మహారాణిపేట : సింహాచలం గిరి ప్రదక్షిణ మార్గంలో ఉన్న గుంతలు, అసంపూర్తి పనులపై ’గిరి ప్రదక్షిణకు గుంతల స్వాగతం’ శీర్షికతో మంగళవారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి జిల్లా యంత్రాంగం స్పందించింది. కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ పోలీస్ కమిషనర్ శంఖభ్రత బాగ్చితో కలిసి 32 కిలోమీటర్ల గిరి ప్రదక్షిణ మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రహదారుల మరమ్మతులు, భూగర్భ కేబులింగ్ పనులు, విద్యుత్ దీపాల ఏర్పాటు తదితర పనులను పరిశీలించిన కలెక్టర్.. పెండింగ్ పనులను తక్షణమే పూర్తి చేసి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా గిరి ప్రదక్షిణ మార్గాన్ని సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.


