బాలికల కోసం నిర్మించిన వసతీ గృహం
మురళీనగర్: రాష్ట్రంలోనే అత్యుత్తమ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లలో ఒకటిగా పేరొందిన కంచరపాలెం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ, వసతి సౌకర్యాల విషయంలో మాత్రం విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 1956లో స్థాపితమైన ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థ దాదాపు 70 ఏళ్ల చరిత్రను పూర్తి చేసుకుని 71వ వసంతంలోకి అడుగుపెట్టింది. సాంకేతిక విద్యలో ఉత్తమ పాలిటెక్నిక్ అవార్డును సొంతం చేసుకున్న ఈ కళాశాలలో, కోట్లాది రూపాయలతో నిర్మించిన బాలికల హాస్టల్ భవనం ఎనిమిదేళ్లుగా తాళం వేసి ఉండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
కోట్ల భవనం.. ప్రయోజనం శూన్యం
కాలేజీలో ప్రస్తుతం వివిధ ఇంజినీరింగ్ విభాగాలు, ఫార్మసీ కోర్సులతో కలిపి సుమారు 1,800 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో దాదాపు 300 మంది విద్యార్థినులు ఉన్నారు. బాలుర కోసం రెండు హాస్టళ్లు ఉన్నప్పటికీ, బాలికలకు మాత్రం ఇప్పటికీ శాశ్వత వసతి సదుపాయం లేదు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా సుమారు ఎనిమిదేళ్ల క్రితం రూ.10 కోట్ల వ్యయంతో ఆధునిక హాస్టల్ భవనాన్ని నిర్మించారు. 150 మందికి పైగా విద్యార్థినులు నివసించే సామర్థ్యం ఉన్న ఈ భవనాన్ని హాస్టల్‌గా ప్రారంభించకుండా కొంతకాలం మెకానికల్ విభాగం తరగతి గదులుగా ఉపయోగించారు. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాలతో తరగతులను నిలిపివేసినా, హాస్టల్‌ను మాత్రం ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేదు. ప్రస్తుతం ఆ భవనం చుట్టూ పిచ్చిమొక్కలు పెరిగి నిరుపయోగంగా మారింది. కోట్లాది రూపాయల ప్రజాధనం ఇలా వృథా కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గ్రామీణ విద్యార్థినులకు ఇబ్బందులు
గతంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సమీపంలోని ప్రభుత్వ కెమికల్ ఇంజినీరింగ్ ఇన్‌స్టిట్యూట్ (గైస్) హాస్టల్‌లో పాలిటెక్నిక్ విద్యార్థినులకు తాత్కాలికంగా వసతి కల్పించారు. ఆ కాలేజీకి ఉన్న డిమాండ్ కారణంగా ఈ ఏడాది మొదటి సంవత్సరం పాలిటెక్నిక్ విద్యార్థినులకు అక్కడ అవకాశం దక్కలేదు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాల వంటి దూర ప్రాంతాల నుంచి మెరిట్ సాధించి వచ్చే గ్రామీణ విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బయట అద్దె గదులు తీసుకుని చదివించే ఆర్థిక స్థోమత లేక చాలామంది సీటు వచ్చినా చేరలేకపోతున్నారు. మరికొందరు డిప్లమా చదువును పూర్తిగా వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
శాశ్వత ప్రిన్సిపాల్ లేకపోవడమేప్రధాన సమస్య
కాలేజీకి చాలా కాలంగా శాశ్వత ప్రిన్సిపాల్ లేకపోవడం కూడా సమస్యను మరింత సంక్లిష్టం చేసింది. ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్స్ తరచూ మారుతుండటంతో కీలక పరిపాలనా నిర్ణయాలు ముందుకు సాగడం లేదు. ఇటీవల స్థానిక ప్రజాప్రతినిధులు కాలేజీని సందర్శించి హాస్టల్‌ను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించినప్పటికీ, ఆ వెంటనే ప్రిన్సిపాల్ బదిలీ కావడంతో వ్యవహారం మళ్లీ మొదటికి చేరింది. ప్రస్తుతం మొదటి విడత కౌన్సెలింగ్ పూర్తయి, రెండో విడత ప్రవేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
● కంచరపాలెం పాలిటెక్నిక్‌లో విద్యార్థినులకు వసతి కరువు
● రూ.10 కోట్లతో నిర్మించిన హాస్టల్ భవనం ఎనిమిదేళ్లుగా నిరుపయోగం
● గ్రామీణ విద్యార్థులు బయట అద్దెలు భరించలేక ఇబ్బందులు
● పట్టించుకోని సాంకేతిక విద్యాశాఖ అధికారులు
ఇకనైనా మేల్కొంటారా?
ఏళ్లుగా మూతపడి ఉన్న హాస్టల్ భవనాన్ని వెంటనే వినియోగంలోకి తీసుకురావాలంటే ముందుగా పరిసరాలను శుభ్రం చేసి, విద్యుత్, తాగునీటి వంటి మౌలిక వసతులను పునరుద్ధరించాలి. విద్యార్థినుల భద్రత కోసం ప్రహరీ గోడ ఎత్తు పెంచడంతో పాటు అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. ముఖ్యంగా కాలేజీకి శాశ్వత ప్రిన్సిపాల్‌ను నియమించి హాస్టల్ నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తేనే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన భవనం అడవిగా మారిపోగా, మరోవైపు విద్యార్థినులు అద్దె గదుల కోసం అల్లాడాల్సి రావడం సాంకేతిక విద్యాశాఖ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి హాస్టల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చి గ్రామీణ విద్యార్థినుల ఉన్నత విద్యకు అండగా నిలవాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.
రూ.10 కోట్ల భవనానికి తాళం.. విద్యార్థినులకు అద్దె గది ’శిక్ష’!


