కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!: సజ్జనార్‌ | Hyderabad CP VC Sajjanar Comments On Adulterated Mangoes | Sakshi
Sakshi News home page

కల్తీ మామిడి పండ్లతో తస్మాత్ జాగ్రత్త!: సజ్జనార్‌

Apr 3 2026 12:33 PM | Updated on Apr 3 2026 1:07 PM

Hyderabad CP VC Sajjanar Comments On Adulterated Mangoes

సాక్షి, హైదరాబాద్‌: ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారుల పట్ల పోలీసుల విభాగం ఉక్కుపాదం మోపుతుందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. ప్రజలు.. మామిడి పండ్ల రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరారు. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

హైదరాబాద్‌ సీపీ వీసీ సజ్జరాన్‌ తాజాగా ట్విట్టర్‌ వేదికగా..‘వేసవి కాలం రాకతో పండ్లలో రారాజు మామిడి మార్కెట్‌లో సందడి చేస్తోంది. అయితే, నోరూరించే ఈ ఫలాల మాటున ప్రాణాంతకమైన విషపు కోరలు దాగి ఉన్నాయన్న నిజాన్ని ప్ర‌జ‌లు విస్మరించకూడదు. కాసుల కక్కుర్తితో కొందరు స్వార్థపరులైన వ్యాపారులు ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. సహజ సిద్ధంగా పక్వానికి రావాల్సిన మామిడిని కాల్షియం కార్బైడ్‌, ఇతర ర‌సాయాల‌ను ఉపయోగించి కృత్రిమంగా మగ్గించి విక్రయిస్తున్నారు. రోడ్డు పక్కన బండ్ల మీద నిగనిగలాడుతూ, పసిడి వర్ణంతో కంటికి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్న ప్రతి పండునూ నాణ్యమైనదిగా భావించి కొనుగోలు చేయడం అంటే.. అనారోగ్యాన్ని స్వయంగా కొని తెచ్చుకోవడమే.

సాధారణంగా సహజంగా పండిన పండు అంతటా ఒకే రంగులో ఉండదు, కానీ రసాయనాలతో మగ్గించిన పండ్లు పైన పసుపు పచ్చగా ఉండి, లోపల మాత్రం పచ్చిగా ఉండి విషతుల్యంగా మారుతాయి. ఇలాంటి పండ్లను తినడం వల్ల గొంతు మంట, కడుపులో వికారం, వాంతులు, విరేచనాలు వంటి తక్షణ సమస్యలతో పాటు, దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థ దెబ్బతినడం, శ్వాసకోశ ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే ఇలాంటి కల్తీ వ్యాపారుల పట్ల హైదరాబాద్ పోలీస్ విభాగం ఇప్పటికే ఉక్కుపాదం మోపుతోంది. కల్తీ మామిడి పండ్లపైనా హెచ్‌-ఫాస్ట్ నిఘా ఉంచుతోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. ప్రజలు రూపాన్ని చూసి మోసపోకుండా, సహజత్వాన్ని గుర్తించి పండ్లను కొనుగోలు చేయాలని కోరుతున్నాను. సహజంగా పండిన పండ్ల కంటే అసహజమైన రంగు, రసాయన వాసన, వింత రుచి కలిగిన మామిడి పండ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పండ్లపై అసాధారణ మచ్చలున్నా లేదా బేకింగ్ సోడా నీటిలో కడిగినప్పుడు రంగు మారినా అవి ఆరోగ్యానికి హానికరమని గ్రహించాలి. కల్తీ మామిడి పండ్ల సమాచారం తెలిస్తే డయల్ 100కి గానీ, హెచ్-ఫాస్ట్ ఫోన్ నంబ‌ర్ 8712661212కు స‌మాచారం ఇవ్వండి’ అని పోస్టు చేశారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement