న్యూఢిల్లీ: ‘చలో సంసద్’ ర్యాలీని విజయవంతం చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) పట్టుదలతో ఉంది. ఆ పార్టీకి మద్దతుగా ఆదివారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌కు భారీగా జనం తరలివచ్చారు. ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆదివారం రాత్రంతా నిరసన కొనసాగించాలని, సోమవారం పార్లమెంట్ వరకు ర్యాలీ చేపట్టాలని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు.
నిర్ణిత సమయానికి ప్రజలను సమీకరించకముందే దాదాపు 20 వేల మంది జంతర్‌మంతర్, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్నారని సీజేపీ ప్రధాన ప్రతినిధి సౌరవ్ దాస్ పేర్కొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద ప్రధాన్ రాజీనామా చేయాల్సిన సమయం వచ్చిందన్నారు. రాజకీయ నాయకులు సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో వాంగ్‌చుక్‌ను కలిసి, విద్యా రంగంలో జవాబుదారీతనం పెంచే అంశాన్ని పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో లేవనెత్తుతామని ఖచ్చితమైన హామీ ఇస్తేనే సోనమ్ సోమవారం దీక్ష విరమిస్తారని ఆయన భార్య గీతాంజలి ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు.


