దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్ దియా బినుకి(21) బిగ్ షాక్ తగిలింది. ప్రతిపక్ష ఎల్‌డీఎఫ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. కేవలం ఏడు నెలలకే ఆమె పదవికి ముగింపు పడింది. అయితే ఈ వ్యవహారంలో అధికార కాంగ్రెస్ సభ్యుల క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె కుర్చీని వీడాల్సి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
కేరళ కొట్టాయం జిల్లా పాలా మున్సిపాలిటీలో 26 మంది సభ్యులున్నారు. మున్సిపల్ కౌన్సిల్‌లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 17 మంది ఓటు వేశారు. దీంతో అవసరమైన మెజార్టీ కంటే ఎక్కువ ఓట్లు రావడంతో తీర్మానం ఆమోదం పొందింది. ఈ పరిణామం అధికార యూడీఎఫ్‌కు భారీ ఎదురుదెబ్బగా మారింది.
కాంగ్రెస్ తిరుగుబాటుతోనే..
పాలా మున్సిపాలిటీలో యూడీఎఫ్, ఎల్‌డీఎఫ్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. అయితే కాంగ్రెస్‌కు చెందిన నలుగురు కౌన్సిలర్లు పార్టీ విప్‌ను ధిక్కరించి అవిశ్వాస తీర్మానానికి మద్దతు ఇవ్వడం దియా ఓటమికి కారణమైంది. కాంగ్రెస్ కౌన్సిలర్లు బిజు మాథ్యూస్, టోనీ థైపరంబిల్, లిస్సీకుట్టి మాథ్యూ, రాజిత ప్రకాశ్‌లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. డిప్యూటీ చైర్‌పర్సన్ మాయా రాహుల్ కూడా అవిశ్వాసానికి మద్దతు తెలిపారు. తమకు పార్టీ విప్ అందలేదని తిరుగుబాటు కౌన్సిలర్లు చెబుతూ.. స్థానిక ప్రజల అభిప్రాయానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు.

ఎవరీ దియా బిను పులిక్కకండం?
21 ఏళ్ల దియా బిను పులిక్కకండం దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా రికార్డు సృష్టించారు. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో ఎకనామిక్స్ చదివిన ఆమె.. ఉన్నత చదువులకు సిద్ధమవుతున్న సమయంలో రాజకీయాల్లోకి వచ్చారు. మున్సిపల్ ఎన్నికల అనంతరం తన తండ్రి బిను పులిక్కకండం, మేనమామ బిజు పులిక్కకండంతో కలిసి స్వతంత్ర వర్గంగా ఏర్పడ్డారు. ఈ మూడు సభ్యుల బ్లాక్‌కు యూడీఎఫ్ మద్దతు ఇవ్వడంతో గత డిసెంబర్‌లో దియా పాలా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
యూడీఎఫ్‌కు అధికారం తెచ్చిన కుటుంబ బ్లాక్
పాలా మున్సిపాలిటీలో సుదీర్ఘకాలంగా ఆధిపత్యం కొనసాగిస్తున్న కేరళ కాంగ్రెస్(ఎం)కు వ్యతిరేకంగా బిను పులిక్కకండం రాజకీయంగా ఎదిగారు. స్వతంత్ర వర్గం కీలకంగా మారడంతో యూడీఎఫ్‌కు మున్సిపల్ పీఠం దక్కింది. అయితే ఆ తర్వాత కాంగ్రెస్, పులిక్కకండం కుటుంబం మధ్య విభేదాలు పెరిగాయి. పలు పాలనా నిర్ణయాలు, రాజకీయ అంశాలపై ఇరు వర్గాల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.

వివాదాల తర్వాత అవిశ్వాస తీర్మానం
డీవైఎఫ్‌ఐ కార్యక్రమానికి అనుమతి ఇవ్వడం వంటి అంశాలపై కాంగ్రెస్, దియా వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇటీవల కాంగ్రెస్ కౌన్సిలర్ బిజు మాథ్యూస్‌పై దియా ఫిర్యాదు చేయడం కూడా వివాదానికి దారితీసింది. తన కార్యాలయం నుంచి ఖరీదైన వాచ్, కొన్ని అధికారిక ఫైళ్లు కనిపించకుండా పోయాయని ఆమె ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను బిజు మాథ్యూస్ ఖండించారు.
"ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నా"
పదవి కోల్పోయిన అనంతరం దియా బిను స్పందించారు. ప్రజాస్వామ్య తీర్పును గౌరవిస్తున్నానని తెలిపారు. తనపై అవినీతి, నిధుల దుర్వినియోగం, లంచాలు, బంధుప్రీతి లేదా చట్ట ఉల్లంఘన వంటి ఎలాంటి నిరూపిత ఆరోపణలు లేవని చెప్పారు. "నా పదవీకాలంలో పారదర్శకత, చట్టబద్ధత, ప్రజా ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇచ్చాను. పదవులు తాత్కాలికం.. విలువలు శాశ్వతం" అని దియా పేర్కొన్నారు.
పాలా మున్సిపాలిటీ భవిష్యత్‌పై ఉత్కంఠ
దియా తొలగింపుతో పాలా మున్సిపాలిటీలో కొత్త రాజకీయ సమీకరణాలు తెరపైకి వచ్చాయి. ప్రస్తుతం ఏ కూటమికీ స్పష్టమైన మెజార్టీ లేకపోవడంతో తదుపరి పాలనపై ఉత్కంఠ నెలకొంది. అవిశ్వాస తీర్మానంతో యూడీఎఫ్ పాలన ముగియగా.. ఎల్‌డీఎఫ్ మద్దతుతో కొత్త రాజకీయ పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.


