కొండకు టెండర్‌! | Illegal mining being run in the name of a follower of CM Ramesh | Sakshi
Sakshi News home page

కొండకు టెండర్‌!

Jul 19 2026 2:17 AM | Updated on Jul 19 2026 2:22 AM

Illegal mining being run in the name of a follower of CM Ramesh

‘పంచదార్ల’ను అక్రమంగా తవ్వేస్తున్న పచ్చగద్ద 

రూ. 500 కోట్లు కొట్టేయడానికి అనకాపల్లి ఎంపీ, ముఖ్యనేత ప్లాన్‌ 

పంచాయతీ తీర్మానం లేదు.. ప్రజాభిప్రాయ సేకరణ లేదు 

భారీ యంత్రాలతో తవ్వకాలు.. రోజూ 200 టిప్పర్ల గ్రావెల్‌ తరలింపు 

ప్రశ్నించిన గ్రామస్తులకు సీఎం రమేష్‌ అనుచరుల బెదిరింపులు 

లారీలతో తొక్కించేస్తామంటూ హెచ్చరికలు.. వారికే పోలీసుల వత్తాసు 

కేసులు పెడతామని గ్రామస్తులకు వార్నింగ్‌లు 

ఆందోళనల నేపథ్యంలో హడావిడిగా అనుమతులు 

50వేల క్యూబిక్‌లకు అనుమతిస్తే 4 లక్షల క్యూబిక్‌ల మేర తవ్వకాలు 

ఆందోళనలు పెరగడంతో మైనింగ్‌ నిలిపివేతకు అధికారుల ఆదేశాలు 

కానీ రహస్యంగా మరో 9.99 హెక్టార్లలో మైనింగ్‌కు అనుమతులు 

సీఎం రమేష్‌ బినామీలలో తాజాగా జనసేన ఎమ్మెల్యే అనుచరుడు

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ప్రాచీన శైవక్షేత్రమున్న పంచదార్ల కొండ అది. పవిత్రమైన బౌద్ధారామాలకు, ప్రకృతి అందాలకు నెలవు. కొండ నుంచి వచ్చే జలధారలతో నిండే రిజర్వాయర్, తాగునీటికి, ఇతర అవసరాలకు దానిపై ఆధారపడిన రెండు గ్రామాల ప్రజలు.. ఆ కొండపై విచ్చుకత్తుల్లాంటి గోళ్లతో పచ్చమూలాలున్న గద్ద ఒకటి వాలింది. కొండను తవ్వేస్తూ మింగేస్తోంది.  ముఖ్యనేత అండతో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్. విజయకుమార్‌నాయుడు అనే అనుచరుడి పేరుతో నడిపిస్తున్న అక్రమ మైనింగ్‌ వ్యవహారమిది. వెంకటాపురం నుంచి పంచదార్ల వరకు విస్తరించి ఉన్న పంచదార్ల కొండను భారీ యంత్రాలతో తవ్వించేస్తున్నారు. రోజుకు 150 నుంచి 200 ట్రిప్పుల వరకు గ్రావెల్‌ తరలించేస్తున్నారు. 

రోజుకు రూ.30 లక్షల చొప్పున ఏడాదికి దాదాపు రూ.100 కోట్లు కొట్టేయడానికి పథకం వేశారు. వీటికి తోడు బినామీల పేరుతో తాజాగా మరో 9.99 హెక్టార్లలో కూడా అనుమతులు సంపాదించారన్న విషయం బయటపడింది. వీటి మొత్తం మైనింగ్‌ విలువ రూ. 500 కోట్లకు పైమాటే. పంచాయతీ తీర్మానం లేదు.. ప్రజాభిప్రాయ సేకరణ లేదు.. నిలదీసిన స్థానికులను టిప్పర్లతో తొక్కించేస్తామని గూండాలు బెదిరిస్తున్నారు. రెండు నెలల నుంచి సాగుతున్న ఈ అక్రమ మైనింగ్‌ను నిజానికి సాక్షి గత నెలలోనే వెలుగులోకి తెచ్చింది. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ప్రజలు ఆందోళనలు చేశారు. దాంతో పక్కనే ఉన్న పారిశ్రామిక పార్కు అవసరాల కోసం అనే పేరుతో అనుమతులు వచ్చేశాయి. వాటిని అడ్డంపెట్టుకుని అనుమతులకు మించి ఏకంగా 3 లక్షల నుంచి 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకాలు జరిపేశారు. 

ఈ వ్యవహారంపై అన్ని వర్గాల నుంచి నిరసన వ్యక్తం కావడంతో అధికారులు తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ అక్రమ మైనింగ్‌ వ్యవహారంపై తూతూ మంత్రంగా విచారణ జరిపి.. నామమాత్రపు అపరాధ రుసుంతో క్లోజ్‌ చేయాలని మైనింగ్‌ అధికారులు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఎన్నికలకు ముందు ఎన్నో విషయాలపై గొంతు చించుకున్న పవన్‌ కళ్యాణ్‌ లిస్టులో పంచదార్ల కొండ కూడా ఉంది. అక్కడ మైనింగ్‌కు అనుమతివ్వబో మన్నారు. కానీ మరెందుకో సీఎం రమేష్‌ అక్రమ మైనింగ్‌ విషయంపై ఆయన ఇపుడు నోరుమెదపడం లేదు. 

పంచాయతీ తీర్మానం లేదు..  ప్రజాభిప్రాయ సేకరణ లేదు 
ఏ ప్రాంతంలోనైనా కొత్తగా మైనింగ్‌కు అనుమతి ఇవ్వాలంటే పంచాయతీ తీర్మానం ఉండాలి. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. అయితే సీఎం రమేష్‌ పలుకుబడి, ఒత్తిళ్ల నేపథ్యంలో అవేవీ లేవు సరికదా... కనీసం మైనింగ్‌శాఖ అనుమతులు కూడా లేకుండానే అక్రమ తవ్వకాలు మొదలుపెట్టేశారు. స్థానికుల ఆందోళనల నేపథ్యంలో భూగర్భ గనులశాఖ అనుమతులు మంజూరు చేసింది. ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (ఏపీఐఐసీ) ఆధ్వర్యంలోని పారిశ్రామిక పార్కుకు గ్రావెల్‌ తరలింపు పేరుతో అనుమతులు మంజూరు చేశారు.

వాస్తవానికి 50 వేల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకాలకు అనుమతులు ఇస్తే  3లక్షల నుంచి 4 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర తవ్వకాలు చేపట్టారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నేతలు ఫిర్యాదు చేయడంతో పాటు ఆందోళన బాట పట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో మైనింగ్‌ తవ్వకాలపై విచారణ చేపట్టి... అనుమతికి మించి తవ్వారంటూ నివేదిక రూపొందించారు. కానీ నామమాత్రపు అపరాధ రుసుం విధించి యథావిధిగా మైనింగ్‌ జరిగేలా వ్యవహారం చక్కబెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.  

ఆగని అనుమతులు.. మొత్తం విలువ రూ.500 కోట్లు 
మొదట అనుమతులు ఇచ్చిన 2.153 హెక్టార్లపైనే ఆందోళనలు, విచారణలు సాగుతుండగా అదే విజయ్‌కుమార్‌నాయుడు పేరుతో ఈ ఏడాది మే 15న మరో 4.99 హెక్టార్లల్లో మైనింగ్‌ అనుమతులు ఇస్తూ అనకాపల్లి జిల్లా మైనింగ్‌ అధికారులు అనుమతులు జారీ చేశారన్న విషయం బయటపడింది. అంటే మొత్తం విజయ్‌కుమార్‌ నాయుడుకు 7.143 హెక్టార్లల్లో మైనింగ్‌ అనుమతులు జారీ అయ్యాయి. మరోవైపు ఇక్కడే మరో 5 హెక్టార్లలో కూడా మైనింగ్‌ జరిపేందుకు తాజాగా లక్ష్మీ మినరల్స్‌ పేరుతో వై.శ్రీనివాస్‌కు తాజాగా అంటే శనివారం లీజుకు ఇస్తూ ఉత్తర్వులు జారీచేశారు. 

అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్టుకు మైనింగ్‌ లీజుదారువిజయ్‌కుమార్‌ నాయుడు గ్రావెల్‌ సరఫరా‡ చేస్తున్నట్టు చెబుతున్న రసీదు 

                         తాజాగా శ్రీలక్ష్మి మినరల్స్‌కు జారీ చేసిన మైనింగ్‌ అనుమతులు  

                               దశమ్నాని విజయకుమార్‌ నాయుడు చిరునామా  

ఈ వై.శ్రీనివాస్‌.. స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌ అనుచరుడని సమాచారం.. అంటే జనసేన ఎమ్మెల్యేను కూడా కలుపుకుని కొండకు టెండర్‌ వేశారని వినిపిస్తోంది. విజయ్‌కుమార్‌ నాయుడుకు, శ్రీ లక్ష్మీ మినరల్స్‌కు ఇచ్చిన 5 హెక్టార్లకు కలుపుకుంటే మొత్తం 12.143 హెక్టార్లకు అనుమతులు జారీచేశారు..  సీఎం రమేష్‌ నుంచి వచ్చిన ఒత్తిళ్లతోనే అనుమతులు జారీచేసినట్టు అధికారవర్గాల్లో వినిపిస్తోంది. మొదట్లో జారీచేసిన 2.153 హెక్టార్లలో ఏడాదికి రూ.100 కోట్ల అక్రమ మైనింగ్‌ జరుగుతుందని తెలుస్తోంది. వీటికి తోడు తాజా 9.99 హెక్టార్లను కలుపుకుంటే ఇది ఏడాదికి రూ.500 కోట్లకు చేరుకుంటుందని అర్థమవుతోంది. 

ప్రశ్నించిన వారిపైనే కేసులా? 
అక్రమ మైనింగ్‌ ఆపాలంటూ స్థానికులు ఆందోళన చేస్తుంటే.. వారికి సహకరించాల్సిన పోలీసులు బెదిరిస్తున్నారు. ఆందోళన చేస్తున్న వారిపై కేసులు పెడతామని రాంబిల్లి పోలీసులు బెదిరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. వాళ్లే కాదు. కూటమికి చెందిన స్థానిక నాయకులు కూడా బాధితులే. సీఎం రమేష్‌ అండతోనే మైనింగ్‌ చేస్తున్నామని, ఎవరైనా ఆందోళన చేసినా అడ్డుగా వచ్చినా లారీలతో తొక్కించేస్తామని విజయకుమార్‌ గ్యాంగ్‌ బెదిరిస్తోందట. 

ప్రాచీన శైవ క్షేత్రానికి ముప్పు! 
వాస్తవానికి పంచదార్ల క్షేత్రానికి ఎంతో ఘనమైన చరిత్ర ఉంది. పంచాధారల వద్ద స్వయంభూ లింగం ఉండే­దని తెలుస్తోంది. కాలక్రమంలో ఇది మరుగునపడింది. నారదమహర్షి సూచన మేరకు యమధర్మరాజు కుçష్టు నివారణ కోసం మరో లింగాన్ని తిరిగి ప్రతిష్ట చేసినట్టు చరిత్రకారులు పేర్కొంటున్నారు. అందువల్ల ఈ పంచదార్ల క్షేత్రానికి యమధర్మ పేరుతో ధర్మ లింగేశ్వరాలయం అనే పేరు వచ్చిందని కూడా చెబుతుంటారు. ఇక్కడ నిరంతరాయంగా లింగాలనుంచి నీరు పారు­తుంది. ఈ ప్రవాహం ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ రహస్యమే. ఈ నీటిని తాగితే అనారోగ్యం పాలుకాకుండా కాపాడతాయనేది ప్రజల నమ్మకం. 

అంతేకాకుండా నరసింహస్వామి మొదటిసారిగా ఇక్కడే పాదా­లు మోపారని పురాణాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో గోల్కొండ తరహాలో ఇక్కడ కూడా మండపంలో చప్పట్లు కొడితే తిరిగి మనకు రీసౌండ్‌గా వినపడుతుంది. ఇది పురాతన రక్షిత కట్టడమని పేర్కొంటూ పురావస్తుశాఖ గుర్తించి బోర్డు కూడా ఏర్పాటు చేసింది. ఇంతటి ఘనచరిత్ర ఉన్న పంచదార్ల శైవ క్షేత్రానికి ముప్పువాటిల్లేలా చంద్రబాబు ప్రభుత్వంలో భారీగా అక్రమ మైనింగ్‌ సాగుతుం­డటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే కొండకు ఆనుకుని ఉన్న ఫణిగిరి కొండపై ఉన్న బౌద్ధారామాలకు కూడా ఈ విచ్చలవిడి అక్రమ మైనింగ్‌తో ముప్పు ఉందన్న ఆందోళన నెలకొని ఉంది. 

ఎవరీ విజయ్‌కుమార్‌ నాయుడు? 
విజయ్‌కుమార్‌ నాయుడు సీఎం రమేష్‌ బినామీ అని వినిపిస్తోంది. ఈయన కడపజిల్లా ఎర్రగుంట్ల గ్రామంలోని నాయుడు స్ట్రీట్‌ నెం. 4–136 లో నివాసం ఉంటున్నారు. సీఎం రమేష్‌ సొంత గ్రామం కూడా ఇదే ఎర్రగుంట్ల కావడం గమనార్హం. విజయ్‌కుమార్‌నాయుడు పేరుతో తీసుకున్న లీజు ద్వారా వచ్చిన గ్రావెల్‌ను సీఎం రమేష్‌కు చెందిన రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌కు సరఫరా చేస్తున్నారు. ఆమేరకు బిల్లులు కూడా తీసుకుంటున్నారు. ఈ రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ బార్క్‌లో జరుగుతున్న పనులకు గ్రావెల్‌ను సరఫరా చేస్తోంది. అంటే నేరుగా రిత్విక్‌ పేరుతో కాకుండా తన గ్రామానికే చెందిన విజయ్‌కుమార్‌నాయుడు పేరుతో లీజుకు తీసుకుని... తద్వారా వచ్చిన గ్రావెల్‌ను రిత్విక్‌ ప్రాజెక్ట్స్‌ ద్వారా సరఫరా చేస్తున్నారన్నమాట.  

రిజర్వాయర్‌ కనుమరుగయ్యే ప్రమాదం..
కొండ నుంచి వచ్చే నీటితో కొండ కింద 15 ఎకరాల్లో రిజర్వాయర్‌ నిండుతుంటుంది. 400 ఎకరాల ఆయకట్టుకే కాదు, రెండు గ్రామాల ప్రజల తాగునీరు, ఇతర అవసరాలకు ఇది కీలకం. ఈ రిజర్వాయర్‌ ఎప్పుడో బ్రిటీషు కాలం నుంచీ ఉందని స్థానికులు పేర్కొంటున్నారు. 2023లో గత ప్రభుత్వ హయాంలో ఏషియన్‌ పెయింట్స్‌ సీఎస్‌ఆర్‌ నిధులతో అప్పటి ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆధ్వర్యంలో ఈ రిజర్వాయర్‌ను అభివృద్ధి చేసి మరింత నీరు ఇక్కడ నిల్వ ఉంచేలా చేశారు. అంతేకాకుండా వెంకటాపురం రెవెన్యూ పరిధిలో ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ నిధులతో కొండ ప్రాంతాల్లో పలు అభివృద్ధి పనులు కూడా చేపట్టారు. ఇప్పుడు ఈ అక్రమ మైనింగ్‌తో రిజర్వాయర్‌ కనుమరుగయ్యే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

గతనెలలో వెలుగులోకి తెచ్చిన సాక్షి 
రాంబిల్లి మండలం పంచదార్ల గ్రామంలోని పవిత్ర పుణ్యక్షేత్రం ఫణిగిరి కొండపై తవ్వకాలకు సంబంధించి సాక్షి జూన్‌ 4న ‘పంచదార్ల కొండపై పచ్చగద్దలు’ శీర్షిక వెలుగులోకి తీసుకొచ్చింది. ఆ తరువాత ప్రజాసంఘాలు, వామపక్షాలు, వైఎస్సార్‌సీపీ నేతలు ఆందోళనలు నిర్వహించారు. 

ఈ నేపథ్యంలో పురావస్తు, మ్యూజియంల శాఖ (విశాఖపట్నం) అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (టెక్నికల్‌) నేతృత్వంలో ఈ నెల 15న వివాదాస్పద క్వారీ పరిసరాల్లో తనిఖీలు నిర్వహించారు. క్వారీలో తవ్వకాలు, డ్రిల్లింగ్, బ్లాస్టింగ్, లోడింగ్, రవాణా సహా అన్ని రకాల కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని గనులు, భూగర్భ వనరుల శాఖ ఏడీ శ్రీనివాస్‌ ఉత్తర్వులు జారీ చేశారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement