ఓవర్‌ టు ఢిల్లీ! | Allegations of political motives behind Sonam Wangchuks latest hunger strike | Sakshi
Sakshi News home page

ఓవర్‌ టు ఢిల్లీ!

Jul 19 2026 12:22 AM | Updated on Jul 19 2026 8:04 AM

Allegations of political motives behind Sonam Wangchuks latest hunger strike

జనతంత్రం

భారతదేశ చరిత్ర ఇప్పుడొక ప్రమాదకరమైన మలుపును తీసుకునేందుకు సన్నద్ధమవుతున్నదనే హెచ్చరికలు వినబడు తున్నాయి. ఆ మలుపు తీసుకుంటే ప్రజాస్వామిక అధ్యాయానికి ముగింపు పలికినట్టేనని, రాజ్యాంగబద్ధ పాలనకు తిలోదకాలు వదిలినట్టేనని కొందరు మేధావులు గళం విప్పుతున్నారు.వందలాది సంవత్సరాల భారతీయ వైవిధ్య సహజీవనం ధ్వంస మౌతుందనీ, బహుళత్వ సౌందర్యం భగ్నమవుతుందనీ, భిన్న త్వంలో ఏకత్వ సందర్శనకు బదులు బలవంతపు ఏకీకరణ ప్రత్యక్షమవుతుందనీ కొన్ని వైతాళిక స్వరాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ గొంతుకలకు సంప్రదాయ మీడియా మైకులు పెద్దగా సమకూరడం లేదు. ఫలితంగా ‘ఆవాజ్‌’ దద్దరిల్లడం లేదు. కానీ, మూగబోవడం కూడా లేదు. అటువంటి వేనవేల స్వరాల్లోని ఒక భా‘స్వరం’ పేరు సోనమ్‌ వాంగ్‌చుక్‌.

లదాఖ్‌ పర్వత ప్రాంతీయుడైన సోనమ్‌ ఒక ఇంజినీర్‌. స్వయంగా పాఠశాలలు స్థాపించి, విద్యారంగ సంస్కరణలకు నడుం కట్టినవాడు. సమాజానికి ఉపయుక్తమయ్యే వైజ్ఞానిక ఆవిష్కరణలు చేసినవాడు. తన ఆవిష్కరణలకు పేటెంట్‌ కోర కుండా సమాజానికి అంకితం చేసి ప్రజాస్వామిక ప్రియత్వాన్ని చాటుకున్నవాడు. లదాఖ్‌ ప్రజల అస్తిత్వ ఆకాంక్షలకు పోరాట రూపమైనవాడు. ఈ నేపథ్యాన్ని గమనించినప్పుడు సోనమ్‌ వాంగ్‌చుక్‌ తాజా నిరాహారదీక్ష వెనుక వేరే రాజకీయ ప్రయోజ నాలున్నాయని కొందరు చేస్తున్న ఆరోపణలు ఎంత అసంగతమైనవో అర్థమవుతుంది. భారతదేశంలో విద్యారంగం నానా టికీ సంక్షోభంలో కూరుకుపోతున్నదనే అభిప్రాయం రాజకీయ పరమైనది కాదు. విజ్ఞులైన దేశ ప్రజలందరూ ఆందోళన చెందు తున్న ఒక చేదు నిజం. పోటీ పరీక్షల వ్యవస్థ స్కామ్‌ల పుట్టగా మారిందన్నది కూడా అంతే నిజం.

ఒకటా, రెండా? ఎన్డీఏ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఈ పన్నెండేళ్లలో పోటీ పరీక్షల అవకతవకలకు సంబంధించి 158 ఉదంతాలు రికార్డయ్యాయి. అంతకు ముందు యూపీఏ హయాంలోనూ ఈ దరిద్రం లేకపోలేదు. 2005 నుంచి 2014 వరకు అరవైకి పైగా అవకతవకల కేసులు నమోద య్యాయి. కోట్లాదిమంది యువతీ యువకుల భవిష్యత్తుతో ఆడుకున్న దురంతాలివి. టీచర్‌ ఉద్యోగాల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాదిమంది యువతీయువకుల కలలను ఏపీ సర్కార్‌ నిర్వహించిన డీఎస్సీ పరీక్ష ఎలా భగ్నం చేసిందో ఇటీవల బైటపడింది. ఈ ఏడాది నిర్వహించిన నీట్‌ పరీక్షలో ప్రశ్నాపత్రాల లీకేజీ బయటపడటం వల్ల దాదాపు ఇరవైమంది తెలివైన విద్యార్థులు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌పై ఏర్పడిన కాక్రోచ్‌ జనతా పార్టీ ఈ అంశంపై ఢిల్లీలో ఆందోళనకు పిలుపునిచ్చింది.

విద్యారంగ సంస్కరణలపై ఎలుగెత్తుతున్న సోనమ్‌ వాంగ్‌ చుక్‌ సహజంగానే ఈ ఆందోళనలో భాగం పంచుకోవాలని నిర్ణయించుకొని ఉంటారు. జంతర్‌మంతర్‌లో ఆయన నిరాహార దీక్షకు కూర్చొని మూడు వారాలు గడిచినా కేంద్రం నుంచి ఎటువంటి స్పందనా రాలేదు. నీట్‌ పరీక్షల వైఫల్యంతో పాటు సీబీఎస్‌ఈ పరీక్షల అవకతవకలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా చేయాలనేది ఆందో ళనకారుల ప్రధాన డిమాండ్‌. ధర్మేంద్ర ప్రధాన్‌తో సోనమ్‌కు గానీ, ఆందోళనకారులకు గానీ వ్యక్తిగత వైరమేమీలేదు. 

కానీ లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టిన ఘటనపై జవాబుదారీతనాన్ని వారు డిమాండ్‌ చేస్తున్నారు. నిజమే కదా, ప్రజాసమస్యలకు బాధ్యత వహించకుండా, జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వాలు వ్యవహరిస్తే అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? పరీక్షల వ్యవహారంపై జవాబుదారీతనానికీ, బాధ్యత వహించడానికీ కేంద్ర సర్కార్‌ మొండిగా నిరాకరించింది. సోనమ్‌ వాంగ్‌చుక్‌ దీక్ష ఇరవై ఒకటో రోజున హైకోర్టు ఆదేశాలు పాటిస్తున్నామంటూ పోలీసులు బల వంతంగా ఆయన్ను ఆస్పత్రికి తరలించారు. 

కేంద్రంతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాల్లో జవాబుదారీ తనం ఇప్పుడు కనిపించడం లేదు. ప్రజాస్వామికవాతావరణం కూడా క్రమంగా కనుమరుగవుతున్నది. పౌరహక్కులకు న్యాయ స్థానాల నుంచి కూడా పూర్తి రక్షణ లభించడం లేదు. లాఠీ రాజ్యం అమల్లోకి వచ్చింది. ఆధిపత్య భావజాలం అన్నిరంగాలను, అన్ని వ్యవస్థలను పట్టి కుదిపేస్తున్నది. భిన్నాభి ప్రాయాలు, ఆలోచనలపై బుల్డోజర్లు నడుస్తున్నాయి. ఆధిపత్య భావజాలాన్ని ఆధారసహితంగా హేతుబద్ధంగా ఎదుర్కొనేగొంతుకలపైకి బండబూతులతో వందమంది దండెత్తుతున్నారు. సోషల్‌ మీడియాలోకి ఫాసిజం చొరబడింది. ప్రధాన స్రవంతి మీడియా సర్కార్‌ల పెంపుడు మీడియాగా మారిపోయింది. 

వాంగ్‌చుక్‌ దీక్ష సందర్భంలో మన జాతీయ మీడియా ప్రభుభక్తినే చాటుకున్నది. పదిహేనేళ్ల కిందట జంతర్‌మంతర్‌లో జరిగిన అన్నా హజారే దీక్షను ఒకసారి గుర్తుకు తెచ్చుకుందాము. జాతీయ దినపత్రికలన్నీ రోజుల తరబడి జంతర్‌మంతర్‌ను పతాక శీర్షికల్లో నిలబెట్టాయి. టీవీ ఛానెళ్లు రాత్రింబవళ్లూ కెమెరా లను అక్కడే పాతేసి కార్యక్రమాలు నడిపాయి. ఇప్పుడువాంగ్‌చుక్‌ దీక్షకు మాత్రం మొహం చాటేశాయి. ఆనాటి కవ రేజీలో పదోవంతు కూడా దక్కలేదు. ‘త్రీ ఇడియట్స్‌’ అనే సూపర్‌ హిట్‌ సినిమాకు వాంగ్‌చుక్‌ జీవితమే ఆదర్శమని ప్రచారం జరగడంతో ఆయన ఇమేజ్‌ పెరుగుతుందని గ్రహించి డ్యామేజీ కంట్రోల్‌కు జాతీయ చానెళ్లు ప్రయత్నించాయి. 

అమీర్‌ ఖాన్‌ను రంగంలోకి దించి సినిమాకు ముందు వాంగ్‌చుక్‌ ఎవరో తమకు తెలియదని చెప్పించారు. అమీర్‌ ఖాన్‌ చెప్పింది పచ్చి అబద్ధమని రుజువు కావడానికి కొన్ని గంటలు కూడా పట్టలేదు. ఈ ఎపిసోడ్‌తో మరోసారి రుజువైన అంశం మన దేశంలో మీడియాకు స్వేచ్ఛ లేదని, అది సర్కారీ పెద్దలకు పెంపుడు జీవిగా మారిపోయిందని! 

దేశ రాజకీయ చరిత్రలో అయోధ్య రామమందిరానికున్న ప్రాధాన్యత ఏమిటో తెలిసిందే కదా? భారతీయ జనతా పార్టీని అధికార పీఠానికి చేరువ చేసిన ఆలయమిది. అటువంటి ఆల యానికి ఇంటిదొంగలే కన్నం వేస్తే మీడియాలో ఎంత రచ్చ జరిగి ఉండాలి! కానీ, అదో చిన్న వార్తే అయిపోయింది. ఆంధ్రాలో అధికార పార్టీ నాయకుడు ఒక మహిళను నడివీధిలో చితకబాదితే పెంపుడు మీడియాలో ఆ వార్తకు చోటు దక్కలేదు. పోలీస్‌ లాకప్‌ చిత్రహింసలకు వరసగా ప్రాణాలు పోతున్న ఘటనలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్నాయి. కేరళలో పోలీసు కస్టడీలో ఉన్న రాజన్‌ మరణిస్తే యావత్‌ భారతదేశం అట్టుడికి పోయిన రోజులు గుర్తుకొస్తున్నాయి. ముఖ్యమంత్రి కరుణాకరన్‌ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. 

మణిపూర్‌ అనే రాష్ట్రం ఈ దేశంలోనే ఉన్నదనే సంగతిని కూడా నేటి జాతీయ మీడియా మరిచిపోయినట్టుంది. ఒక మతాన్ని టార్గెట్‌ చేసి 250కి పైగా ప్రార్థనాలయాలను నేలమట్టం చేస్తే, మనుషుల్ని సజీవ దహనం చేస్తే, ఊచకోత కోస్తే రెండు వర్గాల ఘర్షణలు గానే అప్రధానంగా రిపోర్టయ్యాయి. సోషల్‌ మీడియాలో ప్రభుత్వ విధానాలను విమర్శించే వాళ్లపై ఆంధ్ర సర్కార్‌ దమన నీతిని ప్రదర్శిస్తున్నది. విచ్చలవిడిగా అక్రమ అరెస్టులు చేస్తు న్నారు. లాకప్‌లలో చిత్రహింసలు పెడుతున్నారు. పౌర హక్కు లకు సంబంధించిన ఇటువంటి వార్తలకు మీడియాలో చోటు దొరకడం లేదు. బెంగాల్, బిహార్‌లలో కూడా ఇటువంటి ఘటనలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. 

దేశ చరిత్ర ఒక ప్రమాదకరమైన మలుపులో ఉన్నదని కొందరు మేధావులు ఆందోళన చెందడం, జంతర్‌మంతర్‌లో వాంగ్‌చుక్‌ ఆందోళన, ప్రభుత్వాలు స్వయంగా పౌరహక్కుల హననానికి పూనుకోవడం, ఫోర్త్‌ ఎస్టేట్‌ పెంపుడు మీడియాగా మారిపోవడం – వేర్వేరు విషయాలు కాదు. దేశ రాజకీయ వ్యవస్థ గమనానికి సంబంధించిన సూచికలు. ప్రభుత్వాల అప్రజాస్వామిక ధోరణి, మీడియా నిష్క్రియాపరత్వం ఈ గమనాన్ని సుగమం చేసే బాటలు. అధికార పీఠంపై ఉన్న బీజేపీ మాతృసంస్థ ఆరెస్సెస్‌ ఎజెండా ఈ గమనానికి చోదకశక్తిగా దేశంలోని కొన్ని వర్గాలు అనుమానిస్తున్నాయి. దేశంలోని ప్రధాన ప్రతిపక్షం ఎంతటి అసమర్థ  స్థితిలో ఉన్నప్పటికీ అధికార రథం ఎంచుకొన్న గమనం నిరాటంకం మాత్రం కాదని జంతర్‌మంతర్‌ చెబుతున్నది. బలంగానో, బలహీనంగానో ప్రతిఘటన ఉండి తీరుతుందని చెబుతున్నది.

భారత రాజ్యాంగం పుట్టినప్పుడే వ్యతిరేకించిన ఆరెస్సెస్‌కు ఇప్పుడు అవకాశం దొరికింది కనుక దాన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమాన్ని కొనసాగిస్తుందని ఆ సంస్థ వ్యతిరేకులు శంకి స్తున్నారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమా వేశాల్లో ఆ దిశగా కొన్ని అడుగులు పడే అవకాశమున్నదని వారు భావిస్తున్నారు. ప్రధానమైన ముందడుగు ఇప్పటికే ‘సర్‌’ కార్య క్రమంతో మొదలైంది. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం కాస్త సమగ్ర తొలగింపు కార్యక్రమంగా మారిందనే విమర్శలు కొత్తవి కావు. ఈ విమర్శలకు ఆధారాలు కూడా ఉన్నాయి. పది రాష్ట్రాల్లో పూర్తయిన ‘సర్‌’లో ఐదున్నర కోట్ల ఓట్లను తొలగించారు. ఇందులో సింహభాగం ఒక వర్గం వారేనని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్ని ఆధారాలు సమర్పించి అప్పీల్‌ చేసుకుంటే ఓటుహక్కును పునరుద్ధరిస్తా మని హామీ ఇచ్చారు. 

బెంగాల్‌లో 27 లక్షల మంది తాము స్థానిక పౌరులమనే ఆధారాలు సమర్పిస్తే వారిలో కొన్ని వందల కేసులనే ఇప్పటిదాకా పరిష్కరించారట. ఈ లెక్కన మిగిలిన వారికి ఎన్ని దశాబ్దాల తర్వాత మోక్షం కలగాలి?బిహార్‌లో తొలగించిన 60 లక్షల ఓట్లలో ఐదువందలమందిని ‘విదేశీయులు’గా తేల్చారట. అందులో 350 మంది బిహారీలను పెళ్లి చేసుకున్న నేపాలీ అమ్మాయిలు. నేపాల్‌లో ఉండే మధేశీ తెగ ప్రజలు బిహార్‌లో సరిహద్దు ప్రాంతంలో కూడా ఉంటారు. ఈ మధేశీ ప్రజల పెళ్లి సంబంధాలు కొన్ని శతాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఇన్ని వందల ఏళ్ల చరిత్రను ఎప్పటికి తవ్వితీస్తారో చూడాలి! ఇప్పుడు మిగిలిన రాష్ట్రాల్లో ‘సర్‌’ కార్యక్రమం నడుస్తున్నది.

హైదరాబాద్‌లో 30 శాతం ఓటర్లు ఇప్పటికీ మ్యాపింగ్‌ కాలేదట. అయ్యే అవకాశం కూడా లేదు. నిరక్షరాస్యులు, బతుకుదెరువు కోసం వలసపోయే పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు, మైనారిటీలు ఎక్కువసంఖ్యలో ఈ కార్యక్రమం వల్ల ఓట్లు కోల్పోయే పరిస్థితి కనిపిస్తు న్నది. ఈ వర్గాల ఓట్లు తగ్గితే నష్టమెవరికో, లాభమెవరికో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

‘టార్గెటెడ్‌’ ఓటర్ల తొలగింపునకు అవసరమయ్యే సాకులు కూడా ఈ కార్యక్రమంలో దండిగానే ఉన్నాయి. 2002 జాబి తాతో సరిపోలకపోయినా, అందులో అచ్చుతప్పులు గమనించినా ఓటు హక్కును తృణీకరించవచ్చు. అప్పీల్‌ చేసుకుంటే ఎప్పటికి న్యాయం జరుగుతుందో చెప్పలేము. ‘సర్‌’ ద్వారా ఓటు హక్కును కోల్పోయిన వారికి బెంగాల్, బిహార్‌లలోసంక్షేమ పథకాల వర్తింపును కూడా నిలిపేశారనీ వార్తలు వస్తు న్నాయి. ఇప్పటికే ఆధార్, పాస్‌పోర్ట్‌తో సహా ఏ కార్డూ పౌర సత్వానికి సూచిక కాదని అధికారులు చెబుతున్నారు. 

సరికొత్త ఓటర్‌ ఐడీ మాత్రమే పౌరసత్వానికి రుజువని చెబితే పరిస్థితి ఏమిటి? అలా జరగదని సుప్రీంకోర్టు చెబుతున్నది. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన ఏ ఆదేశాన్ని ఎన్నికల సంఘం గానీ, ప్రభుత్వం గానీ పాటించింది? పౌరసత్వం ఉన్నవారికి మాత్రమే రాజ్యాంగంలో ఆర్టికల్‌ 19 కింద ఉన్న భావప్రకటనా హక్కు, సమావేశ స్వేచ్ఛ... వంటి ఆరు హక్కులు వర్తిస్తాయి. ఈ పౌర హక్కులు న్నప్పుడే అక్రమ నిర్భాంధాలకు గురి చేస్తున్న రాజ్యంలో అవి లేనివారి పరిస్థితి ఏమిటి?

రేపటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్‌ సమావేశాల్లో కొన్ని రాజకీయ బిల్లులు కూడా ఉండొచ్చని తెలుస్తున్నది. వాటిలో రెండు ప్రమాదకరమైన బిల్లులు కూడా కనిపిస్తున్నాయి. అందులో ఒకటి అధికార పదవుల్లో ఉన్నవారు 30 రోజులపాటు జైలుకెళ్లి వస్తే పదవిని కోల్పోతారనే 130వ రాజ్యాంగ సవరణ బిల్లు. ఇందులో న్యాయమూ లేదు, నైతికతా లేదు, రాజ్యాంగ బద్ధతా లేదు. కేవలం ప్రత్యర్థి రాజకీయ పార్టీ నేతలను వేధించి చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఉద్దేశించింది మాత్రమే అనే విమర్శలు వినిపిస్తున్నాయి. బిల్లులో ప్రధానిని కూడా చేర్చిన ప్పటికీ, ఏ దర్యాప్తు సంస్థ ప్రధానమంత్రిని అరెస్టు చేస్తుంది? కేవలం ముఖ్యమంత్రులపైకే కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే అవకాశం ఉంటుంది? 

దర్యాప్తు సంస్థలు అరెస్టు చేసినంత మాత్రాన, అభియోగాన్ని న్యాయస్థానంలో రుజువు కాకుండా పదవి కోల్పోవడమేమిటి? ఇది ప్రతిపక్షాల మీద చట్టబద్ధమైన దాడి. అలాగే ‘ఒక దేశం ఒక ఎన్నిక’ కూడా రాజ్యాంగ ఫెడరల్‌ స్వభావం మీద ప్రత్యక్ష దాడిగానే న్యాయ నిపుణులు భావి స్తున్నారు. రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చే సవరణ చట్టాలు చెల్లుబాటు కావని గతంలో సుప్రీంకోర్టు పలుమార్లు చెప్పింది. ఈ రెండు బిల్లులూ రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవే. అయినా ఇవి చట్టరూపం దాలిస్తే... వీటికి తోడుగా ‘సర్‌’ కోటాలో కొన్ని కోట్లమంది ఓటు హక్కు కోల్పోతే... సమానత్వం, లౌకికత్వం, స్వాతంత్య్రం పునాదుల మీద నిర్మితమైన రాజ్యాంగబద్ధ పాలనకు ప్రమాదం దాపురించినట్టే. పారాహుషార్‌!


వర్ధెల్లి మురళి
vardhelli1959@gmail.com

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement