‘రేర్‌ ఆఫ్‌ ది రేరెస్ట్‌’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు | Rarest of Rare Kerala Nenmara Case 61 Year Old Sentenced to Death | Sakshi
Sakshi News home page

‘రేర్‌ ఆఫ్‌ ది రేరెస్ట్‌’.. నెన్మారా కేసులో సంచలన తీర్పు

Jul 20 2026 12:56 PM | Updated on Jul 20 2026 2:32 PM

Rarest of Rare Kerala Nenmara Case 61 Year Old Sentenced to Death

కేరళలో సంచలనం సృష్టించిన నెన్మారా డబుల్‌ మర్డర్‌ కేసులో సోమవారం కీలక తీర్పు వెలువడింది. తల్లీకొడుకులను దారుణంగా హత్య చేసిన కేసులో 61 ఏళ్ల నిందితుడు చెంతమరాకు కోర్టు మరణశిక్ష విధించింది. అంతకు ముందు అదే కుటుంబంలోని వ్యక్తిని హత్య చేసిన చెంతమరా.. బెయిల్‌పై బయటకు వచ్చి జంట హత్యలకు పాల్పడడం గమనార్హం. దీంతో ఈ కేసు అత్యంత అరుదైన కేసుల (రేర్‌ ఆఫ్‌ ది రేరెస్ట్‌) పరిధిలోకి వస్తుందని భావించిన న్యాయస్థానం కఠిన శిక్షను ఖరారు చేసింది.

పాలక్కాడ్‌ జిల్లా నెన్మారా పరిధిలోని పొతుండి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 2025 జనవరి 27న సుధాకరన్‌ (55), ఆయన తల్లి లక్ష్మి (75)పై నిందితుడు చెంతమరా (Chenthamara) దాడి చేసి హత్య చేసినట్లు కేసు నమోదైంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. పోలీసుల దర్యాప్తులో సేకరించిన ఆధారాలు, సాక్షుల వాంగ్మూలాలను పరిశీలించిన కోర్టు.. నిందితుడిని దోషిగా తేల్చింది.

భార్య దూరం కావడంపై అనుమానంతో.. 
చెంతమరా నేర చరిత్ర మొదలైంది 2019 ఆగస్టు 31న. ఆ రోజు అతను తన పొరుగింటి మహిళ సజిత (35)ను హత్య చేశాడు. పోలీసుల దర్యాప్తు ప్రకారం.. తన భార్య, కుమార్తె తనను విడిచిపెట్టి వెళ్లడానికి సజిత కుటుంబం చేసిన చేతబడే కారణమని చెంతమరా అనుమానించాడు. ఈ అనుమానంతోనే ఘాతుకానికి పాల్పడ్డాడు. 

బెయిల్‌పై బయటకు వచ్చాక ఘాతుకం
సుధాకరన్‌ భార్య సజిత హత్య కేసులో అరెస్టైన చెంతమరా.. బెయిల్‌పై బయటకు వచ్చాడు. సరాసరి సజిత ఇంటికి వెళ్లి.. ఆమె భర్త సుధాకరన్‌, తల్లి లక్ష్మిలను హత్య చేశాడు. నేర తీవ్రత, హత్య చేసిన తీరు, బాధిత కుటుంబంపై పడిన ప్రభావాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఈ కేసును అత్యంత అరుదైన నేరంగా పరిగణించింది. సాధారణంగా జీవిత ఖైదు విధించే పరిస్థితుల్లో కాకుండా.. అరుదైన సందర్భాల్లో మాత్రమే విధించే మరణశిక్షను పాలక్కాడ్‌ అదనపు జిల్లా & సెషన్స్‌ కోర్టు–IV అదనపు సెషన్స్‌ జడ్జి కెన్నెత్‌ జార్జ్‌ (Kenneth George) ఖరారు చేస్తూ తీర్పు ఇచ్చారు.

తీర్పుతో ముగిసిపోలేదా?
నెన్మారా జంట హత్యల కేసు కేరళలో తీవ్ర చర్చకు దారి తీసింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికుల్లో ఆగ్రహం వ్యక్తమైంది. తాజాగా కోర్టు తీర్పుతో ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అయితే న్యాయపరమైన ప్రక్రియలో భాగంగా నిందితుడికి అప్పీల్‌ అవకాశాలు ఉండనున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement