యుద్దంలో పాక్‌ ఓడిపోతే అదే చేయాలి | we are not like hitler should keep doors open rss chief bhagwat | Sakshi
Sakshi News home page

యుద్దంలో పాక్‌ ఓడిపోతే అదే చేయాలి

Jun 14 2026 10:22 AM | Updated on Jun 14 2026 11:28 AM

we are not like hitler should keep doors open rss chief bhagwat

తిరువనంతరపురం: ఆర్ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో చర్చలు జరపాలని RSS ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే గతంలో చేసిన వ్యాఖ్యలు సమర్ధిస్తున్నానని తెలిపారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్  శతాబ్ది ఉత్సవాల సందర్భంగా కేరళలోని తిరువనంతపురంలో జరిగిన ఒక కార్యక్రమంలో  భగవత్ ఇలా వ్యాఖ్యానించారు.

ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ  "మనం హిట్లర్ లాంటి వాళ్లం కాదు, అది మన స్వభావం కూడా కాదు. ఒకవేళ భవిష్యత్తులో జరిగే యుద్ధంలో భారత్ చేతిలో పాకిస్తాన్ పూర్తిగా ఓడిపోతే.. అక్కడ ఉన్న ప్రజలను భారత్‌లో భాగం చేయడమో లేదా వారు ప్రశాంతంగా జీవించేలా చూడడమో చేయాలి. అందుకోసం వారితో చర్చలు జరిపే మార్గాలను (తలుపులను) ఎప్పుడూ తెరిచే ఉంచాలి" అని భగవత్ పేర్కొన్నారు. అన్యాయాన్ని, నియంతృత్వాన్ని అంతమొందించాలని అదే సమయంలో  మంచిని కాపాడుకోవాలని స్పష్టం చేశారు.

పాకిస్తాన్‌లో మారుతున్న ఆలోచనలు
దేశ విభజన జరగడం తప్పని భావించే ప్రజలు పాకిస్తాన్‌లో చాలా మంది ఉన్నారన్నారు.  అక్కడ ఉన్న పలువురు జర్నలిస్టులు కూడా ఆర్‌ఎస్‌ఎస్ చేస్తున్న పనులను ప్రశంసిస్తున్నారని, 'రెండు దేశాల సిద్ధాంతం తప్పని, కలిసి ఉంటేనే బాగుండేదనే భావన అక్కడ అంతర్గతంగా బలంగా పెరుగుతోందని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో  ఏ దేశంతోనైనా విదేశీ సంబంధాల విషయంలో ఆర్‌ఎస్‌ఎస్‌కు విడిగా ఎలాంటి ప్రత్యేక విధానాలు ఉండవని, ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలకే సంఘ్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. ఆర్‌ఎస్‌ఎస్ ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ అయినప్పటికీ, అత్యంత అపార్థానికి గురైన సంస్థ కూడా ఇదేనని  వ్యాఖ్యానించారు. 

యూనిఫామ్ వేసుకుని చేసే రూట్ మార్చ్‌లను చూసి కొందరు దీనిని పారామిలిటరీ సంస్థ అనుకుంటారని, వ్యాయామాలు చూసి వ్యాయామశాల అనుకుంటారని, కానీ బయట నుండి చూస్తే సంఘ్ అర్థం కాదని, దానిని లోపలికి వచ్చి అనుభవపూర్వకంగా తెలుసుకోవాలని ఆయన కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement