మహారాణిపేట: జిల్లాలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ తుది దశకు చేరుకోగా.. జాబితాలో దాదాపు రెండు లక్షల పేర్లు తొలగించే అవకాశం ఉందన్న అంచనాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారికంగా ఇది ఓటరు జాబితా ప్రక్షాళన కార్యక్రమమే అయినప్పటికీ, అమలవుతున్న తీరుపై రాజకీయ పార్టీలు, పౌర సంఘాలు, ప్రజల్లో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లాలో ప్రస్తుతం 20,23,009 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. వీరందరికీ ఎన్యుమరేషన్ ఫారం–2లను పంపిణీ చేయగా, 20,20,363 ఫారాలను డిజిటలైజ్ చేశారు. అంటే 99.87 శాతం ప్రక్రియ పూర్తయింది. ఈ నెల 24వ తేదీ వరకు ఫారాల సమర్పణకు అవకాశం ఉండగా, 31వ తేదీన ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల కానుంది.
ఎక్కువ ఆందోళన షిఫ్టెడ్ ఓట్లపైనే
రెండు లక్షలలో అత్యధికంగా 1.30 లక్షల షిఫ్టెడ్ ఓట్లు ఉండటం గమనార్హం. విశాఖ నగరానికి శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం–మన్యం తదితర ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వలస వచ్చిన వేలాది మంది ప్రస్తుతం నివసిస్తున్నారు. వీరిలో చాలామందికి స్వగ్రామంలో ఓటు కొనసాగుతుండగా, నగరంలో కూడా ఓటు నమోదైంది. సర్ ప్రక్రియలో శాశ్వత నివాసాన్ని నిర్ధారించే సమయంలో వీరిలో చాలా మంది పేర్లు ఒకచోట నుంచి తొలగించే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
మ్యాపింగ్‌పై ఆరోపణలు
సర్ ప్రక్రియలో భాగంగా బీఎల్‌వోలు నిర్వహించిన మ్యాపింగ్‌పై కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్నిచోట్ల తొందరపాటు, మరికొన్ని ప్రాంతాల్లో అధికారుల నిర్లక్ష్యం కారణంగా అర్హులైన ఓటర్ల వివరాలు సరిగా నమోదు కాలేదని రాజకీయ పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రత్యేకంగా ఒకే నియోజకవర్గంలో బూత్ మారిన కుటుంబాలు.. ఉమ్మడి కుటుంబాల నుంచి విడిపోయిన వారు.. వివాహం తర్వాత చిరునామా మారిన మహిళలు.. ఉద్యోగరీత్యా బదిలీ అయిన ఉద్యోగులు.. అద్దె ఇళ్లలో నివసిస్తున్న కుటుంబాలు.. వీరి వివరాలు మ్యాపింగ్‌లో సరిగా నమోదు కాలేదన్న అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం అధికార యంత్రాంగం అధికారపక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ఎన్నికల అధికారులు అధికారికంగా స్పందించలేదు.
వలస ఓటర్ల భవితవ్యంపై ఉత్కంఠ
నగరంలోని మద్దిలపాలెం, సీతంపేట, మాధవధార, పెద్ద వాల్తేరు, గోపాలపట్నం, మురళీనగర్, ఎంవీపీ కాలనీ తదితర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వలస కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరిలో చాలామందికి రెండు ప్రాంతాల్లో ఓటరు నమోదు ఉండటంతో తుది జాబితాలో ఏ ఓటు కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
జిల్లాలో అసెంబ్లీ వారీగా డిజిటలైజేషన్
అసెంబ్లీ మొత్తం ఓటర్లు పోలింగ్ డిజిటలైజేషన్
స్టేషన్లు పూర్తి
భీమిలి 3,67,486 361 3,66,574
విశాఖ తూర్పు 2,92,227 282 2,91,987
విశాఖ దక్షిణ 2,17,795 236 2,17,713
విశాఖ ఉత్తర 2,84,341 272 2,84,244
విశాఖ పశ్చిమ 2,13,890 221 2,13,489
గాజువాక 3,34,768 309 3,34,434
పెందుర్తి 3,12,502 299 3,11,922
మొత్తం 20,23,009 1,980 20,20,363
డేటా ఏమి చెబుతోంది?
ఇప్పటివరకు నమోదైన వివరాలను
పరిశీలిస్తే..
జిల్లాలో మొత్తం ఓటర్లు : 20,23,009
డిజిటలైజేషన్ పూర్తయిన ఫారాలు : 20,20,363 (99.87 శాతం)
తొలగింపునకు గురయ్యే అవకాశం ఉన్న ఓట్లు : సుమారు 2 లక్షలు
మరణించిన వారి పేర్లు : 50,000
షిఫ్టెడ్ ఓటర్లు : 1,30,000
డూప్లికేట్ ఓట్లు : 20,000
ఈ మూడు వర్గాల ఆధారంగా దాదాపు
2 లక్షల పేర్లు తుది జాబితాలో ఉండకపోవచ్చని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది.


