రెండు లారీల మధ్య నలిగి కూలీ మృతి | - | Sakshi
Sakshi News home page

రెండు లారీల మధ్య నలిగి కూలీ మృతి

Jul 23 2026 12:30 AM | Updated on Jul 23 2026 12:30 AM

● అక్కయ్యపాలెం బస్టాప్‌ వద్ద ప్రమాదం.. డ్రైవర్‌ అరెస్ట్‌ ● కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ డ్రైవర్‌ నిద్రమత్తే కారణం?

విశాఖ విద్య: నగరంలోని ఫోర్త్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అక్కయ్యపాలెం బస్టాప్‌ వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కూలీ రెండు లారీల మధ్య నలిగి మృతిచెందాడు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అక్కయ్యపాలెం 80 ఫీట్‌ రోడ్డుకు చెందిన ఇ.అప్పారావు(65) చిప్స్‌ ప్యాకెట్ల లోడుతో వచ్చిన లారీ వద్ద కూలీగా పనిచేస్తున్నాడు. బుధవారం తెల్లవారుజామున అక్కయ్యపాలెం బస్టాప్‌ సమీపంలో చిప్స్‌ను అన్‌లోడ్‌ చేస్తున్న సమయంలో మద్దిలపాలెం వైపు నుంచి వేగంగా వచ్చిన కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ అదుపుతప్పి నిలిపి ఉన్న చిప్స్‌ లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అప్పారావు రెండు వాహనాల మధ్య ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతిచెందినట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుదర్శనరావు తెలిపారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న మరో కూలీ స్వల్ప గాయాలతో బయటపడగా, అదే రహదారిపై మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన అక్కయ్యపాలేనికి చెందిన అప్పలరాజుకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో కాంక్రీట్‌ మిక్సర్‌ లారీ డ్రైవర్‌ నిద్రమత్తులో వాహనం నడిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన ఛత్తీస్‌గఢ్‌కు చెందిన డ్రైవర్‌ పాతీరామ్‌ను అరెస్ట్‌ చేసి కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్‌ ఎస్‌ఐ సుదర్శనరావు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement