● చట్టబద్ధత అంటూ కొత్త డ్రామాలు
● చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే అక్కడ రాజధాని
● మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి
ముత్తుకూరు(పొదలకూరు): అమరావతి పేరిట అడ్డగోలుగా దోపిడీ చేసేందుకే చట్టబద్ధత అంటూ కొత్త డ్రామాలను సీఎం చంద్రబాబు ఆడుతున్నారని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి మండిపడ్డారు. ముత్తుకూరు మండలంలోని పంటపాళెంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మహేంద్రబాబు, లక్ష్మి వివాహ వేడుకలకు హాజరయ్యారు. అనారోగ్యానికి గురైన రావి రవీంద్రబాబురెడ్డిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాజధాని విషయంలో సరికొత్త ప్రతిపాదనను తమ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చారని చెప్పారు. దీంతో టీడీపీ నేతలకు మింగుడుపడక అయోమయంలో పడ్డారని విమర్శించారు. మావిగన్ పేరిట మచిలీపట్నం, విజయవాడ, గుంటూరును కలుపుతూ రాజధాని కారిడార్‌ను నిర్మించాలనే ఆయన ప్రతిపాదనను తెలుగు ప్రజలు ఆహ్వానిస్తున్నారని వెల్లడించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాజధాని నిర్మాణ పనుల్లో చదరపు అడుగుకు రూ.11 వేల నుంచి రూ.14 వేల మేర తన అస్మదీయులకు చంద్రబాబు కట్టబెట్టారని ఆరోపించారు. ప్రజలను ఆయన ఉద్ధరించరని, తన స్వప్రయోజనాల కోసమే పాటుపడతారని విమర్శించారు. అమరావతిలో రాజధాని నిర్మాణం పేరుతో లక్ష ఎకరాలను రైతుల నుంచి సేకరించి, ఎలాంటి అభివృద్ధి చేపట్టకపోవడంతో భూములిచ్చిన వారు మండిపడుతున్నారని చెప్పారు. దేవతల రాజధాని అమరావతి అంటూ సినిమా టైటిళ్లను చెప్తూ కాలం వెళ్లదీస్తున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే రూ.మూడు లక్ష కోట్లకుపైగా అప్పులు చేసిందని, రాష్ట్రంపై ఎన్నడూ లేని విధంగా ఆర్థిక భారం పడిందన్నారు. రాజధాని పేరుతో దాని చుట్టూ వేల ఎకరాల భూములను బినామీ పేర్లతో కొనుగోలు చేసి, అమరావతికి ఎక్కడా లేని పేరు ప్రఖ్యాతలున్నాయనే ప్రచారాన్ని సాగిస్తున్నారని ఆరోపించారు. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడుతూ.. మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటానని ఢాంబికాలు పలుకుతున్నారని విమర్శించారు. 2028లోపు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేస్తానని ప్రకటించారని, ఆలోపే కంప్లీట్ చేస్తే చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ చెప్పిన విధంగా మరో 15 ఏళ్లు కూటమి పాలనే కొనసాగితే, అమరావతిని రాజధానిగా చేసుకునేందుకు అభ్యంతరాలుండవు కదానన్నారు. చంద్రబాబు తన సొంత ఆస్తులను కాపాడుకునేందుకే చట్టబద్ధతను తీసుకొస్తున్నారని దుయ్యబట్టారు. జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేయనున్నామని వెల్లడించారు. నేతలు ఆలపాక శ్రీనివాసులు, ఎంపీటీసీ సభ్యుడు రావి విజయ్‌కుమార్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ నెల్లూరు శివప్రసాద్, చెంగారెడ్డి, దిలీప్‌కుమార్‌రెడ్డి, బ్రహ్మానందం తదితరులు పాల్గొన్నారు.


