మిల్మా తిరువనంతపురం యూనియన్ రద్దు | Milma Thiruvananthapuram Union dissolved over corruption allegations | Sakshi
Sakshi News home page

మిల్మా తిరువనంతపురం యూనియన్ రద్దు

Jul 26 2026 5:32 PM | Updated on Jul 26 2026 5:58 PM

Milma Thiruvananthapuram Union dissolved over  corruption allegations

తిరువనంతపురం: శబరిమల ఆలయానికి సరఫరా చేసిన మిల్మా నెయ్యిని దారి మళ్లించి, తిరిగి విక్రయించడం, మహారాష్ట్ర నుంచి పాలు రవాణా చేసేందుకు టెండర్లు ఆహ్వానించకుండానే అధిక ధరకు మిల్క్ ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించడం వంటి తీవ్రమైన ఆర్థిక అవకతవకలు బయటపడటంతో , మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ పాలకమండలిని రద్దు చేశారు.

చైర్‌ పర్సన్ మణి విశ్వనాథ్ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (LDF) మద్దతుగల పాలకమండలిపై పాడి అభివృద్ధి శాఖ డైరెక్టర్ శాలిని గోపినాథ్ ఈ చర్య తీసుకున్నారు. బోర్డు రద్దు అనంతరం, పాడి అభివృద్ధి శాఖ జాయింట్ డైరెక్టర్ (ప్రణాళిక) సినీ ఉన్నికృష్ణన్ను నిర్వాహకురాలిగా నియమించారు. ప్రభుత్వ ఉత్తర్వు ప్రకారం, చట్టం ప్రకారం ఆరు నెలల్లోగా తిరిగి ఎన్నికలు నిర్వహించాలి, ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన పాలకవర్గం బాధ్యతలు స్వీకరిస్తుంది.

పాడి అభివృద్ధి శాఖ సంయుక్త సంచాలకులు సమర్పించిన విచారణ నివేదిక ప్రకారం, గత నాలుగేళ్లుగా ప్రాంతీయ యూనియన్ పాలకవర్గం పాల్పడిన అవినీతి, ఆర్థిక అవకతవకల స్థాయి చాలా విస్తృతమైనదిగా గుర్తించారు.  పాలకవర్గంలోని కొందరు సభ్యులు అక్రమ ప్రయోజనాలు పొందేందుకు అధికారులను ప్రభావితం చేశారని దర్యాప్తులో తేలింది. నిర్ణయాలను తారుమారు చేయడాన్ని లేదా కీలకమైన సాక్ష్యాలను నాశనం చేయడాన్ని నివారించడానికి, బోర్డును తక్షణమే రద్దు చేసి పరిపాలనా నియంత్రణలోకి తీసుకున్నారు.

ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (TDB) -మిల్మా మధ్య కుదిరిన అధికారిక ఒప్పందం ప్రకారం, శబరిమల మరియు పంపాలకు 1.7 లక్షల లీటర్ల నెయ్యిని సరఫరా చేయాల్సి ఉంది. బహిరంగ మార్కెట్‌లో మిల్మా నెయ్యి లీటరుకు రూ. 720 చొప్పున అమ్ముడవుతుండగా , దానిని దేవస్వం బోర్డుకు అంగీకరించిన ధర అయిన లీటరుకు ₹540 కే సరఫరా చేశారు.

డెయిరీ నుండి పంపిన అత్యుత్తమ నాణ్యత గల మిల్మా నెయ్యిని శబరిమలకు చేరకముందే దారి మళ్లించి, ప్రైవేట్ ఏజెన్సీలకు మరియు బహిరంగ మార్కెట్లో విక్రయించినట్లు విచారణలో తేలింది.

దానికి బదులుగా , తమిళనాడు నుండి తెప్పించిన నాసిరకం నెయ్యిని శబరిమలకు సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. లీటరుకు కేవలం ₹350 విలువ కలిగిన సుమారు 70,000 లీటర్ల ఈ నాసిరకం నెయ్యిని ఆలయానికి సరఫరా చేసి, భక్తులను మోసం చేసినట్లు పాడి అభివృద్ధి శాఖ కనుగొంది.

టెండర్ లేకుండానే పాల ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు. మిల్మాలో పాల కొరతను తీర్చడానికి మహారాష్ట్ర నుంచి కేరళకు పాలు రవాణా చేసే కాంట్రాక్టుల కేటాయింపులో కూడా అవకతవకలు జరిగినట్లు విచారణలో వెల్లడైంది.

ప్రభుత్వ టెండర్లను ఆహ్వానించకుండా , నిర్దేశిత టెండర్ ప్రక్రియను పాటించకుండా , అధిక ధరలకు ప్రైవేట్ ట్యాంకర్ ఆపరేటర్లకు కాంట్రాక్టును అప్పగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సహకార ఆడిట్‌లో , ఈ ఒక్క అవకతవక వల్లే మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్‌కు రూ. 93.40 లక్షల ఆర్థిక నష్టం వాటిల్లిందని తేలింది.

కందల సహకార బ్యాంకు మాజీ అధ్యక్షుడు, మిల్మా తిరువనంతపురం ప్రాంతీయ యూనియన్ మాజీ ఛైర్మన్ అయిన ఎన్. భాసురంగన్ ఏర్పాటు చేసిన పరిపాలనా కమిటీ హయాంలో వివాదాస్పద ట్యాంకర్ కాంట్రాక్టును కేటాయించారు. కందల సహకార బ్యాంకు ఆర్థిక మోసం కేసులో భాసురంగన్ను ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఆ సమయంలో కేఆర్ మోహనన్ పిళ్లై, విఎస్ పద్మకుమార్ ఆ కమిటీలోని ఇతర సభ్యులుగా ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement