దిగ్విజయంగా వైఎస్సార్‌సీపీ ‘చలో పంచదార్ల’
సాక్షి, అనకాపల్లి: కూటమి ప్రజాప్రతినిధుల అక్రమ మైనింగ్ దోపిడీపై వైఎస్సార్‌సీపీ సమరభేరి మోగించింది. పవిత్రమైన పంచదార్ల చారిత్రక, ఆధ్యాత్మిక సంపదను కాపాడుకునేందుకు వైఎస్సార్‌సీపీ చేపట్టిన ‘చలో పంచదార్ల’ ధర్మపోరాట యాత్ర దిగ్విజయంగా సాగింది. స్థానిక కూటమి ఎంపీ సీఎం రమేష్, స్థానిక జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్‌లు చేస్తున్న అక్రమ మైనింగ్‌ను అడ్డుకునేందుకు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నలుమూలల నుంచి ప్రజలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు, అభిమానులు ప్రవాహంలా తరలివచ్చారు. అనకాపల్లి టౌన్ రింగురోడ్డులోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ధర్మపోరాట యాత్ర పూడిమడక జంక్షన్, మునగపాక, అచ్యుతాపురం మీదుగా రాంబిల్లి మండలంలోని వెంకటాపురం జంక్షన్, పంచదార్ల కొండ వరకూ సుమారుగా 25 కిలోమీటర్ల మేర సాగింది. యలమంచిలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ నేతృత్వంలో వందలాది కార్లు, వేలాది మోటార్ బైక్‌లతో వైఎస్సార్‌సీపీ శ్రేణులు, ప్రజలు కూటమి నేతల అక్రమాలను నిరసిస్తూ నినాదాలతో ర్యాలీగా సాగారు. ఈ ధర్మపోరాట యాత్ర ఏకంగా 3 గంటల సమయం పట్టిందంటే ప్రజా స్పందన ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. దారిపొడవునా ప్రజలు వైఎస్సార్‌సీపీ నాయకులకు స్వాగతం పలికారు.
అక్రమ మైనింగ్ ప్రదేశాన్ని పరిశీలించిన వైఎస్సార్‌సీపీ నేతలు
పంచదార్ల చేరుకున్న అనంతరం వైఎస్సార్‌సీపీ అగ్రనేతలు, స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కొల్లగొడుతున్న అక్రమ మైనింగ్ ప్రాంతాన్ని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, రీజినల్ కోఆర్డినేటర్లు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్‌నాథ్, అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్, విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కుంబా రవిబాబు, ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, మాజీ మంత్రి బాలరాజు, సమన్వయకర్తలు కంబాల జోగులు, పెట్ల ఉమాశంకర్ గణేష్, అన్నంరెడ్డి అధీప్‌రాజ్, వాసుపల్లి గణేష్‌కుమార్, మలసాల భరత్‌కుమార్, మొల్లి అప్పారావు, అనకాపల్లి పార్లమెంట్ పరిశీలకులు శోభా హైమావతి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర, మాజీ ఎంపీ భీశెట్టి సత్యవతి, నియోజకవర్గ పరిశీలకులు కోలా గురువులు, వీసంరామకృష్ణ, చింతకాయల సన్యాసిపాత్రుడు సతీష్‌వర్మ, ఏడువాక సత్యారావు, పైలా శ్రీనివాసరావు, గండి రవి, బాణాల శ్రీనివాసరావు, పలువురు ముఖ్య నాయకులు పరిశీలించారు.


