పెద్ద ఎత్తున పాల్గొన్న ఒడిశా భక్తులు
సింహాచలం: శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామివారికి ఆదివారం సాయంత్రం ఉంజల్‌సేవ వైభవంగా నిర్వహించారు. ఒడిశాకు చెందిన లక్ష్మీకాంత్ నాయక్‌దాస్ ఈ సేవను స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఒడిశాలోని పలు ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు ఉంజల్‌సేవలో పాల్గొని అప్పన్న నామస్మరణలో మునిగితేలారు. ఆలయ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఉంజల్‌పై స్వామివారి ఉత్సవమూర్తులు గోవిందరాజస్వామి, శ్రీదేవి, భూదేవి సమేతంగా వేంచేపు చేశారు. ముందుగా విష్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, ద్వాదశి ఆరాధనలు నిర్వహించారు. అనంతరం పలు రకాల పుష్పాలతో స్వామివారికి అర్చన చేసి ఉంజల్‌సేవ నిర్వహించారు. ఒడిశా భక్తులు, అర్చకులు కీర్తనలు ఆలపిస్తుండగా లక్ష్మీకాంత్ నాయక్‌దాస్ స్వామివారి ఉయ్యాలను ఊపారు. అనంతరం భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు టి.పీ. రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, కరి సీతారామాచార్యులు, ఇతర అర్చకులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దేవస్థానం ఈవో జల్లేపల్లి వెంకటరావు కూడా హాజరయ్యారు.


