బోయిపాలెం జంక్షన్ వద్ద టీడీపీ నేత అక్రమ నిర్మాణం
తాగునీటి ప్రధాన పైప్‌లైన్‌పై నిబంధనలకు విరుద్ధంగా పనులు
ఫిర్యాదులు చేసినా పట్టించుకోని జీవీఎంసీ అధికారులు
మధురవాడ: కూటమి ప్రభుత్వంలో తమ్ముళ్ల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. అధికార బలంతో ప్రభుత్వ భూములు, చెరువులనే కాదు.. నగర ప్రజల దాహార్తిని తీర్చే కీలకమైన తాగునీటి పైపులైన్లను సైతం వదలడం లేదు. జీవీఎంసీ 5వ వార్డు పరిధిలోని బోయపాలెం జంక్షన్ వద్ద ఒక టీడీపీ నాయకుడు నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కి, నగరానికి నీటిని తరలించే ప్రధాన పైపులైన్‌పైనే ఇష్టారాజ్యంగా భారీ అనధికార నిర్మాణాన్ని చకచకా లేపేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని, అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలో ఈ అక్రమ నిర్మాణం సాగుతున్నా.. జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్టు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నిబంధనలు ‘లైన్’ తప్పాయి
ఆనందపురం నుంచి మధురవాడ వైపు వచ్చే జాతీయ రహదారిని ఆనుకుని, గంభీరం వైపు వెళ్లే మార్గంలో కొన్నేళ్ల క్రితం జీవీఎంసీ తాగునీటి విభాగం ఒక భారీ పైపులైనును ఏర్పాటు చేసింది. నగర ప్రజల తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ పైపులైన్ ఉన్న స్థలంపై ఎటువంటి శాశ్వత నిర్మాణాలు చేపట్టకూడదనేది కఠినమైన నిబంధన. ఒకవేళ ఎవరైనా అక్కడ నిర్మాణాలు చేయడానికి ప్లాన్ నిమిత్తం దరఖాస్తు చేసుకున్నా, దానికి అనుమతులు నిరాకరించాలని జీవీఎంసీ రూల్స్ స్పష్టంగా చెబుతున్నాయి. అయితే, ఈ నిబంధనలన్నీ సామాన్యులకే కానీ, అధికార పార్టీ నేతలకు వర్తించవన్నట్లు బోయిపాలెం జంక్షన్‌కు అత్యంత సమీపంలోనే ఈ అక్రమ కట్టడం యథేచ్ఛగా సాగిపోతోంది.
ప్రమాదం పొంచి ఉంది.. పట్టించుకోరా?
ఈ పైపులైన్ నగరానికి తాగునీటిని తరలించే అత్యంత కీలకమైన మార్గం. దీనిపై భారీ భవన నిర్మాణాలు చేపట్టడం వల్ల భవిష్యత్తులో పైపులైన్‌కు ఏవైనా మరమ్మతులు వస్తే తక్షణ చర్యలు చేపట్టడం అసాధ్యంగా మారుతుంది. ఒకవేళ లీకేజీలు ఏర్పడి, మరమ్మతులు చేయడం ఆలస్యమైతే నగరంలోని పలు ప్రాంతాలు తాగునీరు లేక అల్లాడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంతటి అత్యంత సున్నితమైన, కీలకమైన తాగునీటి పైపులైనుపై నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడుతుంటే.. అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.
ముఖ్య నేత అండతోనే అక్రమాలు
సదరు టీడీపీ నాయకుడు నియోజకవర్గంలో ఉన్న ఒక ముఖ్య నాయకుడి పేరు చెప్పుకుని ఇష్టానుసారంగా ఈ పనులు చేస్తున్నట్లు స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. రాజకీయ సిఫార్సులు ఉండటంతో అధికారులు కూడా ఈ అక్రమ నిర్మాణం వైపు కన్నెత్తి చూడటానికి భయపడుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై స్థానికులు ఇప్పటికే జీవీఎంసీ ఉన్నతాధికారులకు, జోనల్ కార్యాలయంలో పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేకుండా పోయింది. అధికారులు తక్షణమే స్పందించి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ఆ అనధికార నిర్మాణాన్ని కూల్చివేసి, నగర తాగునీటి వ్యవస్థను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.
బోయిపాలెం వద్ద హైవేను ఆనుకుని జీవీఎంసీ పైపు లైనుపై చేపట్టిన నిర్మాణాలు


