జీవీఎంసీ పరిధిలో 50 పార్కుల ఆధునికీకరణకు కార్యాచరణ తొలి దశలో రూ.21.97 కోట్లతో 47 పార్కుల అభివృద్ధి జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్
డాబాగార్డెన్స్: శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరాన్ని మరింత హరితమయం చేసి, ప్రజలకు ఆరోగ్యవంతమైన, ఆహ్లాదకర జీవన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో జీవీఎంసీ పరిధిలో 50 ఆధునిక పార్కుల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. తొలి దశలో ఇప్పటికే 47 ఓపెన్ స్పేస్‌లను గుర్తించినట్లు వెల్లడించారు. మిగిలిన పార్కుల కోసం అవసరమైన స్థలాలను కూడా గుర్తించి దశల వారీగా అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. భీమునిపట్నం జోన్‌లో 7, మధురవాడ జోన్‌లో 20, గాజువాక జోన్‌లో 20 పార్కులను మొత్తం రూ.21.97 కోట్ల అంచనా వ్యయంతో జీవీఎంసీ నిధుల ద్వారా అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు.
మౌలిక సదుపాయాలు
పార్కుల్లో అత్యాధునిక వాకింగ్ ట్రాక్‌లు, చిన్నారుల ఆట పరికరాలు, ఓపెన్ జిమ్‌లు, సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక విశ్రాంతి వేదికలు, పచ్చిక బయళ్లు, సుందర ల్యాండ్‌స్కేపింగ్, అలంకార మొక్కలు, తాగునీటి సౌకర్యం, విద్యుత్ దీపాలు, బెంచీలు తదితర సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హరిత పార్కుల అభివృద్ధి ద్వారా నగరంలో పచ్చదనం పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ, వర్షపు నీటి సంరక్షణ, ప్రజల శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు దోహదపడుతుందని, చిన్నారులకు సురక్షిత ఆట స్థలాలు, కుటుంబాలకు ఆహ్లాదకర విహార కేంద్రాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
గ్రీన్.. హెల్తీ.. లైవబుల్ విశాఖ
లక్ష్య సాధనలో భాగంగా జీవీఎంసీ చేపట్టనున్న 50 పార్కుల అభివృద్ధి కార్యక్రమం నగర పర్యావరణ పరిరక్షణకు, ప్రజల జీవన నాణ్యత మెరుగుపరచడానికి కీలక మైలురాయిగా నిలుస్తుందని కమిషనర్ చెప్పారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి, ప్రజలకు త్వరితగతిన అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత ఇంజినీరింగ్, హార్టికల్చర్, టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు.


