విద్యా వ్యవస్థలో వైఫల్యాలు, పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా చేపట్టిన ఆమరణ దీక్షను విరమించేందుకు సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ సిద్ధమయ్యారు. ఆయన పిలుపు మేరకు మద్దతుదారులు, కాక్రోచ్ జనతా పార్టీ పార్లమెంట్ ముట్టడికి సిద్ధమైన వేళ.. ఈ ప్రకటన వెలువడడం గమనార్హం. అయితే మూడు షరతులు నెరవేరిస్తేనే దీక్ష విరమిస్తానని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు.
జూన్ 28న ప్రారంభమైన వాంగ్‌చుక్ ఆమరణ దీక్ష 23వ రోజుకు చేరుకుంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద కొనసాగుతున్న దీక్షను పోలీసులు ఇటీవల తొలగించి ఆయనను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుంచి చేతిరాతతో విడుదల చేసిన ఓ ప్రకటనలో వాంగ్‌చుక్.. దీక్ష ముగించేందుకు మూడు షరతులను వెల్లడించారు.
విద్యా వ్యవస్థలో ఇటీవల చోటుచేసుకున్న వైఫల్యాలు, పేపర్ లీక్ వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తుతామని ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు హామీ ఇవ్వాలని కోరారు. అలాకాకుంటే తన ఆరోగ్య పరిస్థితి కారణంగా దీక్ష కొనసాగించడం సాధ్యం కాకపోతే.. ఎంపీలు, రాజకీయ నాయకులు ఆసుపత్రికి వచ్చి ఇదే హామీ ఇస్తే తాను ఉపవాస దీక్షను విరమిస్తానని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం తన కదలికలు, మాట్లాడే స్వేచ్ఛ, కమ్యూనికేషన్‌పై ఆంక్షలు ఉన్నాయని వాంగ్‌చుక్ ఆరోపించారు.
Activist Sonam Wangchuk tweets, "... I will end my fast on 20th July if:
a. If the govt takes accountability of the recent failures in Education system, Paper leaks etc or
b. If I and the leadership of CJP reach the doorsteps of Parliament where MPs and leaders of various… pic.twitter.com/XBAgvbkvkw— ANI (@ANI) July 20, 2026
భార్య ప్రకటనలో రెండే!
ఇదే సమయంలో వాంగ్‌చుక్ భార్య గీతాంజలి అంగ్మో కూడా ఆయన దీక్ష విరమణపై స్పందించారు. రాజకీయ నేతలు ఆయనను కలసి.. విద్యా వ్యవస్థలో వైఫల్యాలపై పార్లమెంట్‌లో చర్చకు హామీ ఇస్తే దీక్ష ముగిస్తారని ఆమె తెలిపారు.
ఆమె వెల్లడించిన రెండు అంశాల్లో.. ఒకటి రాజకీయ నేతలు వాంగ్‌చుక్‌ను కలవడం, రెండోది విద్యా వ్యవస్థలో బాధ్యతపై పార్లమెంట్‌లో అంశాన్ని లేవనెత్తుతామని హామీ ఇవ్వడం. అయితే ఆ తర్వాత వాంగ్‌చుక్ స్వయంగా విడుదల చేసిన ప్రకటనలో ఆరోగ్య పరిస్థితి, ప్రభుత్వ బాధ్యత వంటి అంశాలను కలిపి మూడు షరతులుగా వివరించారు.
ప్రైవేటు ఆసుపత్రికి తరలింపుపై కోర్టు నిరాకరణ
వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌జంగ్ ఆసుపత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రికి తరలించాలని ఆయన భార్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే మధ్యంతరంగా తరలించేందుకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. దీర్ఘకాల ఉపవాసం కారణంగా ఆయన ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్న నేపథ్యంలో వైద్య పర్యవేక్షణ అవసరమని కోర్టు అభిప్రాయపడింది. ఆసుపత్రిలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, బలవంతపు చర్యలు జరుగుతున్నాయని ప్రాథమికంగా భావించలేమని పేర్కొంది. వాంగ్‌చుక్ ఆరోగ్య పరిస్థితిపై మూడు రోజుల్లో నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించింది.
నేడు ‘చలో సంసద్’.. ఢిల్లీలో భారీ భద్రత
మరోవైపు వాంగ్‌చుక్ మద్దతుదారులు సోమవారం ‘చలో సంసద్’ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్న రోజే ఈ కార్యక్రమం చేపట్టడంతో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమయ్యారు. అనుమతి లేకుండా ఎలాంటి మార్చ్‌కు అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. న్యూఢిల్లీ ప్రాంతంలో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్ 163 అమలు చేశారు. జంతర్‌మంతర్, పార్లమెంట్ పరిసరాల్లో భారీగా పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలపై ఆంక్షలు విధించారు.
వైద్యుల పర్యవేక్షణలో వాంగ్‌చుక్
దాదాపు మూడు వారాలుగా ఆహారం తీసుకోకపోవడంతో వాంగ్‌చుక్ 10 కేజీల బరువు కోల్పోయారు. బలహీనత, డీహైడ్రేషన్‌కు గురయ్యారని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నప్పటికీ.. రక్త పరీక్షలు, ఇతర ఆరోగ్య సూచికలను నిరంతరం పరిశీలించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
విద్యా వ్యవస్థలో సంస్కరణలు, నీట్ ప్రశ్నపత్రం లీక్ వంటి అంశాలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహించాలని వాంగ్‌చుక్ వర్గం డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన దీక్ష విరమణ ప్రకటన, ‘చలో సంసద్’ కార్యక్రమం దేశ రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి.


