నష్టాల ఊబిలో విద్యుత్ సంస్థ
నెల్లూరు(వీఆర్సీసెంటర్): విద్యుత్ సంస్థకు బిల్లుల బకాయిలు పేరుకుపోయాయి. నష్టాల్లో ఉన్న సంస్థను గట్టెక్కించేందుకు చార్జీలు పెంచి సామాన్య వినియోగదారులపై అదనపు భారం మోపేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ప్రధానంగా ప్రభుత్వరంగ సంస్థల నుంచి రూ.వందల కోట్లు రాబట్టుకోలేక అప్పుల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటి వరకు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా సర్కి ల్ పరిధిలో రూ. 313 కోట్లు ప్రభుత్వశాఖల నుంచే రావాల్సి ఉంది. బకాయిలు గుదిబండగా మారి విద్యుత్ సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా తయారైంది. సామాన్య వినియోగదారులు చిన్నమొత్తాలను ఒక నెల కట్టడం ఆలస్యమైతే అదనంగా పెనాల్టీ విధించి వసూలు చేస్తారు. బిల్లును చెల్లించడం రెండునెలలు ఆలస్యమైతే సిబ్బంది విద్యుత్ కనెక్షన్ కట్ చేస్తారు. అయితే నెలలు తరబడి రూ.కోట్లలో బిల్లుల బకాయిలున్న ప్రభుత్వ శాఖల విద్యుత్ సంస్థ ఒక్క రూపాయి కూడా వసూలు చేయలేకపోతున్నట్లు విమర్శలున్నాయి.
శాఖల వారీగా..
జిల్లాలో వివిధ ప్రభుత్వ శాఖలు విద్యుత్ బిల్లుల రూపంలో రూ.313 కోట్లు బకాయి పడ్డాయి. వీటిలో అధికంగా మేజర్ పంచాయతీలు, వాటర్ వర్క్ పథకాల నుంచి రూ.175 కోట్లు రావాల్సి ఉంది. అదేవిధంగా రెవెన్యూ శాఖ నుంచి రూ.54 కోట్లు, లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి రూ.16 కోట్లు, మున్సిపాలిటీల నుంచి రూ.16 కోట్లు బకాయిలున్నాయి. ఈ నాలుగు శాఖలు అధిక సంఖ్యలో చెల్లించాలి. మిగిలిన శాఖలు బిల్లులు కట్టాల్సి ఉంది. ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారులు, ప్రభుత్వం చొరవ చూపి ప్రభుత్వ శాఖలకు ఆదేశాలివ్వాల్సి ఉంది.
పేరుకుపోతున్న బకాయిలు
పంచాయతీలు, వాటర్ వర్క్
పథకాల నుంచే రూ.175 కోట్లు
రెవెన్యూ శాఖ నుంచి
రూ.54 కోట్లు
లిఫ్ట్ ఇరిగేషన్, మున్సిపాలిటీల బకాయిలు రూ.32 కోట్లు
బకాయిలిలా..
మేజర్ పంచాయతీలు, వాటర్ వర్క్ పథకాల నుంచి రూ.175,00,00,000, రెవెన్యూ శాఖ నుంచి రూ.54,00,00,000, లిఫ్ట్ ఇరిగేషన్ రూ.16,34,78,000, మున్సిపాలిటీలు రూ.16,00,00,000, వైద్యశాఖ రూ.7,45,09,000, పంచాయతీరాజ్, రూరల్ డెవలప్‌మెంట్ రూ.6,95,17,000, ఎడ్యుకేషన్ రూ.4,61,04,000, కలెక్టరేట్ రూ.4,48,55,000, ఇరిగేషన్ రూ.2,90,83,000, ట్రాన్స్‌పోర్టు, ఆర్‌అండ్‌బీ రూ.2,43,45,000, హోం శాఖ రూ.1,80,58,000, ఇండస్ట్రీస్, కామర్స్ రూ.1,45,51,000, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ రూ.1,28,84,000, టూరిజం రూ.68,78,000, అగ్రికల్చర్ రూ.58,67,000, బీసీ వెల్ఫేర్ రూ.52,37,000, ఉమెన్ డెవలప్‌మెంట్, చైల్డ్ వెల్ఫేర్ రూ.48,55,000, పశుసంవర్థక శాఖ రూ.41,98,000, న్యాయశాఖ రూ.22,72,000, ఫైనాన్స్ శాఖ రూ.14,19,000, జనరల్ అడ్మినిస్ట్రేషన్ రూ.11,42,000, ఫారెస్ట్, సైన్స్ రూ.9,28,000, సివిల్ సప్లయ్స్ రూ.5,66,000, హౌసింగ్ రూ.4,59,000, మైనార్టీ వెల్ఫేర్ నుంచి రూ.1,00,000 బకాయిలు రావాల్సి ఉంది.


