● ఆరోగ్యశ్రీ పథకానికి బకాయిలు కట్టలేని పరిస్థితి
● వైఎస్సార్‌సీపీ రూరల్ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి
నెల్లూరు సిటీ: ‘ప్రైవేట్ హాస్పిటళ్లకు రూ.3 వేల కోట్లు బకాయిలు కట్టలేక ఆరోగ్యశ్రీని నిలిపివేశారు. అమరావతికి రూ.2 లక్షల కోట్లు ఎక్కడ్నుంచి తెస్తారు’ అని వైఎస్సార్‌సీపీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయకుమార్‌రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరు రూరల్ పరిధిలోని చింతారెడ్డిపాళెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమరావతి నిర్మాణం పేరుతో రైతుల నుంచి వేల ఎకరాలు సేకరించి రియల్ ఎస్టేట్ చేస్తూ సంపదను దోచుకుంటున్నారని మండిపడ్డారు. రైతుల పొట్టగొట్టి పొలాలను తీసుకుని రియల్ ఎస్టేట్ చేసి అవినీతికి పాల్పడటానికి వైఎస్సార్‌సీపీ వ్యతిరేకమన్నారు. చంద్రబాబు నాయుడుపేటకు వచ్చి పూర్తి అవాస్తవాలు మాట్లాడారన్నారు. చేయని పనిని కూడా తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు చేశారని విమర్శించారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ తెచ్చింది తానేనని బాబు చెప్పడం దారుణమన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు పేదలకు స్థలాలిచ్చి ఇళ్లు కట్టించారన్నారు. పథకాలు, వివిధ కార్యక్రమాలకు ఈ ప్రభుత్వం పేర్లు మార్చి తన ఖాతాలో వేసుకోవడం సరికాదన్నారు. అవినీతిని ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో వేస్తు న్నారన్నారు. తాము భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలపై వైఎస్సార్‌సీపీ పోరాడుతుందన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ ఉపాధ్యక్షులు చెవిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మండలాధ్యక్షుడు పుచ్చలపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, నాయకులు సుబ్బారెడ్డి, నవీన్‌రెడ్డి, ఇక్బాల్, చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


