సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. తొలిరోజే ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసుల వేధింపులు, లాకప్ డెత్‌ల అంశాలను లేవనెత్తేందుకు వైఎస్సార్‌సీపీ సిద్ధమైంది. ఈ మేరకు లోక్‌సభలో వాయిదా తీర్మానం నోటీసును తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చారు.
ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పలు కస్టడీ మరణాలు, పోలీసుల తీరుపై చర్చకు అనుమతించాలని ఆయన నోటీసుల్లో కోరారు. గాదె సాయి కృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతి కుమార్, దరియా హుస్సేన్ వంటి కేసులను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సభ దృష్టికి తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల అంశాలపైనా చర్చకు అవకాశం కల్పించాలని వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు.
ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న కొన్ని లాకప్ డెత్ ఘటనలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. పోలీసుల వ్యవహారశైలి, కస్టడీలో ఉన్న వ్యక్తుల రక్షణ, న్యాయ ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిపై పార్లమెంట్‌లో చర్చ అవసరమని ఎంపీలు భావిస్తున్నారు.
ఏపీ శాంతిభద్రతల అంశంపై వైఎస్సార్‌సీపీ ఇచ్చిన నోటీసును స్పీకర్ అనుమతిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అదే గనుక జరిగితే.. కూటమి ప్రభుత్వ అరాచకాలపై చర్చతో లోక్‌సభ హీటెక్కే అవకాశాలు ఉన్నాయి.


