు. ఇందులో ఇప్పటికే రూ.100 కోట్ల దోపిడీకి పాల్పడి, తాజాగా మోంథా తుఫాన్ పేరిట మరో రూ.19.70 కోట్లను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వ, ప్రజల ఆస్తులతో పాటు రైల్వే శాఖకు చెందిన ఆస్తులకూ రక్షణ లేకపోవడం ఒక్క సర్వేపల్లి నియోజకవర్గంలోనే జరుగుతోందని చెప్పారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో విక్రయించడాన్ని రైతులు గమనిస్తున్నారని చెప్పారు. కాకుటూరు శివాలయ భూములను సైతం విక్రయించడాన్ని భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారని, భవిష్యత్తులో తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా ఎక్కడా లేని విధంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వం మారిన వెంటనే ఇక్కడ జరిగిన అవినీతిపై విచారణ.. ఎలాంటి చర్యలు తీసుకుంటామో ప్రజలే చూస్తారని స్పష్టం చేశారు. -
గృహ నిర్మాణాల పూర్తికి ప్రత్యేక కార్యాచరణ
● ఆ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్‌బాబు నెల్లూరు(దర్గామిట్ట): పేదల గృహ నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రత్యేక కార్యాచరణతో పనిచేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ పి.అరుణ్‌బాబు ఆదేశించారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో కలెక్టర్ హిమాన్షు శుక్లాతో కలిసి జిల్లాలో గృహ నిర్మాణాల పురోగతిపై ఆయన అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆప్షన్ – 3 కింద నిర్మించిన ఇళ్లల్లో నాణ్యతగా లేనివాటిని గుర్తించి లోటుపాట్లను వెంటనే సరిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. జిల్లాలో సుమారు 6,899 ఇళ్లల్లో శ్లాబులు, గోడ నిర్మాణాలు, బేస్మెంట్లు నాణ్యతా ప్రమాణాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారన్నారు. యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి లబ్ధిదారులకు అందించాలన్నారు. జిల్లాకు కేటాయించిన 27,820 ఇళ్ల నిర్మాణాల వేగం పెంచాలన్నారు. నూతనంగా పీఎంఏవై 2.0లో మంజూరైన ఇళ్లను మొదలు పెట్టించాలన్నారు. పోటీతత్వంతో పనిచేయండి కలెక్టర్ మాట్లాడుతూ ఉగాదిలోగా జిల్లాకు కేటాయించిన ఇళ్లను పూర్తి చేసేందుకు అధికారులందరూ ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. పోటీతత్వంతో గృహ నిర్మాణ శాఖ అధికారులు పనిచేయాలన్నారు. సమావేశంలో ఆ శాఖ అధికారులు మోహన్‌రావు, మాధవరావు, ఏఈలు, డిజిటల్ అసిస్టెంట్లు, వివిధ ఏజెన్సీల కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. -
వైద్య ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి
● హంస అసోసియేషన్ నాయకులు నెల్లూరు(అర్బన్): జిల్లా వైద్యారోగ్య శాఖలో దీర్ఘకాలంగా ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ హంస అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చేజర్ల సుధాకర్‌రావు, కమల్ కిరణ్ డిమాండ్ చేశారు. మంగళవారం నెల్లూరులోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో డీఎంహెచ్ఓ సుజాతకు నాయకులు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేసి సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా సుధాకర్‌రావు మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాలను పూర్తి చేయాలన్నారు. ఉద్యోగుల మెడికల్ బిల్లులు, ఇంక్రిమెంట్లు, ఇతర ఆర్థిక పరమైన బిల్లులు జాప్యం కాకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని కోరారు. డీఎంహెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టిన సంవత్సరం కాలంలోనే అడ్మినిస్ట్రేషన్‌ను చక్కదిద్ది జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు రాష్ట్ర స్థాయిలో ముందుండేలా చేసినందుకు అభినందనలు తెలిపారు. అసోసియేషన్‌కు చెందిన నూతన సంవత్సరం క్యాలెండర్‌ను సుజాత ఆవిష్కరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ పబ్లిసిటీ సెక్రటరీ మజార్, జిల్లా ఉపాధ్యక్షులు మురళీకృష్ణ, నాగరాజు, సిటీ అధ్యక్ష, కార్యదర్శులు గౌస్‌బాషా, మంజరి, బుచ్చి తాలుకా సెక్రటరీ మాధవ, ఉపాధ్యక్షుడు ఉదయకిరణ్, ఇందుకూరుపేట తాలూకా అధ్యక్షురాలు అరుణరాణి పాల్గొన్నారు. -
విద్యార్థులకు సర్టిఫికెట్ల పంపిణీ
నెల్లూరు(టౌన్): అల్లూరు మండలం గొల్లపాళెంలోని చైల్డ్ ఆశ్రమ స్కూల్లో జిల్లాలోని 46 పీఎంశ్రీ పాఠశాలల్లో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ఇస్తున్న శిక్షణ మంగళవారంతో ముగిసింది. శిక్షణ ఇచ్చేందుకు గ్రాంట్స్‌ను విడుదల చేశారు. గైడ్స్‌కు యూనిఫాం అందజేశారు. శిక్షణ తీసుకున్న వారికి సమగ్రశిక్ష ఏపీసీ వెంకటసుబ్బయ్య, ఏఎల్ఎస్ కో ఆర్డినేటర్ రమేష్ చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఏఎంఓ సుధీర్‌బాబు, ట్రెజరర్ మురళీధర్, ఎంఈఓ మురళీధర్, ట్రైనర్ కమల్ కన్నన్, ఆశ్రమ నిర్వాహకులు రామచంద్రశరత్, విజయప్రదీప్, ప్రభాకర్, శాంసన్, తదితరులు పాల్గొన్నారు. ఆటో డ్రైవర్ మృతదేహం లభ్యం● అనుమానాస్పద మృతిగా కేసు నమోదు సంగం: నాలుగు రోజుల క్రితం అదృశ్యమైన తురకా పవన్ (34) మృతదేహాన్ని మర్రిపాడు వద్ద కాలువలో మంగళవారం గుర్తించారు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. సంగం ప్రాంతానికి చెందిన పవన్ ఆటో నడుపుతుంటాడు. అతడికి భార్య లక్ష్మి, కుమార్తె, కుమారులున్నారు. కుటుంబంలో ఏం జరిగింది ఏమో గానీ ఈనెల 26వ తేదీన పవన్ ఇంటి నుంచి అదృశ్యమైనట్లు భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. శనివారం రాత్రి ఉడ్‌హౌస్‌పేట సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువలో ఆటో లభ్యమైంది. అప్పట్నుంచి అతని కోసం గాలిస్తున్నారు. బెజవాడ పాపిరెడ్డి కాలువలో మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. సంగం సీఐ శ్రీనివాసులురెడ్డి, ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధిత కుటుంబాన్ని విషయం చెప్పారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. పవన్ ఆత్మహత్య చేసుకున్నాడా? లేదా ఎవరైనా హత్య చేసి కాలువలో పడేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పోలేరమ్మ ఆలయంలో చోరీ కలువాయి(సైదాపురం): కలువాయి ఎస్సీ కాలనీలోని పోలేరమ్మ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గుడి నిర్వహణ చేసేందుకు పోలయ్య మంగళవారం ఉదయం వెళ్లగా తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు సీసీ కెమెరాల వైర్‌ను కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. అమ్మవారి మెడలోని 8 గ్రాములు బంగారు తాళిబొట్టు, కాసులు, హుండీలోని సుమారు రూ.20 వేలు నగదు ఎత్తుకెళ్లినట్లు పోలయ్య తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించారు. విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.చికిత్స పొందుతూ వృద్ధుడి మృతినెల్లూరు(క్రైమ్): ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ వృద్ధుడు మంగళవారం మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. సంతపేట మాగుంట నగర్లో షేక్ మీరా మొహిద్దీన్ (54) నివాసముంటున్నాడు. ఆయన భార్య చనిపోవడంతో ఓ మహిళతో సహజీవనం చేస్తున్నాడు. నాలుగేళ్లుగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఎంతకీ ఆరోగ్యం కుదుట పడకపోవడంతో మనస్తాపానికి గురైన మొహిద్దీన్ ఈనెల 26వ తేదీన ఇంట్లో ఫినాయిల్ తాగాడు. ఈ విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జీజీహెచ్‌లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి అన్న షేక్ అబ్దుల్ ఖాదర్ సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించి ఎస్సై సుల్తాన్‌బాషా కేసు దర్యాప్తు చేస్తున్నారు.రెండు నుంచి కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలునెల్లూరు(దర్గామిట్ట): రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని ప్రతి మండలంలోని గ్రామాల్లో కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలను సంబంధిత ప్రజాప్రతినిధుల సమక్షంలో జనవరి రెండు నుంచి తొమ్మిది వరకు పంపిణీ చేయనున్నామని కలెక్టర్ హిమాన్లు శుక్లా మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలాల వారీగా షెడ్యూల్‌ను ఖరారు చేశామన్నారు. కండలేరులో నీటి నిల్వ రాపూరు: కండలేరు జలాశయంలో మంగళవారం నాటికి 60.880 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు జలాశయం ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
టౌన్ బస్సుల ఇష్టారాజ్యం
● నిబంధనలు పాటించని యాజమాన్యాలు ● ఒక రూట్‌కు పర్మిట్.. తిరిగేది మరో రూట్లో.. ● నిత్యం ట్రాఫిక్‌కు ఆటంకం ● బస్సులను శుభకార్యాలకు పంపిస్తున్న వైనం ● కండీషన్ కూడా అంతంతమాత్రమే ● పట్టించుకోని పోలీస్, రవాణా అధికారులునెల్లూరు నగరంలో టౌన్ బస్సుల నిర్వాహకులు నిబంధనలు పాటించడం లేదు. ఎప్పుడు పడితే అప్పుడు.. ఎక్కడికి పడితే అక్కడికి ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకుని భారీ శబ్దం చేసే హారన్లతో మితిమీరిన వేగంతో దూసుకెళ్తూ నగర ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. చర్యలు తీసుకోవాల్సిన పోలీసు, రవాణా అధికారులు మామూళ్లు తీసుకుని పట్టించుకోవడం లేదని విమర్శలు వెలువెత్తుతున్నాయి.నెల్లూరు(టౌన్): నగరపాలక సంస్థ పరిధిలో 90 రూట్ పర్మిట్లలో 90 బస్సులు తిరగాల్సి ఉంది. 60 మాత్రమే తిరుగుతున్నాయి. ఈ రంగంలోకి కొత్తవారు వస్తే పోటీతత్వం ఎక్కువగా ఉంటుంది. అయితే ఇతరులు రాకుండా గతంలో పర్మిట్ తీసుకున్న వారే కొత్తగా రూటు పర్మిట్లు తీసుకుంటున్నారని తెలిసింది. టౌన్ బస్సులను తిప్పుకొనేందుకు రవాణా అధికారులు రూట్ మ్యాప్, సమయాన్ని కేటాయిస్తారు. పర్మిట్ తీసుకున్న రూట్లో నిర్దేశించిన సమయానికి బస్సును తిప్పాలి. వీటి కాలపరిమితి ఐదేళ్లపాటు ఉంటుంది. డ్రైవర్‌తోపాటు కండక్టర్‌కు లైసెన్స్ తప్పనిసరి. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించకూడదు. వాహనం కండీషన్లో ఉంచాలి. హెవీ హారన్లు, ఎల్ఈడీ బల్బులను ఉపయోగించకూడదు. ప్రతి ఏడాది ఫిట్నెస్ సర్టిఫికెట్‌ను పొందాలి. అగ్నిమాపక పరికరాలు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను తప్పనిసరిగా బస్సులో ఉంచాలి.అనుమతించిన రూట్లోనే తిప్పాలి. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు తిప్పకూడదు. మూణ్ణాళ్ల ముచ్చటగా జీపీఎస్ టౌన్ బస్సుల నిర్వాహకుల ఆగడాలపై రవాణా శాఖతోపాటు కలెక్టర్‌కు సైతం అనేక ఫిర్యాదులందాయి. ఈ ఏడాది ప్రారంభంలో రవాణా అధికారులు టౌన్ బస్సులకు జీపీఎస్‌ను అమర్చారు. రవాణా కార్యాలయంలో మానిటర్‌ను పెట్టారు. బస్సులు అనుమతించిన రూట్, నిర్దేశించిన సమయంలో తిప్పుతున్నారా.. లేదా.. అని పర్యవేక్షించారు. ఆ తర్వాత ఏమైందో గానీ జీపీఎస్‌ను యజమానులు తొలగించారు. అధికారులు అడగకపోవడంతో ఇష్టారాజ్యంగా మారింది. పర్మిట్ రూట్లో కాకుండా ఎవరికి నచ్చిన రూట్లో వారు నడుపుతున్నారు. పెళ్లిళ్లు, ఫంక్షన్ల సీజన్లలో బస్సులను కాంట్రాక్ట్ పద్ధతిన తిప్పుతున్నారు. డ్రైవర్లు, కండక్టర్లకు లైసెన్స్ లేకుండా తిప్పుతున్నా అడిగే వారు లేకపోవడంతో వారి ఆగడాలు మితిమీరిపోయాయి. స్టాప్‌లో కాకుండా ఎక్కడపడితే అక్కడ నిలుపుతూ ట్రాఫిక్‌కు నిరంతరం అంతరాయం కలిగిస్తున్నారు. పోలీసులు సైతం టౌన్ బస్సుల నిర్వాహకుల దగ్గర నెలవారీ మామూళ్లు పుచ్చుకుని మిన్నకుంటున్నారనే విమర్శలున్నాయి. పేరుకే రవాణా స్క్వాడ్ పర్మిట్లు ఇచ్చిన రూటులో కాకుండా వేరే రూట్లో తిరిగితే రూ.10 వేలు జరిమానా విధించవచ్చు. పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కిస్తే అదనంగా ఉన్న ప్రతి ఒక్కరికి రూ.300 అపరాధ రుసుం వేయొచ్చు. కానీ రవాణా అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ శాఖలో ప్రత్యేకంగా ముగ్గురు అధికారులతో స్క్వాడ్ విభాగం ఉంది. వీరు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి నిబంధనలు అతిక్రమించే వాహనాలపై కేసులు నమోదు చేయాలి. నగర ప్రజల నుంచి టౌన్ బస్సులపై పదుల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా ఆ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టిన సందర్భాల్లేవు. వీరు జాతీయ రహదారిపై తనిఖీలకే మొగ్గు చూపుతున్నారు. అక్కడైతే నిబంధనలు అతిక్రమించే వాహనదారుల నుంచి కొంత మొత్తాన్ని తీసుకుని వదిలివేయొచ్చు. అదే నెల్లూరు నగరంలో అయితే తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలి. అందువల్లే టౌన్ బస్సులు నిబంధనలు అతిక్రమిస్తున్నా కన్నెత్తి చూడటం లేదని ఆరోపణలున్నాయి. ఇప్పటికై నా తనిఖీలు నిర్వహించి టౌన్ బస్సుల ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికలు ఏకగ్రీవం
● జిల్లా అధ్యక్షుడిగా బండారుపల్లి వెంకటేశ్వర్లు నెల్లూరు(అర్బన్): ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ నెల్లూరు జిల్లా ఎన్నికలు మంగళవారం నెల్లూరులోని ఎన్జీఓ భవన్లో కోలాహలంగా జరిగాయి. ఈ ప్రక్రియ ఆ అసోసియేషన్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాఘవులు పర్యవేక్షణలో జరిగింది. ఉదయం 10 గంటల నుంచి నామినేషన్లు స్వీకరించారు. అయితే జిల్లాలో ఉన్న 17 పదవులకు గానూ 17 మంది మాత్రమే నామినేషన్లు వేశారు. పోటీ లేకపోవడంతో ఎన్నికలు ఏకగ్రీవమైనట్టు రాఘవులు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా బండారుపల్లి వెంకటేశ్వర్లు, సహాధ్యక్షుడిగా ఆంజనేయవర్మ, ఉపాధ్యక్షులుగా రాజేంద్రప్రసాద్, కిరణ్‌కుమార్, సతీష్‌బాబు, జనార్దన్‌రావు, మల్లికార్జునరావు, మహిళా ఉపాధ్యక్షురాలిగా కరుణమ్మ, జిల్లా కార్యదర్శిగా గాదిరాజు రామకృష్ణ, కార్యనిర్వహణ కార్యదర్శిగా లక్కాకుల పెంచలయ్య, సంయుక్త కార్యదర్శిగా రవికుమార్, గిరిధర్, వీరబ్రహ్మేశ్వరరావు, సురేష్, రాజేంద్ర, మహిళా సంయుక్త కార్యదర్శిగా రమ్య, కోశాధికారిగా వీఎంవీ ప్రసాద్‌రెడ్డి నియమితులయ్యారు. వీరితో ఎన్నికల అధికారి ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో సహాయ ఎన్నికల అధికారి, ఎన్జీఓ అసోసియేషన్ చిత్తూరు జిల్లా కార్యదర్శి కె.రమేష్, పర్యవేక్షుడు జగదీష్ పాల్గొన్నారు. -
పోలీస్‌స్టేషన్‌లో ఎస్పీ తనిఖీలు
నెల్లూరు(క్రైమ్): వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అజిత మంగళవారం నగరంలోని చిన్నబజారు, నవాబుపేట పోలీసుస్టేషన్లను తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల పరిష్కారం, నేర నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. నేరాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరించాలన్నారు. సాంకేతికత ఆధారంగా సైబర్ నేరాలను ఛేదించడంతోపాటు ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో చిన్నబజారు, నవాబుపేట ఇన్స్పెక్టర్లు చిట్టెం కోటేశ్వరరావు, జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. -
‘రంగడి’ భక్తకోటికి కష్టాలు
నెల్లూరు(బృందావనం): నగరంలోని రంగనాయకులపేటలో శ్రీదేవి, భూదేవి సమేత రంగనాథస్వామిని ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) నాడు దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు నానా అవస్థలు పడ్డారు. మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ఇచ్చిన సిఫార్సు లేఖలతో కూటమి చోటా నేతలు హల్చల్ చేశారు. రూ.50, రూ.200 టికెట్లు కొనుగోలు చేసిన వారికి చుక్కలు చూపించారు. తామ అనుయాయులు, లేఖలు ఉన్నవారిని తూర్పురాజగోపురం వద్ద ఉన్న ప్రధాన ద్వారం నుంచి దర్జాగా పంపించాలంటూ పోలీసు యంత్రాంగంపై తీవ్రమైన ఒత్తిడితెచ్చారు. టికెట్లు కొనుగోలు చేసి వస్తున్న భక్తులకు దర్శనం ఆలస్యం అవుతుండటంతో పరిస్థితిని బేరీజు వేసిన పోలీసులు వారిని నిలువరింపజేశారు. అయితే ససేమిరా అంటూ అధికార అహంకారాన్ని ప్రదర్శించారు. దీంతో పోలీసులు, సిఫార్సు లేఖలతో వచ్చిన వారి మధ్య తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు తోపులాటలు చోటుచేసుకున్నాయి. సమాచారం అందుకున్న నెల్లూరు ఆర్డీఓ ఆలయానికి చేరుకుని పరిస్థితిని నియంత్రించేందుకు కృషి చేశారు. బాధ్యత ప్రైవేట్ వ్యక్తికి.. లేఖలతో వచ్చిన పంపేందుకు దేవస్థానంలో దుస్తుల కాంట్రాక్టర్ ఒకరికి బాధ్యతలను అప్పగించారు. అతని మాటే శాసనంగా చెల్లుబాటైంది. లేఖలు అందుకుని వారి పేర్లు పరిశీలిస్తూ 5 నుంచి 10 మంది వరకు దర్జాగా సాగనంపారు. ఈ పరిస్థితిని చూస్తున్న దేవదాయ, ధర్మదాయ శాఖ సిబ్బందితోపాటు పోలీసు అధికారులు సైతం ఆ వ్యక్తిని అడ్డుకునేందుకు సాహసించలేదు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో పాసులు, లేఖల విషయం ప్రస్తావించలేదు. టికెట్లు కొనుగోలు చేసి రంగడిని దర్శించుకోవాలన్నారు. ఇది నిజమని నమ్మిన భక్తులు మోసపోయారు. ఏర్పాట్లు చేయడంలో విఫలం వేలాదిమంది భక్తులు తరలివస్తారన్న విషయం తెలిసినా అధికారులు ఏర్పాట్లు చేయడంలో విఫలమయ్యారన్న ఆరోపణలున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వగృహానికి కూతవేటు దూరంలో ఉన్న దేవస్థానం వద్ద, అలాగే పొంగూరు నారాయణ ప్రాతినిధ్యం వహించే నెల్లూరు నగరంలో భక్తులకు ఈ పరిస్థితి ఎదురుకావడం అసహనంతోపాటు ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అలాగే వలంటీర్లను తగిన సంఖ్యలో ఏర్పాటు చేయకపోవడం, బయట వ్యక్తులకు పెత్తనం ఇవ్వడంతో దేవదాయ శాఖ సిబ్బంది ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. కట్టె పొంగలి ప్రసాదంతో సరి మున్నెన్నడూలేని విధంగా ఈ ఏడాది భక్తులకు కట్టె పొంగలి ప్రసాదంతో సరిపెట్టారు. 25 ఏళ్లుగా ముక్కోటి నాడు ఇటువంటి ప్రసాదం పంపిణీ కాలేదంటూ భక్తులు చెబుతున్నారు. గతంలో భక్తమండళ్ల సేవా నిరతిని గుర్తుచేసుకుని కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహఃగా ఉన్నారు. భక్తబృందాలను ఆ శాఖ అధికారి ఒకరు అడ్డుకున్నట్లు ఆరోపణలున్నాయి. అ అధికారి మాటలను ప్రభుత్వ పెద్దలు శిరసావహించారని విమర్శలున్నాయి.సిఫార్సు లేఖలతో వచ్చిన భక్తులు ప్రధాన ద్వారం వద్ద లేఖలు తీసుకుంటూ.. మంత్రి, ఎమ్మెల్యే, నుడా చైర్మన్ సిఫార్సు లేఖలకు పెద్దపీట కూటమి నేతల హల్చల్ పోలీస్‌లు, భక్తుల మధ్య తోపులాటలు విఫలమైన దేవదాయ శాఖ అధికారులు -
రైతులకు యాజమాన్యాలు అండగా ఉండాలి
● మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలి ● ఉద్యోగాలు, పనుల్లో స్థానికులకే ప్రాధాన్యం ● ‘ఇథనాల్’ ప్రజాభిప్రాయ సేకరణలో కలెక్టర్ కొడవలూరు: ఇఫ్కో కిసాన్ సెజ్‌లో పరిశ్రమలను ఏర్పాటు చేసే యాజమాన్యాలు భూములిచ్చిన రైతులకు అండగా ఉండాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆదేశించారు. మండలంలోని రాచర్లపాడులో గల ఇఫ్కో కిసాన్ సెజ్‌లో ఏర్పాటు చేయనున్న రాంషీ బయో, గాయత్రి బయో ఇథనాల్ ఫ్యాక్టరీలకు సంబంధించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణకు ముఖ్యఅతిథిగా మంగళవారం హాజరైన ఆయన మాట్లాడారు. 2776 ఎకరాలను 30 ఏళ్ల క్రితమే రైతులిచ్చారని, అప్పట్నుంచి అందులో పరిశ్రమలు, ఉద్యోగాలొస్తాయని ఎదురుచూస్తూనే ఉన్నారని చెప్పారు. ఉద్యోగాలకు కొందరికి వయోపరిమితి దాటిపోయిందని తెలిపారు. ఫ్యాక్టరీలను ఏర్పాటు చేసే వారు భూములిచ్చిన రైతుల పిల్లలకు ఉద్యోగాలను తప్పక ఇవ్వాలని చెప్పారు. నిర్మాణ పనుల్లోనూ ఈ కుటుంబాలకే అఽధిక ప్రాధాన్యనివ్వాలని కోరారు. ధాన్యం ఆధారిత పరిశ్రమలైన తరుణంలో కర్షకుల వద్ద ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు తగ్గకుండా కొనుగోలు చేయాలని ఆదేశించారు. నూకలు సైతం ఉపయోగపడనున్న తరుణంలో, నాణ్యత తగ్గిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఒకవేళ మాట తప్పితే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హామీ ఇచ్చారు. సీఎస్సార్ నిధులతో భూములిచ్చిన గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తే మూతే ఇథనాల్ ఫ్యాక్టరీల నుంచి కాలుష్యం రాకుండా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని యాజమా న్యాలు చెప్తున్నాయని తెలిపారు. నీటిని వృథా చేయకుండా రీసైక్లింగ్ చేస్తామని స్పష్టంగా హామీ ఇస్తున్నాయని చెప్పారు. వీటిని ఉల్లంఘించి కాలుష్యానికి కారణమైతే రైతుల అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకొని ఫ్యాక్టరీలను నిలిపేసే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలి ఈఈ కిశోర్‌కుమార్, సెజ్ సీఈఓ సుధాకర్, ఆర్డీఓ వంశీకృష్ణ, తహసీల్దార్లు స్ఫూర్తిరెడ్డి, లక్ష్మీనారాయణ, కృష్ణ, ఎంపీడీఓ వెంకటసుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎం నేతల నిరసన
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాచర్లపాడులో నిర్వహించిన గ్రామసభలో పాల్గొనకుండా సీపీఎం నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని అపోలో ఆస్పత్రి సెంటర్ వద్ద రాస్తారోకోను పార్టీ రూరల్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టారు. ఈ సందర్భంగా నేతలు ప్రసాద్, పెంచలనరస య్య మాట్లాడారు. ఇఫ్కో పరిశ్రమను ఏర్పాటు చేస్తామంటూ సేకరించిన భూముల్లో ఇథనాల్ ఫ్యాక్టరీలను ఏ ర్పాటు చేయడాన్ని ప్రజలు, రైతులు, వామపక్ష పార్టీ లు, ప్రజాసంఘాలు వ్యతిరేకిస్తున్నాయని చెప్పారు. ఇందులో పాల్గొనకుండా తమ పార్టీ నేతలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. పరిశ్రమల ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సతీష్, పెంచలయ్య, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
లాహిరి.. లాహిరి.. లాహిరిలో
● నేత్రపర్వంగా మూలస్థానేశ్వరుని తెప్పోత్సవం నెల్లూరు(బృందావనం): ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నగరంలోని భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి, గణపతి, గంగామాతకు తెప్పో త్సవాన్ని మూలాపేటలోని పుష్కరిణిలో మంగళవారం రాత్రి నిర్వహించారు. తొలుత దేవస్థానం నుంచి విశేషాలంకారంలో కొలువై పుష్కరిణి వద్దకు వేదమంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, బాణసంచా వెలుగుల నడుమ తరలివచ్చారు. ఈఓ అర్వభూమి వెంకటశ్రీనివాసులురెడ్డి పర్యవేక్షించారు. -
విలువలకు పాతరేసి అడ్డగోలు రాజకీయాలా..?
● మంత్రి నారాయణ తీరు విచారకరం ● ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి ‘ఎన్’ టీమ్‌కే లబ్ధి ● ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరు రూరల్: తానో అధ్యాపకుడిననే అంశాన్ని విస్మరిస్తూ.. అడ్డగోలు రాజకీయాలను మంత్రి నారాయణ సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడారు. నగరంలో సామాన్యులకు రక్షణ కరువైందని, ఎప్పుడెలాంటి దాడి జరుగుతుందోననే ఆందోళనతో జీవనం సాగిస్తున్నారని చెప్పారు. 2021లో నిర్వహించిన కార్పొరేషన్ ఎన్నికల్లో నెల్లూరులో 54 డివిజన్లకు గానూ అన్నింటినీ తమ పార్టీ క్లీన్ స్వీప్ చేసిందని, అయితే ప్రలోభాలకు గురిచేసి టీడీపీలో చేర్చుకోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలు నచ్చక ఐదుగురు కార్పొరేటర్లు.. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి సమక్షంలో తిరిగి పార్టీలో చేరగా, వారిపై అక్రమ కేసులు నమోదు చేసి బెదిరించారని ఆరోపించారు. ఆరో డివిజన్ కార్పొరేటర్ కుమారుడు మద్దినేని శ్రీధర్‌ను విజయవాడలో కిడ్నాప్ చేయించి.. కావలి, తిరుపతిలో తిప్పి అక్రమ కేసును నమోదు చేశారని ధ్వజమెత్తారు. వీటిని పునఃపరిశీలించాలని ఎస్పీని కోరారు. మంత్రి నారాయణ ఇలాంటి దుర్మార్గాలు చేస్తూ సామాన్యుల గొంతు కోస్తున్నారని మండిపడ్డారు. తాను చెప్పేవన్నీ వాస్తవాలేనని, అబద్ధమైతే కేసును నమోదు చేయొచ్చన్నారు. 13వ డివిజన్లో పేద దళిత మహిళకు సంబంధించిన బాత్రూమ్ను కమిషనర్ దుర్మార్గంగా కూల్చేశారని, నారాయణకు ఓటేయలేదనే కారణంతో ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. తమ పార్టీ 15వ డివిజన్ నేత బాలకృష్ణారెడ్డికి చెందిన రూ.రెండు కోట్ల విలువజేసే ఇంటిని జేసీబీతో పడగొట్టారని, 51వ డివిజన్ నేత శౌరి దుకాణాలను నిలువునా కూల్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకపక్షంగా అడ్మిషన్లు వీఆర్ మున్సిపల్ స్కూల్లో అడ్మిషన్లను ఏకపక్షంగా జరిపారని, ఎన్ టీమ్‌కు సంబంధించిన వారి పిల్లలకే ప్రవేశాలను కల్పించారని మండిపడ్డారు. 1046 అడ్మిషన్లన్నీ వీరి సిఫార్సు ద్వారా ఇచ్చినవేననే అంశాన్ని తమ పార్టీ ఇప్పటికే బయటపెట్టిందని వివరించారు. బయటి వారు దరఖాస్తు చేసుకున్నా, అడ్మిషన్లను ఇవ్వలేదని ఆరోపించారు. జాఫర్‌సాహెబ్ కాలువ వద్ద దుకాణాల ఏర్పాటుతో కాలుష్యం ఏర్పడి పూడిపోయే ప్రమాదం ఉందంటూ ఎన్జీటీని తమ పార్టీ ఆశ్రయించిందని, అయితే ఆ ఆదేశాలను సైతం లెక్కచేయలేదని విమర్శించారు. దుకాణ సముదాయంలో బయటి వారు, అక్కడ ఇళ్లు కోల్పోయిన 200 మంది దరఖాస్తు చేసుకుంటే, వారికి కాకుండా ఎన్ టీమ్‌కే కేటాయించారని మండిపడ్డారు. పారదర్శకత లేకుండా తన వద్ద ఉన్న వారికే లబ్ధి చేకూర్చేలా మంత్రి వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. పేదలంటే అంత చులకనా..? బఫర్ జోన్ అంటూ నెల్లూరులో కాలువల పక్కన ఉన్న నివాసాలను తొలగించేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. 2500 ఓట్లు పోతాయి.. తనకు లెక్కే కాదు.. కూల్చేయండంటూ మాట్లాడటం పేదలపై ఆయనకు ఉన్న వైఖరిని తెలియజేస్తోందన్నారు. రైల్వేస్టేషన్ నుంచి ఏసీ సుబ్బారెడ్డి విగ్రహం వరకు కాలువల పక్కన దుకాణాలను ఏర్పాటు చేసి తన టీమ్‌కు ఇచ్చేందుకు ఆయన రంగం సిద్ధం చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన వెంటనే డ్వాక్రా సంఘాల్లో పనిచేస్తున్న కొందరు మహిళలను ఉద్యోగాల నుంచి తొలగించి తనకు అనుకూలమైన వారికి ఆయన కట్టబెట్టారని చెప్పారు. అక్రమ కేసులు బనాయిస్తాం.. రౌడీషీటర్లను రోడ్లపై వదులుతామంటే చూస్తూ ఊరుకునేదిలేదని స్పష్టం చేశారు. -
తైక్వాండో పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
కందుకూరు రూరల్: విజయవాడలోని మేరీస్ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఈనెల 27 నుంచి 29వ తేదీ వరకు నిర్వహించిన 40వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో కందుకూరుకు చెందిన క్రీడాకారులు ప్రతిభ చాటారు. 10 రాష్ట్రాలకు చెందిన వారు పాల్గొనగా ఓవరాల్ చాంపియన్‌గా ఆంధ్రప్రదేశ్, రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ నిలిచాయి. ఈ పోటీల్లో కందుకూరు నుంచి ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొనగా వారిలో ఐదుగురికి బంగారు పతకాలు, ఇద్దరికి రజతం, ఒకరికి కాంస్య పతకం దక్కాయని తైక్వాండో కోచ్ ఎండీ హఫీజ్ తెలిపారు. బంగారు పతకాలను ఎ.జగన్ అభిషేక్, షేక్ సమద్, ఎ.మౌనిక, డి.రామ్‌చరణ్ తేజ్, సూర్యతేజ్, రజత పతకాలను బి.మణిదీప్, రామ్శ్రీతేజ్, కాంస్య పతకాన్ని బి.నేహాల్ సాధించారని కోచ్ వివరించారు. ప్రతిభ చాటిన క్రీడాకారులను తైక్వాండో అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.రమణయ్య, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, డాక్టర్ ఎండీ జహంగీర్, పట్టణ ప్రముఖులు పిడికిటి వెంకటేశ్వర్లు, కోచ్ ఎండీ హఫీజ్ సోమవారం అభినందించారు. -
ఫిర్యాదుల వెల్లువ
నెల్లూరు(క్రైమ్): నెల్లూరులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి 111 మంది విచ్చేసి తమ సమస్యలను ఎస్పీ అజిత దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలను విన్న ఆమె ఆయా ప్రాంత పోలీసు అధికారులతో మాట్లాడారు. చట్ట పరిధిలో ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఏఎస్పీ సీహెచ్ సౌజన్య, ఆత్మకూరు డీఎస్పీ వేణుగోపాల్, లీగల్ అడ్వైజర్ శ్రీనివాసులురెడ్డి, పీసీఆర్, మహిళా స్టేషన్ ఇన్స్పెక్టర్లు భక్తవత్సలరెడ్డి, టీవీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. వినతులిలా.. ● ఆన్లైన్లో ట్రేడింగ్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని కావలికి చెందిన నవీన్ నమ్మించి రూ.7 లక్షలు తీసుకుని మోసగించాడు. నగదు అడిగితే చంపుతామని బెదిరిస్తున్నాడని కావలికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. ● వ్యాపారి రూ.65 లక్షల ధాన్యాన్ని నా వద్ద కొనుగోలు చేశాడు. పలువురు రైతుల వద్ద సుమారు రూ.కోటి విలువైన ధాన్యాన్ని కొనుగోలు చేసి ఎవరికీ నగదు ఇవ్వకుండా ఎటో వెళ్లిపోయాడు. ఆచూకీ కనుక్కొని న్యాయం చేయాలని కోవూరుకు చెందిన ఓ రైతు కోరాడు. ● కృష్ణవేణి అనే మహిళ నా కుటుంబ విషయంలో జోక్యం చేసుకుని ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ నన్ను, నా భర్తను చంపుతామని బెదిరిస్తోంది. ఆమె బారి నుంచి రక్షణ కల్పించాలని నవాబుపేటకు చెందిన ఓ మహిళ వినతిపత్రమిచ్చారు. ● మాకు ఇద్దరు కుమారులు. వృద్ధాప్యంలో ఉన్న మమ్మల్ని పట్టించుకోకుండా ఇబ్బందులు పెడుతున్నారని సంగంకు చెందిన దంపతులు ఫిర్యాదు చేశారు. ● నా కుమారుడు కనిపించడంలేదు. నెల్లూరు రూరల్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. కుమారుడి ఆచూకీ కనుక్కోవాలని నెల్లూరు రూరల్ మండలానికి చెందిన ఓ మహిళ కోరారు. ● నా భర్త, అత్తమామలు మానసికంగా వేధిస్తున్నారు. అనారోగ్యంతో ఉన్న నా ఇద్దరు పిల్లలను సైతం ఇబ్బంది పెడుతున్నారు. కౌన్సెలింగ్ నిర్వహించి కాపురాన్ని చక్కదిద్దాలని జలదంకి ప్రాంతానికి చెందిన ఓ మహిళ అర్జీ ఇచ్చారు. -
ఆడుకుంటూ అనంతలోకాలకు..
● బంతి కోసం వెళ్లిన బాలుడు ● టిప్పర్ చక్రాల కింద నలిగిన ప్రాణం సైదాపురం: ఆడుకుంటూ బంతి కోసం రోడ్డు దాటుతున్న బాలుడు టిప్పర్ చక్రాల కింద నలిగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ విషాదకర ఘటన సైదాపురంలో సోమవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తిరుపతి జిల్లా దొరవారిసత్రానికి చెందిన పన్నీరస ఆదినారాయణ, సుష్మ దంపతులకు దక్షేష్ (5) అనే కుమారుడు ఉన్నాడు. బాలుడు సైదాపురంలో ఎస్టీ కాలనీలో కాపురం ఉంటున్న తన అమ్మమ్మ కర్రెద్దుల పద్మమ్మ వద్ద ఉంటున్నాడు. సోమవారం ఉదయం దక్షేష్ బ్యాట్, బాల్‌తో ఆడుకుంటున్నాడు. బంతి రోడ్డుపైకి వెళ్లగా దాని కోసం బాలుడు వెళ్లాడు. రాపూరు మండలంలోని పులిగిలపాడులోని పీఎల్ఆర్ రోడ్డు మెటల్ క్రషర్ నుంచి టిప్పర్ కంకరతో గూడూరుకు వెళ్తోంది. బాలుడిని తప్పించే క్రమంలో అంగడిని ఢీకొట్టింది. కానీ ఏం జరిగిందో గానీ దక్షేష్ వెనుక చక్రాల కింద పడి నలిగిపోయాడు. అమ్మమ్మ గుర్తించి వెంటనే స్థానికుల సాయంతో గూడూరు ఆస్పత్రికి తరలించింది. అక్కడ చికిత్స పొందుతూ దక్షేష్ మృతిచెందాడు. బాలుడి మృతితో ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా రోదిస్తోంది. ఘటనా స్థలంలో బ్యాట్, చెప్పులను రక్తపుమడుగులో చూసి స్థానికులు కంటతడి పెట్టారు. కాగా టిప్పర్ ఢీకొన్న సమయంలో అంగట్లో ఎవరూ లేకపోవడంతో మరో ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేశారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని బాధిత కుటుంబం కోరుతోంది. రాపూరు నుంచి నిత్యం అధిక టన్నేజీతో టిప్పర్లు వేగంగా వెళ్లడంపై విచారణ చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
కుటుంబ కలహాలతో..
● వివాహిత బలవన్మరణం ఆత్మకూరు: కుటుంబ కలహాలతో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆత్మకూరు మండలం అప్పారావుపాళెం తూర్పు ఎస్సీ కాలనీలో సోమవారం జరిగింది. ఎస్సై ఎస్కే జిలానీ కథనం మేరకు.. కాలనీకి చెందిన రాఘవేంద్ర, పెంచలమ్మ (30) దంపతులకు పిల్లల్లేరు. పెయింట్ పనులు చేసే రాఘవేంద్ర మద్యానికి బానిసయ్యాడు. దీంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. సోమవారం మధ్యాహ్నం చిన్న గొడవ అనంతరం ఇంట్లో ఎవరూలేని సమయంలో పెంచలమ్మ ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కొద్దిసేపటి అనంతరం బంధువులు పరిశీలించి మృతిచెందినట్లు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న ఎస్సై ఎస్కే జిలానీ గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేశారు.న్యాయశాఖ ఉద్యోగుల సంఘం క్యాలెండర్ ఆవిష్కరణనెల్లూరు(లీగల్): న్యాయశాఖ ఉద్యోగుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్‌ను జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీనివాస్ సోమవారం నెల్లూరులోని తన చాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొహిబిషన్ పూర్తయిన న్యాయశాఖ ఉద్యోగులకు జనవరి నెలలో పదోన్నతులు కల్పిస్తామన్నారు. ఈ షెడ్యూల్ పూర్తయిన తర్వాత హైకోర్టు ఉత్తర్వులు ప్రకారం నూతన ఉద్యోగ నియామకాలు చేపడతామని తెలిపారు. ఉద్యోగులు కష్టపడి పనిచేసి న్యాయశాఖకు గుర్తింపు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కోర్టు పరిపాలన అధికారిణి నాగరాణి, ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పీవీ నారాయణరెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు వి.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు సీహెచ్ పోలయ్య, సీహెచ్ వెంకటేశ్వర్లు, శివప్రసాద్బాబు, నాయకులు సురేంద్రబాబు, దినేష్‌కుమార్, అయితా మల్లికార్జునరావు, ఎల్.దర్గా, కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్యనెల్లూరు(క్రైమ్): ఏం కష్టమొచ్చిందో తెలియదు గానీ గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సౌత్ రైల్వేస్టేషన్లో నెల్లూరు వైపు వచ్చే పట్టాలపై సోమవారం చోటుచేసుకుంది. మృతుడి వయసు 63 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. పసుపు రంగు టీ షర్టుపై పాచిరంగు స్వెట్టర్ ధరించి ఉన్నాడు. సమాచారం అందుకున్న నెల్లూరు రైల్వే ఎస్సై ఎన్.హరిచందన ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదు. మృతదేహం గుర్తుపట్టలేని విధంగా తయారైంది. జీజీహెచ్ మార్చురీకి తరలించి ఎస్సై కేసు దర్యాప్తు చేస్తున్నారు. కండలేరులో 60.840 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో సోమవారం నాటికి 60.840 టీఎంసీ నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల వంతున నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
నిధుల స్వాహా.. అడిగేదెవరు?
నెల్లూరు(పొగతోట): జిల్లా వ్యాప్తంగా మహిళలకు సంబంధించి రుణాల మంజూరు, రికవరీ నిధులు స్వాహా చేయడం పరిపాటిగా మారింది. దొరికితే దొంగలు దొరక్కపోతే దొరలు అనేలా ఈ తంతు సాగుతోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో మహిళల ఆర్థికాభివృద్ధి పేరుతో ప్రతి సంవత్సరం రూ.వందల కోట్ల బ్యాంక్ లింకేజ్, సీ్త్రనిధి రుణాలు మంజూరు చేస్తున్నారు. మంజూరు, రికవరీల విషయంలో గోల్మాల్ జరుగుతుందనే విమర్శలున్నాయి. బ్యాంకు లింకేజ్, సీ్త్రనిధి రుణాల మంజూరుకు 5 నుంచి 10 శాతం కమీషన్లు తీసుకుంటున్నారని ఆరోపణలున్నాయి. ఇది చాలదన్నట్లు మహిళలు తిరిగి చెల్లిస్తున్న నగదు బ్యాంక్‌లకు జమ చేయకుండా దిగమింగుతున్నారు. అందువల్లే.. గ్రామ సంఘ బంధానికి ఒక బ్యాంక్ అకౌంట్ ఉండాలి. విడ్డూరంగా 4, 5 బ్యాంకు అకౌంట్లు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో నిధుల స్వాహా చేయడం సులభతరమవుతోంది. గ్రామ, మండల సమాఖ్యల అభివృద్ధి, ఇతర కార్యక్రమాల అమలుకు విడుదల చేస్తున్న నిధులు కూడా జేబుల్లో వేసుకుంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు అవసరాల నిమిత్తం సీసీలు, ఏపీఎంలు, అకౌంటెంట్లు అడిగినంత ఇచ్చి రుణాలు పొందుతున్నారు. దీనికి బ్యాంక్ అధికారుల సహాయ సహాకారాలు, ఉండడంతో అధికారులు ఆడింది ఆట.. పాడిందే పాటగా ఉంది. రూ.750 కోట్ల మంజూరు జిల్లాలో 37,905 స్వయం సహాయక గ్రూపులున్నాయి. సుమారు 4 లక్షల మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.1,336 కోట్ల లింకేజ్ రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటి వరకు రూ.750 కోట్లను మంజూరు చేశారు. సీ్త్రనిధి రుణాలు రూ.300 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం. మహిళలకు శిక్షణ పేరుతో ప్రతి సంవత్సరం రూ.లక్షలు విడుదలవుతున్నాయి. ఈ మొత్తాన్ని పంచుకున్నట్లు ఆరోపణలున్నాయి. గతంలో జిల్లా సమాఖ్య సభ్యులు ఖాళీ చెక్‌లపై సంతకాలు చేయించుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. ఎక్కడ ఎంతంటే? రాపూరు మండలంలో ఎస్టీల అభివృద్ధి పేరుతో భారీ స్థాయిలో నిధులు స్వాహా చేశారు. ఈ మధ్య రూ.1.20 కోట్లు గోల్మాల్ జరిగిందని సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని డీఆర్డీఏ అధికారులు తెలిపారు. అయితే రికవరీల పేరుతో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యల్లేవు. ఈ విషయంపై గోప్యంగా విచారణ జరుగుతోంది. ఇద్దరు ఏపీఎంలు, ఆరుగురు సీసీల ప్రమేయం ఉందని సమాచారం. వలేటివారిపాళెం మండలంలో రూ.18.72 లక్షలకు సంబంధించి అక్రమాలు జరిగాయి. అయితే పూర్తి స్థాయిలో విచారణ జరపలేదు. కేవలం అకౌంటెంట్‌ను మాత్రమే బాధ్యుడిని చేశారు. ఎస్ఆర్పురంలో ఏపీఎంపై నామమాత్రపు చర్యలు తీసుకున్నారు. వింజమూరు మండలంలో మహిళా మార్టు పేరుతో నిధులు తిన్నారని ఆరోపణలొచ్చాయి. అధికారులు విచారించి అలా జరగలేదని, గుర్తించిన ఏజెన్సీల నుంచి కాకుండా ఇతర ఏజెన్సీల్లో వస్తువులు కొనుగోలు చేశారని తేల్చారు. దానికి సంబంధించి ఏపీఎంపై చర్యలు తీసుకున్నారు. ఏఎస్‌పేటలో రూ.1.20 లక్షలు, మర్రిపాడులో రూ.1.50 లక్షలకు అక్రమాలు జరిగాయి. తూతూమంత్రంగా విచారించి సీసీలపై చర్యలు తీసుకున్నారు. గతంలో వివిధ మండలాల్లో పనిచేసిన సీపీ రూ.లక్షలు స్వాహా చేశారు. దీనిపై స్పందన లేదు. జిల్లాలో ఎస్టీలు అధికంగా ఉన్నారు. వారి పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసి రూ.లక్షలు జేబుల్లో వేసుకుంటున్నారు. ప్రస్తుతం గ్రూపుల సభ్యులు ఎక్కడ ఉన్నారో ఎవరికీ తెలియదు. రాపూరులో రూ.1.20 కోట్లు, వలేటివారిపాళెంలో రూ.18.72 లక్షలు ఏఎస్‌పేట, మర్రిపాడు, వింజమూరు తదితర మండలాల్లోనూ.. ఏపీఎంలు, సీసీలు, అకౌంటెంట్ల కీలకపాత్ర రుణాలు కావాలంటే కమీషన్లు ఇవ్వాల్సిందే రికవరీలు చేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థిక ప్రగతి సాధించేలా చర్యలు తీసుకుంటున్నాం. రుణాలు మంజూరు చేయించి జీవనోపాధులు కల్పిస్తున్నాం. నిధులు స్వాహా చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నాం. కేసులు నమోదు చేయడం, విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నాం. రాపూరు మండలంలో జరిగిన అవినీతిపై నిధులు రికవరీ చేసేలా చర్యలు తీసుకున్నాం. – నాగరాజకుమారి, డీఆర్డీఏ పీడీ -
వినతులిచ్చి.. గోడు వినిపించి..
● కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా నలుమూలల ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేసి అధికారులకు సమస్యలు చెప్పుకొన్నారు. సోమవారం నెల్లూరు కలెక్టరేట్లో ని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కా రం వేదిక కార్యక్రమం జరిగింది. దీనికి జేసీ వెంకటేశ్వర్లు, ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. క్వారీ బ్లాస్టింగ్‌తో ఇక్కట్లు బుచ్చిరెడ్డిపాళెం మండలం రామచంద్రాపురం సమీపంలోని కంకర క్వారీ వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు వినతిపత్రం సమర్పించారు. వారు మాట్లాడుతూ క్వారీలో అధిక సైజులో బ్లాస్టింగ్ చేయడంతో కాలుష్యం పెరిగిపోతుందన్నారు. సమీపంలో బాలికల గురుకుల పాఠశాల ఉందని, క్వారీ అనుమతులు రద్దు చేయాలని తెలిపారు. వినతిపత్రం సమర్పించిన వారిలో బి.మల్లికార్జున, పి.సుమన్, రవి, గోపీ, కాలేషా ఉన్నారు. -
వినియోగదారులకు అవగాహన కల్పించాలి
నెల్లూరు రూరల్: వర్షాలు, వాతావరణ మార్పులతో అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లో నీరు పెట్రోల్‌తో కలిసింది. దీంతో అందులోని ఇథనాల్ వేరు పడి తెలుపు రంగుగా మారుతోంది. దానిని వాహనంలో నింపిన తర్వాత అవి మరమ్మతులకు గురవుతున్నాయి. దీనిపై వినియోగదారులకు అవగాహన కల్పించాలి’ అని జిల్లా పెట్రోల్ బంక్ యూనియన్ అధ్యక్షుడు అల్లారెడ్డి ప్రసాద్‌రెడ్డి తెలిపారు. సోమవారం నెల్లూరులోని ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అండర్ గ్రౌండ్ పైపులైన్ జాయింట్ల ద్వారా కూడా పెట్రోల్, డీజిల్ ట్యాంక్‌ల్లో నీరు చేరడాన్ని కొన్నిచోట్ల గుర్తించామన్నారు. ఇలా జరగకుండా యజమానులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మార్పులతో వచ్చిన సమస్యలపై అవగాహన కోసం ఆయిల్ కంపెనీలు, ప్రభుత్వం పోస్టర్లు, హోర్డింగులను ప్రతి బంక్‌లో ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో యూనియన్ జనరల్ సెక్రటరీ పి.రవికుమార్, రాజశేఖరరెడ్డి, పీటీ జగన్నాథం, పి.జితేంద్రబాబు, కె.సుమన్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాలోనే కొనసాగించాలంటూ..
సైదాపురం, రాపూరు, కలువాయి, గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని పీడీఎస్‌యూ నాయకులు అన్నారు. ఈ మేరకు వీఆర్సీ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. నిరసన తెలిపారు. వారు మాట్లాడుతూ రాపూరు మండలంలో కండలేరు జలాశయం ఉందని, దీని కింద వేలాది మంది రైతులు భూములు సాగు చేసుకుంటున్నారన్నారు. సైదాపురం మండలంలో మైకాలో వేలమంది కార్మికులు పనిచేస్తున్నారన్నారు. సైదాపురం నుంచి నెల్లూరుకు 50 కిలోమీటర్లు మాత్రమే ఉందని, తిరుపతికి వెళ్లాలంటే 130 కిలోమీటర్లు దూరంతో ఇబ్బందులు పడుతారన్నారు. గూడూరులోని విద్యార్థులు యూనివర్సిటీకి వెళ్లాలంటే చాలా దూరం అవుతుందన్నారు. -
ప్రజలు నివ్వెరపోయేలా నారాయణ సంభాషణ
● ఎమ్మెల్సీ చంద్రశేఖర్‌రెడ్డి నెల్లూరు రూరల్: నెల్లూరులో శాంతిభద్రతలు క్షీణించేలా.. ప్రజాస్వామ్య విలువలను కాలరాసేలా మంత్రి నారాయణ మాట్లాడిన ఆడియో సంభాషణను విని ప్రజలందరూ నివ్వెరపోయారని వైఎస్సార్సీపీ నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మాట్లాడారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై ఉన్న రౌడీషీట్లను తొలగించి వారిని రోడ్డుపైకి వదిలిపెడతామని చెప్పడం చూసి జిల్లా ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు. నేడు నెల్లూరులో హత్యలు, పీకలు కోయడం, తలలు పగలగొట్టడం నిత్యకృత్యమయ్యాయని చెప్పారు. విచ్చలవిడిగా దొరుకుతున్న గంజాయి, 24 గంటలు లభ్యమవుతున్న మద్యం కారణంగా రౌడీలకు అడ్డాగా మారితే మంత్రికి కనీసం చీమ కుట్టినట్టుగా కూడా లేదన్నారు. టీడీపీలో చేరితే మీపై ఉన్న రౌడీషీట్లు ఎత్తివేస్తామని, కేసులను తొలగిస్తామని, మీ నాయకులు రౌడీషీటర్లను పిలిపించుకుని మాట్లాడుతుంటే ఇంతటి దౌర్భాగ్య పరిస్థితి ఎక్కడైనా చూసి ఉంటామా ఒకసారి ఆలోచించాలన్నారు. జిల్లాలో హత్యలు, రౌడీయిజం పెరిగినట్లు సాక్షాత్తు సీఎం చంద్రబాబు చెప్పారని.. ఇవన్నీ గుర్తుంచుకుని లా అండ్ ఆర్డర్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేయాలన్నారు. కఠినమైన నిర్ణయాలు తీసుకోకపోతే నెల్లూరు మరింత దారుణమైన పరిస్థితిలోకి వెళ్లిపోయే ప్రమాదం ఉందని తెలియజేశారు. -
అడ్వెంచర్ శిక్షణకు నెల్లూరు విద్యార్థులు
నెల్లూరు (టౌన్): రాష్ట్ర స్థాయి అడ్వెంచర్ శిక్షణకు జిల్లాకు చెందిన ముగ్గురు విద్యార్థులు ఎంపికయ్యారు. మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ ఫర్ చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ కార్యక్రమానికి సంబంధించి ఒంగోలులోని ఏబీఎం కాంపౌండ్‌లో జోనల్ స్థాయి అడ్వెంచర్ స్పోర్ట్స్ సెలక్షన్‌ను సోమవారం నిర్వహించారు. అందులో ప్రతిభకనబర్చిన 9 మంది విద్యార్థులను గండిపేటలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి శిక్షణకు ఎంపిక చేశారు. వీరిలో నెల్లూరు జిల్లా షేక్ అప్సర్(తిమ్మారెడ్డిపల్లి జెడ్పీహెచ్ఎస్), గుణ్ణం ప్రతీక్( అన్నారెడ్డిపాళెం జెడ్పీ హెచ్ఎస్), ఎస్ నాగిరెడ్డి (చేజర్ల జెడ్పీహెచ్ఎస్) ఉన్నారు. వీరిని డీఈఓ బాలాజీరావు, ఏపీసీ వెంకటసుబ్బయ్య అభినందించారు. విమానాశ్రయ భూసేకరణ నివేదికకు కేబినెట్ ఆమోదం నెల్లూరు (దర్గామిట్ట): దగదర్తి విమానాశ్రయానికి సంబంధించి భూసేకరణ సమగ్ర నివేదికను కలెక్టర్ హిమాన్షు శుక్లా సోమ వారం రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. ప్రభుత్వ పరంగా చేపట్టిన కార్యాచరణ, భూసేకరణ పురోగతి నివేదికను కేబినెట్ ఆమోదించింది. దగదర్తి విమానాశ్రయం ఏర్పాటుతో జిల్లా పారిశ్రామికంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందుతుందని, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు పెరిగి జిల్లా సర్వతోముఖాభివృద్ధి చెందుతుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కౌన్సిల్ సర్వసభ్య సమావేశం రేపు నెల్లూరు(బారకాసు): నగర పాలక సంస్థ కార్యాలయంలోని ఏపీజే అబ్దుల్ కలాం సమావేశ మందిరంలో కౌన్సిల్ సర్వసభ్య సమావేశాన్ని బుధవారం ఉదయం 10.30 గంటలకు నిర్వహించనున్నారు. ఇన్చార్జి మేయర్ రూప్‌కుమార్‌యాదవ్ అధ్యక్షతన జరిగే కౌన్సిల్ సమావేశంలో 118 అంశాలతో కూడిన అజెండాతో పాటు 53 సప్లిమెంటరీ అంశాలను పొందుపరిచిన మరో అజెండాను ప్రవేశ పెట్టనున్నారు. టేబుల్ అజెండాను కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ముఫ్తీ అబ్దుల్ వహాబ్సాహెబ్ మరణం తీరని లోటు నెల్లూరు(బృందావనం): నెల్లూరు మదరసా జామి యా నూరుల్ హుదా అరబిక్ కళాశాల వ్యవస్థాపక అధ్యాపకుడు జిల్లాలో తొలి ముఫ్తీగా గుర్తింపు పొందిన మత పెద్ద హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహబ్ సాహెబ్ ఖాసిమీ రషాది మరణం సమాజానికి తీరనిలోటని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్‌బాషా, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజం, నెల్లూరు మాజీ డిప్యూటీ మేయర్ ఖలీల్‌అహ్మద్ పేర్కొన్నారు. నగరంలోని మూలాపేటలోని మదరసా జామియా నూర్ ఉల్ హుదాలో సోమవారం నిర్వహించిన జనాజా నమాజ్, అంత్యక్రియల్లో వారు పాల్గొన్నారు. అబ్దుల్ వహాబ్ సాహెబ్ ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అల్లాను ప్రార్ధించారు. కాగా అంత్యక్రియల్లో ముస్లింలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలి
● కలెక్టరేట్ ఎదుట పలు పార్టీల నిరసన నెల్లూరు(దర్గామిట్ట): కొడవలూరు మండలం రాచ ర్లపాడులో ఇఫ్కో కిసాన్ సెజ్‌లో నిర్మించనున్న ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా వివిధ పార్టీల నేతలు నెల్లూరులోని కలెక్టరేట్ ఎదుట సోమవారం నిరసన తెలిపారు. కాలుష్యకారక పరిశ్రమ నిర్మాణాన్ని నిలిపివేయాలని జేసీ వెంకటేశ్వర్లుకు వినతిపత్రా లు అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి మాట్లాడుతూ కిసాన్ సెజ్‌లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ పరిశ్రమ ఏర్పాటుతో పర్యావరణం దెబ్బతింటుందన్నారు. వివిధ జబ్బులు వస్తాయన్నారు. పలు రాష్ట్రాల్లో వద్దని వెనక్కు పంపించిన పరిశ్రమను పంటలు పండే భూమిలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. కిసాన్ సెజ్‌లో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను మాత్రమే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. ప్రజలకు వాస్తవాలు వివరిస్తున్న తరుణంలో వామపక్ష నాయకుల కదలికలను పరిశీలిస్తూ అరెస్టు చేసేందుకు పోలీసులు కుట్రలు పన్నడం తగదన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ పరిశ్రమల స్థాపనకు వామపక్ష పార్టీలు వ్యతిరేకం కాదన్నారు. జనావాసాల మధ్యన కాలుష్య కారక పరిశ్రమలను ఏర్పాటు చేయడం సరికాదన్నారు. మంగళవారం రాచర్లపాడులో జరిగే ప్రజాభిప్రాయ సేకరణలో అన్ని వామపక్ష పార్టీలు పాల్గొని నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించనున్నాయని తెలిపారు. పోలీసులు ఎన్ని కేసులు బనాయించినా భయపడే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కాలుష్యకారక ఇథనాల్ పరిశ్రమకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలు తమ గళాన్ని వినిపించాలని పిలుపునిచ్చారు. సీపీఐ ఎంఎల్ నాయకులు సాగర్, రాంబాబు, కాంగ్రెస్ పార్టీ నేత సుధీర్, సంజయ్‌కుమార్ తమ పార్టీల తరఫున వినతిపత్రాలు అందజేశారు. వామపక్ష నేతలు నందిపోగు రమణయ్య, సిరాజ్, జిలానీఖాన్, లీలామోహన్, అహ్మద్, మోహన్‌రావు, మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నోటీసులు ఇవ్వడం దారుణం నెల్లూరు(దర్గామిట్ట): కొడవలూరు మండలం రాచర్లపాడు కిసాన్ సెజ్‌లో ఇథనాల్ పరిశ్రమ ఏర్పా టుపై మంగళవారం నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయసేకరణకు హాజరుకాకూడదంటూ ఆర్ శ్రీనివాసులతో పాటు 25 మందికి నోటీసులు ఇవ్వడం దారుణమని పలువురు ప్రముఖులు, వైద్యులు ఖండించారు. సోమవారం వారు జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటులో ఎలాంటి ఇబ్బంది లేకుంటే ప్రజాభిప్రాయసేకరణకు హాజరుకావద్దని ఎందుకు నోటీసులు జారీ చేశారని ప్రశ్నించారు. పర్యావరణ పరిరక్షణలో పౌరులందరికీ భాగస్వామ్యం ఉందని, ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకాకుండా పోలీసులు తీసుకుంటున్న చర్యలు చట్ట విరుద్ధమన్నారు. గతంలో నాలుగు వేల మంది ప్రజలు సమావేశమై ఇథనాల్ పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకత చూపారని, దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. డాక్టర్లు కే బాబురావు, కే వెంకటరెడ్డి, డీ రాంబాబు, అహ్మద్‌ఖాన్, పీజీరావు, ఎం బాపూజీ పాల్గొన్నారు. -
వైఎస్ జగన్ హయాంలోనే అభివృద్ధి
● మాజీ మంత్రి కాకాణి ముత్తుకూరు(పొదలకూరు) : గత వైఎస్ జగన్‌హన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలోనే రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని, కూటమి ప్రభుత్వంలో అవినీతి పెచ్చురిల్లినట్టుగా మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కృష్ణపట్నం, బ్రహ్మదేవం గ్రామాల్లో సోమవారం ఆయన పర్యటించారు. బ్రహ్మదేవంలో కన్నయ్య, సుబ్బమ్మ కు టుంబాలు, కృష్ణపట్నంలో అంకయ్యను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ప్రభుత్వంలో ఏటా సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేసి క్రమం తప్పకుండా పథకాలను ప్రజలకు అందించామని గుర్తుచేశారు. మత్స్యకారేతర ప్యాకేజీ పంపిణీ, ఫిషింగ్ జెట్టీ నిర్మాణ పనులను ప్రారంభించామని వెల్లడించారు. 18 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం చెప్పుకునే పని ఒక్కటైనా చేసిందా అని ప్రశ్నించారు. సోమిరెడ్డి అవినీతి, దోపిడీతో కాలం వెళ్లబుచ్చుతున్నాడని పేర్కొన్నారు. మోంథా తుపానుతో దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మతుల కోసం 316 పనులకు రూ.19.70 కోట్లు మంజూరు చేయించుకుని పనులు చేపట్టకుండా దోచుకునేందుకు పెద్ద స్కెచ్ వేశారని ఆరోపించారు. పర్సెంటేజీలు ఇవ్వలేదని సిద్ధేశ్వరాలయం పనులను నిలిపివేయించాడని, అవినీతి సంపాదనే ధ్యేయంగా ఆయన ముందుకు వెళుతున్నాడని విమర్శించారు. పోలీసులు వైఎస్సార్సీపీ శ్రేణులపై కేసులు నమోదు చేస్తూ పక్షపాత వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నారు. అక్రమ కేసులకు భయపడాల్సిన పని లేదని, పార్టీ అండగా ఉంటుందని కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. -
అధికారం చేతిలో రాజ్యాంగం చిత్తు కాగితమైంది. రాజ్యాంగం కల్పించిన హక్కులను అధికార పార్టీ నేతలు కాలరాస్తూ ఎస్టీ మహిళ పీఠంపై బీసీ నేతకు పట్టం కట్టబెట్టారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక ఎస్టీ మహిళను మేయర్ పీఠంపై కూర్చొబెడితే.. టీడీపీ పాలకులు జీర్ణించుకోలేక ఆమె
నెల్లూరు (బారకాసు): నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక ఇక లేనట్టే. మేయర్ పీఠం వ్యవహారంలో అధికార పార్టీ నేతలు ‘రాజ్యాంగాన్ని’ తమకు అనుకూలంగా మలుచుకున్నారు. ఒక ఎస్టీ మహిళను మేయర్ పీఠంపై నుంచి దించేసేందుకు ‘తూట్లు పొడిస్తే’.. బీసీ నేతను ఇన్చార్జి మేయర్ పదవిలో కూర్చొబెట్టేందుకు ‘పట్టం’ కట్టారు. ఈ పీఠంపై కూర్చొనే అర్హత ఉన్న మరో ఎస్టీ మహిళ ఉన్నప్పటికీ.. అవకాశం కల్పించకుండా కాలయాపన చేయడం, ఇన్చార్జి మేయర్ తాత్కాలికమే అంటూనే.. ఆ పదవిలో కూర్చొన్న వెంటనే రూప్‌కుమార్ నెల్లూరు రూరల్, సిటీ నియోజకవర్గాల్లోని ముఖ్య నేతలను కలిసి బొకేలు అందజేసి కృతజ్ఞతలు తెలపడం, నెల్లూరు కార్పొరేషన్‌ను రాష్ట్రంలోనే మోడల్‌గా తీర్చిదిద్దుతానంటూ చెప్పడం చూస్తే.. ఇక మేయర్ ఎన్నిక ‘కలే’ అని రూఢీ అవుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తే పదవీ కాలం పూర్తయ్యే వరకు ఆయన్నే కొనసాగించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాజీనామా వరకు వికృత రాజకీయాలు నెల్లూరు మేయర్ పీఠం విషయంలో గిరిజన మహిళకు టీడీపీ అన్యాయం చేసింది. ఆ పార్టీ బీసీ నేత డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌యాదవ్‌ను ఈ పీఠంపై కూర్చొబెట్టేందుకు అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇందులో నెగ్గేందుకు సామదాన దండోపాయాలు ప్రదర్శించారు. అధికారాన్ని ఉపయోగించి పోలీసులతో స్రవంతి, ఆమె అనుచరులను భయాందోళనకు గురిచేశారు. దీంతో చివరికి వేధింపులు తట్టుకోలేక మేయర్ స్రవంతి తనకు తానే రాజీనామా చేసేవరకు వికృత రాజకీయాలు కొనసాగించారు. అవిశ్వాసం నెగ్గితే.. వెంటనే ఎన్నిక జరిపి అర్హత ఉన్న మరో మహిళకు అవకాశం కల్పిస్తామంటూ కార్పొరేటర్లను భ్రమింపజేశారు. డిప్యూటీ మేయర్ తాత్కాలికంగా ఇన్చార్జి మేయర్‌గానే ఉంటారంటూ నమ్మించారు. తాజాగా ఆ ప్రక్రియ ము గిశాక.. ఎన్నిక నిర్వహించకుండా ఎస్టీ రిజర్వుడు స్థానమైన మేయర్ పీఠంపై రూప్‌కుమార్‌యాదవ్‌ను ఇన్చార్జి మేయర్‌గా కొనసాగిస్తున్నారు. విశాఖలో అలా.. నెల్లూరులో ఇలా.. విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ అక్కడి మేయర్‌పై ఈ ఏడాది ఏప్రిల్ 19న నెల్లూరు తరహాలోనే అవిశ్వాసానికి తెర తీశారు. అయితే అవిశ్వాసం నెగ్గడంతో అదే నెల 28న మేయర్ ఎన్నిక నిర్వహించి కొత్త మేయర్‌ను ఎన్నుకున్నారు. అయితే నెల్లూరు విషయంలో మాత్రం అందుకు భిన్నంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. కేవలం 11 నెలలే పదవీ కాలం ఉన్నా ఈ పీఠాన్ని తమ సొంతం చేసుకునేందుకు అధికార పార్టీ నేతలు పావులు కదిపారు. ఈ క్రమంలో అప్పటి మేయర్ స్రవంతిపై ఈ నెల 18న అవిశ్వాసానికి సిద్ధపడ్డారు. తొలుత రూప్‌కుమార్‌యాదవ్ పదవీ కాలం పూర్తయ్యే వరకు ఇన్చార్జి మేయర్‌గా కొనసాగుతారనే ప్రచారం తెరపైకి వచ్చింది. అయితే వాస్తవానికి రూప్‌కుమార్‌ను ఆ పీఠంపై కూర్చొబెట్టడం మెజార్టీ కార్పొరేటర్లకు ఇష్టం లేదు. అవిశ్వాసానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తారనే సమాచారం ఉండడంతో పాటు కొందరు కార్పొరేటర్లు తిరిగి సొంత గూటికి చేరడంతో అప్రమత్తమైన అధికార పార్టీ నేతలు అస్త్రశస్త్రాలు సంధించారు. ఈ క్రమంలో అప్పటి మేయర్ స్రవంతి అవిశ్వాసానికి నాలుగు రోజుల ముందు 14వ తేదీనే రాజీనామా ప్రకటన చేయడంతో పరిణామాలు కొత్త మలుపు తిరిగింది. ఆగమేఘాల మీద రాజీనామాను ఆమోదించడం, ఆ వెంటనే రూప్‌కుమార్‌ను ఇన్చార్జి మేయర్‌గా నియమించడం జరిగిపోయాయి. అయితే విశాఖపట్నం కార్పొరేషన్ మేయర్ విషయంలో కేవలం పది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలా చర్యలు తీసుకున్న పాలకులు.. నెల్లూరు విషయంలో రెండు వారాలు గడిచినా.. ఇంత వరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు మేయర్ ఎన్నిక ప్రక్రియకు చర్యలు తీసుకోవాలని కనీసం ప్రతిపాదనలు కూడా పంపకపోవడం విశేషం. కాలయాపన వెనుక కుతంత్రం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం సాధారణ ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్నిక ప్రక్రియ చేపట్టే అవకాశం లేదు. అదే విధంగా ఏ ప్రజాప్రతినిధి రాజీనామా చేసినా.. కాలం చేసినా.. ఆ స్థానంలో ఆరు నెలల్లో తిరిగి కొత్త ప్రజాప్రతినిధిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అయితే నెల్లూరు కార్పొరేషన్లో ప్రస్తుత కౌన్సిల్ పదవీ కాలం 11 నెలలే ఉంది. నోటిఫికేషన్ జారీ చేయించకుండా.. మరికొంత కాలం కాలయాపన చేస్తే.. కొత్త మేయర్ ఎన్నిక ప్రక్రియ జరిగే అవకాశం ఉండడని, చివరి పూర్తి కాలం రూప్‌కుమార్ ఇన్చార్జి మేయర్‌గా కొనసాగుతారని రాజకీయ కుతంత్రానికి తెరతీశారంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ప్రాతినిధ్యం వహిస్తు న్న నెల్లూరులోనే ఎస్టీ మహిళకు అన్యాయం చేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్టీ మహిళ పీఠంపై బీసీ నేతకు పట్టం డిప్యూటీ మేయర్ రూప్‌కుమార్‌కు ఇన్చార్జి మేయర్ బాధ్యతలు పదవీకాలం పూర్తయ్యే వరకు ఆయనే కొనసాగింపు? మరో ఎస్టీ మహిళ ఉన్నప్పటికీ ఎన్నిక నిర్వహణపై మీనమేషాలు విశాఖపట్నం కార్పొరేషన్లో అవిశ్వాసం నెగ్గిన పది రోజుల్లోనే తిరిగి ఎన్నిక నిర్వహణ నెల్లూరులో అవిశ్వాసానికి ముందే మేయర్ రాజీనామా ప్రకటన 17 రోజులు దాటినా ఆ ఊసే లేదు -
గ్రావెల్ మాఫియా తగ్గదోయ్..!
● ప్రజాప్రతినిధి అండతో అక్రమ రవాణా ● పట్టించుకోని అధికారులు సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరిన నాటి నుంచి సర్వేపల్లి నియోజకవర్గంలో గ్రావెల్ మాఫియా చెలరేగిపోతోంది. అక్రమంగా రవాణా చేస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. స్థానిక ప్రజాప్రతినిధి అండతో ప్రభుత్వ భూములు, చెరువులను కొల్లగొట్టి దర్జాగా వెనుకేసుకుంటున్నా, అధికారులు మాత్రం మొద్దునిద్రను వీడటంలేదు. ఎలాంటి అనుమతుల్లేకుండానే.. మండలంలోని రామదాసుకండ్రిగ, సర్వేపల్లి, నాగంబొట్లకండ్రిగ, కసుమూరు తదితర గ్రామాల్లో గల ప్రభుత్వ భూములు, చెరువుల్లో ఎలాంటి అనుమతుల్లేకుండా గ్రావెల్‌ను నిరంతరం తరలిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. స్థానికులు తమ అభ్యంతరాలను వ్యక్తం చేసినా, వారిని బెదిరించి టిప్పర్ల ద్వారా లేఅవుట్లకు తరలించి తమ జేబులు నింపుకొంటున్నారు. సర్వేపల్లి వద్ద 20 అడుగుల లోతు వరకు తవ్వకాలు చేపట్టారు. వీటిని కప్పిపుచ్చుకునేందుకు నెల్లూరు నగరంలోని చెత్త, బూడిదను వందలాది టిప్పర్లలో తరలించినా, ఈ గుంతలు పూడే పరిస్థితి కానరావడంలేదు. కసుమూరు తిప్ప నుంచి చవటపాళెం సమీ పంలోని లేఅవుట్లకు గ్రావెల్‌ను రేయింబవళ్లూ తరలిస్తుండటంపై రెవెన్యూ అధికారులకు స్థానికులు ఫిర్యాదు చేసినా, ప్రయోజనం కరువవుతోంది. రైల్వే బ్రిడ్జి పనులనూ వదలని వైనం రైల్వే బ్రిడ్జి కోసం తవ్విన గ్రావెల్‌ను సైతం మాఫియా తరలిస్తుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నుంచి కంటేపల్లి వెళ్లే మార్గంలో వీటి నిర్మాణ పనులు కొద్ది నెలలుగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా తవ్విన గ్రావెల్‌పై స్థానిక ప్రజాప్రతినిధికి అన్నీ తానై వ్యవహరించే టీడీపీ నేత కన్ను పడింది. వెంటనే టిప్పర్లలో నాలుగు రోజులుగా అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని గ్రావెల్ అక్రమ రవాణా కు అడ్డుకట్టేయాలని స్థానికులు కోరుతున్నారు. -
జిల్లాలో తొలి ముఫ్తీ అబ్దుల్ వహాబ్ కన్నుమూత
నెల్లూరు రూరల్ / నెల్లూ రు (బృందావనం): నెల్లూ రు మదరసా జామియా నూరుల్ హుదా అరబిక్ కళాశాల వ్యవస్థాపక అధ్యాపకుడు, జిల్లాలో తొలి ముఫ్తీగా గుర్తింపు పొందిన మత పెద్ద హజ్రత్ మౌలానా ముఫ్తీ అబ్దుల్ వహబ్ సాహెబ్ ఖాసిమీ రషాది ఆదివారం కాలం చేశారు. బట్వాడిపాళెంలోని మదరసాలో ఆయన పార్థివదేహానికి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కాంక్షించారు. వారి కుటుంబానికి మనోధైర్యం కల్పించాలని ప్రార్థించారు. నేటి నుంచి డయల్ యువర్ ఎస్ఈ నెల్లూరు(వీఆర్సీసెంటర్): జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యలను తెలుసుకొని పరిష్కారమే లక్ష్యంగా డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని ఇక ప్రతి సోమవారం నిర్వహించనున్నామని ఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ రాఘవేంద్రం తెలిపారు. ఈ మేరకు నగరంలోని విద్యుత్ భవన్లో విలేకరులతో ఆదివారం ఆయన మాట్లాడారు. 0861 – 2320427 నంబర్‌కు ఉదయం 8.30 నుంచి 9.30లోపు ఫోన్ చేసి తమ సమస్యలను తెలియజేయాలని కోరారు. ట్రాప్ కెమెరాల ఏర్పాటు ఉదయగిరి: ఉదయగిరి – బండగానిపల్లి ఘాట్‌రోడ్డులో పెద్దపులి సంచరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలను అటవీ అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయగిరి అటవీ రేంజ్ పరిధిలోని కొత్తపల్లి, ఉదయగిరి వెస్ట్, నందిపాడు బీట్ ప్రాంతాల్లో వీటిని నెలకొల్పారు. దుత్తలూరు డీఆర్వో మురళి, ఎఫ్ఎస్ఓ చిన్న వెంకటయ్య, ఏబీఓ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 12 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ ఆదివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 16 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. స్వామివారిని 91,147 మంది శనివారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 29,400 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.31 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. చలికి భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రూములు దొరక్క వెయిటింగ్ హాళ్లు, టీటీడీ ఏర్పాటు చేసిన షెడ్ల వద్ద నిరీక్షిస్తూ చలికి వణుకుతూ కనిపిస్తున్నారు. -
భూమి కోసం తప్పని పోరాటం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన స్పందన కార్యక్రమానికి ప్రస్తుత సర్కార్ తూట్లు పొడుస్తోంది. ఆ సమయంలో ప్రజలు అందజేసిన అర్జీలను పక్కాగా పరిష్కరించి.. దాని స్థితిగతులను ఎప్పటికప్పుడూ తెలియజేస్తూ పారదర్శకంగా వ్యవహరించేవారు. అయితే ప్రస్తుతం ఇదో ప్రహసనంలా మారిపోయింది. వాస్తవానికి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు అర్జీదారులు భారీగా హాజరై తమ సమస్యలపై వినతిపత్రాలను అందజేస్తూ కొండంత ఆశతో ఉంటున్నారు. అయితే ఈ మాట అటుంచితే వారికి ప్రదక్షిణలు తప్పడంలేదు. గ్రామ, మండల స్థాయిలో సాల్వ్ కాని అంశాలకు ఇక్కడా అదే పరిస్థితి నెలకొంటోంది. చివరికి అర్జీదారులకు భంగపాటు తప్పడంలేదు. ఇదీ లెక్క.. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో స్పందన పేరిట కార్యక్రమాన్ని నిర్వహించేవారు. ఆ సమయంలో వీటికి పరిష్కార మార్గం పక్కాగా లభించేది. ఈ తరుణంలో గతేడాదిలో నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించి.. కొలువుదీరిన టీడీపీ సర్కార్ దీన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా మార్చింది. అధికారుల లెక్కల మేరకు గతేడాది జూన్ నుంచి ఇప్పటి వరకు 24,719 అర్జీలను ప్రజలు అందజేశారు. వీటిలో 22,393 పరిష్కారమయ్యాయనే లెక్కను అధికారులు చూపి ఫైళ్లను క్లోజ్ చేశారు. అయితే వీరిలో 1764 మంది తమ సమస్యలకు పరిష్కారం లభించలేదంటూ అర్జీలను పదేపదే దాఖలు చేస్తున్నారు. మరోవైపు తమకు తెలియకుండానే సాల్వ్ చేశారంటూ ఆన్లైన్లో తప్పులతడకగా నమోదు చేశారంటూ ఇటీవల 121 మంది ఆరోపించారు. ఆఫ్‌లైన్‌లో సమర్పించిన మరో మూడు వేల అర్జీల పరిస్థితి ఏమిటో పెరుమాళ్లకే ఎరుక. తీరు మారని అధికారులు పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలనే లక్ష్యంతో తనిఖీల నిమిత్తం ఒక గ్రామానికి నెల్లో నాలుగు సార్లు అధికారులు వెళ్లాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా ఇటీవల పేర్కొన్నారు. అయితే ఇదీ సత్ఫలితాలను ఇవ్వడంలేదు. మామూళ్లకు అలవాటు పడిన ఆఫీసర్లు తమ తీరును ఏ మాత్రం మార్చుకోవడంలేదు. పెత్తందారులు, రాజకీయ పలుకుబడి ఉన్న వారికి అండగా నిలుస్తూ.. బాధితులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సింహభాగం రెవెన్యూకు సంబంధించినవే.. కలెక్టరేట్, తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాలకు వచ్చే అర్జీల్లో 60 శాతానికిపైగా రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉంటున్నాయి. భూ కబ్జాల మొదలుకొని.. అధికారులు చేసిన రీ సర్వే తప్పులు, నిషేధిత జాబితాలోకి పట్టా భూములు.. నోషనల్ ఖాతాల్లో చేర్చడం ఇలా ఎన్నో ఉంటున్నాయి. ఆఫీసర్లు చేసిన తప్పులే ప్రజల పాలిట శాపంగా పరిణమిస్తున్నాయి. అర్జీలను స్వీకరిస్తున్న కలెక్టర్ తదితరులు (ఫైల్) కొన్ని ఉదాహరణలు.. అర్జీదారులకు అంతులేని ఆవేదన సమస్యలపై మండల స్థాయిలో అర్జీలిచ్చి.. పరిష్కారం లభించక ప్రజలు విసిగివేసారిపోతున్నారు. చివరికి కలెక్టరేట్లో ఇస్తేనైనా ఆ చిక్కుముడులు వీడతాయనే ఉద్దేశం ఎంతో మందిలో నెలకొంది. కలెక్టర్, జేసీ, డీఆర్వో.. ఇలా పెద్ద సార్లు ఉంటారు.. వినతిపత్రాలను ఇస్తే సమస్యలకు చెక్ పడతాయనే భావనతో ఎన్నో వ్యయప్రయాసలకోర్చి జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో సోమవారం వస్తుంటారు. అయితే ఇక్కడే అసలు ఇక్కట్లు మొదలవుతున్నాయి. నిర్ణీత వ్యవధిలోపు వీటికి పరిష్కార మార్గాన్ని చూపాల్సి ఉండగా, ఆఫీసర్లు అలా వ్యవహరించకుండా.. బాధితులకు తెలియకుండానే అవి సాల్వ్ అయిపోయాయనే రీతిలో ఆన్లైన్లో నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారు. చివరికి ఏమి చేయాలో పాలుపోక కలెక్టర్ కార్యాలయం చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేస్తూ ఒకే సమస్యపై పదేపదే విజ్ఞప్తులను సమర్పించాల్సిన దుస్థితి నెలకొంటోంది. వెతలు పరిష్కారమవుతాయనే కొండంత ఆశతో కలెక్టరేట్‌కు ఎంతో మంది అక్కడా తప్పని భంగపాటు పీజీఆర్ఎస్లో అడుగడుగునా నిర్లక్ష్యమే పట్టించుకోని అధికారులు సాల్వ్ చేయకుండానే.. ఫైళ్లను క్లోజ్ చేస్తూ.. నెల్లూరు రూరల్ మండలం అప్పయ్యకండ్రిగకు చెందిన రామారా వు పూర్వీకులకు 781 ఎకరాల ఇనాం భూమి ఉంది. దీనికి సంబంధించి 1824లో పట్టాను మంజూరు చేశారు. అయితే 1976లో ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఆపై ఇందులో 235 ఎకరాలను వారికే ఇవ్వాలంటూ ఉత్తర్వులను సర్కార్ జారీ చేసింది. దీంతో పాటు చెరువులు, కుంటలకు సంబంధించి ఎందుకూ పనికిరాని భూమిని ఇచ్చింది. ఉపయోగపడేది ఇవ్వాలంటూ 2006 నుంచి అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అప్పటి తహసీల్దార్ భక్తవత్సలరెడ్డి ప్రభుత్వ ఉత్తర్వులు, రికార్డులను పరిశీలించి వీటిని ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినా, నేటికీ అమలు కాలేదు. అధికారుల చుట్టూ ఇప్పటికీ ఆయన కాళ్లరిగేలా తిరుగుతూనే ఉన్నారు. పరిష్కారమేదీ..? తన భూమిని మరొకరు ఆక్రమించారంటూ పొదలకూరు మండలం మహ్మదాపురానికి చెందిన వెంకటశేషయ్య.. రెవెన్యూ అధికారుల చుట్టూ ఎంతో కాలంగా తిరుగుతున్నారు. తాతలు, తండ్రి నుంచి సంక్రమించిన గ్రామంలోని సర్వే నంబర్ 149 – 3లో వెంకటశేషయ్యకు చెందిన 15 సెంట్ల భూమిను వేరే గ్రామానికి చెందిన వ్యక్తులు ఆక్రమించారంటూ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా విజ్ఞప్తుల పరిష్కార వేదికలో వినతిపత్రాన్ని ఈ ఏడాది ఫిబ్రవరి ఐదున అందజేశారు. 1.64 ఎకరాలు కాగా, పొలం కొనుగోలు చేసిన వ్యక్తులు.. తనకు చెందిన 15 సెంట్లను ఆక్రమించారని అందులో పేర్కొన్నారు. అయినా నేటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పేదల ఇళ్ల నిర్మాణంపై కట్టుకథలు
● గత ప్రభుత్వ హయాంలో సజావుగా ● వీటిని తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు పాకులాట ● ధ్వజమెత్తిన కాకాణి గోవర్ధన్‌రెడ్డి నెల్లూరు రూరల్: రాష్ట్రంలో పేదలకు సంబంధించిన గృహ నిర్మాణాల్లో సీఎం చంద్రబాబు అసత్య ప్రచారాలు పతాక స్థాయికి చేరాయని.. తాను నిర్మించని ఇళ్లకు క్రెడిట్ కొట్టేసేందుకు ఆయన యత్నిస్తున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. పేదల ఇళ్ల నిర్మాణంలో చంద్రబాబు ఇప్పటి వరకు చెప్పినవన్నీ అబద్ధాలేనని ఆధారాలతో సహా స్పష్టం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వ ఏడాదిన్నర పాలనలో నిర్మాణాలు జరగలేదని చెప్పారు. జిల్లాలో 19,678 గృహాలను నిర్మించి, పేదలకు కేటాయిస్తున్నామనే ప్రకటనల నేపథ్యంలో.. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు జరిగిన కన్స్ట్రక్షన్స్, మంజూరైన నిధులపై సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలను సేకరించామని వివరించారు. హౌసింగ్ అధికారులిచ్చిన సమాచారం మేరకు అర్బన్‌లో 2838ను కేటాయించగా, 2824 మొదలుకాలేదని.. 14 మాత్రం పునాది దశలో ఉన్నాయని.. నిధులు మంజూరు చేయలేదనే అంశం స్పష్టమైందని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 44 ఇళ్లను ప్రతిపాదించగా, 23కు సంబంధించిన పనులు ప్రారంభంకాలేదని, వివిధ దశల్లో 20 ఉండగా, పూర్తయింది ఒకటి మాత్రమేనని, రూ.12 లక్షలనే విడుదల చేశారని పేర్కొన్నారు. నాడో యజ్ఞంలా.. పేదల కోసం ఇళ్ల నిర్మాణాన్ని యజ్ఞంలా గత సీఎం జగన్మోహన్రెడ్డి జరిపారని, ఊళ్లను తలపించేలా జగనన్న కాలనీలను నిర్మించిన అంశాన్ని ప్రస్తావించారు. ఈ కాలనీల్లో కనీస వసతులను కల్పించకుండా ప్రస్తుత ప్రభుత్వం గాలికొదిలేసిందని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డికి మంచి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మున్సిపాల్టీల కింద వచ్చే ప్రాంతాలనే అర్బన్ ప్రాంతాలుగా పరిగణిస్తామని ప్రస్తుతం చెప్పడంతో నిర్మాణదారులు నష్టపోతున్నారని చెప్పారు. క్రెడిట్‌ను కొట్టేసేందుకు తాపత్రయం ఇప్పటికే నిర్మాణం పూర్తయి గృహాల్లో ఉంటున్న వారి ఇళ్లకు అధికార పార్టీ ఎమ్మెల్యేలు వెళ్లి, గృహప్రవేశం పేరిట ఇప్పుడు ఫొటోలు దిగడంపై ప్రజలు విస్తుపోతున్నారని చెప్పారు. గత సీఎం జగన్మోహన్రెడ్డి చేసిన పనులను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడటం సిగ్గుచేటని విమర్శించారు. బ్లాక్ మెయిల్ చేయడం కోసం హౌసింగ్‌లో రూ.3500 కోట్ల అవినీతి జరిగిదంటూ అసెంబ్లీలో సోమిరెడ్డి గగ్గోలు పెట్టారన్నారు. పొదలకూరులోని లేఅవుట్ యాజమానులను ఫోర్జరీ కేసుల పేరిట బెదిరించి, రూ.2.5 కోట్లను దండుకున్నారని.. బెదిరించడం, బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బులు గుంజడం ఆయనకు అలవాటని ధ్వజమెత్తారు. పలు సమస్యలపై అసెంబ్లీలో చర్చించేందుకు సైతం డబ్బులను సోమిరెడ్డి వసూలు చేస్తున్నారని ఆరోపించారు. విజిలెన్స్ విచారణ పేరిట ఇళ్ల నిర్మాణాలను ఆపి, పేదలకు నీడలేకుండా చేస్తున్నారని చెప్పారు. రాజమహల్పైనే ధ్యాసంతా..! అమరావతిలోని ఐదెకరాల్లో కట్టే రాజమహల్‌పై ధ్యాసే తప్ప.. పేదల ఇళ్ల నిర్మాణంపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని దుయ్యబట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అదనంగా ఆర్థిక సాయమందిస్తానని చెప్పిన చంద్రబాబు, ఒక్క రూపాయిని సైతం ఇవ్వలేదని మండిపడ్డారు. తన వైఫల్యాలను అధికారులపై నెట్టడం, కక్ష సాధింపులకే ఆయన పరిమితమయ్యారని విమర్శించారు. -
మనోళ్లయితే.. రౌడీషీట్లు ఎత్తేద్దాం
● టీడీపీ నేతల టెలి కాన్ఫరెన్స్‌లో మంత్రి నారాయణ హామీ సాక్షి టాస్క్‌ఫోర్స్: గడిచిన 18 నెలలుగా నేరాలు, నరమేధంతో నెల్లూరు అట్టుడికిపోతోంది. బ్లేడ్ బ్యాచ్‌ల నుంచి రౌడీషీటర్ల వరకు సాగిస్తున్న అరాచకాలు, దాడులు, హత్యలు, హింసతో నగర ప్రజలు క్షణ క్షణం భయంతో వణికిపోతున్నారు. నేరస్తులను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలకు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ టీడీపీ నేతలతో ఆదివారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్ అద్దం పడుతోంది. ‘2019– 24 మధ్య రౌడీషీటర్లుగా ముద్రపడి పోలీస్స్టేషన్లలో రౌడీషీట్లను ఓపెన్ చేసి ఉంటే.. వారిలో మనోళ్లు ఉంటే.. వీటిని ఎత్తేద్దాం’ అంటూ నారాయణ హామీ ఇవ్వడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. నగర నియోజకవర్గ పరిధిలోని టీడీపీ నేతలు, డివిజన్ ఇన్‌చార్జీలతో నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో నగరంలో రౌడీషీట్లు ఓపైనెన వారు ఎవరైనా ఉంటే వారిపై తొలగిద్దామన్నారు. దీనికి సంబంధించిన పత్రాలు, ఇతర కేసులకు సంబంధించిన వివరాలను పూర్తిగా సబ్మిట్ చేయాలని సూచించారు. ఏడాదిన్నరగా అదుపు తప్పిన లా అండ్ ఆర్డర్ టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిన్నరలో నెల్లూరులో లా అండ్ ఆర్డర్ అదుపు తప్పింది. వరుస హత్యలు, మారణకాండలు, భయోత్పాత ఘటనలు జిల్లా ప్రజలను వణికిస్తున్నాయి. రాజకీయ విమర్శలు చేసిన నేపథ్యంలో మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఇంటిపై టీడీపీలోని రౌడీషీటర్లు, అరాచక మూకలు సాగించిన విధ్వంసం మొదలుకొని ఇటీవల గంజాయి నిరోధక ఉద్యమకారుడు పెంచలయ్యను తరిమి తరిమి హతమార్చిన హత్యోదంతాన్ని జిల్లా చరిత్రలో ఎన్నడూ చూడలేదు. ఇక నడిరోడ్డుపైనే చేసిన హత్యలైతే కోకొల్లలుగా ఉన్నాయి. బుచ్చిరెడ్డిపాళెంలో నెల్లూరు – ముంబై రోడ్డుపై కార్డును అడ్డంగా పెట్టి మద్యం సేవిస్తున్న పోకిరీలను పక్కకు జరగాలని హారన్ కొట్టిన ఆర్టీసీ డ్రైవర్‌పై దాడికి తెగబడిన ఉదంతం నుంచి నెల్లూరులో రోడ్డుపై అడ్డంగా పెట్టిన బైక్‌లను తీయాలని హారన్ మోగించిన ప్రైవేట్ బస్సు డ్రైవర్‌పై బ్లేడ్లతో పీకలు కోయడం, అడ్డుకోబోయిన కండక్టర్‌పై దాడికి తెగబడిన ఉదంతం సైతం నగర ప్రజలను ఇప్పటికీ వణికిస్తోంది. అర్ధరాత్రే కాదు.. పగలు సైతం ఒంటరిగా వెళ్లేందుకు మగాళ్లు సైతం భయపడిపోతున్న పరిస్థితులు నెల్లూరులో నెలకొన్నాయి. నిన్నటికి నిన్న.. టీడీపీ సానుభూతిపరుడు అధికారిక ముద్ర వేసుకునేందుకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరేందుకు తన అనుచరగణంతో కలిసి చేపట్టిన ర్యాలీలో నడిరోడ్డుపై తన్నులాటను మరిచిపోకముందే రౌడీషీటర్లు టీడీపీ వారైతే షీట్లు తొలగిస్తామంటూ మంత్రి ఇచ్చిన హామీపై నెల్లూరు ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొంత పార్టీ నేతలు సైతం ఇదేం ఘోరమంటూ చర్చించుకుంటున్నారు. ఇక దర్జాగా నేరాలు చేసుకోండి.. -
ప్రాణం తీసిన అతివేగం
● గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడి మృతి ● కోవూరు షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఘటన కోవూరు: అతివేగం నిండు ప్రాణం తీసింది. కోవూరు సమీపంలోని షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. కోవూరు పరిధిలోని షుగర్ ఫ్యాక్టరీ సమీపంలో ఓ యువకుడు రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం వేగంగా ఢీకొట్టింది. దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు వెంటనే కోవూరు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ముత్యాలరావు తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మృతుడి వయసు సుమారు 25 నుండి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
అనుమానం పెనుభూతమై..
● భార్య గొంతు కోసిన భర్త ఉదయగిరి: ఓ వ్యక్తి భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆమె గొంతు కోసి హత్యాయత్నం చేసిన ఘటన ఉదయగిరిలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సై ఇంద్రసేనారెడ్డి, బాధితురాలి కథనం మేరకు.. ఉదయగిరి పట్టణంలోని రజక వీధికి చెందిన చీపినాపి గురవయ్య స్థానికంగా ఉన్న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో అటెండర్‌గా పని చేస్తున్నాడు. అతను భార్య రమణమ్మపై అనుమానం పెంచుకున్నారు. కొన్నిరోజులుగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం ఉదయం ఆరు గంటల ప్రాంతంలో భార్యాభర్తలు మరోసారి గొడవపడ్డారు. గురవయ్య కత్తితో రమణమ్మ గొంతు కోశాడు. అయితే కత్తి పూర్తిగా గొంతులోకి వెళ్లకపోవడంతో రక్త గాయమైంది. గమనించిన స్థానికులు వెంటనే ప్రభుత్వ వైద్యశాలకు తరలించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వైద్యులు బాధితురాలకు చికిత్స చేసి ప్రాణాపాయం లేదని తెలిపారు. ఎస్సై కేసు నమోదు చేశారు. నిందితుడిని పోలీసులు ఆదుపులోకి తీసుకున్నారు. అక్రమ లేఅవుట్లపై చర్యలు కలువాయి(సైదాపురం): మండలంలో అక్రమంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లపై చర్యలు తప్పవని నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆదివారం తహసీల్దార్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అనధికారికంగా ఏర్పాటు చేసిన లేఅవుట్లను గుర్తించాలని, ఎల్ఆర్ఎస్ ద్వారా క్రమబద్ధీకరించుకునేలా చూడాలని తహసీల్దార్ కృష్ణారెడ్డి, అధికారులకు తెలియజేశారు. నిమ్మ ధరలు (కిలో) పెద్దవి : రూ.20 సన్నవి : రూ.16 పండ్లు : రూ.10 -
ఆడుతూ.. గెలుస్తూ..
● క్రీడల్లో సంస్కృత పాఠశాల విద్యార్థుల ప్రతిభ ● జాతీయ స్థాయి పోటీలకు ఎంపికనెల్లూరులోని వేద పాఠశాల విద్యార్థులు క్రీడల్లోనూ సత్తా చాటుతున్నారు. పేద, బడుగు వర్గాలకు చెందిన వారు రాణించేలా ఇక్కడ వివిధ క్రీడల్లో తర్ఫీదు ఇస్తున్నారు. మారుతున్న కాలంతోపాటు విద్యార్థులు క్రీడల్లో రాణిస్తూ జాతీయ స్థాయికి ఎదిగారు. నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): తెలుగు, సంస్కృత పద్యాలను నేర్పించేందుకు నగరంలోని వేద సంస్కృత పాఠశాలను 1953లో ఏర్పాటు చేశారు. సంస్కృతంతోపాటు సంప్రదాయాలను నేర్పించడంలో ఆ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకప్పుడు మూలాపేట దేవాలయాల్లో విధులు నిర్వహించే వారి పిల్లలు మాత్రమే చదివే పాఠశాలలో ఇప్పుడు అన్నివర్గాల చిన్నారులు విద్యనభ్యసిస్తున్నారు. 15 ఏళ్లుగా వివిధ క్రీడల్లో రాణిస్తున్న విద్యార్థులు తాజాగా త్రోబాల్‌లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఇద్దరు ఎంపిక త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో జరుగుతున్న జాతీయ చాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైన ఇద్దరు విద్యార్థులు జి.గోపీచంద్, ఎం.మహేష్ పదో తరగతి చదువుతున్నారు. వీరు 2, 3వ తరగతుల నుంచే ఉదయం, సాయంత్రం క్రీడల్లో సాధన చేసేవారు. వారి ప్రతిభను గుర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ వాలీబాల్, నెట్‌బాల్, సాఫ్ట్‌బాల్, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇచ్చారు. స్కూల్ గేమ్స్‌లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో రాణించారు. కూలీల పిల్లలు గోపీచంద్ తల్లిదండ్రులు రాజేశ్వరి, రాములు బేల్దారి కూలీలు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నా పాఠశాల ఇచ్చిన ప్రోత్సాహంతో జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనే అవకాశం లభించింది. మహేష్ అయితే ఆర్థికంగా మరీ దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు. తండ్రిని పోగొట్టుకున్నాడు. తల్లి రోజువారీ కూలీ పనులు చేస్తూ కుమారుడిని చదివిస్తోంది. మహేష్ సంస్కృత భాషను అభ్యసిస్తూనే ఉదయం, సాయంత్రం క్రీడల్లో సాధన చేస్తుంటాడు. బాగా చదివి క్రీడల్లో రాణించి పోలీసు ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని నిరంతరం కష్టపడుతున్నాడు.విద్యార్థులకు ప్రోత్సాహం ఒకప్పుడు ఒక వర్గానికే విద్యకు స్థానమిచ్చే పాఠశాల మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులను స్వీకరిస్తోంది. ఈ పరిసర ప్రాంతాల్లో కూలీ పనులు చేసుకునే పిల్లలకు అన్నివిధాలా ప్రోత్సాహాన్ని అందిస్తోంది. చిన్నారులకు వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే ఉత్తమ భవిష్యత్‌ను అందించవచ్చు. – ప్రభాకర్‌రావు, కరస్పాండెంట్ క్రీడా నైపుణ్యాన్ని గుర్తించాలి విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహిస్తే సరైన ఫలితం లభిస్తుంది. పాఠశాలలో ఈ పనిచేయడంతో 20 ఏళ్లుగా చిన్నారులు పలు క్రీడల్లో ప్రతిభను చాటుకుతున్నారు. సంప్రదాయ విద్యను వివిధ వర్గాల వారు అభ్యసిస్తూనే ఇలా క్రీడల్లో రాణించడం అభినందనీయం. యాజమాన్యం భావితరాలకు బంగారు భవిష్యత్‌ను అందిస్తుంది. – చంద్రశేఖర్, పీఈటీ అన్ని రంగాల్లో రాణించాలి మారుతున్న కాలంతోపాటు సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్యార్థులు పాఠశాల స్థాయి నుంచి అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలి. ప్రస్తుతం సమయాన్ని వృథా చేసే అనేక పరిస్థితులు ఉన్నా విద్యార్థులు సంప్రదాయ విద్య, క్రీడా రంగాల్లో రాణించడం అభినందనీయం. – చతుర్వేదుల శ్రీరామమూర్తి, పాఠశాల యాజమాన్య కమిటీ అధ్యక్షుడు -
రహదారి గుంతకు మరమ్మతులు
ఆత్మకూరు: ఆత్మకూరు నుంచి చేజర్లకు వెళ్లే మార్గంలో వెంకయ్య స్వామి గుడి సమీపంలో రహదారిపై భారీ వాహనాల తాకిడితో వారం రోజుల క్రితం పారుదల కాలువ బ్రిడ్జికి రంధ్రం పడిన విషయం తెలిసిందే. దీంతో ఆ మార్గంలో పెద్ద వాహనాలను నిలిపివేశారు. విద్యార్థులు, రైతులు పడుతున్న ఇక్కట్లను, భారీ ఇసుక వాహనాల రవాణాతో ధ్వంసం అవుతున్న రోడ్ల గురించి ‘ఇసుక మాఫియాకు రోడ్లు బలి’ శీర్షికతో ఆదివారం సాక్షిలో కథనం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో స్పందించిన రహదారులు, భవనాల శాఖ అధికారులు మరమ్మతులు చేపట్టారు. నూతన పైపులైన్లను జేసీబీ యంత్రాల సహాయంతో ఏర్పాటు చేశారు. సోమవారం నుంచి వాహనాలు యథావిధిగా తిరగొచ్చని ఆ శాఖ అధికారులు తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై బలవంతపు కేసులు
● కాకాణి పూజిత నెల్లూరు రూరల్: జంతుబలులపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను బెదిరించడానికి, నేరస్తులుగా ముద్ర వేయడానికి చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులు ప్రమాదకరమైనవని ఆ పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత పేర్కొన్నారు. ఆదివారం ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గతంలో బాలకృష్ణ సినిమాలు, చంద్రబాబు పుట్టినరోజులకు కనిపించని నేరం ఈరోజు అకస్మాత్తుగా నేరంగా పరిగణించడం దారుణమన్నారు. సామాజిక ఆచారంగా ఉన్న జాతర్లు, కొన్ని రకాల వేడుకలకు జంతుబలులు ఇప్పటికీ ఆచార వ్యవహారాలుగా ఉన్నాయన్నారు. పోలీసులు వాళ్లని దారుణంగా కొట్టి హక్కులు హరించి నేరస్తుల్లా రోడ్లపై నడిపించడం హేయమైన చర్యగా అభివర్ణించారు. రాష్ట్రంలో పోలీసులు ఇలాంటి అనైతిక చర్యలకు పాల్పడటం మానవహక్కుల ఉల్లంఘన, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. ఇటువంటి భావజాలం ఉన్న ఏ ప్రభుత్వం మనుగడ సాగించలేదన్నారు. సంసస్కృతిని నేరంగా మార్చి అసమ్మతిని శిక్షించినప్పుడు ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదని హెచ్చరించారు. ఇప్పటికై నా వ్యవస్థలో మార్పు రాకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
స్వల్పంగా పెరిగిన నిమ్మ ధరలు
పొదలకూరు: పాతాళానికి పడిపోయిన నిమ్మ ధరలు స్వల్పంగా పెరిగాయి. కోత కూలీలు ఖర్చులకు కూడా ఇబ్బందులు పడుతున్న రైతులకు కొంతమేర ఊరట లభించింది. ప్రస్తుతం ఒక కిలో రూ.16 నుంచి రూ.20 వరకు ఉంది. బస్తా (లూజు) ఒకటి రూ.1,200 నుంచి రూ.1,600 వరకు ధరలు గిట్టుబాటవుతున్నాయి. సంక్రాంతి పండగ తర్వాత ధరలు పెరిగే అవకాశం ఉంది. బంగారు హారం బహూకరణబుచ్చిరెడ్డిపాళెం రూరల్: జొన్నవాడలోని మల్లికార్జున సమేత కామాక్షితాయి అమ్మవారికి నెల్లూరుకు చెందిన పోడ్ల రాజేశ్వరి ఆదివారం బంగారు హారం సమర్పించారు. ఆలయ సిబ్బంది అతిథి మర్యాదలతో సత్కరించి అమ్మవారి దర్శనం కల్పించారు. పెంచలకోనలో వైకుంఠ ఏకాదశి వేడుకలు రేపురాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలోని పెనుశిల లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఈనెల 30వ తేదీన వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించనున్నట్లు ఏసీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ పెంచలకోన క్షేత్రంలో శ్రీవారిని దర్శించేందుకు ఉత్తర ద్వారం ఉన్నా వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి నిత్యకల్యాణ మండపంలో 7 బంగారు రంగుతో కూడిన ద్వారాలు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. అందులో బంగారు గరుడ వాహనంపై శ్రీవారిని కొలువుదీర్చడం జరుగుతుందన్నారు. తెల్లవారుజామున 3 గంటలకు అభి షేకం, 4 గంటలకు నిజరూప దర్శనం, 5 గంటలకు పూలంగిసేవ, ఉత్తర ద్వార దర్శనం, సాయంత్రం 6 గంటలకు బంగారు గరుడ వాహనంపై క్షేత్రోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఆటో డ్రైవర్ కోసం ముమ్మర గాలింపుసంగం: మండల కేంద్రమైన సంగం ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్ పవన్ అదృశ్యమై రెండు రోజులైంది. కాగా ఆటో శనివారం రాత్రి ఉడ్‌హౌస్‌పేట సమీపంలోని బెజవాడ పాపిరెడ్డి కాలువలో లభ్యమైంది. పవన్ ఆచూకీ లభించలేదు. అర్ధరాత్రి కావడంతో గాలింపు చర్యలను పోలీసులు నిలిపివేశారు. ఆదివారం కాలువలో నీళ్లు తగ్గించి గాలింపు చర్యలు ప్రారంభించినా అతని ఆచూకీ దొరకలేదు. సంగం ఉడ్‌హౌస్‌పేట నుంచి 15 కిలోమీటర్ల వరకు మర్రిపాడు సమీపం వరకు బెజవాడ పాపిరెడ్డి కాలువలో గాలించినా ఫలితం లేదు. కండలేరులో 60.79 టీఎంసీలురాపూరు: కండలేరు జలాశయంలో ఆదివారం నాటికి 60.79 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ గజేంద్రరెడ్డి తెలిపారు. సోమశిల జలాశయం నుంచి కండలేరుకు 1,600 క్యూసెక్కుల నీరు చేరుతోందన్నారు. కండలేరు నుంచి సత్యసాయి గంగ కాలువకు 850, లోలెవల్ కాలువకు 50, హైలెవల్ కాలువకు 100, పిన్నేరు కాలువకు 20, మొదటి బ్రాంచ్ కాలువకు 85 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
వైభవం.. అయ్యప్ప స్వామి నగరోత్సవం
● సాంస్కృతిక కార్యక్రమాలతో కోలాహలం నెల్లూరు(బృందావనం): నెల్లూరు వేదాయపాళెంలో ఉన్న శ్రీస్వామి అయ్యప్ప దేవస్థానంలో 41 రోజులుగా జరుగుతున్న మండల పూజోత్సవాల ముగింపు సందర్భంగా నగరోత్సవాన్ని ఆదివారం వైభవంగా నిర్వహించారు. శ్రీస్వామి అయ్యప్ప సేవా సమాజం పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు గూడల శేషగిరిరావు, కత్తుల వెంకటరత్నం పర్యవేక్షణలో శబరిమలవాసుని ఉత్సవం కనులపండువగా జరిగింది. తొలుత దేవస్థానం నుంచి ఉదయం 9 గంటలకు ఉత్సవం రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి ఆలయానికి చేరింది. మధ్యాహ్నం భక్తులకు ముంగమూరు శ్రీధరకృష్ణారెడ్డి జ్ఞాపకార్ధం సతీమణి రాజేశ్వరమ్మ ఆధ్వర్యంలో అన్నసంతర్పణ నిర్వహించారు. సాయంత్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంపై స్వామిని విశేషాలంకారంలో కొలువుదీర్చారు. రంగనాథస్వామి ఆలయం నుంచి నగరోత్సవం మంగళవాయిద్యాలు, సింగారిమేళం, నగర సంకీర్తనలు, కోలాటాలు, పండరి భజనల నడుమ వైభవంగా సాగింది. రంగనాయకులపేట, సంతపేట, ఏసీ బొమ్మ సెంటర్, ట్రంకురోడ్డు, గాంధీబొమ్మ, ఏసీ మార్కెట్, మద్రాస్ బస్టాండ్, కేవీఆర్ పెట్రోలు బంక్, ఏసీ స్టేడియం, కరెంటాఫీస్ సెంటర్ మీదుగా అయ్యప్ప స్వామి ఆలయానికే చేరింది. కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు కోశాధికారి గడ్డం రత్నయ్య, సభ్యులు పావళ్ల ప్రసాద్, బొగ్గుల మురళీమోహన్‌రెడ్డి, పసుపులేటి అశోక్‌తేజ, కేజీ శంకరన్, ముంగమూరు కృష్ణచైతన్య తదితరులు పాల్గొని పర్యవేక్షించారు. ● అయ్యప్పస్వామి మండల పూజోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 8 గంటలకు దేవస్థాన ప్రాంగణంలోని పుష్కరిణిలో ఆరాట్టు ఉత్సవం (చక్రస్నానం) జరుగుతుంది. -
‘ఎమ్మెల్యే సార్.. మీ రోడ్డు సూపర్’
‘వర్షం కురిస్తే నెల్లూరు నగరంలోని రామలింగాపురం రైల్వే అండర్ బ్రిడ్జి రోడ్డు చెరువును తలపించేది. నీళ్లు నిలిచేవి, డ్రెయినేజీ పారేది కాదు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ‘అత్యాధునిక టెక్నాలజీ’తో చుక్క నీరు నిలవకుండా డ్రెయిన్, సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారంటూ కొద్ది నెలల క్రితం సోషల్ మీడియాలో భజన రీల్స్, పోస్టులు వైరలయ్యాయి. ‘ఎమ్మెల్యే సార్.. సూపర్’ అంటూ లైక్స్, షేర్స్‌తో ముంచెత్తారు. దాదాపు రెండునెలలపాటు రోడ్డును బ్లాక్ చేసి, రూ.1.17 కోట్లు ఖర్చు పెట్టి.. అత్యాధునిక టెక్నాలజీతో ‘అద్భుత డ్రెయినేజీ పారుదల’ నిర్మాణం చేపట్టామంటూ గప్పాలు కొట్టుకున్నారు. అండర్ బ్రిడ్జి రోడ్డును చూస్తే విదేశీ ఇంజినీర్లు సైతం ఆశ్చర్యపోతారన్నంతగా కూటమి నేతలు హడావుడి చేశారు. రూ.కోట్లు ఖర్చు పెట్టి.. వాహనచోదకులపై బురద చిల్లించే రీతిలో ప్రస్తుత పరిస్థితి ఉంది. ఆ రోడ్డులో ప్రయాణించే వారు పడుతున్న కష్టాలు వర్ణనాతీతం. డ్రెయినేజీ, బురద చేరడంతో ఫీట్లు చేస్తూ రాకపోకలు సాగిస్తున్న పరిస్థితిని చూసి.. అద్భుతో అద్భుతః.. అంటూ నెల్లూరు ప్రజలు వెటకారాన్ని జోడించి విమర్శలు గుప్పిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, నెల్లూరు -
ఉద్యోగాలివ్వండి.. లేకుంటే తిండి పెట్టండి
● జాబ్ క్యాలెండర్ విడుదలకు డిమాండ్ నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు ఇవ్వాలని, లేనిపక్షంలో నిరుద్యోగ భృతి ఇవ్వాలని, అదీ కాకపోతే తిండైనా పెట్టాలని ఏఐవైఎఫ్ జిలా కార్యదర్శి మున్నా డిమాండ్ చేశారు. నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ వద్ద ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో భిక్షాటన కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు నెలకు రూ.3 వేలు నిరుద్యోగభృతి ఇస్తామని, ఉద్యోగావకాశాలు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా చంద్రబాబు ఒక్కరికీ ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి ఇవ్వలేదన్నారు. నేడు రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు ఉద్యోగావకాశాలు లేకపోవడంతో గంజాయి, మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. చివరకు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఇవన్నీ ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు గౌస్‌బాషా, బాబయ్య, నూరుల్లా, మీరామొహిద్దీన్, షబ్బీర్, ఖాజా, మనోహర్, వాసుదేవరెడ్డి, విజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పులి సంచారంపై గుబులు
● ఉదయగిరిలో మరోసారి కలకలం ఉదయగిరి: స్థానిక రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో పులి అలజడి శనివారం మరోసారి వెలుగులోకి వచ్చింది. మేకల మేత నిమిత్తం గ్రామ సమీపంలోని బత్తల వెంకటమ్మగుంట, జెర్రివాగు ప్రాంతంలోని అడవికి జీ చెరువుపల్లికి చెందిన జీవాలకాపరి పెంచలయ్య ఉదయం వెళ్లారు. ఈ క్రమంలో అతి సమీపంలో పులి గాండ్రింపులు వినిపించడంతో భయంతో వణికిపోయారు. అదే సమయంలో అడవిలో అవుల మంద పరిగెత్తడాన్ని గమనించారు. సుమారు 70కుపైగా అడవి ఆవుల మందను వేటాడుతున్నట్లు గుర్తించి గ్రామంలోకి వచ్చారు. ఆపై విషయాన్ని స్థానికులకు తెలిపి వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి సమాచారమిచ్చారు. దీంతో ఘటన స్థలానికి సిబ్బంది వెళ్లి పులి సంచార గమనాన్ని గుర్తించారు. స్థానికులను అప్రమత్తం చేశారు. కొత్తపల్లి బీట్ ప్రాంతంలో పులి పాదముద్రలను సిబ్బంది సాయంత్రం గుర్తించారని సమాచారం. అటవీ అధికారుల నిర్లక్ష్యం శ్రీశైలం టైగర్ జోన్ నుంచి ెగిద్దలూరు, వీ బైలు, భైరవకోన, దేవమ్మ చెరువు, కొత్తపల్లి, వెంకటాపురం ప్రాంతాల్లో పెద్ద పులుల సంచారం ఉందని నాలుగు నెలల క్రితమే పశువుల కాపర్లు గమనించి అటవీ సిబ్బందికి తెలిపారు. దీంతో వీటి కదలికలను ఉదయగిరి, ఆత్మకూరు ఫారెస్ట్ అధికారులు ప్రాథమికంగా గుర్తించినా విషయాన్ని గోప్యంగా ఉంచారు. వెంకటాపురం జాతీయ రహదారి వద్ద కారును పెద్ద పులి ఢీకొని గతంలో గాయపడింది. ఇదే విషయాన్ని కారు డ్రైవర్ తెలిపినా పట్టించుకోలేదు. ఉదయగిరి రేంజ్ పరిఽధిలో పెద్ద పులి సంచారం ఉందని అటవీ అధికారులకు సైతం సమాచారముందని తెలుస్తోంది. బండగానిపల్లి ఘాట్‌లో బైక్‌పై వెళ్తున్న వ్యక్తులకు పులి కంటపడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. -
గిరిజనులపై ఎందుకింత వివక్ష..?
● ఓ వ్యక్తి కోసం మమ్మల్ని బలి చేస్తారా..! ● ప్రభుత్వ తీరును తప్పుబట్టిన జయవర్ధన్ నెల్లూరు రూరల్: గిరిజనులపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకింత వివక్ష అని మాజీ మేయర్ స్రవంతి భర్త జయవర్ధన్ ప్రశ్నించారు. నగరంలోని జర్నలిస్ట్ భవన్లో విలేకరులతో శనివారం ఆయన మాట్లా డారు. ఓ వ్యక్తి కోసం తమను బలి చేస్తారానంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. చట్టాలపై రూప్‌కుమార్‌యాదవ్ మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. ఆయనేదో సాధించాననే రీతిలో వ్యవహరిస్తున్నారని చెప్పారు. విశాఖపట్నంలో అనుసరించిన పద్ధతిని ఇక్కడ ఎందుకు పాటించలేదని ప్రశ్నించారు. అక్కడ ఈ ఏడాది ఏప్రిల్ 19న అవిశ్వాస తీర్మానం పెడితే, 28న ఎన్నిక జరిగిందని, మరి దీన్ని ఇక్కడ ఎందుకు అమలు చేయలేదన్నారు. ఇద్దరు గిరిజన బిడ్డలు టీడీపీలోనే ఉన్నారని, వారికెందుకు న్యాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. వెబ్సైట్లో ఎన్నెమ్మెమ్మెస్ తుది కీ నెల్లూరు (టౌన్): జాతీయ ఉపకార వేతన పరీక్షకు సంబంధించిన తుది కీని విద్యాశాఖ కార్యాలయ వెబ్సైట్ www. bse.ap.gov.i nలో అందుబాటులో ఉంచామని ప్రభుత్వ పరీక్షల కార్యాలయ సంచాలకుడు శ్రీనివాసులురెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాథమిక కీపై వచ్చిన అభ్యంతరాలపై పాఠ్యాంశ నిపుణులతో తనిఖీ చేయించి సవరించిన దాన్ని అందుబాటులో ఉంచామని వివరించారు. దీనిపై ఎలాంటి అభ్యంతరాలను స్వీకరించబోమని స్పష్టం చేశారు. ఉదయగిరిలో జీఎస్ఐ సర్వే ఉదయగిరి: మండలంలోని బండగానిపల్లి, జీ చెర్లోపల్లి, చెరువుపల్లి తదితర ప్రాంతాల్లో రాళ్లు, మట్టి నమూనా సేకరణ సర్వేను హైదరాబాద్‌కు చెందిన జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం శనివారం చేపట్టింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఉదయగిరి కొండ ప్రాంతాల్లో గల గ్రామాల్లో విలువైన ఖనిజ సంపదను గుర్తించే నిమిత్తం సర్వేను జరిపామని వివరించారు. వీటిని హైదరాబాద్‌లోని తమ కార్యాలయానికి తీసుకెళ్లి ల్యాబ్‌లో పరీక్షలు చేపట్టనున్నామని వెల్లడించారు. మర్రిపాడు, ఉదయగిరి, తిరుపతిలోని పలుచోట్ల ఇప్పటికే నమూనాలను సేకరించామని వివరించారు. అభిషేక్ జైన్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. శ్రీవారి దర్శనానికి 20 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శనివారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ శిలాతోరణం వద్దకు చేరుకుంది. స్వామివారిని 72,487 మంది శుక్రవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 29,500 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.52 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 20 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
ఇసుక మాఫియాకు రోడ్లు బలి
● వంతెనల వద్ద ఏర్పడిన భారీ రంధ్రాలు ● టీడీపీ నాయకుల అండతో రెచ్చిపోతున్న వైనం జిల్లాలో ఇసుక మాఫియాకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. టీడీపీ నేతల అండదండలతో పరిమితికి మించి టన్నుల కొద్దీ ఇసుకను తరలిస్తుండడంతో రోడ్లు గుల్లగుల్ల అవుతున్నాయి. ఆత్మకూరు నియోజకవర్గంలో ఇసుక ట్రక్కుల వల్ల వంతెనల వద్ద భారీ రంధ్రాలు ఏర్పడి రోజుల తరబడి రాకపోకలు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునేవారు లేకుండాపోయారు. ఆత్మకూరు: పట్టణానికి సమీపంలోని అప్పారావుపాళెం ఇసుక రీచ్ వద్ద నుంచి భారీ వాహనాలు పట్టణం మీదుగా వస్తుండడంతో ఆ మార్గంలోని పారుదల కాలువలపై నిర్మించిన పాత వంతెనలు కుంగి రంధ్రాలు పడుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో అప్పారావుపాళెం సమీపంలోని కొత్తపాళెం మలుపు వద్ద, నల్లపరెడ్డిపల్లి అడ్డరోడ్డు వద్ద, ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని వెంకయ్య స్వామి గుడి వద్ద పారుదల కాలువల బ్రిడ్జిలు దెబ్బతిని అడుగు మేరకుపైగా రంధ్రాలు ఏర్పడ్డాయి. కేవలం భారీ ఇసుక టిప్పర్లు ఈ మార్గంలో ఇష్టారాజ్యంగా ప్రయాణిస్తుండడంతో రోడ్లు దెబ్బతిన్నాయని స్థానికులు మండిపడుతున్నారు. కొత్తపాళెం, నల్లపరెడ్డిపల్లి మలుపు వద్ద గుంతలు పడి మూడు వారాలైనా ఇప్పటి వరకు అధికారులు వాటిపై దృష్టి సారించకపోవడం గమనార్హం. దీంతో స్థానికులే సూచికలుగా ఆ గుంతల వద్ద కర్రలు నిలబెట్టారు. దీంతో ఆటోలు, ద్విచక్ర వాహనదారులు ఆ ప్రాంతాల్లో భయాందోళనలకు గురవుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు. పరిమితికి మించి.. అప్పారావుపాళెం ఇసుక రీచ్ నుంచి పరిమితికి మించిన భారీ వాహనాలు ఇసుకను తరలిస్తున్నాయి. ఒక్కొక్క టిప్పర్ 30 నుంచి 50 టన్నుల బరువు కలిగిన ఇసుక తరలిస్తూ నిత్యం పదుల కొద్దీ ఈ మార్గంలో ప్రయాణిస్తుండడంతో దశాబ్దాల క్రితం పంట కాలువలపై ఏర్పాటు చేసిన బ్రిడ్జిలు దెబ్బతింటున్నాయి. కేవలం కూటమి నాయకుల స్వలాభమే ధ్యేయంగా ఇసుకను తరలించడాన్ని ప్రజలు తప్పుబడుతున్నారు. నిలిచిన ఆర్టీసీ బస్సు ఆత్మకూరు–అప్పారావుపాళెం మార్గంలో భారీ గుంతలు పడడంతో చేజర్ల బస్సును ఆర్టీసీ అధికారులు వారం రోజులుగా నిలిపివేశారు. ప్రస్తుతం ఆ మార్గంలో ఇసుక లారీలు, ట్రాక్టర్లకు కూడా అనుమతిని నిలిపివేశారు. కేవలం ఆటోలు, ద్విచక్ర వాహనాలు మాత్రమే ప్రయాణాలు సాగిస్తున్నాయి. ప్రయాణాలకు ఇబ్బందులు ఈ మార్గంలో ఆర్టీసీ బస్సును నిలిపివేయడంతో అప్పారావుపాళెం, బట్టేపాడు హైస్కూళ్లలో చదువుకునే సమీప గ్రామాల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బస్సు నిలిచిపోవడంతో ఆటోలు మాత్రమే ప్రయాణిస్తుండడంతో ఆటోల కోసం ఎదురుచూస్తూ పాఠశాల సమయం మించిపోతుండడంతో విద్యార్థులు సరైన సమయంలో బడికి వెళ్లలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రహదారులు, భవనాల శాఖ అధికారులు రంధ్రాలు పడిన బ్రిడ్జిలకు మరమ్మతులు చేపట్టి రాకపోకలు పునరుద్ధరించాలని, అదే క్రమంలో భారీ ఇసుక వాహనాలను ఈ మార్గంలో అనుమతించరాదని ప్రజలు కోరుతున్నారు. -
అంతర్జాతీయ ప్రమాణాలతో బోధన
● వీఎస్‌యూ వీసీ శ్రీనివాసరావు వెంకటాచలం: విక్రమ సింహపురి యూనివర్సిటీ(వీఎస్‌యూ), అంతర్జాతీయ సంస్థల మధ్య కుదిరిన ఒప్పందం ద్వారా విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్య, పరిశోధన, శిక్షణ లభిస్తాయని వీఎస్‌యూ వీసీ అల్లం శ్రీనివాసరావు అన్నారు. మండలంలోని కాకుటూరు వద్దనున్న వీఎస్‌యూలో యునైటెడ్ నేషన్స్ అసోసియేషన్ మిషన్ గ్రూప్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ(ఏపీయూఎన్ఏ), అంతర్ ప్రభుత్వ సంస్థల (ఐజీఓ) ద్వారా అనుబంధంగా ఉన్న యూఎన్ఏ గ్రూప్ సంస్థలతో వీఎస్‌యూ అవగాహన ఒప్పందం (ఎంఓయూ) శనివారం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ ఈ ఒప్పందం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, సామాజిక సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, మానవ హక్కులు, అంతర్జాతీయ సంబంధాలపై సంయుక్త వర్క్‌షాప్‌లు, సెమినార్లు, ఇంటర్న్‌షిప్‌లు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల్లో గ్లోబల్ అవగాహన, నాయకత్వ లక్షణాలు పెంపొందించడమే ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. మాస్కో(రష్యా)లోని ఐసీఎస్టీఐ చీఫ్ ఎక్స్పర్ట్ అండ్ యునైటెడ్ నేషన్స్ విజన్ డిప్లోమాట్ జయ రాములు లింగుట్ల మాట్లాడుతూ ఈ భాగస్వామ్యం విద్యారంగంలో ఒక మైలురాయి అని పేర్కొన్నారు. ఐసీఎస్టీఐ సహకారంతో అంతర్జాతీయ సెమినార్లు, శిక్షణా కార్యక్రమాలు నిర్వహించి, విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. వీఎస్‌యూ ఇన్చార్జి రిజిస్ట్రార్ డాక్టర్ కె.సునీత, ప్రిన్సిపల్ సీహెచ్ విజయ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృత అవకాశాలు లభిస్తాయని, అధ్యాపకులు అంతర్జాతీయ సంస్థలతో కలిసి సంయుక్త పరిశోధనలు చేయవచ్చని వెల్లడించారు. -
వెంటనే మరమ్మతులు చేపట్టాలి
● వైఎస్సార్సీపీ నేతల నిరసన ఆత్మకూరు: ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని చేజర్ల మార్గంలో వెంకయ్యస్వామి గుడి సమీపంలో ఉన్న పంటకాలువ బ్రిడ్జికి రంధ్రంపడి వారం రోజులైనా ప్రభుత్వాధికారులు ఇప్పటి వరకు ఎలాంటి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడంపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. పార్టీ ఎస్సీసెల్ నాయకుడు తోడేటి అశోక్ ఆధ్వర్యంలో పలువురు రోడ్డుకు గుంతపడిన ప్రాంతంలో శనివారం నిరసన వ్యక్తం చేశారు. కొందరు గుంతలోకి దిగి పరిశీలించి పెను ప్రమాదాలు చోటు చేసుకుంటాయని తెలిసినా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని వారు దుయ్యబట్టారు. ఈ మార్గంలో బస్సును సైతం వారం రోజులుగా నిలిపివేయడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తక్షణమే ఇసుక తరలించే భారీ వాహనాలు ఈ మార్గంలో అనుమతించరాదని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో కృష్ణమూర్తి, మాల్యాద్రి, దొరబాబు, రాజా, వెంకయ్య, సుమంత్, మాధవ, పెంచలయ్య, బుజ్జయ్య తదితర దళిత నాయకులు పాల్గొన్నారు. -
ప్రజారోగ్య పరిరక్షణలో పీఎంపీలు కీలకం
నెల్లూరు(అర్బన్): వైద్యశాఖతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో పీఎంపీ వైద్యులు కీలకపాత్ర పోషిస్తున్నారని, వారి కృషి అభినందనీయమని డీఎంహెచ్ఓ సుజాత అన్నారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ పక్కన ఉన్న ఏనుగు సుందర్రామిరెడ్డి రోటరీ క్లబ్ ఆడిటోరియంలో 63వ పీఎంపీ అసోసియేషన్ వ్యవస్థాపక దినోత్సవం శనివారం జరిగింది. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మారుమూల పల్లెలతో పాటు, పట్టణాల్లోని పేదలతో మమేకమై అతి తక్కువ ఖర్చుతో పీఎంపీలు వైద్య సేవలందిస్తున్నారన్నారు. డాక్టర్ శార్వాణి కంటి వ్యాధులు, నివారణపై అవగాహన కల్పించారు. కిడ్నీ దానంపై సురేంద్రకుమార్ వీడియో ప్రజెంటేషన్ ఇచ్చారు. మెదడు, నరాల సమస్యలపై డాక్టర్ వైష్ణవి, కీళ్లు, ఎముకల వ్యాధులపై డాక్టర్ భాస్కర్, సర్జరీలపై లాపరోస్కోపిక్ సర్జన్ అమర్నాథరెడ్డి, చిన్నపిల్లల వ్యాధులపై రాజశేఖర్‌రెడ్డి, ఊపిరితిత్తుల వ్యాధులపై ప్రేమ్‌దీప్, చర్మవ్యాధులపై శ్వేత, సీ్త్రల సమస్యలపై విజయలక్ష్మి పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పీఎంపీలకు అవగాహన కల్పించారు. నారాయణ మెడికల్ గ్రూప్ ఏజీఎం చౌకచర్ల భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ గత 25 ఏళ్లుగా పీఎంపీలతో కలిసి వైద్య సదస్సులు, ఉచిత వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం భాస్కర్‌రెడ్డిని అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్ సత్కరించారు. జిల్లా లెప్రసీ, టీబీ నివారణాధికారి ఖాదర్‌వలీ, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ కనకాద్రి, అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు జయప్రకాష్, న్యాయ సలహాదారు రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శులు శేషయ్య, దేవరకొండ శ్రీనివాసులు, ప్రసాద్, రామదాస్, మాలిని, రమణయ్య, మస్తానయ్య, వెంకటేశ్వర్లు, శేఖర్, సాయిమురళి, సుమారు 300 మంది పీఎంపీలు పాల్గొన్నారు. -
● గూడూరు, వెంకటగిరిలోని మూడు మండలాలు నెల్లూరు జిల్లాలోనే..?
ప్రభుత్వం తాజాగా చేపట్టిన జిల్లాల పునర్విభజనలో నెల్లూరుకు తీరని అన్యాయం జరిగింది. దీనిపై ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున రేగగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతిచ్చి నిరసనలు చేపట్టింది. ఈ పరిణామాల క్రమంలో సర్కార్ దిగొచ్చిందని తెలుస్తోంది. గూడూరుతో పాటు వెంకటగిరి నియోజకవర్గంలోని రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించేలా నిర్ణయం తీసుకుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. మరో వైపు దీనిపై ఆనందోత్సాహాలు వ్యక్తమవుతున్నాయి. ముందుండి నడిపించిన వైఎస్సార్సీపీ వెంకటగిరి నియోజకవర్గంలోని మూడు మండలాలను తిరుపతిలో కలపకూడదంటూ ప్రజా ఉద్యమం ఉవ్వెత్తున ఎగసింది. కలువాయి మండల ప్రజలు ఏకతాటిపై నిలిచారు. వీరికి అండగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి, వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, కలువాయి జెడ్పీటీసీ అనిల్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఉద్యమ తీవ్రతను పెంచారు. మండల, జెడ్పీ సమావేశాల్లో తీర్మానాలనూ చేయించారు. కలువాయిలో భారీ స్థాయిలో ర్యాలీలను నిర్వహించి ఉద్యమ గళాన్ని వినిపించారు. రాపూరు, సైదాపురంలో ర్యాలీలు, బంద్‌లను నిర్వహించారు. ఇలా అందరూ ఏకమవడంతో నిరసన సెగకు ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. -
ప్రజల కంటే కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమా..?
● ఇథనాల్ పరిశ్రమలతో పర్యావరణానికి ముప్పు ● రౌండ్ టేబుల్ సమావేశంలో నేతల తీర్మానం నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల కంటే కంపెనీల ప్రయోజనాలే ముఖ్యమవుతున్నాయని.. పర్యావరణ పరిరక్షణ కోసం ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ పేర్కొన్నారు. రాచర్లపాడులోని కిసాన్ సెజ్‌లో ఇథనాల్ ప్లాంట్ల ఏర్పాటును నిరసిస్తూ ‘ప్రజారోగ్య పరిరిక్షణకు ఇథనాల్ ఫ్యాక్టరీలను వ్యతిరేకించండి.. కాలుష్య భూతం నుంచి ప్రజలను కాపాడండి అనే నినాదంతో నగరంలోని జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని పలు రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించారు. ఈ సందర్బంగా రమేష్ మాట్లాడారు. ఉపాధి కోసం పరిశ్రమలొస్తే తప్పు లేదని, అయితే ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే విష వాయువులను విడుదల చేసే ఫ్యాక్టరీలను కచ్చితంగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వాయు, నీటి కాలుష్యం పెరిగి ప్రజలు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. గుజరాత్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో వీటిని ప్రజలు వ్యతిరేకించిన అంశాన్ని ప్రస్తావించారు. అనంతరం సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి మాట్లాడారు. ఇథనాల్ ఫ్యాక్టరీలకు నీటిని తరలిస్తే జిల్లా ప్రజల పరిస్థితి దారుణమయ్యే ప్రమాదం ఉందని చెప్పారు. సీపీఐఎమ్మెల్ నేత రాంబాబు మాట్లాడుతూ.. వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియజేయకుండా వీటికి అనుమతివ్వడం సరికాదన్నారు. ఎస్‌యూసీఐ నేత బసవరాజు మాట్లాడుతూ.. కార్పొరేట్ శక్తులకు రాష్ట్ర సంపదను దోచి పెట్టేందుకే వీటికి అనుమతులిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకునేందుకు ఉద్యమాలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు. సీపీఐఎమ్మెల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి లక్ష్మీరెడ్డి మాట్లాడుతూ.. కిసాన్ సెజ్ భూముల్లో ఇథనాల్ పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి అనుమతుల్లేవని చెప్పారు. ఇఫ్కో ఫ్యాక్టరీకి కేటాయించిన భూముల్లో వీటిని నిర్మించతలపెట్టడం దారుణమన్నారు. సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ఇలాంటి పరిశ్రమలతో ఉపాధి లభించకపోగా, ప్రజల ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు హాజరుకావాలి రాచర్లపాడులోని కిసాన్ సెజ్ వద్ద మంగళవారం నిర్వహించనున్న ప్రజాభిప్రాయ సేకరణకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, మేధావులు, పర్యావరణవేత్తలు, ప్రజలు భారీగా హాజరుకావాలని కాంగ్రెస్ పార్టీ నగర ఉపాధ్యక్షుడు సంజయ్‌కుమార్ కోరారు. నేతలు కత్తి శ్రీనివాసులు, మోహన్‌రావు, సుధీర్, శివశంకర్, పుల్లయ్య, నరసింహ, రషీద్, సూర్యనారాయణ, వెంకటేశ్వర్లు, శివకుమారి తదితరులు పాల్గొన్నారు. -
ప్రెస్‌మీట్ పెట్టారని వైఎస్సార్సీపీ నేత నిర్బంధం
మనుబోలు: టీడీపీ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అపహాస్యమవుతున్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అధికార పార్టీ నేతలు అమలు చేస్తుంటే.. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. మనుబోలుకు చెందిన పార్టీ నేత అనమాల ప్రభాకర్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ను ఇటీవల నిర్వహించి స్థానిక టీడీపీ నేత మస్తాన్నాయుడిపై విమర్శలు చేశాడు. దీంతో ప్రభాకర్‌రెడ్డికి 41ఏ నోటీసులను పోలీసులు శనివారం సాయంత్రం ఐదింటికిచ్చి స్టేషన్‌కు పిలిపించారు. రాత్రి వరకు స్టేషన్లో ఉంచి బైండోవర్ చేస్తామని చెప్పి నిర్బంధించారు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి.. మనుబోలు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి వారి చర్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. అనంతరం ఆయన మాట్లాడారు. తమను దూషించిన వారిపై కేసులు నమోదు చేయకుండా.. దానికి కౌంటర్ ఇచ్చిన వ్యక్తిపై ఆగమేఘాలపై కేసు పెట్టి ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు. రాజకీయంగా విమర్శలు చేసిన వ్యక్తులకు 41ఏ నోటీసులివ్వడం.. బైండోవర్ చేయడమేమిటని నిలదీశారు. ఇలాంటి పోకడలను ఎక్కడా చూడలేదని చెప్పారు. ఖాకీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఎవరూ కాపాడే పరిస్థితి ఉండదని తెలిపారు. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నిస్తే దానికి సమాధానం చెప్పకుండా ఎదురు కేసులు పెట్టి వేధిస్తామంటే తాము భయపడబోమని స్పష్టం చేశారు. సోమిరెడ్డికి సిగ్గుంటే ఇరిగేషన్ పనులపై సీబీఐ విచారణ జరిపించాలన్నారు. ఊపిరున్నంత వరకూ పార్టీ శ్రేణులకు అండగా ఉంటామని తెలిపారు. అవసరమైతే హైకోర్టు మెట్లైకె ్కనా శ్రేణులను కాపాడుకుంటామని పేర్కొన్నారు. పోలీసులుండేది శాంతభద్రతలను కాపాడేందుకే తప్ప ఓ వర్గానికి కొమ్ముకాయడానికి కాదనే విషయాన్ని గుర్తెరిగి ప్రవర్తించాలని హితవు పలికారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, దాసరి భాస్కర్‌గౌడ్, ముంగర రవీందర్‌రెడ్డి, గుంజి రమేష్, గిద్దంటి రమణయ్య, గిరి, దయాకర్, కోటేశ్వరగౌడ్, కేవీఆర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తే శిక్ష తప్పదు కార్యకర్తలను కాపాడుకుంటాం మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి -
విలీన ప్రతిపాదనపై ప్రసన్న హర్షం
● ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ ● వ్యతిరేకతతో దిగొచ్చిన సర్కార్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తాము అధికారంలోకి వచ్చిన వెంటనే గూడూరును నెల్లూరు జిల్లాలో కలుపుతామని గత ఎన్నికలకు ముందు ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆర్భాటపు హామీలను గుప్పించారు. ఇది నిజమేనని భావించి ఓటేసిన ప్రజలకు ఆయన అసలు రంగు తర్వాత బోధపడింది. వాగ్దానాన్ని విస్మరించడంతో పాటు జిల్లాలోనే ఉన్న రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలనూ తిరుపతిలో కలపాలని ఇటీవల ఆయన నిర్ణయించడంపై ప్రజానీకం భగ్గుమంది. తమ అభీష్టానికి వ్యతిరేకంగా ఆయన ఎలా వ్యవహరిస్తారని పలువురు ప్రశ్నించారు. సాంస్కృతికపరంగా.. భౌగోళికంగా నెల్లూరుతో ముడిపడిన గూడూరును అసలు సంబంధంలేని తిరుపతి జిల్లాలో ఎలా కొనసాగిస్తారంటూ ఎక్కడికక్కడ ఆందోళనలు చోటుచేసుకున్నాయి. కందుకూరును ప్రకాశంలో కలిపేలా నిర్ణయం తీసుకున్నప్పుడు, ఇది తమకు ఎందుకు వర్తించదంటూ వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనం.. మౌనవ్రతం వెంకటగిరి నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలో గతంలో విలీనం చేసినప్పుడు, రాపూరు, సైదాపురం, కలువాయిని అక్కడ చేర్చొద్దంటూ అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డిని నాటి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కోరారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. అయితే ప్రస్తుతం వీటి విలీనానికి సర్కార్ సై అనగా, మంత్రి హోదాలో ఉన్న ఆనం మాత్రం మౌనవ్రతం దాల్చారు. ఈ పరిణామం ప్రజలను మరింత ఆగ్రహానికి గురిచేసింది. నీటి పంపకాల్లో సమస్యలు జిల్లాలో సాగునీటికి కీలకంగా ఉండేవి సోమశిల, కండలేరు జలాశయాలు. ఈ తరుణంలో రాపూరు, సైదాపురం, కలువాయి మండలాలను తిరుపతి జిల్లాలో విలీనం చేస్తే, రెండు ప్రాంతాల మధ్య జల వివాదాలు చోటుచేసుకునే ప్రమాదాలూ లేకపోలేదు. దీన్ని నిరసిస్తూ ఆ మండలాల ప్రజలు రోడ్డెక్కారు. తమకు జరుగుతున్న అన్యాయంపై మంత్రివర్గ ఉపసంఘంతో పాటు ప్రజా సమస్యల పరిష్కార వేదికలోనూ వినతిపత్రాలను అందజేసి తమ నిరసనను వ్యక్తపర్చారు. గూడూరుపై ప్రసన్న పట్టు గూడూరు విషయంలో ఉద్యమానికి కార్యాచరణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపొందించింది. పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ఓ అడుగు ముందుకేసి ఆమరణ దీక్షకు పూనుకుంటానని ప్రకటించారు. దీనికి సహకరించాలంటూ నేతలను వ్యక్తిగతంగా కలుసుకున్నారు. ఈ పరిణామాల క్రమంలో అప్పటి వరకు మౌనంగా ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలు సైతం ప్రజా వ్యతిరేకతను గమనించి రంగంలోకి దిగుతున్నట్లు షో చేశారు. ఫలితంగా గూడూరుతో పాటు వెంకటగిరిలోని మూడు మండలాలను జిల్లాలోనే కొనసాగించేలా ప్రభుత్వం నిర్ణయించిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. కోవూరు: గూడూరు నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను గమనించి, తిరిగి నెల్లూరు జిల్లాలో కలపాలని నిర్ణయించడం శుభపరిణామమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన మాట్లాడారు. గూడూరును నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలనే డిమాండ్ వెనుక ప్రజల భావోద్వేగాలున్నాయని చెప్పారు. ఇదే అంశమై ప్రజల పక్షాన తాను గళమెత్తానని గుర్తుచేశారు. అవసరమైతే ఆమరణ దీక్షకు సైతం వెనుకాడబోనని గతంలోనే ప్రకటించానని, ఆ పట్టుదలే ఈ నిర్ణయానికి దారితీసిందని అభిప్రాయపడ్డారు. అక్కడి వ్యాపార, విద్య, వైద్యావసరాలన్నీ నెల్లూరుతోనే ముడిపడి ఉన్నాయని వివరించారు. జిల్లాలో గూడూరును కలపాలనే డిమాండ్‌తో ఉద్యమించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలను తెలియజేశారు. -
ఇంత తక్కువకు భూములివ్వలేం
● రుద్రకోట రైతులతో సమావేశం ● అధికారులు నిర్ణయించిన పరిహారంపై ఆగ్రహం సాక్షి ప్రతినిధి నెల్లూరు: బీపీసీఎల్ పరిశ్రమకు సంబంధించిన భూసేకరణలో భాగంగా పొలాలను కోల్పోతున్న రుద్రకోట రైతులతో సమావేశాన్ని కావలి ఆర్డీఓ కార్యాలయంలో శనివారం నిర్వహించారు. అధికారులు నిర్ణయించిన పరిహారంపై రైతులు భగ్గుమన్నారు. ఎకరాకు రూ.కోటి చొప్పున ఇవ్వడంతో పాటు 2013 భూసేకరణ చట్టం మేరకు పరిశ్రమలో వాటాలివ్వాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ.24 లక్షలేనా..! బీపీసీఎల్ రిఫైనరీ కోసం కావలి మండలంలోని తీర గ్రామం చెన్నాయపాళెంలో ఎకరాకు రూ.24 లక్షలను నిర్ణయించామని అధికారులు ప్రకటించారు. రుద్రకోటలోని భూములకు సైతం ఇదే వర్తిస్తుందని వారు తెలియజేయడంతో ఆ ప్రతిపాదనను రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. చెన్నాయపాళెంలో భూముల రిజిస్ట్రేషన్ విలువ రూ.మూడు లక్షలు కాగా, అక్కడ రూ.24 లక్షలను ప్రకటించారని, అయితే రూ.7.59 లక్షల రిజిస్ట్రేషన్ విలువ ఉన్న రుద్రకోటలో సైతం అంతే ఇస్తామనడం తమకేమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేశారు. నిష్పత్తి మేరకు రుద్రకోటలో ఎకరాకు రూ.56 లక్షలవుతాయని వివరించారు. పైగా తమ గ్రామం జాతీయ రహదారి, రైల్వే లైన్‌కు దగ్గరగా ఉందని, బహిరంగ మార్కెట్లో రూ.మూడు కోట్లు పలుకుతున్నాయని వివరించారు. గ్రామదేవత అంకమ్మ తల్లి భూములకు మినహాయింపునివ్వాలని కోరారు. నాటి పరిహారాన్ని ఎందుకు పట్టించుకోవడంలేదు..? గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో భూములను సేకరించినప్పుడు ఎకరాకు రూ.35 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఇచ్చారని, దీంతో సంతోషంగా అప్పగించామన్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం రైతులను దోచుకునేందుకు, వారి జీవితాలను అల్లకల్లోలం చేసేందుకు యత్నిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నాటి పరిహారాన్ని ఎందుకు ప్రామాణికంగా తీసుకోవడంలేదని ప్రశ్నించారు. ఉద్యోగమనేది.. మభ్యపెట్టేందుకే..! అధికారులు చెప్తున్న ‘ఇంటికో ఉద్యోగం’పై రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ ఆశ చూపి తమ పొలాలను లాక్కుంటారని, ఆ తర్వాత అవసరమైన నైపుణ్యం లేదంటారన్నారు. గట్టిగా అడిగితే సెక్యూర్టీ ఉద్యోగాలిచ్చి.. హిందీ, ఇంగ్లిష్ మాట్లాడటం రాదంటూ ప్రొబేషన్పూర్తయ్యేలోపే తొలగిస్తారని చెప్పారు. గతంలో కొన్ని పరిశ్రమల ఏర్పాటులో ఇతర గ్రామాల్లో ఎదురైన ఘటనలను ఉదహరించారు. రుద్రకోటలో బీపీసీఎల్ పరిపాలన కార్యాలయ భవనాలను నిర్మించనున్నారని, రైతులు తెలియజేసిన అంశాలను పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. అభిప్రాయ సేకరణ కోసమే సమావేశాన్ని నిర్వహించామని ఆర్డీఓ వంశీకృష్ణ తెలిపారు. రైతులు తుళ్లూరు మల్లికార్జున, శ్రీనివాసులు, వాకా చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, నారపరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
స్కిల్ సెంటర్ ఏర్పాటుకు వినతి
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): నెల్లూరు నగరంలోని గాంధీ నగర్లో ఉన్న 6.90 ఎకరాల్లో చేనేత బజార్, చేనేతలకు స్కిల్ సెంటర్, కల్యాణ మండపాన్ని ఏర్పాటు చేయాలని బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు వీఎన్ మాధవ్‌ను జిల్లా చేనేత ఐక్య కార్యాచరణ కమిటీ ప్రతినిధులు కోరారు. విజయవాడలో ఆ పార్టీ కార్యాలయంలో శుక్రవారం కమిటీ జిల్లా అధ్యక్షుడు బుధవరపు బాలాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ సోమ గోపాల్, ఉపాధక్షులు చింతలగింజల సుబ్రహ్మణ్యం, జానపాటి రామసుబ్బయ్య కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చేనేతలకు సహకారం అందించడం వల్ల 3,800 కుటుంబాలు, అనుబంధ వృత్తులపై ఆధారపడిన ఐదువేల కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కార్మికులకు ఆధునిక నైపుణ్యం అందుబాటులోకి వస్తుందన్నారు. గాంధీ నగర్లో చేనేతలకు కేటాయించిన స్థలాన్ని ఉపయోగంలోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సహకరించాలని కోరారు. కార్యక్రమంలో పద్మశాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జగ్గారపు శ్రీనివాసరావు, బండారు బెనర్జీ, సింగరి లక్ష్మీనారాయణ, మునగపాటి వెంకటేశ్వరరావు, చిలుకోటి అంజిబాబు, మునగాల గిరిధర్, పెండం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మహిళా కబడ్డీ జట్టు ఎంపిక
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): రాష్ట్ర సీనియర్స్ మహిళా కబడ్డీ జట్టును నగరంలోని సెయింట్ పీటర్స్ స్కూల్ మైదానంలో శుక్రవారం ఎంపిక చేశారు. ముఖ్యఅతిథులుగా రైల్వే ఎస్సై హరిచందన, ట్రాఫిక్ ఆర్ఎస్సై నాగరాజు, డాక్టర్ ప్రసాద్ హాజరయ్యారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కాంక్షించారు. 20 మందిని ఎంపిక చేశామని, వీరికి ఐదు రోజుల పాటు శిక్షణ శిబిరాన్ని నిర్వహించి జిల్లా జట్టు క్రీడాకారులను ప్రకటించనున్నామని కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరీష్, కార్యదర్శి గంటా సతీష్ తెలిపారు. ఉదయ్, మోజెస్, రామచంద్రయ్య, సునీల్, రామకృష్ణ, శీనయ్య తదితరులు పాల్గొన్నారు. -
పొట్టకూటి కోసం.. రాష్ట్రాలు దాటి..
● మధ్యప్రదేశ్ నుంచి రాక ● ఊరూరా వ్యవసాయ పరికరాల విక్రయం ● రోడ్లపైనే తయారీసీతారామపురం: బతుకుదెరువు కోసం కొన్ని కుటుంబాలు రాష్ట్రాలు దాటి పల్లెసీమలకు వలస వస్తున్నాయి. మధ్యప్రదేశ్‌కు చెందిన కొందరు ఊరూరా తిరుగుతూ వ్యవసాయ పరికరాలు విక్రయిస్తూ బతుకు పోరాటం సాగిస్తున్నారు. వ్యవసాయ పనుల్లో నిత్యం ఉపయోగించే కత్తి, గొడ్డలి, గుణపం, కొడవలి తదితర పనిముట్లతోపాటు ఇంట్లో వాడే కత్తిపీటలను వాసులు తయారు చేస్తున్నారు. ఆ రాష్ట్రంలోని భోపాల్, సాగర్ తదితర ప్రాంతాలకు చెందిన సుమారు పదుల సంఖ్యలో కుటుంబాలు ఈ పనుల కోసం మన రాష్ట్రంలోని పల్లె ప్రాంతాలకు వచ్చాయి. వీరంతా రహదారి పక్కనే తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుని వ్యవసాయ పరికరాలు తయారు చేసి అమ్ముతున్నారు. వస్తువులకు ఉన్న డిమాండ్‌ను బట్టి రెండు, మూడు రోజులు అక్కడే ఉంటున్నారు. ఆ తర్వాత మరో ఊరికి వలస వెళ్తున్నారు. కళ్లెదుటే తయారీ మధ్యప్రదేశ్‌కు చెందిన వలస జీవులు తమతో తీసుకొచ్చిన ఇనుప రాడ్లను రైతుల ముందే కొలిమిలో కాల్చి వారు కోరిన విధంగా పనిముట్లను తయారు చేయడం విశేషం. ఒక్కో పనిముట్టును దాని బరువు ఆధారంగా రూ.100 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు. ఇలాంటివి స్థానికంగా దుకాణాల్లోనూ లభిస్తాయి. కానీ నాణ్యత బాగోదని రైతులు చెబుతున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చిన వీరందరూ ఏడాదిలో దాదాపు పది మాసాలపాటు ఇతర రాష్ట్రాల్లో తిరుగుతారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్‌లోని పలు గ్రామాలకు వెళ్తుంటారు. నవంబర్ నెల నుంచి మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తిరుగుతున్నారు. కుటుంబం మొత్తం వ్యవసాయ పరికరాల తయారీలో పురుషులతోపాటు మహిళలు, బాలలు శ్రమిస్తున్నారు. ఇనుమును కటింగ్ చేసే సమయంలో మగవారితో సమానంగా మహిళలు సమ్మెట దెబ్బలు వేస్తున్నారు. కొలిమిని మండించడం, తయారు చేసిన వస్తువులను విక్రయించడం వంటి పనులు చేస్తున్నారు. అయితే తల్లిదండ్రులతోపాటే వలస జీవితం సాగించే చిన్నారులు పూర్తిగా చదువుకు దూరమయ్యారు. పదేళ్ల వయసున్న వారు సైతం పనిముట్ల తయారీలో పెద్దవారికి చేదోడువాదోడుగా ఉంటున్నారు. పాఠశాలకు పంపడం లేదా అని ఎవరైనా ప్రశ్నిస్తే ముందు పొట్ట నిండాలి కదా అని తల్లిదండ్రులు సమాధానమిస్తున్నారు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల పరిసర ప్రాంతాల్లో టెంట్లు వేసుకుని తాము జీవనం సాగిస్తున్నామని తమకు నిలువ నీడ లేదని చెబుతున్నారు.ఏటా వలస బాట జీవనోపాధి కోసం ఏటా వలస వచ్చేస్తాం. దాదాపు పదినెలలపాటు గ్రామాల్లో తిరుగుతూ బయట ప్రాంతాల్లో గడుపుతాం. అన్ని ప్రాంతాల్లో వ్యవసాయ పనిముట్లను తయారు చేసి అమ్మకాలు సాగిస్తుంటాం. చలైనా, ఎండైనా పూట గడవడానికి పాట్లు తప్పవు. రైతులు మమ్మల్ని ఎంతో ఆదరిస్తున్నారు. రహదారి పక్కనే జీవిస్తున్న సమయంలో కొన్నిచోట్ల ప్రమాదాలకు కూడా గురవుతుంటాం. – సర్దార్ సింగ్, వలస కార్మికుడు, మధ్యప్రదేశ్ పరికరాలు బాగున్నాయి మధ్యప్రదేశ్ వాసులు తయారు చేస్తున్న వ్యవసాయ పరికరాలు చాలా బాగున్నాయి. మా కళ్లెదుటే నాణ్యతగా తయారు చేస్తున్నారు. దీంతో మాకు నచ్చిన విధంగా వాటిని తయారు చేయించుకుంటున్నాం. వీరి పనిముట్లను గ్రామాల్లోని రైతులందరూ కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం వ్యవసాయ పనులు జోరందుకుంటున్న నేపథ్యంలో పనిముట్లకు డిమాండ్ ఏర్పడింది. – చెన్నుబోయిన రమణయ్య, రైతు, పోకలవారిపల్లి -
పెన్నానదిలో అక్రమంగా ఇసుక తవ్వకాలు
నెల్లూరు(వీఆర్సీసెంటర్): అనుమతి లేకుండా పెన్నానదిలో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొందరు అక్రమార్కులు నిత్యం ట్రాక్టర్లలో రవాణా చేస్తున్నారు. నెల్లూరు నగరంలోని 54వ డివిజన్ పరిధిలో భగత్‌సింగ్ కాలనీ వద్ద పెన్నానది నుంచి నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారు. పదిరోజుల నుంచి యంత్రాలతో రోజుకు 300 ట్రాక్టర్లకు పైగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. శుక్రవారం అక్కడికి సీపీఎం నాయకులు నాగేశ్వరరావు, అల్లాభక్షు వెళ్లి తవ్వకాలను అడ్డుకున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదు చేశారు. -
నిత్యం తనిఖీలు చేస్తున్నాం
హోటళ్లు, ఐస్‌క్రీమ్ పార్లర్లు, రెస్టారెంట్లు తదితరాల్లో తనిఖీలను నిత్యం చేస్తూనే ఉన్నాం. పలు హోటళ్లలో వంటల తయారీకి ఉపయోగిస్తున్న పదార్థాల్లో నాణ్యత లేకపోగా.. చాలా వరకు కాలం చెల్లినవి, పాడైపోయినవి ఉంటున్నాయి. ఆహార పదార్థాలు ఆకర్షణీయంగా ఉండేందుకు రంగులు కలుపుతున్నారనే అంశాన్ని గుర్తించాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 307 శాంపిళ్లను సేకరించి.. ఆరు కేసులపై కోర్టుకు నివేదించాం. జేసీ వద్ద 22 కేసులపై విచారణ జరిపి రూ.మూడు లక్షలు జరిమానాను విధించాం. కల్తీ ఆహారాన్ని విక్రయిస్తే చర్యలు తప్పవు. – వెంకటేశ్వరరావు, జిల్లా సహాయ ఆహార నియంత్రణాధికారి ● -
పులి ఆచూకీ కోసం గాలింపు
ఉదయగిరి: ఉదయగిరి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో పెద్ద పులి సంచరిస్తోందనే అంశం స్థానికుల్లో అలజడి సృష్టిస్తున్న నేపథ్యంలో దాని ఆచూకీ కోసం గాలింపు చర్యలను అటవీ సిబ్బంది శుక్రవారం చేపట్టారు. బండగానిపల్లి ఘాట్ రోడ్డులో బైక్‌పై వెళ్తున్న వారికి పులి మంగళవారం రాత్రి కనిపించడంతో దాని పాదముద్రలను అటవీ అధికారులు సేకరించారు. తాజాగా గోసుకొండ ప్రాంతంలో జీవాల కాపరికి పులి గురువారం మధ్యాహ్నం కనిపించడంతో అటవీ అధికారులు, బేస్ క్యాంప్, స్టయికింగ్ ఫోర్స్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. కొన్ని ప్రదేశాల్లో పాదముద్రలను గుర్తించారు. ఈ దిశను అనుసరించి వచ్చిన దారినే తిరిగి ప్రయాణాన్ని ప్రారంభించి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ట్రాప్ కెమెరాలను అమర్చారని సమాచారం. కాగా పాదముద్రల విశ్లేషణ నివేదిక ల్యాబ్ నుంచి రావాల్సి ఉంది. అదొచ్చాకే స్పష్టత లభించనుంది. విద్యార్థులకు తీరిన రవాణా కష్టాలు వెంకటాచలం: వీఎస్‌యూ విద్యార్థులకు రవాణా కష్టాలు ఇక తీరినట్లేనని వీసీ అల్లం శ్రీనివాసరావు పేర్కొన్నారు. మండలంలోని కాకుటూరు వద్ద గల వర్సిటీలో 8 సీటర్ల బ్యాటరీ వాహనాన్ని యూనియన్ బ్యాంక్ సహకారంతో ఎంపవర్ హర్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ప్రధాన రహదారి నుంచి క్యాంపస్ సుమారు కిలోమీటర్ దూరంలో ఉండటంతో విద్యార్థులు, మహిళలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. తమ అభ్యర్థన మేరకు ఈ వాహనాన్ని యూనియన్ బ్యాంక్ అందించడంపై ఆనందం వ్యక్తం చేశారు. బ్యాంక్ రీజినల్ హెడ్, ఏజీఎం శ్యామ్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
10న ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలు
నెల్లూరు(అర్బన్): ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా ఎన్నికలను జనవరి పదిన నిర్వహించనున్నామని జిల్లా ఎన్నికల అధికారి, సంఘ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు రాఘవులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దర్గామిట్టలోని అసోసియేషన్ కార్యాలయంలో ఉదయం పదింటికి ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు. జిల్లాలో ఉన్న 17 పదవులకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ఎన్జీఓ భవన్లో ఈ నెల 30న నిర్వహించనున్నామని తెలిపారు. సహ ఎన్నికల అధికారిగా చిత్తూరు జిల్లా కార్యదర్శి రమేష్, పర్యవేక్షకుడిగా ఎన్జీఓస్ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి జగదీష్‌ను అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ నియమించారని పేర్కొన్నారు. ఉద్యోగులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. జీఎస్టీ రెవెన్యూ రూ.156.99 కోట్లు నెల్లూరు (టౌన్): నెల్లూరు డివిజన్ పరిధిలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ఈ డిసెంబర్ నాటికి జీఎస్టీ రెవెన్యూ రూ.156.99 కోట్లు వచ్చిందని వాణిజ్య పన్నుల శాఖ జాయింట్ కమిషనర్ కిరణ్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024లో ఇది రూ.108.07 కోట్లుగా ఉందన్నారు. అదే విధంగా ఎస్జీఎస్టీ 2024లో 50.83 కోట్లు ఉండగా, 2025లో 60.73 కోట్లుగా నమోదైందని వివరించారు. 2025 – 26 సంవత్సరానికి సంబంధించి వాహనాల తనిఖీ ద్వారా రూ.3.36 కోట్ల జరిమానాను వసూలు చేశామని చెప్పారు. విధుల్లో అలసత్వం వహిస్తే అధికారులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. జెడ్పీ ఉన్నత పాఠశాలలో తనిఖీ వరికుంటపాడు: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలను డీఈఓ బాలాజీరావు శుక్రవారం తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు అమలు చేస్తున్న 100 రోజుల ప్రణాళికపై సమీక్షించారు. 50 మంది విద్యార్థుల కోసం రూపొందిస్తున్న యాక్షన్ ప్లాన్.. ప్రణాళిక మేరకు అమలవుతోందాననే అంశమై ఎంఈఓ – 1 కొండయ్య, ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణయ్యను ఆరాతీశారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు మరింత శ్రద్ధతో బోధించాలని సూచించారు. నిధుల దుర్వినియోగంపై ఎంకై ్వరీ మనుబోలు: మండలంలోని వీరంపల్లి పంచాయతీలో నిధుల దుర్వినియోగంపై గతంలో ఫిర్యాదు రావడంతో విచారణను డీఎల్పీ ఓ పుట్టా రమణయ్య శుక్రవారం చేపట్టారు. గతంలో పనిచేసిన పంచాయతీ కార్యదర్శి రాజేశ్వరి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని అభియోగాలు రావడంతో విచారణ చేపట్టేందుకు వచ్చామని తెలిపారు. ప్రాథమికంగా విచారణను ప్రారంభించామని, పండగలు అయ్యాక పూర్తి స్థాయిలో జరుపుతామని వివరించారు. శ్రీవారి దర్శనానికి 24 గంటలు తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ శుక్రవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. శిలాతోరణం వద్దకు క్యూ చేరుకుంది. స్వామివారిని 72,255 మంది గురువారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 37,154 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన వారికి సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 12 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
● సీపీఐ జిల్లా కార్యదర్శి నాగేంద్రసాయి నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పీపీపీ విధానంతో పేద, మద్య తరగతి విద్యార్థులు వైద్య విద్యకు దూరమవుతారని సీపీఐ జిల్లా కార్యదర్శి అరిగెల నాగేంద్రసాయి అన్నారు. ఆ పార్టీ శత జయంతి ఉత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం నెల్లూరులోని సంతపేటలో ఉన్న జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం కోసం సీపీఐ పోరాటాలు చేస్తోందన్నారు. జనవరి 18వ తేదీ తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో నిర్వహించే శత జయంతి ముగింపు కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు తరలివస్తారన్నారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి వీబీ–జీ రాం జీ చట్టాన్ని తీసుకురావడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉఫాది హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తోందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు వ్యక్తులకు అప్పజెబుతోందని, దీంతో పేద విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు. ఈ విధానంపై రాజకీయ పార్టీలు నిరసనలు, అభ్యంతరాలు తెలిపినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. పీపీపీ విధానాన్ని రద్దు చేసేంత వరకు సీపీఐ పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర సహాయ కార్యదర్శి సిరాజ్, నాయకులు రామరాజు, రమణయ్య, మాలకొండయ్య, వినోదిని, శంకర్ కిశోర్, మున్నా, జిలానీఖాన్, అజీజ్, వనజ, సోఫియా, జ్యోతి పాల్గొన్నారు. -
‘సౌండ్’బాబులపై కన్నెర్ర
● అధిక శబ్దం వచ్చే సైలెన్సర్ల తొలగింపునెల్లూరు(క్రైమ్): కొంతమంది వాహనదారులు అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను మోటార్‌బైక్‌లకు ఏర్పాటు చేసుకుని యథేచ్ఛగా తిరుగుతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలో నార్త్ ట్రాఫిక్ పోలీసుల శుక్రవారం నెల్లూరు ముత్తుకూరు గేటు సెంటర్ వద్ద స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. అధిక శబ్దం వచ్చే సైలెన్సర్లను తొలగించి ఒరిజినల్ వాటిని దగ్గరుండి ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ పోలీసు అధికారులు మాట్లాడుతూ ప్రజలకు, తోటి వాహనచోదకులకు అసౌకర్యం కలిగిస్తూ శబ్ద కాలుష్యానికి కారణమయ్యే సైలెన్సర్లు వినియోగిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నామన్నారు. వాహనాలకు కంపెనీ ఇచ్చిన సైలెన్సర్లు తొలగించి వేరేవి బిగిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. పెద్ద శబ్దం వచ్చే సైలెన్సర్లు విక్రయించేవారు, వాటిని బిగించే మెకానిక్లపై సైతం చర్యలు తప్పవని హెచ్చరించారు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని సూచించారు. -
చికెన్ వ్యర్థాలు తరలిస్తుండగా..
● మినీవాన్ల పట్టివేత సంగం: మండల పరిధిలోని రాంపు సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం అక్రమంగా తరలిస్తున్న రెండు చికెన్ వ్యర్థాల వాహనాలను పోలీసులు పట్టుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఈ వ్యర్థాలను తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్సై రాజేష్ తన సిబ్బందితో కలిసి తనిఖీలు చేపట్టారు. రెండు మినీవ్యాన్లు నిలిపి పరిశీలించి అందులో 31 డ్రమ్ముల వ్యర్థాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాహనాలను సీజ్ చేశారు. కేసు నమోదు చేశారు. నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని కోరాం ● మంత్రి ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరు(దర్గామిట్ట): రాపూరు, కలువాయి, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని సీఎం చంద్రబాబు, రెవెన్యూ శాఖ మంత్రి, కలెక్టర్‌ను కోరినట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. విభజన నోటిఫికేషన్ కు సంబంధించి అభ్యంతరాలు తెలియజేయడానికి శుక్రవారం ఆఖరిరోజు కావడంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నెల్లూరులోని క్యాంపు కార్యాలయంలో మంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మూడు మండలాలను నెల్లూరు జిల్లాలోనే కొనసాగించాలని, అలాగే ఆత్మకూరు రెవెన్యూ డివిజన్లో కలపాలని సీఎంకు విన్నవించానన్నారు. ఎమ్మెల్సీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రకు విజ్ఞాపన పత్రాన్ని అందజేశానని తెలిపారు. వైభవంగా క్షేత్రోత్సవంరాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంచలకోనలో గోదాదేవికి ప్రత్యేక పూజలు, క్షేత్రోత్సవం నిర్వహించారు. ధనుర్మాసం పురస్కరించుకుని గోదాదేవికి నాలుగు శుక్రవారాలు క్షేత్రోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా రెండో శుక్రవారం గోదాదేవి ఉత్సవ విగ్రహాన్ని తిరుచ్చిపై కొలువుదీర్చారు. వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించి కోన వీధుల్లో ఊరేగించారు. ఉదయం 5 గంటలకు పెనుశిల లక్ష్మీనరసింహస్వామికి తిరుప్పావై, ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
‘అల్ట్రా మెగా’ భూములపై కన్ను
● ఆక్వా సాగుకు యత్నం ముత్తుకూరు(పొదలకూరు): దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో కృష్ణపట్నం కేంద్రంగా సూపర్ క్రిటికల్ అల్ట్రా మెగా థర్మల్ కేంద్ర నిర్మాణానికి భూములను సేకరించారు. దీనికి గానూ 2700 ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా అందజేయగా, పరిహారాన్నీ చెల్లించారు. అయితే నేటికీ థర్మల్ విద్యుత్ కేంద్ర స్థాపన జరగలేదు. భూములు అన్యాక్రాంతం కాకుండా చుట్టూ కౌంపౌండ్ వాల్‌ను నిర్మించారు. అయితే గోడ సమీపంలో థర్మల్ కేంద్రానికి కేటాయించిన భూములు బీడుగా ఉండడంతో వాటిపై కొందరి కన్ను పడింది. దీంతో అక్కడ ఆక్వా సాగు కోసం సుమారు 25 ఎకరాల్లో కంపకర్రను జేసీబీతో తొలగించారు. సమాచారం తెలుసుకున్న గ్రామస్తులు ఆగ్రహించి అక్కడికి చేరుకోవడంతో ఆక్రమణకు యత్నంచిన వారు పలాయనం చిత్తగించారు. ఈ భూములకు సమీపంలో బకింగ్‌హామ్ కెనాల్ ఉండటంతో ఆక్వాసాగుకు అనుకూలంగా మారడంతో ఖాళీగా ఉన్న భూములపై కొందరు కన్నేసి గుంతలు తీసేందుకు యత్నిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భూముల వద్ద జంగిల్ క్లియరెన్స్ -
ఉపాధి మస్టర్లపై ఏపీడీ విచారణ
కొండాపురం: మండలంలోని ఆరు పంచాయతీల్లో బయటి వ్యక్తులకు ఎన్ఆర్ఈజీఎస్ మస్టర్లను నమోదు చేసే లాగిన్‌ను ఇచ్చి వేయించారంటూ రాష్ట్ర నీటి యాజమాన్య సంస్థ కమిషనర్‌కు మర్రిగుంట సర్పంచ్ దార్ల గోపీ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో గోపీ, ఏపీఓ మురళితో విచారణను కందుకూరు డివిజన్ ఏపీడి శ్రీనివాసరావు శుక్రవారం నిర్వహించారు. పూర్తి స్థాయిలో విచా రణ కాలేదని, మరోసారి జరిపి వివరాలను వెల్లడిస్తామని ఏపీడీ చెప్పారు. ఈ సందర్భంగా గోపీ మాట్లాడారు. మండలంలోని ఆరు పంచాయతీల్లో కొత్త వ్యక్తులకు మస్టర్ల లాగిన్‌ను స్థానిక ఎంపీడీఓ ఆదినారాయణ, ఏపీఓ మురళిలు ఇచ్చి వేయించారని ఆరోపించారు. దీనిపై గతంలో ఉదయగిరి ఏపీడీ విచారణ నిర్వహించినా, న్యాయం లభించకపోవడంతో కమిషనర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. డిప్యూటీ ఎంపీడిఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఇరిగేషన్ అవినీతిపై విచారణకు సిద్ధమా..?
● సోమిరెడ్డి జీవితమంతా అవినీతిమయం ● మండిపడిన మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మనుబోలు: సర్వేపల్లి నియోజకవర్గంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమానని ఎమ్మెల్యే సోమిరెడ్డికి మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి సవాల్ విసిరారు. మనుబోలులో గురువారం పర్యటించిన ఆయన.. పలు సమస్యలపై ప్రజలతో చర్చించారు. పార్టీ నేత కమలాకర్‌రెడ్డి సతీమణి రాధమ్మ పెద్దకర్మకు హాజరై కుటుంబసభ్యులను పరామర్శించారు. అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్వేపల్లిలో వివిధ కాలువలకు ఏర్పాటు చేసిన షట్టర్ల విషయంలో తాను అవినీతికి పాల్పడ్డానని ఆరోపిస్తున్న సోమిరెడ్డి సీబీఐ విచారణకు సిద్ధమానని ప్రశ్నించారు. పనులు చేసిన కాంట్రాక్టర్లను బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజేందుకు సోమిరెడ్డి ఆడుతున్న డ్రామాగా అభివర్ణించారు. గతంలో నీరు – చెట్టు పేరు చెప్పి పనులు చేయకుండానే బిల్లులు చేసుకున్న పంథాను ఇప్పటికీ ఆయన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. మోంథా తుఫాన్‌తో దెబ్బతిన్న కాలువలు, చెరువుల మరమ్మతులకు గానూ జిల్లాలోని నియోజవర్గాలకు రూ.97 కోట్లు, సర్వేపల్లికి రూ.17 కోట్లను కలెక్టర్ మంజూరు చేశారని తెలిపారు. గతంలో వివిధ పద్దుల కింద మంజూరైన పనులనే తాజాగా మోంథా తుఫాన్ పేరిట మరోసారి ఇచ్చారంటూ ఆధారాలు చూపారు. సర్వేపల్లిలో తాను చెప్తున్న 316 పనులను ఎక్కడ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వ హయాంలో చేసిన పనులకు సైతం వివిధ పద్దుల్లో బిల్లులు చేసుకుంటున్నారని ఆరోపించారు. రూ.కోట్ల దోపిడీకి స్కెచ్ పులికల్లు వద్ద 100 క్యూసెక్కుల డిస్చార్జ్ కెపాసిటీ లేని కాలువను చూపి రూ.కోట్లు దోచుకునేందుకు స్కెచ్ వేశారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు సాగునీరు, యూరియాను సమృద్ధిగా అందించడంతో పాటు గిట్టుబాటు ధరను కల్పించి.. నష్టపోయిన వారికి ఇన్పుట్ సబ్సిడీని ఇచ్చి ఆదుకున్నామని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం రైతులను అడ్డుపెట్టుకొని అవినీతికి సోమిరెడ్డి పాల్పడుతున్నారని మండిపడ్డారు. పంపిణీ చేస్తున్న విత్తనాలు సక్రమంగా మొలకెత్తకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని తెలిపారు. సోమిరెడ్డికి నీతి, నిజాయతీ ఉంటే అన్నదాతల సమక్షంలో చర్చకు సిద్ధపడాలని సూచించారు. ఆయన అవినీతి బాగోతాన్ని ఆర్టీఐ ద్వారా త్వరలోనే బహిర్గతం చేస్తామని స్పష్టం చేశారు. నేతలు బొమ్మిరెడ్డి హరగోపాల్‌రెడ్డి, ముంగర రవీంద్రరెడ్డి, కడివేటి చంద్రశేఖర్‌రెడ్డి, ఎంపీపీ గుండాల వజ్రమ్మ, దాసరి భాస్కర్‌గౌడ్, సూరపనేని కిశోర్‌నాయుడు, భాస్కర్‌రెడ్డి, కోటేశ్వరగౌడ్, గిరి, నవకోటి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ పతనం ప్రారంభం
నెల్లూరు(వీఆర్సీసెంటర్): రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వ పతనం ప్రారంభమైందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు మోహన్‌రావు పేర్కొన్నారు. అనకాపల్లికి చెందిన పార్టీ నేత, ప్రజా ఉద్యమనేత అప్పలరాజుపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి, పీడీ యాక్ట్‌ను నమోదు చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని గాంధీబొమ్మ సెంటర్ నుంచి వీఆర్సీ సెంటర్ వరకు భారీ ర్యాలీని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రజా సమస్యలపై ఉద్యమించే వారిపై పీడీ యాక్ట్‌ను నమోదు చేయడంలో ఉన్న శ్రద్ధ.. గంజాయి బ్యాచ్, మహిళలను అక్రమ రవాణా చేస్తున్న వారు, కిరాయి హంతకులను పట్టుకోవడంలో ఎందుకు లేదని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ధ్వజమెత్తారు. ఉద్యమాలు చేసే వారిపై పీడీ యాక్ట్‌ను ప్రయోగించడాన్ని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో సర్కార్ ఘోరంగా విఫలమైందని మండిపడ్డారు. నగరంలో గంజాయిపై వ్యతిరేకంగా పోరాడిన పెంచలయ్య హత్య ఘటనపై సీఎం చంద్రబాబు, హోంమంత్రి అనిత ఇప్పటికీ నోరుమెదపకపోవడం, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి అద్దం పడుతోందని చెప్పారు. పార్టీ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మూలి వెంగయ్య, పుల్లయ్య, నేతలు కొండా ప్రసాద్, నాగేశ్వరరావు, వెంకమరాజు, శ్రీరాములు, శేషయ్య, అజీజ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి బ్యాచ్ ఆగడాలు, మహిళల అక్రమ రవాణాను అరికట్టలేని సర్కార్ ప్రజాసమస్యలపై పోరాడేవారిపై పీడీ యాక్టా..? ధ్వజమెత్తిన సీపీఎం నేతలు -
భగవద్గీత శ్లోక పోటీలకు విశేష స్పందన
నెల్లూరు(బృందావనం): నగరంలోని పురమందిరంలో సృజన సాహిత్య సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు దగ్గుపాటి రాధాకృష్ణ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన భగవద్గీత శ్లోక పోటీలకు విశేష స్పందన వచ్చింది. ఈ పోటీల్లో పాల్గొన్న ఔత్సాహికులు శ్రావ్యంగా ఆలపించిన శ్లోకాలు భక్తిభావాన్ని ప్రేరేపించాయి. జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహకంగా జ్ఞాపికలు, ప్రశంసాపత్రాలు, నగదు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, పల్మనాలజిస్ట్ డాక్టర్ డి.మధుసూదన్, సామాజిక సేవకులు పెనాక సుజితరెడ్డి, ఆడిటర్లు జేవీ చలపతిరావు, ఎం.బాలకృష్ణ, ఏజే గుప్తా, సతీష్‌కుమార్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. భగవద్గీత విశిష్టతను వివరించారు. -
ఎన్నో సంవత్సరాల క్రితం ఓ ట్రస్ట్‌కు ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇప్పటి వరకు ఆ స్థలంలో ఒక్క కట్టడం చేపట్టలేదు. పిల్లలకు చదువు చెప్పలేదు. స్థలానికి అమాంతం విలువ పెరిగిందని అమ్మేందుకు చూస్తున్నారు. దీనిపై సహించేది లేదని కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెం గ్ర
● ట్రస్ట్ భూముల్లో జామాయిల్ చెట్ల నరికివేత ● గురువారం కూడా అడ్డుకున్న గ్రామస్తులు ● నిర్వాహకులపై ఆగ్రహంకలిగిరి: మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌కు ఇచ్చిన భూముల్లో జామాయిల్ మొక్కల తొలగింపు, చదును, ప్రహరీ నిర్మాణ పనులను గురువారం స్థానిక జిర్రావారిపాళెం గ్రామస్తులతోపాటు కలిగిరివాసులు కూడా అడ్డుకున్నారు. 1995లో కలెక్టర్ సిఫార్సు మేరకు కలిగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 1012లో 4.02 ఎకరాలను మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌కు కళాశాల నిర్మాణానికి కేటాయించారు. అనంతరం 4.02 ఎకరాల్లో 80 సెంట్ల భూమిని శ్మశానానికి కేటాయించారు. ప్రస్తుతం సర్వే నంబర్ 1012–1లో 3.22 ఎకరాలు ట్రస్ట్ పేరుపై ప్రభుత్వ భూమిగా నమోదై ఉంది. ట్రస్ట్ తరఫున ఆ భూముల్లో జామాయిల్‌ను సాగు చేస్తున్నారు. ఈ భూమి జాతీయ రహదారిని ఆనుకుని ఉండటంతో ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ నేపథ్యంలో భూములను రూ.4.60 కోట్లకు అమ్మకాలు జరపడానికి చూస్తున్నారని విమర్శలొచ్చాయి. దీనికి బలం చేకూరుస్తూ ఆగస్టు 30వ తేదీన వింజమూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు జామాయిల్ మొక్కలు తొలగించడానికి ప్రయత్నించాడు. గ్రామస్తులు వ్యతిరేకించండంతో ఆ ప్రయత్నాలు నిలిచిపోయాయి. గ్రామస్తుల ఆగ్రహం బుధవారం రాత్రి భారీ యంత్రాలతో జామాయిల్ చెట్లను తొలగించడానికి పనులు మొదలు పెట్టారు. గ్రామస్తులు అడ్డుకోవడంతో ఆపేశారు. మళ్లీ గురువారం చెట్లను తొలగించడం.. ప్రహరీ నిర్మాణమంటూ ఐరన్‌ను తీసుకురావడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చెట్లను తొలగిస్తున్న వాహనాన్ని పొలంలో నుంచి బయటకు పంపారు. ట్రస్ట్ అడ్వైజర్ కృష్ణారెడ్డి వచ్చి రైతులతో మాట్లాడారు. పొలం అమ్మడం లేదని, ప్రహరీ నిర్మాణం మాత్రమే చేపడుతున్నామని చెప్పారు. దీంతో రైతులు, గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇప్పటి వరకు సాగులో ఉన్న జామాయిల్ మీరు కొట్టుకుంటున్నారు. ఒక్క సెంటు భూమి కూడా ఆక్రమణకు గురవ్వలేదు. హడావుడిగా ప్రహరీ నిర్మించాల్సిన అవసరం ఏంటి?, చెట్లను ఎందుకు తొలగిస్తున్నారని నిలదీశారు. మీతో తిరిగే వాళ్లే పొలం కొనుగోలు చేశామని చెబుతున్నారు. మీరేమో అమ్మలేదంటున్నారు. పొంతన లేని సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఏంటని అడిగారు. ట్రస్ట్ పేరుతో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనార్థం పనులకు అయితే అంగీకరిస్తాం గానీ అమ్మకాలు జరపడానికి ఉపేక్షించమన్నారు. ఇక్కడ జరుగుతున్న విషయాలు అన్ని ట్రస్ట్ పెద్దలకు తెలుసా అని నిలదీశారు. గ్రామస్తుల వ్యతిరేకతతో పనులు నిలిపివేశారు.ఉద్యమం చేస్తాం నిబంధనలను వ్యతిరేకించి ట్రస్ట్ భూములను అమ్మకాలు జరిపితే సహించం. ప్రహరీ నిర్మాణానికి ఈ స్థాయిలో జామాయిల్ తొలగించాల్సిన అవసరం లేదు. భూములు అన్యాక్రాంతం అయితే తీవ్రస్థాయిలో ఉద్యమం చేస్తాం. – నోటి బుజ్జిరెడ్డి, జిర్రావారిపాళెం ఎంపీ మాగుంటకు తెలుసో.. లేదో ట్రస్ట్ భూముల్లో జరుగుతున్న వ్యవహారం ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డికి తెలుసో.. లేదో అని అనుమానంగా ఉంది. ట్రస్ట్ తరఫున వస్తున్న వ్యక్తి మమ్మల్ని ఒంగోలులో ఎంపీ కార్యాలయానికి వచ్చి సమస్యను పరిష్కరించుకోమనడంలో మతలబు ఏమిటో అర్థం కావడం లేదు. భూములను ప్రజాప్రయోజన కార్యక్రమాలకు వినియోగించాలి. – బొర్రా మాల్యాద్రిరెడ్డి, జిర్రావారిపాళెం -
పులి సంచారంతో కలకలం
● దుర్గంపల్లి రిజర్వ్ ఫారెస్ట్‌లో సంచారం ఉదయగిరి: ఉదయగిరి దుర్గం రిజర్వ్ ఫారెస్ట్‌లో పులి సంచారంపై కలకలం కొనసాగుతోంది. తాజాగా దుర్గంపల్లి అటవీ ప్రాంతంలో పులి పాదముద్రలను గురువారం గమనించిన స్థానికులు, విషయాన్ని ఆ శాఖ అధికారులకు తెలియజేశారు. దీంతో అక్కడికి వారెళ్లి పరిశీలించి.. పాదముద్రలను సేకరించారు. మంగళవారం రాత్రి సంచరించిన పులి అడుగులు.. ప్రస్తుతానివి పోలి ఉన్నాయనే అంశాన్ని గుర్తించారు. నిర్ధారణ నిమిత్తం వీటిని ల్యాబ్‌కు పంపారు. కాగా తాజాగా కనుగొన్న పాదముద్రలు ఉదయగిరి పట్ణణ శివారులో ఉండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కదలికలను అధికారులు నిఽశితంగా గమనిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు జనావాస ప్రాంతాలు, రహదారి మార్గంలో పులి కదలికలు ఉండటంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పెంచలకోన రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్దపులుల సంచారం ఉందని తెలుస్తోంది. మర్రిపాడు – బద్వేల్ జాతీయ రహదారిలో వెంకటాపురం వద్ద కారును పెద్ద పులి ఢీకొందనే ప్రచారం గతేడాది జరిగింది. ఏదిఏమైనా నిర్ధారించడంలో అధికారులు జాప్యం చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అలంకారప్రాయంగా సీసీ కెమెరాలు
● నెల్లూరు ఎంఎల్ఎ్స్ పాయింట్లో ఇదీ పరిస్థితి ● బియ్యం అక్రమ రవాణా కోసమేనా.. ● పని చేయకుండా చేశారని ఆరోపణలునెల్లూరు ఎంఎల్ఎస్ పాయింట్ నెల్లూరు(పొగతోట): ప్రజా పంపిణీ వ్యవస్థ సక్రమంగా పారదర్శకంగా జరిగేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారు. బియ్యం అక్రమ రవాణా చేయలేమని, గుట్టు రట్టువుతుందని ఈ పనికి పూనుకున్నట్లు ఆరోపణలున్నాయి. నెలలుగా కెమెరాలు పని చేయకపోయినా పట్టించుకున్న నాథుడు లేడు. మరమ్మతులు చేయించే విషయంలో ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దీంతో బియ్యం అక్రమ రవాణా యథేచ్ఛగా జరుగుతోంది. నిబంధనలు తుంగలో తొక్కి.. జిల్లాలో 1,513 చౌక దుకాణాలున్నాయి. 7.20 లక్షల రేషన్ కార్డుదారులున్నారు. ప్రతినెలా 10 వేల నుంచి 11 వేల టన్నుల బియ్యం పది ఎంఎల్ఎస్ పాయింట్ల ద్వారా చౌకదుకాణాలకు సరఫరా చేస్తున్నారు. వాటిల్లో ఇన్చార్జిలుగా డిప్యూటీ తహసీల్దార్, లేదా సీనియర్ అసిస్టెంట్ హోదా కలిగిన అధికారులను నియమించాలి. కానీ కొంత కాలంగా మూడు పాయింట్లకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఇన్చార్జిలుగా నియమించారు. మరో మూడుచోట్ల సీసీఎస్ డీటీలను వేశారు. కానీ ఇలా చేయకూడదు. నిబంధనలు తుంగలో తొక్కి ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ఇక్కడిలా.. నెల్లూరు ఎంఎల్ఎస్ పాయింట్ జిల్లాలో ప్రాధానమైనది. ఇక్కడి నుంచి సుమారు 230 చౌక దుకాణాలకు ప్రతినెలా రేషన్ సరఫరా చేస్తున్నారు. అటువంటి కీలకమైన చోట అనేక నెలలుగా సీసీ కెమెరాలు పని చేయడం లేదు. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుగా ఉన్నాయని సిబ్బంది అవి పనిచేయకుండా చేశారని ఆరోపణలున్నాయి. ఫలితంగా కొంత కాలంగా ప్రైవేట్ వ్యక్తులు వాహనాల్లో బియ్యం అక్రమ రవాణాను కొనసాగించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి ఈ విషయాన్ని గమనించి జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.మరమ్మతులు చేయిస్తాం నెల్లూరు ఎంఎల్ఎస్ పాయింట్లో సీసీ కెమెరాలు పని చేయడం లేదని నా దృష్టికి వచ్చింది. మరమ్మతులు చేయిస్తాం. ఎంఎల్ఎస్ పాయింట్లలో తప్పకుండా కెమెరాల ఏర్పాటుకు చర్యలు చేపడతాం. పాయింట్లో ప్రైవేట్ వ్యక్తులు, వాహనాలు వచ్చినట్లు రుజువైతే దానికి సంబంఽధించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. – ఎం.వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ -
పని దొరకడం లేదని..
● కత్తితో మెడ కోసుకున్న వ్యక్తి ● నెల్లూరు నగరంలో ఘటననెల్లూరు(వీఆర్సీసెంటర్): పట్టపగలు ఓ వ్యక్తి కత్తితో తన మెడ కోసుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఘటన నెల్లూరులోని కనకమహాల్ సెంటర్ వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మంగళగిరి మండలం వడ్డేశ్వరం గ్రామానికి చెందిన 41 సంవత్సరాల వయసున్న అమీర్‌వలీ బేల్దారి పనులు చేస్తుంటాడు. ఈ క్రమంలో పనుల కోసం కొద్దిరోజుల క్రితం నెల్లూరుకు వచ్చాడు. ఇక్కడ పనులు దొరక్కపోవడంతో మానసికంగా ఆందోళనకు గురైన అతను గురువారం ఉదయం కనకమహాల్ సెంటర్ వద్ద మెయిన్ రోడ్డుపై చేరి చిన్న కత్తితో తన మెడ, పొట్ట భాగాల్లో కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న సంతపేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అమీర్వలీని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో భార్య, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేశారు.కోడిపందేల స్థావరాలపై దాడులు సైదాపురం: మండలంలోని పెరుమాళ్లపాడు గ్రామ శివారు ప్రాంతాల్లో గురువారం కోడిపందేల స్థావరాలపై ఎస్సై క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. రూ.3,320 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.భార్యను కిడ్నాప్ చేశారని ఫిర్యాదు సైదాపురం: తనపై దాడి చేసి భార్యను ఆమె బంధువులు కిడ్నాప్ చేశారంటూ మండలంలోని అనంతమడుగు గ్రామ పంచాయతీ కుంటిరాజుపాళెం గ్రామానికి చెందిన మందపాటి శివశంకర్ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదులోని వివరాల మేరకు.. శివశంకర్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్. కందుకూరుకు చెందిన మైత్రి అనే యువతి బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగాన్వేషణలో ఉంది. వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈనెల 15వ తేదీన అక్కడే రిజిస్టర్ వివాహం చేసుకున్నారు. అక్కడ్నుంచి కుంటిరాజుపాళెం గ్రామానికి వచ్చారు. కాగా యువతి తల్లిదండ్రులకు ఈ పెళ్లి ఇష్టం లేదు. దీంతో రెండు రోజుల క్రితం రాపూరు పోలీస్‌స్టేషన్‌లో ఇరు కుటుంబాలకు చెందిన వారి సమక్షంలో రాజీ కూడా చేసి పంపేశారు. గురువారం సెలవు దినం కావడంతో శివశంకర్ భార్యతో కలిసి స్వగ్రామం నుంచి మోటార్‌బైక్‌పై గూడూరుకు వెళ్తున్నాడు. మైత్రి బంధువులు కర్రలతో శివశంకర్‌పై దాడి చేశారు. తన భార్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
అధికారం ఉంది.. మా ఇష్టం
సాక్షి, టాస్క్‌ఫోర్స్: అధికారం ఉందని కొందరు కూటమి నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతంలో ప్రభుత్వ భూములను ఆక్రమించి ఆక్వా కల్చర్ సాగుకు సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల హెచ్చరికలను బేఖాతరు చేస్తూ వారంరోజులుగా రొయ్యల గుంతల నిర్మాణాన్ని చేపట్టారు. 13 భారీ యంత్రాలను ఉపయోగించి వంద ఎకరాల్లో గుంతల నిర్మాణం పూర్తి చేస్తున్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడతారని తీరప్రాంత గ్రామస్తులు భయపడుతున్నారు. సీఆర్‌జెడ్ (కోస్టల్ రెగ్యులర్ జోన్) నిబంధనలను తుంగలో తొక్కి పెద్దఎత్తున ప్రభుత్వ భూముల్లో ఆక్వా కల్చర్‌కు సిద్ధమయ్యారు. ముత్తుకూరు మండలం కృష్ణపట్నం తీరప్రాంత గ్రామానికి సమీపంలో ఈ తంతు జరుగుతున్నా ఆపేవారు లేరు. పట్టించుకోకుండా.. కృష్ణపట్నం గ్రామ సచివాలయానికి 4.5 కి.మీ దూరంలోనే అక్రమంగా ఆక్వా గుంతల నిర్మాణం జరుగుతున్నా పట్టించుకోవడం లేదు. స్థానికంగా ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ భూముల్లో వివిధ రకాల పంటల సాగు చేసుకుని జీవిస్తున్నారు. అయితే అధికారాన్ని అడ్డుపెట్టుకున్న కొందరు ఇక్కడ రొయ్యల సాగుకు శ్రీకారం చుట్టారు. పేదల చేతుల్లో ఉన్న ప్రభుత్వ భూములకు ఎంతో కొంత ముట్టజెప్పి స్వాధీనం చేసుకుని పెద్ద ఎత్తున గుంతలను తవ్విస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. బాగా ఎత్తులో మట్టికట్టలను నిర్మించి గుంతలను తయారు చేస్తున్నారు. సమాచారం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు వారించేందుకు వెళ్లి అధికార బలం ముందు ఏమి చేయలేక నిలిపివేయాల్సిందిగా మౌఖిక ఆదేశాలు మాత్రం అందజేసినట్టు తెలుస్తోంది. చర్యలు తీసుకోవాలి సీఆర్‌జెడ్ నిబంధనల ప్రకారం సముద్ర తీరానికి 500 మీటర్ల దూరం వరకు ఎలాంటి నిర్మాణాలు, పనులు చేపట్టేందుకు అవకాశం లేదు. తీరప్రాంతాల పర్యావరణ పరిరక్షణ చట్టం 1986 కింద అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ద్వారా చేయబడింది. అయితే సీఆర్‌జెడ్ నిబంధనలను తొంగలో తొక్కి యథేచ్ఛగా 100 మీటర్ల లోపలే రొయ్యల సాగు కోసం గుంతలను నిర్మిస్తున్నారు. ఇక్కడ బయటి ప్రాంతం నుంచి వచ్చి పట్టపగలే పనులు చేయిస్తున్నారంటే స్థానికంగా ఎవరి అండదండలు ఉన్నాయనేది పెద్దఎత్తున చర్చనీయాంశంగా మారింది. దీనికితోడు ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో అధికార పార్టీ నాయకులు తెరవెనుక ఉండి నడుపుతున్నారనే ప్రచారం జోరందుకుంది. ఇకనైనా అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఆక్వా కల్చర్ చెలరేగిపోతున్న నాయకులు సముద్ర తీరంలో భారీ యంత్రాలతో గుంతలు అధికారుల హెచ్చరికలు బేఖాతరు సీఆర్‌జెడ్ నిబంధనలకు తూట్లు -
పుష్పాలంకరణలో రంగడి దర్శనం
నెల్లూరు(బృందావనం): నెల్లూరు నగరంలోని రంగనాయకులపేటలోని శ్రీదేవి, భూదేవి సమేత తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పగల్‌పత్తు ఉత్సవాల్లో భాగంగా ఆరో రోజైన గురువారం రంగనాథ స్వామి విశేష పుష్పాలంకరణలో దర్శనమిచ్చారు. ఉభయదేవేరులతో కొలువైన స్వామివారిని భక్తులు దర్శించుకుని తీర్థ, ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా డాక్టర్ ఎం.ప్రసన్నగుప్తా, దుర్గావరం వ్యవహరించారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆళ్ల శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు. -
నెల్లూరు డివిజన్ పరిధిలో ఇలా..
నెల్లూరు (టౌన్): వ్యాపారుల స్వార్థం.. అధికారుల అలసత్వం.. వెరసి జీఎస్టీ వసూళ్లు పతనమవుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుముఖం పడుతోంది. వాస్తవానికి నెల్లూరు డివిజన్ పరిధిలో నెల్లూరు, ప్రకాశం జిల్లాలున్నాయి. జిల్లాలో నెల్లూరు – 1, 2, 3, కావలి, కందుకూరు.. ప్రకాశం జిల్లాలో ఒంగోలు – 1, 2, మార్కాపురంలో జీఎస్టీ కార్యాలయాలు ఉన్నాయి. నెల్లూరు డివిజన్ పరిధిలో 29,852 మంది రెగ్యులర్ పన్ను చెల్లింపుదారులు.. 5589 మంది కాంపోజిషన్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారు. అంతా గోప్యం ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల్లోపు వ్యాపారం చేసే డీలర్లు మూడు నెలలకోసారి.. రూ.50 లక్షలకు పైగా టర్నోవర్ గల వారు ప్రతి నెలా రిటర్న్స్‌ను చూపాల్సి ఉంటుంది. ఈ జిల్లాల్లో గ్రానైట్, ఆటోమొబైల్స్, వెజిటబుల్ ఆయిల్స్, ఎర్త్ మూవింగ్ ఎక్విప్మెంట్స్, ఎలక్ట్రానిక్స్ తదితర వ్యాపారాలున్నాయి. వీటి నుంచి జీఎస్టీ రావాల్సి ఉంది. అయితే గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం 30 శాతం రాబడి తగ్గిందనే ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారంలో జిల్లా అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలిసింది. అయితే నెల్లూరు డివిజన్ పరిధిలో జీఎస్టీ వివరాలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. ఈ అంశాలను వెల్లడించొద్దంటూ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని సెలవిస్తున్నారు. విక్రయాలు కొండంత..పన్ను చెల్లింపు గోరంత జిల్లాలోని అధిక వ్యాపారులు నిత్యం రూ.లక్షల్లో వ్యాపారాలు చేస్తున్నా, జీఎస్టీని మాత్రం తక్కువ మొత్తంలో చెల్లిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ఐదు శాతం.. 18 శాతమనే రెండు స్లాబులను అమలు చేస్తున్నారు. దుకాణంలో రూ.300కుపైగా కొనుగోళ్లను జరిపితే జీఎస్టీ నంబర్‌తో ఉన్న ఒరిజినల్ బిల్లును వినియోగదారులకు ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే ఇదెక్కడా అమలు కావడంలేదు. ఒకవేళ ఎవరైనా అడిగితే ధర పెరుగుతుందని చెప్తున్నారు. ఉదాహరణకు హోటళ్లలో వినియోగదారులపై ఐదు శాతం జీఎస్టీని విధిస్తున్నారు. అయితే ఎక్కడా బిల్లులను మాత్రం ఇవ్వడంలేదు. కొందరు వ్యాపారులు కొటేషన్ రూపంలో.. మరికొందరు డూప్లికేట్ బిల్లు బుక్కును ముద్రించి అందిస్తున్న పరిస్థితి నెలకొంది. జిల్లాలో రెడీమేడ్ వస్త్రాలు, ఆటోమొబైల్స్, ఎలాక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, లాడ్జిలు, హార్డ్‌వేర్, బంగారు తదితర దుకాణాల్లో వ్యాపారం నిత్యం భారీగా జరుగుతోంది. అయితే ఇక్కడ కొద్ది మొత్తంలోనే బిజినెస్‌ను చూపి జీఎస్టీని భారీగా ఎగ్గొట్టి ప్రభుత్వాదాయానికి గండికొడుతున్నారు. రెగ్యులర్ ట్యాక్స్ పేయర్స్ 29,852 కాంపోజిషన్ పన్నుదారులు 5589 మంది మామూళ్ల మత్తులో అధికారులు జిల్లాలో వాణిజ్య పన్నుల శాఖ అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. డివిజన్లోని ఆయా సర్కిళ్ల పరిధిలో గల వ్యాపారులతో నెలవారీ మామూళ్లను కుదుర్చుకున్నారనే ఆరోపణలూ లేకపోలేదు. వినియోగదారులు ఫిర్యాదు చేసినా పట్టించుకున్న దాఖలాల్లేవు. బెంగళూరు, హైదరాబాద్, చైన్నె తదితర ప్రాంతాల నుంచి బిల్లుల్లేకుండా వస్తువులను నిత్యం తీసుకొస్తున్నా, తనిఖీ చేసే నాథుడే కరువయ్యారు. దుకాణాన్ని బట్టి రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ప్రతి నెలా వసూలు చేస్తున్నారని తెలుస్తోంది. ఫలితంగా అంతా ఇష్టారాజ్యంగా మారింది. కాగా ఈ విషయమై జీఎస్టీ సంయుక్త కమిషనర్ కిరణ్‌కుమార్‌ను సంప్రదించేందుకు యత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు. -
షూటింగ్ బాల్ పోటీలు ప్రారంభం
కావలి (అల్లూరు): పట్టణంలోని డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల సీనియర్ షూటింగ్ బాల్ పోటీలను గురువారం ప్రారంభించారు. 18 జిల్లాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్డీఓ పాండురంగారావు మాట్లాడారు. రాష్ట్రంలో షూటింగ్ బాల్ క్రీడ రోజురోజుకు అభివృద్ధి చెందుతోందని చెప్పారు. క్రీడాకారులు అద్భుతంగా రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. వచ్చే నెల్లో మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి షూటింగ్ బాల్ పోటీల్లో పాల్గొనే రాష్ట్ర జట్టును ఎంపిక చేయనున్నామని వివరించారు. కళాశాల ఏఓ రమేష్‌బాబు, ప్రిన్సిపల్ టీవీరావు, అసోసియేషన్ సభ్యులు కిరణ్‌కుమార్, జయరావు, నాగరాజు, విజయ్‌కుమార్, నరేష్‌బాబు, వేణుగోపాల్, గణేష్, పోటీల నిర్వాహకుడు మురళి, హరి తదితరులు పాల్గొన్నారు. కనియంపాడులో పోలీస్ పికెట్ వరికుంటపాడు: మండలంలోని కనియంపాడులో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిన నేపథ్యంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ పికెట్‌ను ఇన్స్పెక్టర్ వెంకట్రావు, ఎస్సై రఘునాథ్ గురువారం ఏర్పాటు చేశారు. గాయపడిన గుర్రం భాస్కర్‌రెడ్డి, బిజ్జం వెంకటరెడ్డి, పాణ్యం శ్రీనివాసులు.. వరికుంటపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేడుకగా కలభాభిషేకం నెల్లూరు(బృందావనం): మండల పూజలను పురస్కరించుకొని నగరంలోని అయ్యప్ప దేవస్థానంలో కలభాభిషేకాన్ని గురువారం ప్రారంభించారు. చందనాలంకారంలో అయ్యప్పస్వామి దర్శనమిచ్చారు. నిర్మాల్య దర్శనం, క్షీరాభిషేకం, మహోగణపతి హోమం, శీవేలి ఉత్సవం తదితరాలను వేడుకగా జరిపారు. ఉభయకర్తలుగా కుందా సూర్యనారాయణరెడ్డి, ప్రభావతి, కందాటి వెంకటేష్, స్వర్ణ, అల్లాడి హేమ, వెంకటసిద్ధుకృష్ణ, మాచవరం సునీల్, యషిత దంపతులు, సరోజనమ్మ కుటుంబసభ్యులు వ్యవహరించారు. అయ్యప్ప సేవా సమాజ పాలకమండలి అధ్యక్ష, కార్యదర్శులు గూడల శేషగిరిరావు, కత్తుల వెంకటరత్నం, సభ్యులు పావళ్ల ప్రసాద్, మురళీమోహన్‌రెడ్డి, పసుపులేటి అశోక్‌చంద్ర తదితరులు పర్యవేక్షించారు. 4న బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాల ప్రదానం సంగం: జిల్లాలో గత విద్యాసంవత్సరంలో పదో తరగతి, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబర్చిన బలిజ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలను ప్రదానం చేయనున్నామని బలిజ సేవా ఫౌండేషన్ అధ్యక్షుడు పోకల రవికుమార్, ప్రధాన కార్యదర్శి కమతం సుబ్బారావు తెలిపారు. సంగంలో గురువారం నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. నెల్లూరులోని ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి ఆలయ సమీపంలో గల కాపు భవన్లో వీటిని జనవరి నాలుగున అందజేయనున్నామని వివరించారు. పదో తరగతిలో 575కుపైగా, ఇంటర్మీడియట్లో 970కుపైగా మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.ఐదు వేల చొప్పున నగదు, ప్రశంసపత్రాలను అందజేయనున్నామని చెప్పా రు. జిల్లాలోని బలిజ సంఘీయులు హాజరై జయప్రదం చేయాలని కోరారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. బలిజ సేవా ఫౌండేషన్ సభ్యులు చలపతి, తోట భాస్కర్, సురేంద్ర, సుధాకర్, మధుసూదన్, దినేష్ తదితరులు పాల్గొన్నారు. -
క్రిస్మస్ను సుఖసంతోషాలతో జరుపుకోవాలి
నెల్లూరు సిటీ: క్రిస్మస్ను ప్రజలు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, పార్టీ మహిళా విభాగ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత వేర్వేరు ప్రకటనల్లో బుధవారం కాంక్షించారు. ఈ సందర్భంగా క్రిస్మస్ శుభాకాంక్షలను తెలియజేశారు. యేసుక్రీస్తు ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి నెల్లూరు(దర్గామిట్ట): జిల్లా ప్రజలపై యేసుక్రీస్తు ఆశీస్సులు మెండుగా ఉండాలని.. ప్రజలు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్థిల్లాలని కలెక్టర్ హిమాన్షు శుక్లా బుధవారం ఒక ప్రకటనలో కాంక్షించారు. ఈ మేరకు క్రిస్మస్ శుభాకాంక్షలను ఆయన తెలియజేశారు. పారిశ్రామికవేత్తలతో అవగాహన సదస్సు రేపు నెల్లూరు సిటీ: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలతో అవగాహన సదస్సును నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో శుక్రవారం నిర్వహించనున్నామని జిల్లా ప్రజారవాణాధికారి షమీమ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కోవూరు బస్టాండ్, ఆత్మకూరు డిపో పరిధిలోని ఖాళీ స్థలాలను లీజుకు ఇచ్చేందుకు నిర్ణయించామని చెప్పారు. ఇందులో భాగంగా సందేహాలను నివృత్తి చేసేందుకు గానూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని వెల్లడించారు. కబడ్డీ మహిళా జట్టు ఎంపికలు రేపు నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): జిల్లా మహిళా కబడ్డీ జట్టును రంగనాయకులపేటలోని సెయింట్ పీటర్స్ స్కూల్లో శుక్రవారం ఎంపిక చేయనున్నామని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు హరీష్, గంటా సతీష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 75 కిలోల్లోపు బరువున్న వారు అర్హులని చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవానరంలో వచ్చే నెల్లో నిర్వహించనున్న అంతర్ జిల్లాల మహిళా కబడ్డీ చాంపియన్‌షిప్‌లో జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారని వివరించారు. లైసెన్స్‌ల పునరుద్ధరణకు గడువు పొడిగింపు మర్రిపాడు: పంట కాలం 2025 – 28కు సంబంధించిన పొగాకు సాగుకు లైసెన్స్‌ల పునరుద్ధరణకు గడువును జనవరి ఐదు వరకు పొడిగించామని డీసీపల్లి వేలం కేంద్ర నిర్వహణాధికారి రాజశేఖర్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.400 అపరాధ రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని వివరించారు. ఆపై ఎలాంటి అవకాశం ఉండదని, వివరాలకు బోర్డు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు. లారీని ఢీకొన్న కారు ● నెల్లూరు వాసులకు స్వల్ప గాయాలు నాయుడుపేటటౌన్: మండలంలోని బిరదవాడ సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో కారులో ఉన్న వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరుకు చెందిన వారు చైన్నె వైద్యశాలలో ఉన్న వ్యక్తిని తీసుకొని కారులో బయల్దేరారు. వాహనం బిరదవాడ గ్రామానికి వచ్చేసరికి జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా ఆగింది. దీంతో కారు అదుపుతప్పి ఢీకొంది. ఘటనలో నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. వీరు మరో కారులో నెల్లూరు వెళ్లారు. కారు ముందు భాగం దెబ్బతింది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
దుర్గంలో పెద్ద పులి సంచారం
ఉదయగిరి: ఉదయగిరి దుర్గంలోని రిజర్వ్ ఫారెస్ట్‌లో పెద్ద పులులు సంచారిస్తున్నాయనే అనుమానాలకు మంగళవారం రాత్రితో తెరపడింది. బండగానిపల్లి ఘాట్ రోడ్డులో బైక్‌పై వెళ్తున్న ఇద్దరికి పెద్ద పులి కంటపడింది. ప్రత్యక్ష సాక్షుల వివరాల మేరకు.. బిజ్జంపల్లికి చెందిన నాయబ్ అనే టైలర్ 18 ఏళ్లుగా ఉదయగిరిలో దర్జీ పనిచేస్తూ రోజు ఇంటి నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ క్రమంలో రోజు మాదిరిగానే రాత్రి 7.30కు షాపును మూసేసి మరో వ్యక్తితో కలిసి బైక్‌పై ఇంటికి ఘాట్ రోడ్డులో బయల్దేరారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో అటవీ ప్రాంతానికి వెళ్లగా, బండగానిపల్లి ఘాట్‌రోడ్డులోని కనుమ బావి మలుపు వద్ద రోడ్డుపై కూర్చొని ఉన్న పెద్దపులి కంటపడింది. 12 అడుగుల దూరంలో ఉన్న పులిని గమనించి షాక్‌కు గురై బైక్‌ను ఆపేశారు. దీంతో పెద్దపులి అడవిలోకి వెళ్లిపోయింది. కొంత సమయం వేచి ఉండి ఆపై వారు బయల్దేరారు. దీనిపై అటవీ అధికారులకు ఫోన్లో తెలియజేశారు. విషయం బుధవారం ఉదయానికి అందరికీ తెలిసిపోయింది. దీంతో అనేక మంది ఆ ప్రాంతానికి వెళ్లి పాదముద్రలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఫారెస్ట్ అధికారి కుమారరాజా తన సిబ్బందితో వెళ్లి పాదముద్రలను సేకరించారు. వివరాలను నిపుణులకు ఫోన్లో తెలియజేయగా, పెద్దపులి అని చెప్పారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాన్ని అటవీ అధికారులు అధికారికంగా ప్రకటించలేదు. పాదముద్రల విశ్లేషణ అనంతరం నివేదిక ఆధారంగా వివరాలను వెల్లడిస్తామన్నారు. కాగా ఈ ప్రాంతంలో రాత్రివేళ ఎవరూ ఒంటరిగా రాకపోకలు సాగించొద్దని సూచించారు. మరోవైపు పెద్ద పులి సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు హడలిపోతున్నారు. ముమ్మరంగా కూంబింగ్ కూంబింగ్‌ను పోలీస్, అటవీ అధికారుల బృందం ముమ్మరంగా నిర్వహిస్తోంది. ఘాట్ రోడ్డులో ఎవరూ వెళ్లకుండా చర్యలు చేపట్టారు. బండగానిపల్లి, బిజ్జంపల్లి, చెరువుపల్లి, చెర్లోపల్లి, కొత్తపల్లి, కృష్ణారెడ్డిపల్లి తదితర గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతానికి సమూహంగా వెళ్లాలని సూచించారు. -
ఐసీడీఎస్ ప్రాజెక్ట్ తీరే వేరయా..!
ఉదయగిరి: స్థానిక ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌లో పనిచేసేందుకు ఉద్యోగులు కొన్నేళ్లుగా ఆసక్తి చూపడంలేదు. బదిలీల్లో ఒకరిద్దరు వచ్చినా, విధుల్లో వారు చేరడం లేదు. దీంతో ప్రాజెక్ట్‌లో పోస్టులు ఎంతో కాలంగా భర్తీ కావడం లేదు. మరోవైపు వింజమూరు ప్రాజెక్ట్‌లో మాత్రం సూపర్వైజర్లు పూర్తి స్థాయిలో ఉండటం గమనార్హం. కేంద్రాలపై పర్యవేక్షణేదీ..? ఉదయగిరి ప్రాజెక్ట్ పరిధిలో వరికుంటపాడు, పెద్దిరెడ్డిపల్లి, దుత్తలూరు, నర్రవాడ, ఉదయగిరి – 1, 2, గండిపాళెం, సీతారామపురం, ఎస్సార్‌నగర్ సెక్టార్లున్నాయి. వాస్తవానికి ఒక్కో సెక్టార్‌కు ఒక సూపర్వైజర్ ఉండాలి. మరోవైపు ప్రాజెక్ట్ పరిధిలో 208 కేంద్రాలుండగా, ఇక్కడ మూడు వేల మందికి పౌష్టికాహారాన్ని రోజూ అందిస్తున్నారు. అయితే వీటన్నింటినీ ఒక్కరే పర్యవేక్షించాల్సి వస్తుండటంతో, ప్రక్రియ సక్రమంగా జరగడంలేదు. ఫలితంగా కేంద్రాలు సజావుగా పనిచేయడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పౌష్టికాహారం సైతం సక్రమంగా అందడంలేదని తెలుస్తోంది. మాకెందుకు..? ఉదయగిరి ప్రాజెక్ట్ పరిధిలో పోస్టుల భర్తీ విషయంలో పాలకుల నిర్లక్ష్యం కొట్టిచ్చినట్లు కనిపిస్తోంది. టీడీపీ ఆధ్వర్యంలో ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 20 నెలలు కావస్తున్నా, ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఏ మాత్రం పట్టించుకోవడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పాలకులు సైతం దృష్టి సారించకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌కు ఆలనాపాలనా కరువైంది. ఇప్పటికై నా అధికారులు స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉదయగిరి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ తీరే వేరుగా ఉంటోంది. వాస్తవానికి జిల్లా కేంద్రానికి వంద కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో విధులు నిర్వర్తించేందుకు ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపరు. ఒక వేళ ఎవర్నైనా నియమించినా, రాజకీయ సిఫార్సులతో అది ఆగిపోతుంది. కొన్నేళ్లుగా ఇక్కడ ఈ తంతు నడుస్తోంది. పదేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొన్నా.. పాలకులు, అధికారులు పెద్దగా దృష్టి సారిస్తున్న దాఖలాల్లేవనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
యూరియాను ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం
కాకాణి గోవర్ధన్‌రెడ్డి పొదలకూరు: రైతులకు యూరియాను అందించలేని అసమర్థ స్థితిలో ప్రభుత్వం ఉందని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. మండలంలోని బిరదవోలు చెర్లోపల్లిలో బుధవారం పర్యటించారు. గ్రామానికి చెందిన పార్టీ నేత బత్తల గోపాల్‌రెడ్డి కర్మక్రియలకు హాజరైన ఆయన్ను రైతలు కలిసి తామెదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. యూరియా సక్రమంగా లభించడంలేదని, నిమ్మకాయలకు కోతకూలీలు సైతం గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గిట్టుబాటు ధరల్లేక నిమ్మ రైతులు అవస్థలు పడుతున్నారని, కాడి వదిలేసేలా వారున్నారని చెప్పారు. యూరియా లభ్యం కాక అష్టకష్టాలు పడుతున్నారని, దిగుమతయ్యే దాన్ని టీడీపీ నేతలు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. క్యూల్లో గంటల తరబడి కర్షకులు నిరీక్షించి, తీరా అది లేదంటుండటంతో వెనుదిరుగుతున్నారని చెప్పారు. దిత్వా తుఫాన్‌తో దెబ్బతిన్న నారుమడుల రైతులకు గత సీజన్లో మిగిలిపోయిన విత్తనాలను రాయితీపై పంపిణీ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. కాలం చెల్లిన వీటి పంపిణీతో మొలకెత్తపోవడంతో మరింత నష్టపోయారని ఆరోపించారు. గతంలో ఉక్రెయిన్ యుద్ధంతో ధాన్యం ధరలు పెరిగాయని సోమిరెడ్డి చెప్తే, అదే యుద్ధంతో యూరియాకు కొరత ఏర్పడిందంటూ పవన్ కల్యాణ్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. దేవుడి ఆస్తులపై కన్నేసిన సోమిరెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ, ప్రజల ఆస్తులతో పాటు ఏకంగా దేవుడి ఆస్తులపైనే సోమిరెడ్డి కన్నేశారని ఆరోపించారు. కాకుటూరు శివాలయ భూములను విక్రయంచిన అంశంపై ప్రశ్నించిన తనపై పోలీస్ కేసును పెట్టారని.. కృష్ణపట్నం వేణుగోపాలస్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో ముడుపులు ముట్టకపోవడంతో టెండర్ల ప్రక్రియను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఆలయానికి సంబంధించిన రూ.మూడు కోట్ల పనులకు టెండర్లు పిలిచి.. టెక్నికల్ బిడ్లు తెరిచి.. ఫైనాన్షియల్ బిడ్లు తెరవకుండా ఎవరడ్డుకుంటున్నారో దేవదాయ శాఖ అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేశారు. పొదలకూరు పట్టణంలో లేఅవుట్ల యజమానుల నుంచి డబ్బులు దండుకునే సంప్రదాయానికి సోమిరెడ్డి నాంది పలికారని మండిపడ్డారు. సర్వేపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఎందరో పనిచేశారని, ఇలా వీరెవరూ దండకాలు సాగించలేదని చెప్పారు. ప్రస్తుత ప్రభుత్వంలో అవినీతే అజెండాగా మార్చుకొని ప్రజలను నానా రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమం తమ హయాంలోనే జరిగాయని గుర్తుచేశారు. తమకు అధికారంతో పనిలేదని.. ప్రజల మధ్యే ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, నేతలు బచ్చల సురేష్‌కుమార్‌రెడ్డి, వెంకటశేషయ్య, కోనం చినబ్రహ్మయ్య, రావుల ఇంద్రసేన్‌గౌడ్, దయాకర్‌రెడ్డి, బత్తల పెంచలరెడ్డి, గోపాలయ్య, సుధాకర్‌రెడ్డి, రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
కరేడులో భారీ చోరీ
● 18 సవర్ల బంగారం అపహరణ ఉలవపాడు: మండల పరిధిలోని కరేడు గ్రామంలో రిటైర్డు టీచర్ ఇంట్లో మంగళవారం రాత్రి భారీ చోరీ జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కరేడుకు చెందిన రిటైర్డు ఉపాధ్యాయురాలు ఉల్చి కమలాదేవి ఉంటోంది. భర్త 19 ఏళ్ల క్రితం మరణించాడు. సంతానం లేకపోవడంతో ఒంటరిగా ఉంటోంది. ఈనెల 14వ తేదీ గాల్‌బ్లాడర్ ఆపరేషన్ చేయించుకోవడానికి ఇంటికి తాళాలు వేసి తిరుపతికి వెళ్లింది. అయితే ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయని, తలుపు తెరిచి ఉన్నాయని స్థానికులు మంగళవారం శింగరాయకొండలోని కమలాదేవి మరిది చంద్రశేఖర్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. దీంతో అతను వెళ్లి పరిశీలించాడు. ఇంటి ప్రధాన ద్వారం పగులగొట్టి ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దొంగలు బీరువాను పగులగొట్టి 4 జతల కమ్మలు, 4 జతల బంగారు దండలు, వెండి పూజా సామగ్రి ఎత్తుకెళ్లారు. మొత్తం బంగారం 18 సవర్లు, అర కేజీ వెండి అపహరణకు గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, సీఐ అన్వర్‌బాషా ఇంటిని సందర్శించి పరిశీలించారు. క్లూస్ టీమ్ వచ్చి వివరాలు సేకరించింది. బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు. వైద్యం అందక వ్యక్తి మృతి● గుండెపోటుతో సీహెచ్‌సీకి వెళ్లిన టీడీపీ నాయకుడు ● టిఫిన్‌కు వెళ్లిన డ్యూటీ డాక్టర్ ● వైద్యుడిని సస్పెండ్ చేయాలని బంధువుల ధర్నా ఉలవపాడు: అనారోగ్యంతో వైద్యశాలకు వెళ్లిన వ్యక్తికి సరైన సమయంలో వైద్యం అందక మృతిచెందాడు. ఈ ఘటన ఉలవపాడులోని సీహెచ్‌సీ వైద్యశాలలో జరిగింది. బంధువుల కథనం మేరకు.. ఉలవపాడు అంబేడ్కర్ నగర్‌కు చెందిన టీడీపీ నాయకుడు, సీహెచ్‌సీ వైద్యశాల అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్ దార్ల మల్లికార్జున (45) బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో వైద్యశాలకు వెళ్లి గుండెనొప్పిగా ఉందని చెప్పాడు. వైద్యులు చూసి ఈసీజీ బాగుంది. గ్యాస్ట్రిక్ ట్రబుల్ అని చెప్పారు. దీంతో మల్లికార్జున సాయంత్రం బస్టాండ్‌కు వెళ్లాడు. అయినా గుండె వద్ద ఇబ్బందిగా ఉందని స్నేహితులతో చెప్పడంతో వారు మళ్లీ సీహెచ్‌సీకి తీసుకొచ్చారు. అప్పుడు డ్యూటీ డాక్టర్ చంద్రేష్ లేడు. కొంతసేపటికి నర్సు వచ్చి పరిశీలించి ఈసీజీ తీసి డాక్టర్‌కు వాట్సాప్‌లో పెట్టింది. అప్పటికీ కూడా వైద్యుడు రాలేదు. ఈలోపు మల్లికార్జున మరణించాడు. దీంతో బంధువులు డాక్టర్, సిబ్బందిని విధుల సస్పెండ్ చేయాలని ఆస్పత్రి ఎదుట బైఠాయించారు. కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ వచ్చి వారికి సంఘీభావం తెలిపారు. రూ.40 వేల విలువైన ఇంజెక్షన్లు వైద్యశాలలో ఉన్నాయని చెబుతున్నా ఎందుకు వేయడం లేదని ఆయన ప్రశ్నించారు. చంద్రేష్ మాట్లాడుతూ మల్లికార్జున ఆస్పత్రికి రాగానే నర్సు ఈసీజీ తీసిందన్నారు. తాను ఆ సమయంలో టిఫిన్ చేసేందుకు బయటకు వెళ్లానని, వచ్చేలోగా అతను చనిపోయినట్లు చెప్పారు. పొదలకూరు నిమ్మధరలు (కిలో)పెద్దవి: రూ.15 సన్నవి: రూ.10 పండ్లు: రూ.3 ధర్నాలో పాల్గొన్న మృతుడి బంధువులు, మాజీ ఎమ్మెల్యే శివరామ్ మల్లికార్జున మృతదేహం -
డీటీపై ఆర్డీఓ ఆగ్రహం
వింజమూరు(ఉదయగిరి): స్థానిక డిప్యూటీ తహసీల్దార్ ఓబయ్యపై కావలి ఆర్డీఓ వంశీకృష్ణ ఫైరయ్యారు. స్థానిక సివిల్ సప్లయ్స్ గోదాములో అదనపు బాధ్యతలను స్వీకరించాలని ఉత్తర్వులను జారీ చేసినా, ఆయన విధుల్లో చేరకపోవడంపై మండిపడ్డారు. ఆదేశాలను బేఖాతర్ చేసిన తరుణంలో సస్పెన్షన్‌కు నివేదికను పంపాలని తహసీల్దార్ హమీద్‌ను అదేశించారు. వింజమూరు ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌ను బుధవారం తనిఖీ చేసిన సందర్భంగా ఈ పరిణామాలు చోటుచేసుకున్నాయి. వివరాలు.. ఉదయగిరి ఎమ్మెల్‌ఎస్ పాయింట్లో రూ.కోటి విలువజేసే రేషన్ బియ్యం ఇటీవల పక్కదారి పట్టడం సంచలనాన్ని సృష్టించింది. ఈ వ్యవహారంలో గోదాములో పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగుల పాత్ర ఉందనే విషయం తేలింది. దీంతో జిల్లాలోని అన్ని గోదాముల నుంచి తప్పించి, ప్రభుత్వోద్యోగులకు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులను జేసీ జారీ చేశారు. ఇదే సమయంలో వింజమూరు ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌కు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్‌ను నియమిస్తూ గత నెల్లో ఉత్తర్వులివ్వగా, ఆయన విధుల్లో చేరలేదు. దీంతో రూ.కోట్ల విలువజేసే డిసెంబర్ నెల సరుకుల పంపిణీని అక్కడ పనిచేస్తున్న ఓ ప్రైవేట్ ఉద్యోగి నిర్వహించారు. ఇదే సమయంలో కార్యాలయంలో పనిచేసే డీటీ ఓబయ్యను నియమిస్తూ ఉత్తర్వులొచ్చాయి. అయితే తన ఆరోగ్యం బాగొలేదని చెప్తూ విధుల్లో చేరలేదు. దీంతో జవవరి నెల సరుకులను ప్రైవేట్ వ్యక్తితోనే పంపిణీ చేయాల్సి ఉంది. మరో ఐదు రోజుల్లో ఈ నెల ముగుస్తున్నా, రేషన్ షాపులకు బియ్యం, ఇతర సరుకులు ఇంతవరకు సరఫరా కాలేదు. దీంతో ఎమ్మెల్‌ఎస్ పాయింట్‌ను ఆర్డీఓ తనిఖీ చేశారు. ఇంతవరకు సరుకులు వెళ్లకపోవడంపై ఆరాతీశారు. గోదాము ఇన్చార్జి బాధ్యతలు చేపట్టకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రహించి డీటీ ససెన్షన్‌కు ఆదేశించారు. దీంతో గత నెల ఉత్తర్వుల్లో పేరున్న సుధాకర్‌పై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. దీంతో వెంటనే ఆయన బాధ్యతలు స్వీకరించారు. -
శ్రీవారి దర్శనానికి 16 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ బుధవారం ఎక్కువగా ఉంది. క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. క్యూలైన్ ఏటీజీహెచ్ వద్దకు చేరుకుంది. స్వామివారిని 61,583 మంది మంగళవారం అర్ధరాత్రి వరకు దర్శించుకున్నారు. తలనీలాలను 28,936 మంది అర్పించారు. కానుకల రూపంలో హుండీలో రూ.4.93 కోట్లను సమర్పించారు. టైమ్ స్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. ఇవి లేని వారికి 16 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక టికెట్లు కలిగిన వారు మూడు గంటల్లోనే దర్శించుకోగలుగుతున్నారు. -
జామాయిల్ చెట్ల తొలగింపునకు యత్నం
కలిగిరి: కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళెంలోని మాగుంట రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్‌కు చెందిన భూముల్లో జామాయిల్ చెట్ల తొలగింపునకు వచ్చిన యంత్రాలను గ్రామస్తులు, రైతులు బుధవారం అడ్డుకున్నారు. జాతీయ రహదారిని ఆనుకొని చారిటబుల్ ట్రస్ట్‌కు కలిగిరి రెవెన్యూ విలేజ్ సర్వే నంబర్ 1012 / 1లో 3.22 ఎకరాల భూములున్నాయి. ప్రస్తుతం ఈ ప్రాంతంలో భూముల విలువ రూ.కోట్లకు చేరింది. వాస్తవానికి 1996లో మాగుంట చారిటబుల్ ట్రస్ట్‌కు 1012 / 1లో 4.22 సెంట్లను ఎకరా రూ.నాలుగు వేలకు ప్రభుత్వం అందజేసింది. ఇందులో 80 సెంట్లను ఎస్సీ కాలనీకి శ్మశాన నిమిత్తం కేటాయించారు. ఈ నేపథ్యంలో జామాయిల్ చెట్లను ఈ ఏడాది అగస్ట్ 30న నరుకుతుండగా, స్థానికులు అడ్డుకున్నారు. మరోవైపు ట్రస్ట్ భూములను రూ.4.6 కోట్లకు విక్రయించేందుకు యత్నిస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. దీనికి బలాన్ని చేకూరుస్తూ వింజమూరు మండలానికి ఓ టీడీపీ నేత తాను ట్రస్ట్ భూములను కొనుగోలు చేశానని, పనులను అడ్డుకోవద్దంటూ కొందరు గ్రామస్తులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. తాజాగా సదరు స్థలంలో లేఅవుట్లు వేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేందుకు సదరు వ్యక్తి యత్నాలను ప్రారంభించారని సమాచారం. అప్పట్లో గ్రామస్తులతో ట్రస్ట్ మేనేజర్ చర్చలు జరిపారు. దీనిపై స్థానికులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ పరిణామాల క్రమంలో భూముల జోలికి రాకుండా ట్రస్ట్ నిర్వాహకులు, టీడీపీ నేతలు కొంతకాలం మౌనం దాల్చారు. తాజాగా జామాయిల్ చెట్లను తొలగించేందుకు గానూ భారీ యంత్రాలను అర్ధరాత్రి తీసుకొచ్చి పనులకు యత్నించడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రస్ట్ భూముల్లో ప్రజా ఉపయోగ కార్యక్రమాలు చేపట్టాలే తప్ప.. విక్రయిస్తే ఉపేక్షించేదిలేదని స్పష్టం చేశారు. భూములు అన్యాక్రాంతమైతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.


