బైక్ ర్యాలీలో వైఎస్సార్‌సీపీ నేతలు కాకాణి, బుర్రా మధుసూదన్ యాదవ్, ప్రతాప్‌కుమార్‌రెడ్డి, కార్యకర్తలు, ప్రజలు
పోర్టు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ముట్టడి
టిప్పర్లు, బారికేడ్లతో పోర్టుకు వెళ్లే మార్గాన్ని మూసివేసిన పోలీసులు
లోపలికి అనుమతి నిరాకరణ
సీఈవో బయటకు రావాలని నేతల డిమాండ్..పోలీసులు, వైఎస్సార్‌సీపీ శ్రేణుల మధ్య తోపులాట.. జాతీయ రహదారిపై శ్రేణుల బైఠాయింపు
కాకాణి, బుర్రా, రామిరెడ్డిలను ఈడ్చుకెళ్లిన పోలీసులు
నాయకులపై అక్రమ కేసు నమోదు
కందుకూరు: చంద్రబాబు ప్రభుత్వం రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరించడాన్ని నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ శనివారం భారీ ఆందోళన చేపట్టింది. పోర్టు ముట్టడికి తరలివ చ్చిన పార్టీ శ్రేణులు, రైతులను పోర్టు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడుకోవడంతో పోలీసులకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. పోర్టు సందర్శనకు అనుమతించకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ప్రభుత్వ బండారం బయటపడుతుందన్న భయంతోనే అనుమతించడంలేదంటూ నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారీ బైక్ ర్యాలీ
రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కందుకూరు నియోజకవర్గ ఇన్‌చార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో భారీగా కార్యకర్తలు, నేతలు, రైతులు, యువత పోర్టు సమీపంలోని జాతీయ రహదారిపైకి చేరుకున్నారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కావలి నియోజకవర్గ ఇన్‌చార్జి రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, పార్టీ శ్రేణులు కావలి నుంచి ర్యాలీగా వచ్చారు.16వ నంబర్ జాతీయ రహదారి నుంచి పోర్టు వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు. ర్యాలీని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. పోర్టుకు కిలోమీటర్ దూరంలో టిప్పర్‌లు, ఇనుప రేకులతో రోడ్డును మూసివేసి పోలీసులు అడ్డుగా నిలబడ్డారు.
లోపలికి అనుమతించాలని కాకాణి, బుర్రా, ప్రతాప్‌కుమార్‌రెడ్డి పోలీసులను కోరారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎన్నో వ్యయప్రయాసలకు ఎదురొడ్డి ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మించిన పోర్టులో కార్యకలాపాలు ప్రారంభమయ్యే దశలో చంద్రబాబు తన బినామీలకు అప్పగించడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు పోర్టులో ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు తమకు ఉందని, అడ్డు తొలగాలని గట్టిగా కోరారు. అయినా పోలీసులు పార్టీ నేతలు, శ్రేణులను వెనక్కి నెట్టేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
గంటన్నర పాటు పోలీసులకు, వైఎస్సార్‌సీపీ శ్రేణులకు మధ్య వాదోపవాదాలు, తోపులాటలు, నినాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లిపోయింది. లోపలికి అనుమతి లేదని పోర్టు సీఈవో లెటర్ ఇచ్చారని, ముగ్గురు నేతలను మాత్రమే లోపలికి అనుమతిస్తామని డీఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెప్పారు. కనీసం 50 మందిని అనుమతించాలని కాకాణి పట్టుపట్టారు. దీనికీ పోలీసులు ససేమిరా అన్నారు. పోర్టు సీఈవోని బయటకు పిలిపించి తమతో మాట్లాడించాలని, లేదంటే తమను పోర్టులోకి తీసుకెళ్లాలంటూ నేతలు పట్టుపట్టారు. పోర్టు నిర్మాణానికి 3 గ్రామాలను ఖాళీ చేసి 850 ఎకరాలు ఇచ్చామని, కానీ చంద్రబాబు ప్రభుత్వం తమ భూములతో వ్యాపారం చేస్తోందని స్థానిక రైతులు మండిపడ్డారు.
భూములి చ్చిన రైతులుగా పోర్టు నిర్మాణం ఎలా ఉందో తెలుసుకునే హక్కు తమకుందని, లోపలికి పంపాలని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, రైతులు, యువత జాతీయ రహదారి 16పై రాస్తారోకోకు దిగారు. రహదారిపై కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. రోడ్డుపై బైఠాయించిన కాకాణి, బుర్రా, రామిరెడ్డిలను పోలీసులు ఈడ్చుకెళ్లారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య మరోసారి తోపులాట జరిగింది. నేతలను, కార్యకర్తలను గుడ్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. బుర్రా, కాకాణి, ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మరో 15 మంది నేతలపై జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారంటూ అక్రమ కేసులు నమోదు చేసి సొంత పూచీకత్తుపై అందరినీ విడుదల చేశారు.
ప్రజల ఆస్తులను తెగనమ్మడమే చంద్రబాబు లక్ష్యం
వేల కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తులను అతి చవగ్గా తెగనమ్మి, తన కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని, దీనిలో భాగమే రామాయపట్నం పోర్టు ప్రైవేటీకరణ అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం రామాయపట్నం పోర్టు ముట్టడి కార్యక్రమం సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, మధుసూదన్ యాదవ్‌తో కలిసి కాకాణి విలేకరులతో మాట్లాడారు. దాదాపు నిర్మాణం పూర్తయి, 5 శాతం పనులే మిగిలి ఉన్న దశలో రామాయపట్నం పోర్టును చంద్రబాబు సొంత మనుషులకు కట్టబెడుతున్నారని అన్నారు.
‘‘రూ 5వేల కోట్లు విలువ చేసే ఆస్తిని రూ 1,500 కోట్లకే ఇస్తున్నారు. పోర్టు నిర్మాణానికి తీసుకున్న రూ. 2,079 అప్పును ప్రభుత్వమే భరిస్తుందని చెప్తున్నారు. మిగిలిన 5శాతం పనులను ప్రభుత్వమే చేస్తుందని, లేని పక్షంలో లబ్దిదారుడు ఆ పనులు చేసి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన రూ 1500 కోట్లలో మినహాయించుకోవచ్చని చెబుతున్నారు. ఇది దోపిడీ కాక మరేమిటి?’ అని ప్రశ్నించారు. రామాయపట్నం పోర్టు ఈ ప్రాంత ప్రజలకు జగన్ ఇచ్చిన హక్కు అని. దానిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తుంటే చూస్తూ ఊరుకోలేమని బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ ఆస్తులను అమ్మి దోచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు పని చేస్తున్నారని రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.


