భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇటు ఐపీఎల్.. అటు భారత అండర్-19 జట్టు తరఫున ఈ చిచ్చరపిడుగు విధ్వంసకర బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది రాజస్తాన్ రాయల్స్ తరఫున ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన వైభవ్.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్ సందర్భంగా ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు.
ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ
కేవలం 35 బంతుల్లోనే శతక్కట్టిన వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. అత్యంత పిన్న వయసులోనే ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేసిన ఆటగాడిగా రికార్డు సాధించాడు. అప్పటికి వైభవ్ వయసు పద్నాలుగు సంవత్సరాలు మాత్రమే. ఇక భారత్ అండర్-19 వరల్డ్‌కప్ గెలవడంలోనూ వైభవ్ కీలక పాత్ర పోషించాడు. ఇంగ్లండ్‌తో ఫైనల్లో 80 బంతుల్లోనే 175 పరుగులతో దుమ్ములేపాడు.
ఇదే జోరు కొనసాగిస్తూ ఐపీఎల్-2026లోనూ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) శుభారంభం అందుకున్నాడు. ఇటీవలే పదిహేనో వసంతంలో అడుగుపెట్టిన ఈ రాజస్తాన్ స్టార్.. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో కేవలం 17 బంతుల్లోనే 52 పరుగులతో విధ్వంసం సృష్టించాడు.
టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు
ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని టీమిండియాకు ఎంపిక చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. ఐపీఎల్ తాజా ఎడిషన్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌ను ఈ టూర్‌కు పంపాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాడు.
టీమిండియాలోకి వచ్చేస్తాడు
ఇప్పుడు ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కమ్రాన్ అక్మల్, బసిత్ అలీ కూడా చేరారు. గేమ్ ప్లాన్ షోలో అక్మల్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పటికి కేవలం 8 ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడిన ఈ పిల్లాడు రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తున్నాడు. త్వరలోనే అతడు టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టే అవకాశం కనిపిస్తోంది.
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జాతీయ జట్టు ఆడే సిరీస్‌ల సందర్భంగా అతడు టీమ్‌లోకి రావొచ్చు. అదే జరిగితే అంతర్జాతీయ టీ20లలో అరంగేట్రం చేసిన పిన్న వయస్కుడిగా నిలుస్తాడు. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే తప్పకుండా అతడు టీమిండియాలోకి వచ్చేస్తాడు’’ అని అంచనా వేశాడు.
నాకు భయం వేస్తోంది
మరోవైపు బసిత్ అలీ మాట్లాడుతూ.. ‘‘ఆట పట్ల అతడికి పూర్తి అవగాహన ఉంది. చిన్న వయసులోనే ఎంతో పరిణతి సాధించాడు. చెన్నైతో మ్యాచ్‌లో రాజస్తాన్ 128 పరుగులు చేధించాల్సి రావడం పెద్ద విషయం కాదు. అయితే, 15 బంతుల్లోనే వైభవ్ 50 పరుగులు చేయడం చర్చనీయాంశం.
అతడి తండ్రి ఎంతగానో గర్వపడుతూ ఉంటాడు. కోచ్‌లు, క్రికెట్ క్లబ్ స్నేహితులు సంతోషిస్తూ ఉంటారు. ఇప్పుడే ఇలా ఉంటే.. అతడు పాతికేళ్ల వయసులోకి వస్తే బౌలర్ల పరిస్థితి ఏమిటోనన్న విషయం తలచుకుంటేనే నాకు భయం వేస్తోంది. ఈ పిల్లాడు అందరిపైనా ఆధిపత్యం చెలాయించగలడు’’ అంటూ వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తాడు.
చదవండి: IPL 2026: పాపం అర్జున్ టెండూల్కర్.. జట్టు మారినా?


