రాక్షస పాలన | - | Sakshi
Sakshi News home page

రాక్షస పాలన

Jul 22 2026 2:17 AM | Updated on Jul 22 2026 2:17 AM

రెడ్‌బుక్‌ రాజ్యంలో
అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం నిరసన మహిళలపై దాడులను అరికట్టాలని డిమాండ్‌

డాబాగార్డెన్స్‌: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో మహిళలపై అఘాయత్యాలు, దాడులు, హత్యలు మితిమీరిపోయాయని వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా మహిళా విభాగం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు ఆధ్వర్యంలో జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి నేతృత్వంలో మహిళలు అంబేడ్కర్‌ విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నల్ల దుస్తులు ధరించిన మహిళలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి నివాళులర్పించి, రాష్ట్రంలో మహిళలకు భద్రత కల్పించాలని, మహిళలపై దాడులను అరికట్టాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపై దాడులు తీవ్రంగా పెరిగాయని ఆరోపించారు. మహిళను వివస్త్ర చేసి దాడి చేసిన ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. బాధితురాలు పోలీసులను ఆశ్రయించినా కేసు నమోదు చేయడంలో నిర్లక్ష్యం చూపారంటూ విమర్శించారు. రాష్ట్రంలో మహిళా కమిషన్‌, సంబంధిత శాఖలు స్పందించడం లేదని ఆరోపించారు. జిల్లా అధ్యక్షుడు కేకే రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలు ఒంటరిగా బయటకు రావాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళల భద్రత కోసం గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన ’దిశా’ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. మహిళా హోంమంత్రి ఉన్నప్పటికీ మహిళలకు న్యాయం జరగడం లేదని విమర్శించారు. మాజీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగాయని ఆరోపించారు. ప్రభుత్వం మారినా చట్టాల అమలులో మార్పు ఉండకూడదన్నారు. జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పిలుపు మేరకు మహిళల భద్రత కోసం నిరసనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మహిళలను అవమానించిన ఘటనల్లో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కార్యక్రమంలో తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు, మాజీ జీసీసీ చైర్మన్‌ శోభ స్వాతిరాణి, పార్టీ నాయకులు శ్రీదేవివర్మ, ఉమ్మడి స్వాతి, సాడి పద్మారెడ్డి, బెందాళం పద్మావతి, బయ్యవరపు రాధ, మళ్ల ధనలత, సబీరా బేగం, రీసు అనురాధ, కోనాల విజయ వినీత, కె.శిరీష, పప్పుల సునీత, పల్లా చిన్నతల్లి, పలివెల ఈవ్వరి, గీతారెడ్డి, సలాది భవానీ, చుక్క వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement