కాక్రోచ్‌ ముట్టడి.. అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రదాన్‌ భేటీ | Dharmendra Pradhan Meets Amit Shah Parliament Tension Cockroach Protest | Sakshi
Sakshi News home page

కాక్రోచ్‌ ముట్టడి.. అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రదాన్‌ భేటీ

Jul 20 2026 1:29 PM | Updated on Jul 20 2026 2:55 PM

Dharmendra Pradhan Meets Amit Shah Parliament Tension Cockroach Protest

సాక్షి, న్యూఢిల్లీ: నీట్‌ అవకతకవలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలను కోరుతూనే.. కేంద్రం విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తూ కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలు చేపట్టిన ఆందోళన తీవ్రతరమైంది. సోమవారం పార్లమెంట్‌ ముట్టడికి ప్రయత్నం జరగ్గా.. పోలీసులు, భద్రతా సిబ్బంది నిలువరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కఠిన చర్యలతో.. పలువురిని అదుపులోకి తీసుకుంటున్నారు. అదే సమయంలో..

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ధర్మేంద్ర ప్రదాన్‌ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రదాన్‌పై ఆరోపణలు చేస్తూ ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని కాక్రోచ్‌ పార్టీ ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో ఏదైనా నిర్ణయం వెలువడుతుందా? లేదంటే కేవలం పరిస్థితిని సమీక్షించే భేటీనా? అనేదానిపై మరికాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

ధర్మేంద్ర ప్రదాన్‌తో అమిత్‌ షా సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న సమయంలోనే.. మరోవైపు పార్లమెంట్‌ సమీపంలో సీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని నిరసన తెలుపుతున్నారు. అంతకు ముందు కేంద్రంతో చర్చలు ఉంటాయని సీజేపీ ప్రతినిధులు ప్రకటించగా.. కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆ ప్రచారాన్ని ఖండించారు. ప్రముఖ పర్యావరణ వేత్త సోనం వాంగ్‌చుక్‌ ఈ డిమాండ్లతోనే ఆమరణ దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన ఇచ్చిన చలో సంసద్‌ పిలుపు మేరకు మద్దతు దారులు భారీగా తరలి రావడం గమనార్హం. 

బారికేడ్లు తోసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం
ఆందోళనకారులు పార్లమెంట్‌ ప్రధాన గేటు వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, కార్యకర్తల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అనంతరం పరిస్థితి తోపులాటకు దారితీసింది. ఆందోళనకారులు భద్రతా బారికేడ్లను తోసుకుని ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని నిలువరించారు. దీంతో కొంతసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగాయి.

పార్లమెంట్‌ గేట్లు మూసివేత
కార్యకర్తలు పార్లమెంట్‌ ప్రధాన ప్రవేశ ద్వారం వద్దకు చేరుకోవడంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా పార్లమెంట్‌ గేట్లను మూసివేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జి జరపడంతో పాటు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించినట్లు తెలుస్తోంది.

భద్రత కట్టుదిట్టం
పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో భద్రతా సిబ్బంది ఆందోళనను అడ్డుకునేందుకు భారీగా మోహరించారు. కొంతసేపు నిరసనలు, నినాదాలతో పార్లమెంట్‌ పరిసరాలు హోరెత్తాయి. అమిత్‌ షా–ధర్మేంద్ర ప్రదాన్‌ భేటీ ఒకవైపు కొనసాగుతుండగా.. మరోవైపు పార్లమెంట్‌ వద్ద చోటుచేసుకున్న నిరసనలు రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement