సాక్షి, విశాఖపట్నం : సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీకి చెందిన 22 మంది ట్రైనీ ఐపీఎస్ అధికారులు సోమవారం తమ మారిటైమ్ సెక్యూరిటీ మాడ్యూల్ శిక్షణలో భాగంగా విశాఖ పోర్టు అథారిటీని సందర్శించారు. వీరిలో ఇద్దరు విదేశీ అధికారులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా పోర్టు చైర్మన్ జేఎస్ బింద్రా వారికి స్వాగతం పలికి, పోర్టులోని ఆధునిక మౌలిక వసతులు, కార్గో నిర్వహణ వ్యవస్థ, యాంత్రీకరణ, అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్, సౌర విద్యుత్ ఉత్పత్తి, మురుగునీటి శుద్ధి కేంద్రం తదితర అంశాలపై సమగ్రంగా వివరించారు. పోర్టు డిప్యూటీ చైర్‌పర్సన్ రోష్ని అపరంజి కోరాటి, కార్యదర్శి శంకర్‌బాబు పాల్గొన్నారు.


