స్కూళ్లు తెరుచుకున్న రోజే ఘోరం.. విచారణకు ఆదేశాలు | School Building Collapses in Thiruvananthapuram | Sakshi
Sakshi News home page

స్కూళ్లు తెరుచుకున్న రోజే ఘోరం.. విచారణకు ఆదేశాలు

Jun 2 2026 8:39 AM | Updated on Jun 2 2026 8:51 AM

School Building Collapses in Thiruvananthapuram

తిరువనంతపురం: కేరళలో జూన్‌ ఒకటిన కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైంది. అయితే ఇంతలోనే తిరువనంతపురంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని అత్యంత పురాతన విద్యాసంస్థల్లో ఒకటైన అట్టాకుళంకర సెంట్రల్ హైస్కూల్‌ భవనంలోని ఒక భాగం ఊహించని రీతిలో కుప్పకూలింది. అయితే, అదృష్టవశాత్తూ తరగతులు ముగిసి విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇళ్లకు వెళ్లిన తర్వాత ఈ ఘటన జరగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

పెను ప్రమాదం తప్పింది
సాయంత్రం 5 గంటల తర్వాత ఈ ఘటన చోటుచేసుకుంది. కూలిపోయిన ఆ భాగంలో సర్వ శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) కార్యాలయం ఉంది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎలాంటి హాని జరగలేదు. ఒకవేళ స్కూల్ వేళల్లో గనుక ఈ ప్రమాదం జరిగి ఉంటే, పరిస్థితి తీవ్రంగా ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజనిర్ధారణకు విచారణ
ఈ ఘటనపై విద్యాశాఖ మంత్రి ఎన్. షంసుద్దీన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. భవనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఎలా ఇచ్చారు? క్రమ పద్ధతిలో భద్రతా తనిఖీలు జరిగాయా? లేదా? అనే అంశాలపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాతబడిన నిర్మాణాల కండిషన్‌పై కూడా ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు.

భయపెడుతున్న పురాతన భవనాలు
తిరువనంతపురంలోని అత్యంత పురాతన విద్యాసంస్థల్లో అట్టాకుళంకర స్కూల్ ఒకటి. ఈ భవనాల దుస్థితిపై గతంలోనే పలుమార్లు ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పాత స్కూల్ భవనాల భద్రతపై మరోసారి చర్చకు దారితీసింది. పాఠశాల ప్రాంగణం మొత్తం పరిశీలించి, తదుపరి భద్రతా చర్యలు చేపట్టేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

ఇది కూడా చదవండి: విద్యార్థులకు శుభవార్త: లైవ్‌లోకి సీబీఎస్‌ఈ రీ ఎవాల్యుయేషన్ పోర్టల్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement