తిరువనంతపురం: కేరళలోని తిరువనంతపురంలో శనివారం ఉదయం తీవ్ర కలకలం చెలరేగింది. ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను అంతమొందిస్తానంటూ ఒక వ్యక్తి నేరుగా పోలీస్ కంట్రోల్ రూమ్‌కే ఫోన్ చేసి, బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడిని ట్రాక్ చేసి అదుపులోకి తీసుకున్నారు.
అర్ధరాత్రి వచ్చిన ఆ అజ్ఞాత కాల్
పోలీసుల కథనం ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 6:50 గంటల ప్రాంతంలో తిరువనంతపురం సిటీ డిస్ట్రిక్ట్ పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌కు ఒక అజ్ఞాత ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ముఖ్యమంత్రి వీడీ సతీశన్‌తో పాటు ఆయన కుటుంబాన్ని చంపేస్తానని బెదిరించాడు. ఆ సమయంలో డ్యూటీలో ఉన్న అధికారి కారణం అడగగా, ‘నాకు సతీషన్ అంటే నచ్చదు, అందుకే చంపుతా’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చాడు.
పోలీసులకే సవాల్.. భద్రతపై ఆరా
అంతటితో ఆగకుండా, సదరు నిందితుడు కేవలం మూడు నిమిషాల వ్యవధిలో, అంటే సాయంత్రం 6:53 గంటలకు మరోసారి ఫోన్ చేసి, మళ్లీ బెదిరించాడు. కాల్ మాట్లాడిన పోలీస్ అధికారిని అసభ్య పదజాలంతో దూషించాడు. పైగా, ‘ముఖ్యమంత్రికి మీరు సరైన రక్షణ ఏర్పాట్లు చేశారా లేదా?’ అంటూ పోలీసులను అడిగాడు.
మద్యం మత్తులో నిందితుడు
ఈ ఘటనపై కంటోన్మెంట్ పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి, ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని అట్టింగల్‌కు చెందిన సోనీ థామస్‌గా గుర్తించారు. శనివారం ఉదయం నిందితుడిని పోలీసులు పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నారు. ఫోన్ చేసే సమయంలో నిందితుడు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. అతడిని రిమాండ్ నిమిత్తం త్వరలోనే కోర్టులో ప్రవేశపెట్టనున్నారు.


