మహారాణిపేట: డాక్యుమెంట్ రైటర్ల నిరవధిక పెన్‌డౌన్ సమ్మె రెండో రోజైన మంగళవారం కూడా కొనసాగడంతో జిల్లాలోని తొమ్మిది సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కేవలం 70 డాక్యుమెంట్లు మాత్రమే నమోదుకాగా, వాటి ద్వారా ప్రభుత్వానికి రూ.43 లక్షల ఆదాయం సమకూరినట్లు జిల్లా రిజిస్ట్రార్ ఉపేంద్ర తెలిపారు. తొలి రోజు కంటే రెండో రోజు రిజిస్ట్రేషన్ల సంఖ్య మరింత తగ్గిందన్నారు. జీవో ఎంఎస్ నెం.396ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం (విశాఖ అర్బన్) ఆధ్వర్యంలో సూపర్‌బజార్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద డాక్యుమెంట్ రైటర్లు రిలే నిరాహార దీక్ష, పెన్‌డౌన్ కార్యక్రమం నిర్వహించారు.


