సింహాచలం : ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్న సింహాచలం గిరి ప్రదక్షిణను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేస్తోందని కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ తెలిపారు. మంగళవారం పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి,జేసీవిద్యాధరి, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, దేవస్థానం ఈవో జె.వెంకటరావుతో కలిసి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని బస్సులో పరిశీలించారు. అనంతరం సింహాచలంలోని తొలిపావంచా వద్ద మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రహదారులు, విద్యుత్, అండర్‌గ్రౌండ్ కేబుల్ పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పారు. రాత్రి సమయంలో ఎక్కడా చీకటి లేకుండా మార్గమంతా విద్యుత్ దీపా లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గిరి ప్రదక్షిణ మార్గంలో 30 సహాయక కేంద్రాలు, 6 నుంచి 7 వరకు కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, సింహాచలం తొలిపావంచా వద్ద ప్రధాన కమాండ్ కంట్రోల్ రూమ్ పనిచేస్తుందని వెల్లడించారు. మొత్తం 38 కేంద్రాల్లో దేవస్థానం, పోలీస్, జిల్లా యంత్రాంగానికి చెందిన సీనియర్ అధికారులు విధులు నిర్వర్తిస్తారని చెప్పారు. శానిటేషన్, తాగునీరు, వైద్య సేవలు అందించే సిబ్బంది షిఫ్టుల వారీగా అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. గిరి ప్రదక్షిణ సందర్భంగా అనకాపల్లి, విజయనగరం నుంచి నగరంలోకి వచ్చే వాహనాలను మళ్లిస్తామని, హనుమంతవాక నుంచి మద్దిలపాలెం వరకు ట్రాఫిక్ ఫ్రీజోన్‌గా ప్రకటిస్తామని కలెక్టర్ తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపులపై త్వరలో పూర్తి స్థాయి అడ్వైజరీ విడుదల చేస్తా మని చెప్పారు. హెల్త్‌సిటీ పరిధిలోని ఆసుపత్రులతో సమన్వయం చేసి అత్యవసర వైద్య సేవలకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించే అంశంపై కంపెనీలతో చర్చించినట్లు, 28, 29 తేదీల్లో పాఠశాలలకు సెలవుల అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
పిల్లలు, పెద్దలకు ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు
నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చి మాట్లాడుతూ హనుమంతవాక, ఇసుకతోట, వెంకోజీపాలెం ప్రాంతాల్లో ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తామని చెప్పారు. రద్దీ సమయాల్లో వాహనాలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉందన్నారు. 18 డ్రోన్ కెమెరాలతో పాటు భారీ సంఖ్యలో సీసీ కెమెరాల ద్వారా 32 కిలోమీటర్ల మార్గంపై నిరంతర నిఘా ఉంచుతున్నామని తెలిపారు. గత ఏడాది జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలు పునరావృతం కాకుండా క్రైమ్ బీట్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పిల్లలు, పెద్దలకు కూడా ఆర్‌ఎఫ్‌ఐడీ ట్యాగ్‌లు అందజేసి, ఎవరైనా తప్పిపోతే వెంటనే గుర్తించేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
గిరిప్రదక్షిణకు ఆర్టీసీ 50 బస్సులు
డాబాగార్డెన్స్ : సింహాచలం గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తుల రవాణా కోసం ఆర్‌టీసీ 50 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణా అధికారి బి.అప్పలనాయుడు తెలిపారు.


