ఆరిలోవ: ఇందిరాగాంధీ జూ పార్కులో వన్యప్రాణుల దత్తత కార్యక్రమానికి దాతల నుంచి మంచి స్పందన లభిస్తోంది. సీఎంఆర్ టెక్స్‌టైల్స్ అండ్ జ్యూవెలరీకి చెందిన మావూరి పద్యావతి శనివారం తొమ్మిది వన్యప్రాణులను ఒక సంవత్సరం పాటు దత్తత తీసుకున్నారు. రింగ్‌టైల్డ్ లెమూర్, మార్మోసెట్, బోనెట్ మకాక్, స్క్విరెల్ మంకీ, హమాడ్రియాస్ బబూన్, చింపాంజీ, రీసస్ మకాక్, అస్సామీస్ మకాక్, స్టంప్‌టైల్డ్ మకాక్‌ల సంరక్షణ కోసం రూ.1.65 లక్షల చెక్కును జూ క్యూరేటర్ జి. మంగమ్మకు అందజేశారు. అనంతరం క్యూరేటర్ దత్తత అంగీకార పత్రం, ధ్రువీకరణ పత్రాన్ని (సర్టిఫికెట్) పద్యావతికి అందించారు. అలాగే జూలో విధులు నిర్వహిస్తున్న వెటర్నరీ వైద్యుడు డాక్టర్ పి.భానుబాబు సారస్ క్రేన్‌ను ఏడాది కాలానికి దత్తత తీసుకుని, దాని సంరక్షణ కోసం రూ.10 వేల నగదును క్యూరేటర్‌కు అందజేశారు.


